“ కళాప్రపూర్ణ ’ శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారిని, ఈ తరానికి చెందిన ప్రముఖ కవిపుంగవులలో ఒకరిగా పరిగణింపవచ్చును. ఈ వ్యాసాన్ని వ్రాయడంలో నా ప్రధాన లక్ష్యం ఏమిటంటే వారి బాల్యం, తదితర జీవిత విశేషాలను ఇందులో చొప్పించడం కాకుండా వారితో నాకు ఏర్పడిన పరిచయ సౌభాగ్య సుమసౌరభాలను మీచేత ఆఘ్రాణింప జేసి మీకు ఆనందాన్ని కలుగజేయడం.
1971-77 మధ్యకాలంలో నేను తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి పట్టణానికి చేరువలో ఉన్న ధవళేశ్వరంలో ఇంజనీరు గా పని చేసేవాడిని. యుద్ధ ప్రాతిపదికన, రాత్రింబవళ్ళు నిర్విరామంగా జరిగే గోదావరి బారేజ్ ప్రాజెక్టు పనులలో తలమునకలై శారీరిక శ్రమకు లోనవడంతో – దాని నుంచి కొంత సేద తీర్చుకోవడానికి, మానసికోల్లాసానికి, మేమందరమూ కలిసి సర్ ఆర్థర్ కాటన్ లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ అన్న సంస్థను నెలకొల్పి నిర్వహించేవాళ్లం. దీనికి అధ్యక్షులుగా శ్రీ డి. వి. ఎస్. రాజు గారు, కార్యదర్శిగా శ్రీ అల్లు వెంకట అప్పారావు గారు, కోశాధికారిగా శ్రీ చామర్తి కామేశ్వరరావు గారు, లిటరరీ కార్యదర్శి గా నేను వ్యవహరించాము. దీనికి అనుబంధంగా ‘ సాహితీ సమితి ’ వెలిసింది. వారం – వారం సభ్యులు సమావేశమై, తమ కవితలను – ఇతర రచనలను వినిపించేవారు. మధ్య మధ్యలో చుట్టు ప్రక్కల ఉన్న సాహితీ ప్రముఖులను కొందరిని ఆహ్వానించి వారి ప్రసంగాలను – ప్రవచనాలను వినేవాళ్లం. ఎంతోమంది అభిమాన శ్రోతలు వేళ తప్పకుండా వచ్చి, ఆ కార్యక్రమాల్లో ఆసక్తిగా పాల్గొనేవారు. ముఖ్య అతిథులను ఆహ్వానించే సందర్భం లో నేనూ – కామేశ్వరరావు గారు సైకిళ్ళ మీద ప్రక్కన లంకలలోని గ్రామాలకు, రాజమండ్రి పట్టణానికి వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మేము వెళ్ళి వారిని రమ్మనమని ఆహ్వానించగానే వారు కాదనకుండా పెద్ద మనసుతో ఆనందంగా అంగీకరించేవారు. అలా వచ్చిన అతిధులను, భారీ స్థాయిలో కాకపోయినా – మా శక్తి మేరకు సన్మానించి, కానుకలతో సత్కరించేవాళ్లం. ఇలా మేము ఆహ్వానించిన ప్రముఖలలో శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, శ్రీ జానకి జానీ, శ్రీ రంధి సోమరాజు, శ్రీ కొండముది శ్రీరామచంద్రమూర్తి, శ్రీ కొండముది హనుమంతరావు ఉన్నారు.
సాహితీ సమితిని తమ చేతుల మీదుగా ప్రారంభించిన వారు శ్రీ మధునాపంతుల వారు. ‘ ఆనంద ’ ఉగాది నాడు – మా నూతన లిఖిత పత్రిక కు ‘ ఆనంద ’ అని నామకరణం చేసి, తమ కవితాక్షతలతో పత్రికను ఆశీర్వదించారు. ఆ పత్రికను విడుదల చేస్తూ – చేసిన తమ ప్రసంగంలో ఆయన ఉదహరించిన అపూర్వ సంఘటనను ఒక దానిని మీకు మనవి చేస్తాను.
