13_004 ఆనందవిహారి

 

నగరంలో దసరా శోభ

 అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ప్రతి నెలా అంతర్జాలంలో సమర్పిస్తున్న “నెల నెలా వెన్నెల” అక్టోబర్ మాసం కార్యక్రమంలో చెన్నై “నగరంలో దసరా శోభ” ప్రత్యేక భక్తి సంగీత విభావరి జరిగింది.

అక్టోబర్ 23వ తేదీ సోమవారం ప్రసారమైన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన గాయక మహిళామణులు చక్కని గాత్రశుద్ధితో, వాద్య ప్రతిభతో ఆకట్టుకున్నారు. యడవల్లి అరుణా శ్రీనాథ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అమ్మవారి అనుగ్రహ విశేషాలను వివరించారు.

కొన్ని చక్కటి కీర్తనలను, దసరా సందర్భంగా ఊర్లలో పాడే పాటను వినిపించారు. లక్ష్మీ ప్రసన్న బోనాల అష్టాదశ శక్తిపీఠాల పాటను ఆలపించారు.

శారద “హిమగిరి తనయే హేమలతే” కీర్తనను వీనులవిందుగా వీణపై మీటారు.

“జయ జయ శ్రీ రాజరాజేశ్వరి” అంటూ వసుంధర అలరించారు.

“నీ కాలి అందెల” అని కె. రమాదేవి సందడి చేశారు.

క్రొవ్విడి రమాదేవి వందన సమర్పణ గావించారు. మధ్య మధ్య బొమ్మలకొలువు, మహిళల పేరంటాల సన్నివేశాలు కనువిందు చేశాయి.

ప్రసాద్ గ్రాఫిక్స్ చెన్నై, శిష్ట్లా రామచంద్రరావు, శిష్ట్లా ఉదయ్ సాంకేతిక సహకారం అందజేశారు.

ఈ కార్యక్రమం వీడియో…..

 

 

*****************************************************

 

“ తెలుగింటి అత్తగారు ” పుస్తకావిష్కరణ

మహానటి శ్రీమతి సూర్యకాంతం గారి శత జయంతి వేడుకల ప్రారంభోత్సవ సభ చెన్నై లో నవంబర్ 05వ తేదీ అదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు పాల్గొని సూర్యకాంతం గారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె గురించిన సినీ జీవిత విశేషాలతో వెలువరించిన “తెలుగింటి అత్తగారు” ప్రత్యేక సంచిక ఆవిష్కరించారు.

ముఖ్య అతిథి మాట్లాడుతూ సూర్యకాంతం గారికి మాటలు అవసరం లేదని, ఆమె ఎడమ చేయి ఊపితే చాలని అంటూ తమిళనాడులో జయలలిత ను అందరూ అమ్మ అని పిలిచేవారని…. అటువంటి జయలలిత చేత అమ్మా అని పిలిపించుకున్న గొప్ప వ్యక్తి సూర్యకాంతం అని అభివర్ణించారు. తెలుగు సినీరంగంలో ఆమెకు ప్రత్యామ్నాయం ఎవరూ లేరని ఆయన పేర్కొన్నారు. ఇటీవల తెలుగు పాటకు ఆస్కార్ పురస్కారం రావడం గురించి గుర్తు చేస్తూ మన భాషాసంస్కృతులను కాపాడుకుంటే ప్రపంచం కూడా తప్పకుండా గుర్తిస్తుందని, గౌరవిస్తుందని అన్నారు.

సూర్యకాంతం గారి కుమారుడు డా. అనంతపద్మనాభ మూర్తి మాట్లాడుతూ ఈ పుస్తకం అనేకమంది సినీ ప్రముఖులు, ఆథ్యాత్మికవేత్తలు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు అందించిన వ్యాసాల సంకలమని అన్నారు.    

ఈ సందర్భంగా సూర్యకాంతం గారి పైన డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు.

స్థానిక త్యాగరాయ నగర్ లోని ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ( ఆస్కా ) వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులు గా మద్రాసు ఉన్నత న్యాయస్థానం న్యాయాధిపతి శ్రీమతి ఎన్ మాల గారు, డెట్ ట్రిబ్యునల్ జడ్జి శ్రీ జయచంద్ర గారు… ఆత్మీయ అతిథి గా గోపురం శ్రీ హరికృష్ణ గారు పాల్గొన్నారు.

తొలిప్రతి అలనాటి అందాల నటీమణులు శ్రీమతి రాజశ్రీ, శ్రీమతి జయచిత్ర, ప్రముఖ సీనియర్ సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ గారు, ప్రముఖ ఆర్కిటెక్ట్ శ్రీ ఆదిశేషయ్య గారు, ఆస్కా అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు అందుకొన్నారు.

సూర్యకాంతం గారి పైన ప్రముఖ రచయిత, సినీ జర్నలిస్టు శ్రీ ఎస్వీరామారావు గారు సమర్పించిన డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది.   

