13_004

ప్రస్తావన

అనివార్య కారణాల వలన ఈ సంచిక విడుదలలో జాప్యం జరిగింది. పాఠకులు, మిత్రులు మన్నిస్తారని ఆశిస్తూ…

మనిషికి కనీసావసరాలు ఆర్థిక శాస్త్రం ప్రకారం తిండి, బట్ట, గూడు. అయితే వీటితో బాటు తర్వాత కాలంలో అదనంగా కొన్ని జోడించబడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి విద్య, వైద్యం. ఉపాధి ఉంటే తిండి, బట్ట, గూడు అవే ఏర్పాటు అవుతాయి. అయితే జ్ఞాన సముపార్జనకు, మనో వికాసానికి మనిషికి విద్య చాలా అవసరం. స్వాతంత్ర్యం వచ్చిన మూడు, నాలుగు దశాబ్దాల వరకు విద్య పూర్తిగా ప్రభుత్వం అజమాయిషీలోనే ఉంది. అప్పుడు దేశంలో ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో అధిక భాగం ప్రభుత్వ యాజమాన్యమే. అక్కడక్కడ స్థానికంగా కొంతమంది ఉదార స్వభావులు తమ ప్రాంత ప్రజలు చదువు కోసం పడే తపన, కష్టం చూడలేక ఒక సంఘంగా ఏర్పడి తమ విరాళాలతో ప్రైవేట్ రంగంలో విద్యాసంస్థలను ఏర్పాటు చేసి విద్యాసేవ చేశారు. అవి ప్రైవేట్ సంస్థలయినా ప్రభుత్వ అజమాయిషీ ఉండేది. ప్రభుత్వ విధివిధానాలనే అనుసరించేవారు. అయితే తర్వాత కాలంలో విద్యారంగంలో క్రమంగా మార్పులు వచ్చాయి. అప్పటివరకూ బోధనలో జాతీయ భాషకు, ప్రాంతీయ భాషల తర్వాత స్థానమే ఆంగ్ల భాషకు ఉండేది. ఆంగ్ల మాధ్యమం చాలా అరుదుగా నగరాలలోనే ఉండేది. స్థానిక భాషా మాధ్యమంలో చదివిన ఎంతోమంది ఉన్నత పదవులను అలంకరించి దాదాపు అర్థ శతాబ్దం పాటు దేశాన్ని ప్రగతి పథంలోనే నడిపించారు. తర్వాత కాలంలో వచ్చిన మార్పు ఆంగ్ల మాధ్యమం పైన ప్రజల్లో ముఖ్యంగా మధ్యతరగతి లో పెరిగిన మోజు కారణంగా ప్రైవేట్ రంగంలో కుప్పలు తెప్పలుగా విద్యా దుకాణాలు ప్రారంభమయ్యాయి. విద్యా వ్యాపారం మొదలయింది. ఫలితంగా పోటీ తత్వం మొదలయింది. చివరకు ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు శిక్షణ పేరుతో కూడా వ్యాపారం మొదలయింది. దీనికి తోడు విదేశీ వ్యామోహం కూడా పెరిగింది. ఈ దేశంలో ప్రజలు కట్టిన పన్నుల నుంచి వచ్చిన ప్రభుత్వ ఆదాయంలో కొంత భాగం ఖర్చు పెట్టి సుమారు పదిహేను, పదహారు సంవత్సరాలు చదివి డిగ్రీ అందుకున్నాక… తన చదువుకు సహకరించిన దేశాన్ని, ప్రజలని వదిలేసి విదేశాలకు సేవ చెయ్యడానికి వెళ్లిపోతున్నారు. ఇక్కడ వచ్చే కొద్దిపాటి ఆదాయంతో సుఖంగా బతికే అవకాశం బాగానే ఉన్నా, విదేశాలలో కష్టపడటానికే ఇష్టపడుతున్నారు. ప్రజల్లో పెరిగిన ఈ మోజును వ్యాపారంగా మలుచుకుని మిలియనీర్లు అయిపోతున్నారు. విద్యాసంస్థలన్నిటికీ ప్రభుత్వ పరంగా అనేక నిబంధనలు, పరిమితులు వంటివి ఉన్నాయి. అయితే అవేమీ వాటిని పాటించవు. ఏ సంస్థకు ఆ సంస్థ తమదైన నిబంధనలు పెట్టుకుంటాయి. పోటీ తత్వం కారణంగా విద్యార్థుల మీద ఒత్తిడి బాగా పెంచుతున్నారు. శారీరకంగా, మానసికంగా వారిని శక్తిమంతుల్ని చేసే ఆటలు, కళలకు తిలోదకాలిచ్చేశారు. దాంతో ఇప్పటి తరం పిల్లలు మానసికంగా ఎదుగుదల ఉండడం లేదు. సాంకేతికంగా ప్రపంచమంతా ముందుకు వెడుతోంది గాని, మానవ సంబంధాల విషయంలో, లోక జ్ఞానం విషయంలో వెనక్కి నడుస్తోంది. మూడు దశాబ్దాల క్రితం వరకు ప్రభుత్వమే ఉచితంగా విద్య ను అందించేది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలను, ఉచిత విద్యను ప్రభుత్వాలే నిర్వీర్యం చేస్తున్నాయనిపిస్తోంది. ప్రైవేట్ విద్యాసంస్థలను కట్టడి చేసి, ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసి, ఉచిత విద్య అందరికీ అందించే ప్రభుత్వమే రావాలి….. అలాంటి ప్రభుత్వమే కావాలి…. దానికి ప్రజలు గట్టిగా సంకల్పించుకోవాలి.

