13_004 తోలుబొమ్మలాట

 

ప్రాచీన కళ – తోలుబొమ్మలాట

అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్న చెన్నై యువతి

 

ప్రతిభ, సృజనలే పెట్టుబడిగా, కన్నవారి ప్రోత్సాహమే ఆలంబనగా నగరంలోని యువత అంతర్జాతీయ ఖ్యాతి పొందుతున్నారు. సంప్రదాయ కళల పరిరక్షణకు కూడా సహకారం అందిస్తున్నారు. గతంలో వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్, ఎగ్జిమ్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహించిన హస్తకళలపై చలనచిత్రాల పోటీలో చెన్నై నగరానికి చెందిన నీలభాస్కర్ మూడో బహుమతి గెలుచుకుంది ( ప్రథమ, ద్వితీయ బహుమతులు విదేశీయులు అందుకున్నారు ). ఆమె తీసిన ‘ తోలు బొమ్మలాట్టం ’ ఆంగ్ల చిత్రం బహుమతికి ఎంపికైంది. అప్పటి కేంద్రమంత్రి ఆనంద్ శర్మ సమక్షంలో ఎగ్జిమ్ బ్యాంక్ సి‌ఎం‌డి టి. పి. ఏ. రంగనాథన్ నుంచి ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఆమె చిత్ర విశేషాలను వివరిస్తూ…..

 

నాన్న స్ఫూర్తిగా………  

నాన్న భాస్కర్ ఫిల్మ్ మేకర్. చిన్నప్పటి నుంచి ఆయన పనిని కొద్దిగా గమనించేదాన్ని. ఫోటోలు తీయడం, కెమెరా అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. చదువులో కూడా సైన్స్, లెక్కల కన్నా చరిత్ర, జాగ్రఫీ, ఫైన్ ఆర్ట్స్ మీదే నా దృష్టి ఉండేది. అయిదారేళ్ళ వయసులోనే భరతనాట్యానికి పరిచయం కావడం కళలపై ఆకర్షణను, అంకితభావాన్ని కలిగించింది. భరతనాట్యం నేర్చుకుంటుండగా అన్నీ కళలూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయనిపించింది. ఆ భావనే నన్ను ప్రాచీన కళలను పరిరక్షించాలన్న నినాదంతో చలనచిత్రాన్ని తీసేలా ప్రేరేపించింది.

ఈ విజయం అందరిదీ….

ఒక స్నేహితుడి ఇ మెయిల్ ద్వారా నాన్నకి వరల్డ్ క్రాఫ్ట్స్, ఎగ్జిమ్ బ్యాంక్ లు ప్రకటించిన ఫిల్మ్ మేకింగ్ పోటీ గురించి తెలిసింది. వెంటనే నేనూ పాల్గొంటానని చెప్పా. ఆయన అంగీకరించారు. చూసేవారికి తేలికగా అర్థమౌతుందని శబ్దాలు, కదలికలు ఉన్న తోలుబొమ్మలాటను అంశంగా ఎంచుకున్నాను. చిన్న ఊరిలో సాంకేతిక పరమైన సౌకర్యాలు తక్కువని ఆంధ్రప్రదేశ్ లోని ధర్మవరం నుంచి కళాకారులను ( కండె రామదాసు బృందం ) నాన్న చెన్నైకి ఆహ్వానించారు. అంతటితో ఆయన బాధ్యత పూర్తి అయింది. నా పని మొదలైంది. ఏం తీయాలో…. ఎలా తీయాలో తెలియక మొదట తికమక పడ్డా. మొత్తానికి రామాయణంలో రాముడు అడవిపాలైన దగ్గర నుంచి రావణుడు హతమయ్యే వరకు చిత్రించాను. ఆ పనితనానికి నాన్న ఆశ్చర్యపోయారు. ఎడిటింగ్ కి ఎక్కువగా అవకాశం ఇవ్వకుండా కంటిన్యూటికి ప్రాధాన్యమివ్వడం, తోలుబొమ్మలాటను పరిరక్షించందన్న నినాదం బహుమతికి ఆధారమయ్యాయి. ఈ పోటీలో మొత్తం 80 మంది పాల్గొన్నారు. అరుగురి తోడ్పాటుతో తీసిన ఎనిమిది నిమిషాల నా మొదటి చిత్రం ‘ తోలుబొమ్మలాట్టం ’ అంతర్జాతీయంగా 3వ స్థానంలో నిలిచింది. ఒకటిన్నర లక్షల నగదు అందుకునేలా చేసింది. ఈ విజయం బృందంలోని వారందరిదీ !

భవిష్యత్తులో….

ఇంకొక చిత్రం తీస్తే ‘ కొరట్టి ‘ అనే ఆభరణాలను తయారు చేసే జాతి గురించి తెరకెక్కిస్తాను. ఇంత ఆధునిక యుగంలోనూ, సంప్రదాయాన్ని అంటిపెట్టుకొని పేదరికాన్ని కూడా లెక్క చేయక అదే వృత్తిలో వాళ్ళు కొనసాగడం నన్ను కదిలించింది. మున్ముందు మరిన్ని సినిమాలు తీస్తానేమో ! వృత్తిగా మాత్రం భరతనాట్యాన్నే ఎంచుకుంటాను. నా గురువు ఎన్. శ్యామల ఆశీర్వాదంతో ఆరంగేట్రం కూడా చేశాను. ఫోటోగ్రఫి, ఫిల్మ్ మేకింగ్ వంటివి అభిరుచిగా ముందుకెళ్తాను.

ప్రయోగాలే పునాదిగా…..

చెన్నైలోని అబాకస్ మాంటెస్సోరీ పాఠశాలలో, మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో బి‌ఏ చరిత్ర చదువుకున్నా. బడిలోను, కళాశాలలోను ఫోటోగ్రఫి పోటీల్లో పాల్గొని బహుమతులందుకున్నాను. ఫోటోగ్రఫి అభిరుచిగా మారిన నేపథ్యంలో ఒక స్నేహితుడు తనకింక అక్కర్లేదనుకున్న కెమెరాను నాకిచ్చాడు. అప్పటినుంచి ప్రయోగాలకి అదే నెలవైంది.

  

**********************  

­👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page