అది మారుమూల ఒక కుగ్రామం. ఆ గ్రామంలో ఒక కటిక నిరుపేద మహిళ నివసించేది. ఆమెకు ఎదిగి వచ్చిన ఒక కొడుకు తప్ప వేరే ఏ ఆధారం లేదు. ఉన్న ఆ ఒక్క కొడుకూ బాధ్యతా రహితంగా ఉంటూ – చెడు స్నేహాలు మరిగి, తల్లి మాటలను పెడచెవిన పెట్టి, జులాయిగా తిరుగుతూ ఉంటాడు. అతడి ప్రవర్తన ఆమెకు క్లేశకారణం అవుతుంది. తాగి తందనాలాడుతూ, స్నేహితులతో పేకాట, జూదం ఆడుతూ – అప్పులు చేస్తూ – ఉన్నదంతా కోల్పోయి, దుర్వ్యసనాలలో మునిగి, ఒక్కొక్కసారి రోజుల తరబడి ఇంటిముఖం చూసేవాడు కాదు. ఒకసారి ఇలా ఆటలో ఓడిపోగా, స్నేహితులందరూ అతనిని గేలి చేస్తూ “ వాడి దగ్గర ఇక ఇవ్వడానికి ఏముందిరా ? ఇంటిదగ్గర ముసలి తల్లి గుండెకాయ తప్ప – ఇస్తే గిస్తే, దానినే తెచ్చి బాకీగా చెల్లించుకుంటాడు…. హహ్హ….. హ్హహ్హహ్హ….. ” అంటూ పగలబడి నవ్వటం మొదలు పెట్టారు. ఆ అవమానం తట్టుకోలేక – లోపలినుండి పౌరుషం తన్నుకు రాగా “ అవునా ? ఆగండి – ఒక్క నిముషం – ఆ గుండెకాయనే తెచ్చి మీ చేతులలో పెట్టకపోతే చూడండి. – ఇది నా ఛాలెంజ్ ’ అంటూ ఆవేశంతో పెద్ద అంగలు వేసుకుంటూ వడి వడిగా ఇంటికి పరుగెట్టాడు. చాలా రోజులకి ఇంటికొచ్చిన కొడుకుని గుమ్మంలోనే చూసిన తల్లి ఆందోళనతో “ అదేమిట్రా ! నాయనా ! ముఖం అలా వేళ్ళాడేసుకుని వచ్చావ్ ? ముందు లోపలికి పద. ముఖం, కాళ్ళు, చేతులు చల్లటి నీళ్ళతో కడుక్కురా. అన్నం తిందువు గాని. ఎప్పుడనగా ఎంగిలి పడ్డావో – ఏమిటో ? ” అంటూ వాడు లోనికి వచ్చాక కడుపు నిండా భోజనం పెట్టింది. అప్పటికి వాడి ముఖంలో ఆరాటం, ఉద్వేగం తగ్గకపోవడం చూసి, జరిగినదంతా వాడి నుండి తెలుసుకుని “ నాయనా ! నువ్వు నీ స్నేహితులకు ఇచ్చిన మాటను తీర్చడం కంటే, నాకు మరేమీ ఎక్కువ కాదు. ఆ మాటకొస్తే, నా ప్రాణాలు అయినా సరే – నీకు కావాల్సినది నా గుండెకాయే కదా ! ఇంద – తీసుకో – పట్టుకెళ్లి వాళ్ళకు ఇచ్చి, వాళ్ళకు నీవిచ్చిన మాటను నిలబెట్టుకో ! ” అంది. అంతే ! వాడు ఇంక పునరాలోచన కూడా లేకుండా, ఒళ్ళు తెలియని ఆవేశంలో కన్నతల్లిని కత్తితో పొడిచాడు. దానితో నేల అంతా రక్తపు మడుగు – తల్లి గుండెని వెలికి తీసి చేతబట్టుకుని – వడి వడిగా అడుగులు వేసుకుంటూ ముందు సాగి పోబోతుండగా “ నాయనా ! జారిపడేవు. మెల్లగా చూసుకుని ముందడుగు వేయి ” అన్న మాటలు వెనుక నుండి వినవచ్చాయి. కనబడని తల్లి నుండి వినబడిన మాటలవి !! కన్నతల్లి పుత్ర వాత్సల్యానికి, కడుపు తీపికి పరాకాష్ట ఈ వృత్తాంతం. అందుకే మన పెద్దలన్నారు – “ దుర్మార్గుడయిన పుత్రుడు ఉండవచ్చునేమో గానీ దుర్మార్గురాలైన తల్లి ఉండదు ” అని.
