13_003 మందాకిని – తీర్మానం

కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి. దట్టమైన అడవిలో దండోరా విని చిన్నా, పెద్దా జంతువులన్నీ ప్రాంగణంలో సమావేశమై ఇంత హఠాత్తుగా సమావేశం ఎందుకో అర్థం కాక తల బద్దలు కొట్టుకుంటున్నాయి. వాటిలో అవి చర్చించుకొంటున్నాయి, కారణం ఏమైవుంటుందా ? అని.

ఇంతలో మృగరాజు వేంచేశాడు. సభ ప్రారంభిస్తూ “ అందరూ శ్రద్ధగా వినండి ”. అంతా నిశ్శబ్దమైపోయింది. ఎంత క్రమశిక్షణో. “ ఈమధ్య మానవజాతిలో మగాళ్లను ‘ మృగాడు ’ అంటూ మనతో పొలుస్తున్నారని తెలిసింది. అలా ఎందుకు అంటున్నారని అడుగుతున్నారా ? ఆ విషయం గురించి చర్చించడానికే ఈ సమావేశం.

వాళ్ళ పురాణాల్లో కీచకుడు, రావణాసురుడు లాంటి కొందరు, ఎంతో గొప్ప రాజులయినప్పటికీ స్త్రీలను అవమానించి చెరబట్టే వాళ్ళని కథలు ప్రచారంలో వున్నాయి. వారికి చెడ్డవారిగా ముద్ర పడింది. అట్లా ఎవరూ చేయకూడదనే నీతిని బోధించే కథలు. కానీ ఈనాడు వారినే కొందరు అనుసరిస్తున్నారు.

పురుషాధిక్య సమాజంలో కుటుంబాన్ని వృద్ధి చేయడంతో బాటు, కుటుంబ సభ్యుల పోషణ, రక్షణే కాక సంఘం కట్టుబాట్లు, సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ పరాయి స్త్రీ తల్లి తోబుట్టువులతో సమానమని తెలిసి ఏమిటో ఈ ప్రవర్తన.

ఏమిటీ ప్రవర్తన అంటారా ? ఆ మధ్య దేశరాజధాని నగరంలో జరిగిన ఒక పైశాచిక హత్య తరువాత నిర్భయ చట్టమనేది అమలులోకి తెచ్చారుట. శిక్ష చాలా కఠినంగా వుంటుందిట. అయినా ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే వున్నాయట.

కారణం ఏమైవుంటుందంటారా ? పిల్లలను ఆడ మగ వివక్షతో పెంచడం ( ఇప్పుడు చాలావరకు ఆ వివక్ష తగ్గిందనుకోవచ్చు ).  ఆడవారికి క్రమశిక్షణ, కట్టుబాట్లు, సంప్రదాయాలు. మగమహారాజుని క్రమశిక్షణ తప్పి ప్రవర్తిస్తున్నా చూసీచూడనట్లు ఊరుకోక సంస్కారం, సంస్కృతి, మానవత్వ విలువలు తెలియ చెప్పేటట్లు శిక్షణ వుండాలని పెద్దలు అనుకొంటున్నారు.

ఈ విషయంతో మనకేమిటి సంబంధం అంటారా ? మన మృగజాతుల్లో వావి వరుసలు లేకపోయినా సృష్టి ప్రక్రియ కోసం ఇష్టమైన ఆడజీవితో జత కట్టడం, పిల్లల్ని స్వతంత్ర్య జీవనం సాగించేవరకు పోషించడం జరుగుతుంది. ఏకపత్నీవ్రతుడైన రాముని రామాయణం మానవ జీవన ప్రమాణమని గౌరవించే మానవుని మహాబుద్ధిశాలి అంటారు కదా ! బుద్ధిశాలి అయిన మానవుడి బుద్ధి వక్రించి, గౌరవించి పూజించాల్సిన స్త్రీని వయసు, వావి, వరుసలు మరిచి అవమానించి, అత్యాచారం చేసి, హత్య చేస్తున్నాడట. అందుకని వాడిని ‘ మృగాడు ’ అంటూ అనవసరంగా మనతో పోల్చి మనల్ని అవమానిస్తున్నారు.

మనతో పోల్చడం సమంజసమా ? కాదు – కాదు – కాదు. మన జీవనం, కట్టుబాట్లకు సరికాజాలడు. మృగంతో పోల్చడానికి కూడా అనర్హుడని తీర్మానం చేస్తున్నా. అందరికీ ఆమోదమే కదా ? ఇంతటితో సమావేశం ముగిసింది ”.

 

***********************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page