శ్రీమతి సూర్యకాంతం కుటుంబం నిర్వహించిన ఈ సభలో నగరానికి చెందిన అతిరథ, మహారథులు ఎందరెందరో పాల్గొనగా అత్యంత వైభవంగా సూర్యకాంతం శతజయంతి వేడుకలు ప్రారంభం అయ్యాయి.

 

 

 

************************************************

భారత మాజీ ఉప రాష్ట్రపతి గౌ. శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి సందేశం :  

తెలుగు వారంతా అభిమానించే “తెలుగింటి అత్తగారు” శ్రీమతి సూర్యకాంతం గారి శతజయంతి ఏడాది ప్రారంభం సందర్భంగా తెలుగు తెరపై ఏళ్ళ పాటు ఒకే తరహా పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసి, ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను.

శ్రీమతి సూర్యకాంతం గారి శతజయంతి నేపథ్యంలో తెలుగింటి అత్తగారు పుస్తకాన్ని విడుదల చేయటం ఆనందదాయకం. ఈ పుస్తకం వారి నటనా వైభవాన్ని తెలియజేసే కరదీపిక కాగలదని ఆశిస్తున్నాను. ఈ పుస్తకంలో వ్యాసాలు రాసిన రచయితలకు, రూపకల్పనలో కృషి చేసిన వారికి అభినందనలు.

శ్రీమతి సూర్యకాంతం గారి గురించి వారు నటించిన పాత్రలే మాట్లాడతాయి. ఆమె సహజనటి. వారి పేరులోని సూర్యకాంతి ఆమె నటనలో ప్రకాశిస్తే, ఆ కాంతిలోని వేడి-వాడి వారి మాటల్లో ప్రస్ఫుటమౌతుంది. బహుముఖ ప్రజ్ఞ కలిగిన శ్రీమతి సూర్యకాంతం గారికి ప్రత్యామ్నాయం లేదు. వారిని అనుకరించటం కూడా కష్టమే.

గయ్యాళి పాత్రల్లో ప్రేక్షకాభిమానం సంపాదించుకున్న శ్రీమతి సూర్యకాంతం గారికి నలుగురికీ అన్నం పెట్టడం ఎంటే ఎంతో ప్రీతి. గుప్తదానాలు, అవసరాల్లో ఉన్న వారికి సాయం చెయ్యటం, సొంత ఊరిని మరువకపోవటం వంటివి వారి నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన ఆదర్శాలు.

ఓ మహిళా నటి అయ్యి ఉండి, కఠినమైన మనస్తత్వమున్న పాత్రల్లో నటిస్తూ, సినిమా టైటిల్ కూడా ఆమె పేరు పెట్టగలిగేంత ప్రేక్షకాభిమానం సంపాదించుకున్న శ్రీమతి సూర్యకాంతం నటనా వైభవం అద్వితీయం. వారి శతజయంతి సందర్భంగా చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారి కుమారుడు శ్రీ అనంత పద్మనాభ మూర్తికి అభినందనలు.

*******************************************

 

హాంగ్ కాంగ్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

దసరాకి రెండు రోజుల ముందు వచ్చె బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగను ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వారందరు కలిసి ఎంతో ఆనందోత్సాహాలతో, భక్తీ శ్రద్ధలతో జరుపుకున్నారు. లాంటౌ ద్వీపం లో క్రొత్తగా నిర్మించబడ్డ వాటర్ ఫ్రంట్ ప్రోమేనాడ పై అందమైన ఆకాశంలో నక్షత్రాల మెరుపుల క్రింద, రంగు రంగుల పూలతో అందంగా తయారైన గౌరమ్మను మెరిసే పట్టు చీరలు, నగలలో అందాల భామలు, అందమైన నవ్వులతో, పిల్ల – పాపలతో ఆడపడుచులందరూ చక చక తరిలి వచ్చారు.

తుంగ్ చుంగ్ మెట్రో స్టేషన్ నుండి కేవలం కొద్ది దూరంలో ఉన్న తుంగ్ చుంగ్ ఈస్ట్ ప్రొమెనేడ్, జాగర్స్, బైకర్స్, డాగ్వాకర్స్ మరియు విహార యాత్రలకు వచ్చే వారితో ప్రసిద్ది చెందింది, ఇది విశ్రాంతి తీసుకోవడానికి మరియు ప్రకృతిని ఆస్వాదించటానికి సరైన ప్రదేశం.

చివరి రోజు బతుకమ్మ (సద్దుల బతుకమ్మ) పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు తంగేడు, గునుగు మొదలగు పూలను ఇంటిల్లపాదీ స్నేహితులతో కలసి ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు.

ఈ పూలను జాగ్రత్తగా ఒక పళ్ళెం (తాంబలం) లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగేడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబోలంలో పేర్చి, ఆపై తంగేడు పూల కట్టలు పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది పెడతారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు. చీకటి పడుతుండగా, స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని వాటర్ ఫ్రంట్ కి ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు లో బతుకమ్మ పాటలు ‘ బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో ’ పాడుతూ అందంగా అలంకరించుకున్న బాలికలు, కన్నె పడుచులు,  స్త్రీలు, బతుకమ్మలతో అత్యంత సుందరంగా, వైభవయానంగా ఉంటుంది. ఈ ఊరేగింపు కొనసాగినంత సేపూ, జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి.

సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ప్రోమేనాడ చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడి పాడారు. ఇలా చాలా సేపు ఆడాక గౌరమ్మను పూజించి వెళ్ళి రావే బతుకమ్మ అంటూ సముద్రంలో నిమజ్జనం చేసారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.

ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన సత్తుపిండి (మొక్కజొన్నలు లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి, వాటిని పిండి చేసి, వాటితో చక్కెర పిండి లేదా బెల్లం, నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు) వాయనాలను ఇచ్చి పుచ్చుకొని ప్రసాదం సేవించారు.

స్థానికంగా జరిగే మరొక పండుగ “చుంగ్ యెంగ్ ఫెస్టివల్” వివరాలు శ్రీమతి జయ తెలియజేస్తూ మన బతుకమ్మ పండుగ కి ఒకటి రెండు రోజుల తేడాలో ఈ పండుగ వస్తుందని, అందుకే పూలు ఈ రోజులలో చాల ఖరీదుగా ఉంటాయని, అయిన ఏ విధంగాను ఉత్సాహం తగ్గేదేలేదు అని వివరించారు.

చుంగ్ యెంగ్ ఫెస్టివల్ అనేది తొమ్మిదవ నెల తొమ్మిదవ రోజున హాంకాంగ్, ప్రధాన భూభాగం చైనా, తైవాన్ మరియు మకావులలో 2,000 సంవత్సరాల క్రితం నాటి గొప్ప సంప్రదాయానికి సంబంధించిన ఒక పండుగ. హాంకాంగ్‌లో ప్రత్యేకంగా, ప్రజలు ఈ సాంప్రదాయ చైనీస్ పండుగను పర్వతాల పైకి ఎక్కడం, బంధువులను స్మరించుకోవడం మరియు యిన్-యాంగ్ శక్తిని తిరిగి సంతులనం చేయడం వంటి అనేక కార్యకలాపాలతో గౌరవిస్తారు, అదే సమయంలో ఈ పండుగ వెనుక ఉన్న ఒక పురాణ ఖడ్గవీరుడి మూల కథను ప్రస్తావిస్తారు.

చుంగ్ యెంగ్ ఫెస్టివల్ లేదా డబుల్ నైన్త్ ఫెస్టివల్ (重陽節, కాంటోనీస్‌లో చుంగ్ యెంగ్ జిట్ అని ఉచ్ఛరిస్తారు లేదా మాండరిన్‌లో చోంగ్యాంగ్ జియే అని ఉచ్ఛరిస్తారు) హాంగ్ కాంగ్ ప్రజలు ఎత్తైన పర్వతాలను అధిరోహించి, తమ పూర్వీకుల సమాధులను శుభ్రపరుస్తారు మరియు స్తబ్దుగా ఉన్న శక్తిని తొలగించడానికి శుభ్రపరిచే ఆహారాన్ని తినే రోజు. తొమ్మిదవ చాంద్రమాన నెలలో తొమ్మిదవ రోజున గమనించిన చుంగ్ యెంగ్ ఫెస్టివల్ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 23, 2023న జరుపుకున్నారు. చుంగ్ యెంగ్ ఫెస్టివల్ వసంతకాలంలో జరుపుకునే చింగ్ మింగ్ ఫెస్టివల్ (清明節)తో ఒకదాన్నొకటి అని పొరబడుతారు, అయినప్పటికీ అవి కొన్ని సారూప్యతలను కలిగి ఉన్నాయి. రెండు సెలవులు పూర్వీకులను మరియు ప్రియమైన వారిని సమాధులు స్వీపింగ్ చేయడం ద్వారా మరియు జరుపుకోవడానికి కొన్ని ఆహారాలు తినడం ద్వారా గౌరవించబడతాయి, చల్లని బంక బియ్యం, కుడుములు వంటివి. చింగ్ మింగ్ అంటే ‘కాంతి’ లేదా ‘ప్రకాశం’, మరియు చల్లని కాలం తర్వాత తాజా ప్రారంభాలను నొక్కి చెప్పడం వాటిని వేరు చేస్తుంది.

ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి జయ పీసపాటి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో వరుసగా ఆరవ సంవత్సరం జరుగుతున్న బతుకమ్మ ఉత్సవమని తెలుపుతూ, ఈ ఉత్సవానికి సహాయ సహకారాలు అందించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. THKTS సభ్యులు, వారి కుటుంబ సభ్యుల కృషివల్లే బతుకమ్మ సంబురాలను ఇంత బాగా చేయగలుగుతున్నామని అన్నారు. నవంబర్ లో కార్తిక వనభోజనాలు మరియు దీపావళి వేడుకల ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.

 

*******************************************

 

­👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page