13_003 సర్వ కళా స్వరూపిణి

 

సర్వకళా స్వరూపిణి ఆ తల్లి

సర్వజగత్తు సృష్టించిన ఆ తల్లిలో ఎంత కవనమో ఉంది. ఎంత గానమో దాగిఉంది. జగత్ సృష్టికి మించిన కళ ఏమున్నది ? అంతకు మించిన శిల్పమేమున్నది ? ఆమెలో గోచరించని కళలేమి ఉన్నాయి ? సర్వకళా స్వరూపిణి ఆమె. వాణి ఆమె రూపమే. అందువలన నవరాత్రులలో ఒకనాడు ఆమెను సరస్వతిగా పూజిస్తారు.

ఈ నవరాత్రులలో సరస్వతీపూజతో పాటుగా ఆయుధపూజ, విజయదశమి ప్రొద్దులుకూడా జరుగుతాయి. వీటికి సంబంధించి ఐతిహాసికంగా కథలున్నాయి.

 

విజయ దశమి విజయుని దశమి

జూదంలో ఓడిపోయిన పంచపాండవులు పదమూడేళ్లు వనవాసం చేశారు. ఇక అజ్ఞాతవాసం గడవాలి. అజ్ఞాతవాసం కఠోరమైనది. వారిని ఆ సంవత్సరకాలంలో ఎవరూ గుర్తించరాదు. అలా గుర్తించటం జరిగితే మళ్ళీ అరణ్యవాసం, మళ్ళీ అజ్ఞాతవాసం చెయ్యాలి. అందువల్ల వారందరూ మారువేషాలు తాల్చవలసి వచ్చింది. అరణ్యవాసం పొడుగునా తాల్చిన ఆయుధాల నన్నిటినీ కట్టకట్టి శవాకారంగా రూపొందించి ఒక జమ్మిచెట్టు మీద దాచివేశారు.

బృహన్నలగా ఉన్న అర్జునుడు ఉత్తరగోగ్రహణ సమయంలో ఉత్తరునికి రథసారథిగా నియమితుడైనాడు. ఉత్తరుడు ప్రగల్భాలేతప్ప పౌరుషం లేనివాడు. అర్జునుడు రథాన్ని ఆ శమీవృక్షం దగ్గరకు పోనిచ్చి ఆ చెట్టుపై నున్న ఆయుధాలు తీశాడు. ఆ రోజుతో అజ్ఞాత వ్రతదీక్ష పరిసమాప్తమైంది. అందువల్ల ధైర్యంగా గాండీవం ధరించి యుద్ధానికి బయలుదేరుతాడు. పాండవులలో తొలుతగా అలా సమరానికి ఉరికి విజయం సాధించినది అర్జునుడే. అది విజయదశమి. విజయుని దశమికూడా అయింది.

శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేసింది కూడా నవరాత్రులలోనే అంటారు కొందరు పెద్దలు. రామాయణంలో శరదృతువు రాగానే వానరసేనలు సీతాన్వేషణకు బయిల్దేరినట్లు ఉదాహరించబడింది. ఆంజనేయుడు లంకకుపోయి సీతను కనుగొని ఆ వర్తమానం రామునికి తెలియబరిచాడు. తదుపరి వానరసేనలు బయిలుదేరటం, వారధికట్టడం, లంకను చేరటం, యుద్దానికి ఉపక్రమించటం జరిగింది. మరి ఈ విధంగా ఆలోచిస్తే నవరాత్రుల నాటికి రావణ సంహారం జరిగిందనటానికి అవకాశం చాలదు. అయినా ఎందుకో ఈ నమ్మకం జనంలోకి వచ్చి నిలబడిపోయింది.