‘ ఆనంద ’ ఉగాది లిఖిత పత్రిక సర్వాంగ సుందరంగా వెలువడింది. దీనిని ఇలా తీర్చిదిద్దడంలో సహకరించిన వారు… మా తమ్ముడు శేషగిరిరావు, మా ఆఫీసు లో ట్రైనర్ గా పని చేసే సత్యవతి, బొమ్మలు వేసిన టి. రామనాథం – రామనాథం చిత్రకారుడే కాక వర్థమాన నటుడు కూడా. అతనికి చిన్న వేషాన్నిచ్చి ప్రోత్సహించారు ప్రముఖ దర్శకులు శ్రీ బాపు గారు తమ ‘ ముత్యాల ముగ్గు ’, ‘ వంశవృక్షం ’ చిత్రాలలో. ఇక ‘ ఆనంద ’ పత్రికను చూసి అభినందన పూర్వకంగా, ఆశీః పూర్వకంగా తమ ప్రశంసలను కురిపిస్తూ – అందులో వ్రాసారు శ్రీ బాపు గారు, శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు. వారి వ్యాఖ్యలు పత్రికకు ఎంతో వన్నెను తెచ్చాయంటే అతిశయోక్తి కాదు. బహుశః వారి చల్లని ఆశీస్సుల బలంతోనే కాబోలు – మరుసటి సంవత్సరం అది ‘ టైపు ’ చేయబడిన పత్రిక స్థాయికి ఎదిగి – మరింత అందంగా రూపు దిద్దుకోగలిగింది.
మధునాపంతుల వారు రాజమండ్రి లో శ్రీ కందుకూరి వీరేశలింగం గారి పేరిట నెలకొల్పబడిన విద్యా సంస్థలలో తెలుగు శాఖలో పని చేసేవారు. గోదావరి గట్టు దాటగానే కుమారి టాకీస్ కి ఛేరువుగా వారి ఇల్లు ఉండేది. ఒకసారి రాజమండ్రిలో సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకులు శ్రీ కె. వి. మహదేవన్ గారికి భారీ ఎత్తున సన్మాన కార్యక్రమం జరగడం, ఆ వేడుకలో పాల్గొనేందుకు చెన్నై నుండి శ్రీ బాపు గారు, శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు, శ్రీ వి. ఏ. కె. రంగారావు గారు – విజయవాడ నుండి శ్రీ నండూరి రామమోహనరావు గారు – హైదరాబాద్ నుండి డా. సి. నారాయణరెడ్డి గారు – నూజివీడు నుండి శ్రీ ఎం. వి. ఎల్. గారు వచ్చారు. శ్రీ నారాయణరెడ్డి గారు ధవళేశ్వరంలో కాటన్ హౌస్ అతిథి గృహంలో బస చేశారు. అంతకు పూర్వం వారితో నాకున్న పరిచయం ఆధారంగా నారాయణరెడ్డి గారిని ఆ ఉదయం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మాటల సందర్భంలో వారన్నారు – “ సుబ్బారావు గారూ ! రాజమండ్రిలో మధునాపంతుల వారిని దర్శించాలని చాలాకాలంగా మనసులో కోరికగా ఉంది. వారిని మీరెరుగుదురా ? వారి మీకు తెలిసి ఉంటే, ఒకసారి కారులో వెళ్ళి వారిని చూసి వద్దాము. ఏమంటారు ? ” అన్నారు. “ ఓ ! అలాగే ! తప్పకుండానండీ ! తప్పక వెడదాం. ఈ సమయంలో అయితే వారు ఇంటిదగ్గరే ఉంటారు కూడా ” అన్నాను ఆనందంగా. వెంటనే ఇద్దరం కలిసి కారులో రాజమండ్రికి బయిలుదేరి శాస్త్రి గారి ఇంటికి వెళ్లాము. ఇద్దరు సాహితీ పుత్రులిలా ముందుగా అనుకోకుండా కలవడం, కలిసి ఆత్మీయంగా పలకరించుకోవడం, అనేక విషయాలు ముచ్చటించుకోవడం – ఈ శుభ సందర్భాన్ని నేను కళ్ళారా చూడగలగడం, ప్రత్యేకించి నా పూర్వ జన్మ సుకృతమని చెప్పక తప్పదు. అంతే కాదు. ఇది నా మరపురాని, మరువలేని అనుభూతుల్లో ఒకటి. మధునాపంతుల వారు, నారాయణరెడ్డి గారు ఇద్దరూ కూడా సంస్కారం, సౌమ్యత, సాహితీపరిణితి – ఈ మూడింటినీ పుణికి పుచ్చుకున్న వారని నాకు ఆ క్షణంలో విశదమయింది.
