13_004 మందాకిని – మధుర స్మృతులు

 

లేఖ

చిరంజీవి శరత్ కు, మీ ఆంటీ ఆశీస్సులతో వ్రాయునది.

నాకేమైనా మధురస్మృతులుంటే చెప్పమని ఆమధ్య ఎప్పుడో అన్నావు. నా మధురస్మృతులన్నీ నా బడి తో ముడిపడి వున్నాయి. కాబట్టి నా బడి గురించి వ్రాయందే నా స్మృతులు మధురమైనవి ఎవరూ అనుకోరు.

మాడపాటి హనుమంతరావు పంతులుగారు రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి గార్ల కృషి ఫలితంగా బాలికలకు ప్రత్యేకంగా బడి వుండాలనే ఉద్దేశ్యంతో స్థాపింపబడిన బడి మాది. ఐదుగురు బాలికల తో సుల్తాన్ బజారు పోలీసు స్టేషన్ ఎదురుగుండా సందులో ప్రారంభమయిన మా బడి అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్ర గర్ల్స్ హైస్కూల్ గా వాసికెక్కింది. నా అయిదేళ్ళ వయసప్పుడు ఆ బడిలో చేరిన నేను 1961 సం. లో పన్నెండవ తరగతి పూర్తి చేసి అనుబంధ సంస్థయైన రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి గారి కళాశాలలో బి. ఏ. పూర్తి చేసుకొని 1964 లో పట్టా తీసుకొని బయిటకి వచ్చాను. తరువాత ఆంధ్రా గర్ల్స్ హైస్కూల్ లో చేరి అక్కడే 35 సంవత్సరాలు టీచర్ గా పనిచేసి 2000 సం. మార్చిలో పదవీ విరమణ చేశాను.

ఆ బడిలో సూర్యారావు గారు, ఆదిరాజు వీరభద్రరావు గారు, కస్తూరి ప్రసాద్ గారు, రాఘవాచార్యులు గారు, మాదిరెడ్డి హనుమంతరావు నాయుడు గారు, వెంకటేశ్వరరావు గారు, రామమూర్తి గారు మొదలైన ఉద్ధండ పండితులు నా చిన్నతనంలో పనిచేసేవారు. అందులో రామమూర్తి గారు మా నాన్నగారు.

ఆ రోజుల్లో ఆడవారి కన్న మగవారే ఎక్కువగా టీచర్లుగా పనిచేసేవారు. రామమూర్తి గారు అన్నీ పాఠ్యాంశాలు చెప్పగల దిట్ట. ఆయన్ని అందరూ ఎంత ఇష్టపడేవారో అలాగే అంత భయపడేవారు. ఆయన సమరయోధులు. ఆయన అవడానికి లెక్కల మాస్టారే అయినా సోషల్, ఇంగ్లీష్, తెలుగు, మానవ శరీర శాస్త్రము వంటి పాఠ్యాంశాలను బోధించేవారు. ఆయన వద్ద ఎంతోమంది బాలికలు ట్యూషన్లు చెప్పించుకుంటూ ఉండేవారు. ఆయన కొన్ని పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలు వ్రాసి ప్రచురణకు యిచ్చేవారు. ఆ పుస్తకాలు చిన్న తరగతుల వారికి పాఠ్య పుస్తకాలుగా వుండేవి.

అక్కడ రామక్క, పాపమ్మ, మాణిక్యమ్మ, లచ్చవ్వ, బాలయ్య, రాములు పని చేసేవారు. అందరూ ఒక కుటుంబంగా ఎవరి పని వారు శ్రద్ధగా నిర్వహించేవారు. తక్కినవారి గురించి ఈసారి…. .

— జలజ

 

*********************************** 

 

­👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page