13_003

 

ప్రస్తావన

దేశంలో ఎన్నికల జాతర మొదలవుతోంది. ఇప్పటి తరానికి తెలిసిన జాతర పార్టీల అధినాయకుల పాదయాత్రలు, సమావేశాలు, ఒకరిపై మరొకరు విమర్శలు, దూషణలు వగైరా. వీటికి అదనం టీవీల్లో చర్చలు, మొబైల్ ఫోన్ల హడావిడి…. సోషల్ మీడియా సందేశాలు.

గత తరానికి తెలిసిన ఎన్నికల జాతర మరో విధంగా ఉండేది. కాలంతో వచ్చిన మార్పులతో ఎన్నికలు కూడా ఆధునిక రూపాన్ని సంతరించుకున్నాయి. ఇప్పుడు టీవీలు ఉన్నాయి. అంతర్జాలం ఉంది. ఉపగ్రహ సాధనాలు ఉన్నాయి. ప్రత్యక్ష ప్రసారాలు ఉన్నాయి. పార్టీల నాయకులకు, ముఖ్యంగా అధినాయకులకు ప్రజలకు రోజూ నేరుగా కనిపించే, సందేశాలిచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎన్నికల ప్రచారం చాలావరకు కేంద్రీకృతమై పోయింది. కరపత్రాల నుంచి ఆడియో, వీడియోల వరకు ప్రచార సామగ్రి అంతా అధిష్టానం నుంచి సరఫరా అవుతోంది.  

అదే మూడు, నాలుగు దశాబ్దాల క్రితం వరకు ఎన్నికల చిత్రం మరో రకంగా ఉండేది. జాతీయ స్థాయి ఎన్నికలయినా, రాష్ట్ర స్థాయి ఎన్నికలయినా కూడా ప్రచారం ప్రాంతీయ స్థాయిలోనే అధికంగా ఉండేది. అధిష్టానం సూచనలు మాత్రమే చేసేది. ఎన్నికల సామగ్రి అంతా స్థానికంగానే తయారయ్యేది. అసలు ఎన్నికలు వస్తున్నాయి అంటే ఆరునెలల ముందు నుంచే ప్రయత్నాలు మొదలయ్యేవి. ఒక ప్రక్క పార్టీ టికెట్ల కోసం ఆశావహులు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆయా నియోజక వర్గాల పరిధిలో నాయకులు, కార్యకర్తలు ప్రచార వ్యూహాలలో మునిగి ఉంటే సామాన్య జనంలో చాలా వర్గాలకు కూడా చేతినిండా పని దొరికేది.

చిత్రకారులందరూ ముందుగానే ముఖ్యమైన కూడళ్లలోను, జనసమ్మర్ధం ఉండే ప్రాంతాలలోను ఉన్న గోడలను గుర్తించేవారు. ఆయా గోడల యజమానులను కలిసి ఎన్నికల ప్రచారానికి ఇవ్వడానికి ఒప్పించేవారు. తరువాత ఆయా పార్టీలను, అభ్యర్థులను కలిసి గోడల మీద ప్రచారానికి ఒప్పందాలు చేసుకునేవారు. ఆ కారణంగా ఒక్కొక్క నియోజక వర్గంలో కనీసం పదిమంది చిత్రకారులకి, సహాయకులకి పని ఉండేది. అదే విధంగా పార్టీలు, అభ్యర్థులు ఆయా నియోజక వర్గాల్లో కవులను, రచయితలను కలిసి ప్రచారానికి పనికి వచ్చే పాటలను, నాటకాలు వగైరా లు వ్రాయించుకొనేవారు. తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న గాయనీ గాయకులు, వాయిద్య కళాకారుల చేత ఆ పాటలను సాధన చేయించేవారు. అలాగే కొన్ని వాహనాలను కూడా ఎన్నికల వరకు అద్దెకు తీసుకునేవారు. వాటిలో ఆ కళాకారులను ఊరూరా తిప్పుతూ పాటలతో, నాటకాలు, బుర్రకథలు మొదలైన ప్రక్రియలలో ప్రచారం నిర్వహించేవారు. అలాగే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఫ్లెక్సి ప్రింటింగ్ తెలియని ఆరోజుల్లో ఖద్దరు బట్ట మీద చేతితో వ్రాయించి ముఖ్యమైన కూడళ్లలో కట్టేవారు. ఆఫ్‌సెట్ ప్రింటింగ్ లేదు గనుక లెటర్ ప్రెస్ లో కరపత్రాలు ముద్రించేవారు. లితో ప్రింటింగ్ పద్ధతిలో గోడ పత్రికలు ( వాల్ పోస్టర్స్ ) ముద్రించేవారు. సమావేశాలు, ఊరేగింపులు మామూలే. ఊరేగింపుల్లో బ్యాండ్ మేళాల సందడి ఉండేది. కొన్ని పార్టీలు తమ ఎన్నికల చిహ్నాలను కూడా ప్రదర్శించేవారు. ఉదాహరణకి నెహ్రూ కాలంలో కాంగ్రెస్ ఎన్నికల చిహ్నంగా కాడెద్దులు ఉండేవి. ఇందిరాగాంధి కాలంలో మొదట ఆవు, దూడ గుర్తు ఉండేది. వీటిని కూడా ఊరేగింపు లో భాగస్వాముల్ని చేసేవారు. అవకాశాల మేరకు ఇతర పార్టీలు, స్వతంత్రులు కూడా తమ ఎన్నికల చిహ్నాల్ని ప్రదర్శించేవారు. అప్పట్లో అక్షరాస్యతా శాతం తక్కువ గనుక ఓటర్లు తమ పార్టీ చిహ్నాలని గుర్తు ఉంచుకునేటట్లు చెయ్యడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగించేది.