 

విజయ దశమి విద్యకు ఉత్సవం

ఈ విజయదశమిని, ముందున్న నవరాత్రులను విద్యార్థులు, గురువులు విశేషమయిన ఉత్సాహంతో ఉత్సవంగా జరపటం తెలుగునాట ఒక ఆచారం. విద్యార్థులకు వీరోచితగాథలు చెప్పటం, వారిచేత జయీభవ ! విజయీభవ ! అని విజయ వాక్యాలు పలికించటం, వారి చేతులలో విల్లంబులు ధరింపజేయటం, వారిచేత సామూహికంగా జైత్రయాత్రలు చేయించటం ఆ ఆచారంలో ఒక భాగం.

పిల్లల చేతులలో కోతిబొమ్మలు కూడా ఉంటాయి. రావణసంహారం నిమిత్తం వెళ్ళిన వానరసేనను తలుచుకోవడమేనేమో యిది !

“ ధర సింహాసనమై నభంబు గొడుగై

            తద్దేవతల్ భృత్యులై

పరమాయ్నాయము లెల్ల వంది గణమై

            బ్రహ్మాండ మాకారమై

సిరి భార్యామణియై విరించి కొడుకై

            శ్రీగంగ సత్పుత్రియై

వరుపన్ నీ ఘనరాజసంబు నిజమై

            వర్థిల్లు నారాయణా ! ”

ఈ పద్యం పాడుతూ బడిపిల్లలు కొత్త దుస్తులు తాల్చి, సంబరాలు పడుతూ, తోటివాళ్లతో కలసి, విల్లంబులు, కోతిబొమ్మలు చేపట్టి ఇంటింటికీ వెళ్ళేవారు. పిల్లల వెనుకనే వారి గురువులు.

కళకళలాడుతూ పిల్లలు అలా ఇంటికి రాగానే గృహాస్థులు ఆనందంతో వారిని ఆదరించేవారు. తమకు, తమ గురువులకు ఏమికావాలో ఆ పిల్లలు జయజయధ్వనులు చేస్తూ చెప్పేవారు.

“ అయ్యవారికి చాలు అయిదు వరహాలు

పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు ”        

గృహాస్థులు పిల్లలకు రుచికరమైన ఉపహారాలు పంచి గురువులను కొత్తబట్టలతో దక్షిణ తాంబూలాలతో సత్కరించేవారు.

మా చిన్నతనంలో బళ్ళలో దసరా పండుగల్లో ఇద్దరు కుర్రవాళ్ళకు నరనారాయణులని పేరు పెట్టేవారు. నరుడు నారాయణుని కీర్తించటం, ఆరాధించటం, ఆయన నరుని అనుగ్రహించి ఆశీర్వదించటం ఉండేది. చివరకు నర నారాయణులొక్కరే అని సూచించి ఒకరిలో ఒకరు లీనం కావటం ప్రదర్శించేవారు. పసితనంలోనే అంటువంటి భావనలు కల్పించటం మన సంస్కృతికి గొప్ప చిహ్నం. పండుగలు జరుపుకోవటంలో ఇమిడి ఉన్న సూక్ష్మం కూడా అదే. అవి వేడుకలే కాక విజ్ఞాన బోధనలు. సాంస్కృతిక సాధనలు.

ఈ శరన్నవరాత్రేలు పరమ పవిత్రమైన పర్వదినాలు. మహామాతను అర్చించి పునీతులయ్యే పున్నెపు దినాలు. ఆ శివసుందరి, ఆ లలితాంబ, ఆ కాత్యాయని మనకు సకల శుభాలు అందించాలని ప్రార్థిద్ధాము. “ ముక్తిని సాధించు సామగ్రిలో భక్తి యొక్కటే గొప్పది ” అనేదే నవరాత్రులకు చెందిన దివ్యసందేశం.

 

పరిచెద పారిజాతములు పాదము లల్లన మోపి రాగదే !

తెరిచెద గుండె వాకిళులు తీరుగ గుమ్మము దాటి రాగదే !

సరిదెద నాత్మపీఠమును చల్లన వచ్చి అలంకరింపవే !

కురిసెద భక్తి గీతములు కోరిన కోరిక లాలకింపవే !

                   

**************************************************** 

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page