13_005 ఆనందవిహారి

 

 

నాద తనుమ్ స్మరామి    

 

శివ కేశవులనిద్దరినీ కొలుచుకొనే మాసం కాబట్టి “న కార్తీక సమో మాస:” అంటారని ప్రముఖ సంగీత విద్వాంసురాలు, సంగీత ఉపన్యాసకురాలు డా. ఎర్రమిల్లి రమాప్రభ వ్యాఖ్యానించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ప్రతి నెలా అంతర్జాలంలో సమర్పిస్తున్న “నెల నెలా వెన్నెల” కార్యక్రమంలో భాగంగా నవంబర్ మాసానికి గాను “నాద తనుమ్ స్మరామి” ప్రసారమైంది. శనివారం సాయంత్రం ప్రసారమైన ఈ కార్యక్రమానికి మరొక సంగీత విద్వాంసురాలు, రేడియో ప్రయోక్త గండికోట లక్ష్మీ మంజూష సంధానకర్తగా వ్యవహరించారు.

సామవేద జనితమైన సంగీతానికి ఆధారం పరమశివుడని, “నాద తనుం అనిశం” కీర్తనలో శంకరుడి శరీరం నాదమేనని త్యాగరాజస్వామి పేర్కొన్నారని గుర్తు చేశారు. మనిషి శరీరంలోని నాద తత్త్వాన్ని భరతుడి నాట్యశాస్త్రం, సంగీత రత్నాకరం గ్రంథాల ఆధారంగా వివరించారు. మొత్తానికి నాదం, శివుడు వేరు వేరు కాదని చెప్పారు. తొమ్మిది రసానుభూతులకి అతీతమైన అనుభూతి నాదానుభవమేనని అంటూ ఒక అన్నమాచార్య కీర్తనను ఉటంకించారు. 

శం అంటే శుభం అని, శుభాన్ని కలిగించే శంకరుడి మహిమను వివరించే పలు వాగ్గేయకార కృతుల పల్లవులను రసరమ్యంగా వినిపించారు. పంచతత్త్వ క్షేత్రాల కీర్తనలు, “శ్రీ కాళహస్తీశ” (ముత్తుస్వామి దీక్షితులు), “శంకర శ్రీగిరి నాదప్రభు హే” (స్వామి తిరునాళ్), “బ్రుహి త్రినేత్రేతి” (కామరాజు రామకృష్ణ) తదితర కృతుల పల్లవులను వినిపించారు. శివుడిని కీర్తించే నారాయణ తీర్థ తరంగాన్ని పరిచయం చేశారు. ఇంకా అనేక కీర్తనలు, కృతులలోని శివతత్త్వాన్ని వివరించారు. 

నవ విధ భక్తి మార్గాలలో అత్యంత సులభమైనది అంటూ లక్ష్మీ మంజూష “శంభో మహాదేవ” (త్యాగరాజ స్వామి), “నమః శివాయ తే నమో భవాయ” (ఆధ్యాత్మ రామాయణం కీర్తన)లను, ఒక భజనను ఉదహరించారు. కార్యక్రమం ఆద్యంతం శాస్త్రీయ సంగీత రచనలలోని ఉత్తమ సాహిత్యాన్ని గుబాళింపజేసింది. 

కార్యక్రమం ప్రారంభంలో వెనకటి తరం ప్రఖ్యాత సినీ నటుడు చంద్రమోహన్ మృతికి నిర్వాహకులు సంతాపం తెలిపారు.

కార్యక్రమ వీడియో –

 

హిందూ మహాసముద్రంలో తెలుగు వాణి

( మారిషస్ అనుభవాలు )

 

 