స్థానికంగా చేతి వృత్తుల వారికి, కళాకారులకి, రచయితలకు…. చాలామందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల సీజన్ అంతా పని దొరికేది. తర్వాత ప్రచారంలో క్రమంగా మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ప్రధాన ప్రసార సాధనమైన రేడియోలో ఎన్నికల ప్రచారానికి అంతగా ప్రాముఖ్యత ఉండేది కాదు గానీ దూరదర్శన్ వచ్చాక పెరిగింది. ప్రధానమైన పార్టీలకు నిర్ధిష్టమైన సమయం కేటాయించి కొంతమంది నాయకులకే మాట్లాడే అవకాశం ఇచ్చేవారు. ప్రైవేట్ ఛానెల్స్ ప్రభంజనం వచ్చిన తర్వాత ప్రచార స్వరూపమే మారిపోయింది. అంతర్జాల వినియోగం, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగాక విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పక తప్పదు. అది ఎంతవరకు వెళ్లిందంటే ఓటర్ల సెంటిమెంట్లను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగింది.

కొత్త తరానికి కొత్త మార్పులు. మార్పు సహజమే. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి స్థానికుల ప్రమేయం తగ్గిపోయింది. పోస్టర్లు, బేనర్లు, హోర్డింగ్ లు ఎక్కడో తయారవుతున్నాయి. పాటలు, వీడియోలు ఇంకెక్కడో తయారై వస్తున్నాయి. చివరికి కరపత్రాలు కూడా. దీనిలో కూడా కార్పొరేట్ సంస్థలు ప్రవేశించాయి. స్థానిక సామాన్య ప్రజలకు ఐదేళ్ల కొకసారి దొరికే ఉపాధిని కూడా అవి మింగేస్తున్నాయి. ఎన్నికల జాతర అంటే నిజంగానే ఎన్నికల కాలమంతా జాతర లాగే ఉండేది.

గతంలోనూ రాజకీయాలున్నాయి. ఎత్తుకు పైయెత్తులున్నాయి. ప్రచార హోరు ఉండేది. ప్రత్యర్థుల మీద విమర్శలుండేవి. అప్పుడప్పుడు కొట్లాటలు కూడా ఉండేవి. అయితే అవి హద్దు మీరకుండా కొన్ని విలువలకు లోబడి ఉండేవి. ఒకరికంటే మరొకరు ఉధృతంగా ప్రచారం చెయ్యాలనుకునేవారు గానీ ఒకరినొకరు నిర్మూలించాలని అనుకునేవారు కాదు. దూషణలు ఉన్నా అవి కూడా హద్దుల్లో ఉండేవి. తాము గెలవాలని అనుకునేవారు గానీ ప్రత్యర్థుల ఉనికి లేకుండా చేయాలనే ఆలోచన ఎవరికీ ఉండేవి కాదు. అసలు ఎన్నికలంటే పోటాపోటీగా జరిగేవి.

అప్పట్లో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, కేంద్ర నాయకులు వంటి వారిని చూసే అవకాశం సామాన్య ప్రజానీకానికి ఎక్కువగా ఎన్నికల సమయంలో గానీ లేదా ఆ ప్రాంతంలో ఏదైనా పెద్ద ప్రాజెక్టు ప్రారంభించే సందర్భంలో గానీ మాత్రమే చాలా అరుదుగా వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్తితి ఉందా ? 

సమాజం సాంకేతికంగా పురోగమిస్తోంది గానీ నైతికంగా దిగజారిపోతుందేమోననిపిస్తోంది ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే. అప్పటి పరిస్థితులు తిరిగి రావాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. కానీ నైతికత, హుందాతనం ఉండే రాజకీయం రావాలని ఆశించడం తప్పు కాదేమో !

********************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page