ఏ సాహితీ సమావేశానికి ఆహ్వానించినా, దానిని సరస్వతీదేవి పిలుపుగా తలపోసి, ఆ సమావేశానికి వెళ్ళి అందులో పాల్గొని, దానికి మరింత శోభను కలుగజేసేవారు శ్రీ శాస్త్రి గారు. రాజమండ్రి పట్టణంలో శ్రీ నార్ని కేదారీశ్వరుడు గారు ప్రముఖ వ్యాపార వేత్తలలో ఒకరు. వారి నేతృత్వంలో రాజమండ్రిలో శ్రీ శాస్త్రి గారికి ఒకసారి ఘన సన్మానం జరిగింది. ఆ సమావేశానికి నేనూ హాజరయ్యాను. ఆ సమావేశంలో శాస్త్రి గారిని సన్మానించి ‘ మధుకోశము ’ అని ఒక ప్రత్యేక సంచికను వెలువరించారు. నిజానికి ఈ వ్యాసానికి కూడా అదే పేరుని మకుటంగా చేయడం మీరు గమనించే ఉంటారు.
శాస్త్రి గారు ఎన్నో ఉద్గ్రంధాలను వ్రాసారు. ఉదాహరణకి తోరణము, రత్నపాంచాలిక, షడ్డర్శన సంగ్రహము, సూర్య సప్తతి మొదలుగునవి. సూర్యారాయాంధ్ర నిఘంటువు వెలువడడంలో వీరి పాత్ర అమోఘం. వీరి కృషి అనుపమానం. అంతే కాదు. 19 సంవత్సరముల చిరుత ప్రాయంలోనే వీరు ‘ అంధ్రి ’ అనే పత్రికను నిర్వహించారు. తమ స్వగ్రామం పల్లిపాలెం లో ‘ ఆంధ్ర కుటీరం ’ అన్న సాహితీ సంస్థను నెలకొల్పారు. సాహితీ వ్యవసాయాన్ని కొనసాగించారు. ఇక తిరుమల – తిరుపతి దేవస్థానము, తిరుపతి – శ్రీ పి. వి. ఆర్. కె. ప్రసాద్, కార్యనిర్వహణాధికారి గారి ఆధ్వర్యంలో 1980 లో ప్రచురించిన “ ఏకావళి ” – సాంస్కృతిక వ్యాసావళి అన్న పుస్తకం – పుస్తక చిన్నదే అయినా, అందులో విషయవైవిధ్యం అనంతం. సప్తస్వరాలలా, సప్త వర్ణాలలా, సప్తర్షుల ప్రతి రూపాల్లా ఆసక్తిదాయకమయిన ఏడు వ్యాసాలు ఇందులో చోటు చేసుకున్నాయి. అవి,,,,,,,
- తెలుగు వారి సరస్వతి
- వాల్మీకి ప్రతిభా వైభవము
- ప్రస్తాన బేధము
- మహాభారత సౌరభము
- అన్నమయ్య వాగ్గేయ ప్రభావము
- దర్శనోదయము
- ఉపనిషత్ ప్రస్థానము
శ్రీ శాస్త్రి గారి పాండితీ ప్రకర్షకు దర్పణం అయిన ఈ గ్రంథం లో భాషా – భావం చెట్టాపట్టాలు వేసుకుని, జత కట్టి, జంటగా నడవడం ఇందులో మనం గమనించవచ్చును. మచ్చుకి ఒక అంశం…
“ విశ్వ సిత మస్య వేదాః వీక్షిత మే తస్య పంచ భూతాని |
స్మిత మే తస్య చరాచర మస్య చ సుప్తం మహా ప్రళయః || ”
“ వేదములు ఆయన నిట్టూర్పు :
పంచ భూతములు ఆయన చూపు :
చరాచర ప్రపంచము ఆయన చిరునవ్వు :
మహా ప్రళయము ఆయన సుప్తి :
ఈ సమస్తము ఎవని వివర్తమో ఆ పరమేశ్వరునికి నమస్కారము ”
72 సంవత్సరముల పాటు ఈ జీవన యాత్రను సాగించి, సాహితీ సరస్వతి సేవలో తమ జీవితాన్ని పండించుకున్న మహోన్నతులు శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు, విశిష్టమైన తమ రచనల అలంబనతో ఆయన అమరత్వాన్ని సిద్ధింపజేసుకున్నారు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. వారికి నా నమోవాకాలు.
***************
మధుర కవి శ్రీ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారి వర్థంతి ( నవంబర్ 7 వ తేదీ ) సందర్భంగా…..
******************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page
చాలా మంచి వ్యాసం అందించి మాకు తెలియని సాహితీ విషయాలు సోదాహరణంగా వివరించారు శ్రీవోలేటివారు. వారికీ, శిరాకదంబం సాహితీ గుచ్ఛం నిరంతరం తరం తరంగా అందిస్తూన్న మిత్రులూ, శిరాకదంబం సంపాదకులు శ్రీరామచంద్ర రావుగారికీ నమస్సుమనస్సులు