తెలుగు వాణిని దివ్యభాషగా భావించే దివ్యస్థలి మారిషస్ 



   రెండు వందల ఏళ్ళకు పూర్వం మన తెలుగువారిని “కాశీ ప్రయాణం చేయిస్తాం” అంటూ బ్రిటిష్ వారు మభ్యపెట్టి మారిషస్ దేశంలో కూలీలుగా తీసుకొని వెళ్ళినా, అక్కడికి చేరుకున్న మనవారు తరతరాలుగా తెలుగుతోనే ప్రయాణిస్తున్నారని ప్రముఖ రచయిత, నటుడు, ఏకపాతరాభినయ కళాకారుడు వాడ్రేవు సుందరరావు వెల్లడించారు. అయితే, ఆ దేశంలో ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల మన తెలుగు భాష దివ్యభాషా స్థాయిని ఆస్వాదిస్తోందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి శనివారం సాయంత్రం (16 డిసెంబర్ 2023) అంతర్జాలంలో ఆయన ప్రసంగాన్ని “హిందూ మహాసముద్రంలో తెలుగు వాణి”గా ప్రసారం చేసింది. ఆయన ప్రసంగిస్తూ…. కాశీకి కదా అని తెలుగువారు తమతోపాటు ఇతిహాసాలు, పురాణాలు, పెద్దబాలశిక్ష కూడా తీసుకువెళ్ళారని, తీరా తాము చేరుకున్నది వేరే దేశమని తెలుసుకొని ఎంతో బాధతో అక్కడ జీవనం సాగించారని వివరించారు. అపురూపమైన ఆ గాథకు చెందిన విశేషాలను మధ్య మధ్య వివరిస్తూ, ఇటీవల “తెలుగు భాషా దినోత్సవం” సందర్భంగా అక్కడివారి ఆహ్వానం మేరకు వెళ్ళి వచ్చిన విశేషాలను ఆసక్తికరంగా వివరించారు. 

మారిషస్ తెలుగువారి స్ఫూర్తిగా “తెలుగు మన్ను దొంగ” అనే ఏకపాత్రాభినయాన్ని తాను రూపొందించి మారిషస్ దేశంలో అనేకచోట్ల ప్రదర్శించానని వక్త చెప్పారు. తనను పిలిచి మరీ దేశాధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్ రూపన్ అధ్యక్ష భవనంలో, విద్యాశాఖ మంత్రి, ఉపాధ్యక్షురాలు లీలా దేవి తన కార్యాలయంలో తిలకించారని చెప్పారు. 

మారిషస్ లో భారతీయుల తొలి అడుగు “అప్రవాసీ ఘాట్ ” :

తెలుగు, మరాఠీ, హిందీ భోజ్ పురి ప్రజలు అక్కడ కనిపిస్తారని చెప్పారు. వారంతా 200 ఏళ్ళ క్రితం బ్రిటీషు వారు అక్కడ వేసిన చెరుకు పొలాల్లో పనిచేసేందుకు హిందూ మహాసముద్రంలో ఎన్నో నెలలకాలం ప్రయాణం చేసి వెళ్ళినవారని వెల్లడించారు. నిజానికి వారికి కాశీ దర్శనం చేయిస్తామని చెప్పి, ఎన్నో ఆశలు చూపి అక్కడికి తీసుకెళ్లారని తెలిపారు. నేటి మన శ్రీకాకుళం, విజయనగరం సహా దేశంలోని తీర ప్రాంతాలకు చెందిన అనేకమంది భారతీయులు తొలిసారి అడుగుపెట్టిన స్థలంలో “అప్రవాసీ ఘాట్” అనే కట్టడాన్ని నిర్మించారని అన్నారు. తమదైన జీవితాలను, సంస్కృతులను వదిలిపెట్టి వెళ్ళినవారి స్మృతి చిహ్నాన్ని చూసి చలించిపోయానని వక్త చెప్పారు. దాన్నొక దివ్య, స్మరణీయ స్థలంగా వారి వారి జీవిత విశేషాలను ప్రదర్శించే మ్యూజియంను ఏర్పాటు చేయడం మారిషస్ ప్రభుత్వ గొప్పదనమని కొనియాడారు. ఈ ఉదంతానికి సంబంధించి ఒక పుస్తకం కూడా అచ్చేశారని, తన పర్యటన సందర్భంగా తనకు ఒక ప్రతిని బహూకరించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు.  