విద్యా రంగానికి ఏమాత్రం తీసిపోని దిశగా వైద్య రంగం కూడా పూర్తిగా వ్యాపార రంగం అయిపోయింది. గత తరంలో ప్రభుత్వ వైద్యశాలల్లో పేదలకు ఉచితంగా వైద్యం అందేది. ప్రైవేట్ వైద్యులు కూడా అవసరమైనంత వరకే ఫీజు తీసుకుని వైద్యం చేసేవారు. ముఖ్యంగా కుటుంబ వైద్యులు ఉండేవారు. అవసరాన్ని బట్టి ఇంటికి కూడా వచ్చి వైద్యం చేసేవారు. ఇప్పుడు రోగి కదల్లేని స్థితిలో ఉన్నా వైద్యుని దగ్గరకు వెడితేనే వైద్యం అందుతోంది. నాడి చూసి, లక్షణాలు తెలుసుకుని రోగ నిర్థారణ చేసేవారు. అవసరమైన మందులు ఇచ్చేవారు. వైద్య పరీక్షలు చాలా తక్కువగా చేసేవారు. ఇప్పుడు మనం ఏ ఆరోగ్య సమస్యతో అయినా వైద్యుని దగ్గరకు వెడితే ముందు వైద్య పరీక్షలకు పంపిస్తారు. ప్రభుత్వ వైద్యశాలలకు వెడితే చాలా సమస్యలు చుట్టుముడతాయి. వైద్యానికి డబ్బు లేక అక్కడికి వచ్చే నిరుపేద రోగులకు కూడా యూజర్ చార్జీలు ఎదురవుతాయి. అవసరమైన అన్ని పరికరాలు అందుబాటులో ఉండవు. ఉచితంగా ఇవ్వవలసిన మందులు అన్నీ దొరకవు. ప్రాథమిక చికిత్స కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఈ కొరత లకు తోడు వైద్యుల కొరత కూడా ఎక్కువే. ఈ సమస్యల కారణంగా వైద్య రంగంలో కార్పొరేట్ సంస్థలు ప్రవేశించాయి. వాటి ప్రధాన లక్ష్యం వ్యాపారమే. ఈ వ్యాపారాన్ని కూడా నియత్రించి, ప్రభుత్వ వైద్యశాలల్ని బలోపేతం చేసి ఉచిత వైద్యం అందరికీ అందించడం కూడా ప్రభుత్వ బాధ్యతే. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తిని గుర్తు ఉంచుకుంటే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

ప్రజలు విజ్ఞానవంతులు అయితే దేశ పురోగమనానికి తోడ్పడుతారు. ఆరోగ్యవంతులు అయితే ఉత్పాదకత పెంచుతారు. దేశం అభివృద్ధిలో దూసుకుపోతుంది. విద్యా వైద్య రంగాలలో వ్యాపార ధోరణిని నియంత్రించి, ప్రభుత్వ పరంగా ఉచితంగా అందించాలి. ఎన్నికలప్పుడు అమలు సాధ్యం కాని హామీలకు, పంచే డబ్బుకు, ఉచితాలకు లొంగిపోయి ప్రజలు తమకు రావాల్సిన సౌకర్యాలలో పదో వంతు మాత్రమే దక్కించుకుంటున్నారు. ఇదో మాయ. ఈ మాయ మిగిలిన తొంభై శాతం ఎక్కడికి పోతోందో ఆలోచించనివ్వడం లేదు. ఫలితంగా ఏం కోల్పోతున్నారో వారికి తెలియడం లేదు. విద్యావంతులు, మేధావులు విస్తృతంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎన్నికల హడావిడి మొదలైంది గనుక ఇప్పటికైనా ఓట్లు అడగడానికి వచ్చిన వారి దగ్గర ఉచిత విద్య, ఉచిత వైద్యం గురించి గట్టి హామీ తీసుకుని మరీ ఓట్లు వెయ్యాలి. ఎన్నికల తర్వాత కూడా వారు మర్చిపోకుండా అవి నెరవేర్చేవరకు గుర్తు చేస్తూనే ఉండాలి. ఎన్నికైన తర్వాత మళ్ళీ ఎన్నికల వరకు నాయకులు ఆ హామీలు మర్చిపోయినా ప్రజలు మాత్రం మర్చిపోకూడదు. సాధించుకోవాలి. ఇవి నెరవేరితే వచ్చే తరంలోనైనా నిబద్ధత కలిగిన నాయకులు తయారవుతారు. దేశం పురోభివృద్ధి పథంలో దూసుకెడుతుంది.  

­👉🏾 పత్రిక పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

 

              

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page