ఫ్రెంచ్ వచ్చినవారికి సులభంగా అర్థమయ్యే తమ సొంత భాష అయిన “క్రియోల్”తో పాటుగా దేశంలో ఉన్న అన్ని భాషల వికాసానికీ తోడ్పడుతుండడం మారిషస్ ప్రభుత్వ గొప్పదనమని సుందరరావు పేర్కొన్నారు. ఆయా భాషలన్నీ తాము ఏర్పరచిన భాషా సంఘాల ఆధ్వర్యంలో అభివృద్ధి చెందేలా చూస్తోందని వివరించారు. ఆ రకంగా క్రియోల్, ఫ్రెంచ్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, భోజ్ పురి, అరబిక్ తదితర భాషలు అక్కడ వెల్లి విరియడంతో ఆ దేశం ఒక “విశ్వ భాషా సమ్మేళనం” వంటిదని వ్యాఖ్యానించారు. తను వారి దేశానికి వచ్చానని తెలిసి మారిషస్ విశ్వవిద్యాలయానికి అనుబంధం వంటిదైన మహాత్మా గాంధీ పరిశోధనా సంస్థ డైరెక్టర్ జనరల్ రామ్ పెట్ ఒక సమావేశాన్ని నిర్వహించారని, తన “శిఖండి” ఏకపాత్రాభినయంలోని సంభాషణలను విన్నారని ఆనందం వ్యక్తం చేశారు. 

అన్ని భాషల అభివృద్ధి సంఘం చైర్మన్ డా. రామస్వామి అప్పడు, తెలుగు భాషా సంఘం బాధ్యురాలు ప్రవాసినిల ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగిందని అన్నారు. అందులో… తెలుగు, ఆంగ్లం, ఏకపాత్రాభినయం, సంభాషణలు, మాటలు అవసరం లేని చోట భావ ప్రకటన చేస్తూ తాను ఆద్యంతం నిర్వహించిన ఆ కార్యక్రమాన్ని అందరూ ఎంతగానో ఆస్వాదించారని వివరించారు. మన దేశ ప్రతినిధిగా మహాత్మా గాంధీ, తెలుగు తేజాలకు సంబంధించిన దాదాపు 150 చిత్రాలను అక్కడ ప్రదర్శించడమే కాక వాటిని ఆ సంఘానికి  బహూకరించానని  వెల్లడించారు. 

ఆ సాయంత్రం జరిగిన “తెలుగు భాషా దినోత్సవం” విశేషాలను తెలియజేస్తూ… అదొక చిన్న గ్రామంలోని శ్రీకృష్ణ దేవాలయంలో జరిగిందన్నారు. తెలుగులో పిల్లల పాటలు, పెద్దల ఏకపాత్రాభినయాలు, భజన కీర్తనలు విని పరవశం చెందానని అన్నారు. దీపాల చెట్టు చుట్టూ దీపాలు వెలిగించి 24 గంటలపాటు రామదాస కీర్తనలు పాడడం అక్కడివారి సాంప్రదాయని మురిపెంగా చెప్పారు. అక్కడి తెలుగువారందరికీ రామదాస కీర్తనలు వచ్చని తెలిసి ఆశ్చర్యపోయానని అన్నారు. వారంతా ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి వెళ్ళినవారు కావడంతో సింహాచల అప్పన్నకి అక్కడి దేవతలలో ఎంతో ప్రాముఖ్యం ఉందని తెలిపారు. అందుకని రామదాసు కీర్తనలు, నరసింహస్వామి మీద కీర్తనలు, తాము సొంతంగా రాసుకున్న పాటలు వీనుల విందు చేశాయని చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇక్కడి తెలుగువారి నుంచి దూరమైన చక్కని, తీయని తెలుగు పదాలు అక్కడివారి నోటి వెంట వినడం ఒక మధురానభూతి అన్నారు. ఆ తెలుగుదనాన్ని ఆనందంగా కొనసాగిస్తున్న మారిషస్ తెలుగువారికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని అంటూ అద్భుతమైన తన ప్రసంగాన్ని సుందరరావు ముగించారు.  

కార్యక్రమం ప్రారంభంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి, అమరజీవి స్మృతి భవనం ఏర్పాటుకు కారకులైన వై. ఎస్. శాస్త్రి జయంతి, ప్రముఖ సినీ దర్శకుడు బాపు జయంతిలను పురస్కరించుకొని వారిని స్మరించారు. 

కార్యక్రమ వీడియో –

 

 

కాకినాడ కాంగ్రెస్

శతాబ్ది ఉత్సవాలు

 

1885వ సంవత్సరంలో ఆవిర్భవించిన కాంగ్రెస్ సంవత్సరానికి ఒకసారి దేశంలోని ఒక నగరంలో మహాసభను నిర్వహించడంలో భాగంగా 1923వ సంవత్సరం డిసెంబర్ 28 నుంచి కాకినాడలో జరిగాయి. ఆ ప్రతిష్టాత్మక అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు జరిగి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా 2023 సంవత్సరం డిసెంబర్ 28వ తేదీ నుండి శతాబ్ది ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా కాకినాడ సూర్యకళా మందిరంలో ఉదయం 1923 లో జరిగిన కాకినాడ కాంగ్రెస్ మహాసభలకు సంబంధించిన ఫోటో ప్రదర్శన జరిగింది. అనంతరం దేశభక్తి గేయాలు, వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది.

సాయింత్రం జరిగిన కార్యక్రమానికి సమరచరిత్ర పరిశోధనా సంస్థ అధ్యక్షురాలు, ఐడియల్ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ పి.చిరంజీవినీ కుమారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అనేది మొదట్లో స్వాతంత్ర్య సముపార్జన ఉద్యమంగా ప్రారంభమైందని, తర్వాత రోజుల్లో ఒక రాజకీయ పార్టీ గా రూపాంతరం చెందిందని వివరించారు. ఆనాటి ఉద్యమ స్పూర్తి, ఆ ఉద్యమ గొప్పతనాన్ని, ఆ చరిత్ర గురించి ఇప్పటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.

సభాప్రారంభకులు, కేంద్ర మాజీ మంత్రి  ఎం. ఎం. పళ్లంరాజు తన ప్రారంభోపన్యాసంలో మన దేశంలో 35 ఏళ్లలోపు యువత 65 శాంతం ఉందని, అదే మన దేశ సంపద అన్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందని, ఇది దురదృష్టకరమని అన్నారు. ఇప్పటి తరానికి స్వాతంత్ర్యోదయం పోరాట పటిమ గురించి, అప్పటి నాయకుల జీవిత చరిత్రలను తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అల్లూరి, మహర్షి సాంబమూర్తి, దుర్గాభాయ్ దేశముఖ్ వంటి తెలుగువారంతా ఆనాటి జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో పాల్గొన్నారన్నారని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఈనాడు రాజకీయమంటే డబ్బు ఖర్చు పెట్టి గెలవడమే అనే భావం స్థిరపడిందని, అప్పటి నాయకుల చిత్తశుద్ధిని, పోరాట విధానాన్ని ఇప్పటి తరానికి తెలియజెయ్యాలని కోరారు. ఇంకా ఈ సభలో ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు, రాష్ట్ర గ్రంథాలయ సంఘ ప్రధాన కార్యదర్శి రావి శారద కూడా మాట్లాడారు. డాక్టర్ గొడవర్తి సత్య మూర్తి, బజరంగ్ ల్ బియానీ రచించిన వందేళ్ల క్రితం కాకినాడలో “ భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు డిసెంబరు 1923 ” పుస్తకాన్ని ఈ సభలో ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఇంకా వైడీ రామారావు, డీవీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ స్టాలిన్, డాక్టర్ దోసగిరిరావు, వి.రామకృష్ణ, వెంకటేష్, జానకీరామ్ చౌదరి, ఆలపాటి శ్రీనివాస్, జవహర్అలీ, కృష్ణంరాజు, వర్మ, గాంధీ, చింతపల్లి సుబ్బారావు, వీరబాబు, శ్రీరామచంద్రమూర్తి, సలార్, భారతలక్ష్మి, వెంకటేశ్వరరావు, టిక్కు తదితరులు పాల్గొన్నారు.

 

***************************

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

 

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page