13_005 భక్త పోతన – జ్ఞాపకాలు

సాక్షి టీవీ లో మా గురువుగారి ఇంటర్వ్యూ వచ్చిందని విన్నాను. యు ట్యూబ్ లో దొరుకుతుందేమో చూద్దామని వెతుకుతున్నాను లాప్ టాప్ లో, ఇంతలో నాగయ్యగారు త్యాగయ్య సినిమాలో పాడిన పాటలు కనిపించాయి. అవి వింటూ కూర్చుండిపోయాను. నాగయ్యగారు వేమనగా కూడా నటించారు.

భక్త పోతనలో పోతన గారు ఆయనే ! కొన్ని పాత్రలు ధరించడానికి పూర్వజన్మ సుకృతం కూడా కొంత ఉండాలేమో ? పాత పోతన దొరికితే బాగుండుననిపించింది. వెతికితే దొరికింది. ఇటువంటి సినిమాలు చాలా మంది చూడరు కనుక ప్రింటు బాగానే వుంది. సౌండ్ కూడా బాగుంది. సినిమా మొదలవగానే నా మనస్సు బందరు వెళ్ళిపోయింది.

వాహినీవారి భక్త పోతన సినిమా వచ్చినపుడు నేను చాలా చిన్నదాన్ని. అప్పుడు నాన్నగారు నన్ను తనతో తీసుకెడుతూ వుండేవారు. నాన్నగారు కృష్ణా పత్రికలో వుండడం వలన అందరితో నాన్నగారికి పరిచయాలుండేవి. బందరు వచ్చిన పెద్దలందరూ కృష్ణాపత్రిక మీద, ముట్నూరి కృష్ణారావు గారి మీద గౌరవంతో కృష్ణాపత్రిక ఆఫీసుకు తప్పక వచ్చేవారు. భక్త పోతన సినిమా తీసే ముందు డైరెక్టర్ గారు కే.వి రెడ్డి గారు, కమలాకర కామేశ్వరరావు గారు బందరు వచ్చారు. కే.వి రెడ్డిగారు సినిమా తీయాలంటే ప్రతి విషయము నిశితంగా ఆలోచించి తీరుబడిగా నిర్ణయం తీసుకొంటారని నాన్న చెప్పేవారు. అప్పుడు వారు భక్తపోతన లోకి నటీనటులను ఎంపిక చేస్తున్నారు. కమలాకర కామేశ్వరరావుగారి సోదరులు కమలాకర వెంకటరావు గారు కూడా కృష్ణా పత్రికలో ఉప సంపాదకులుగా పనిచేస్తున్నారు. భక్త పోతనకి కుమార్తెగా నటించడానికి బాల నటి దొరకలేదు. అన్వేషిస్తున్నారు. ఆ విషయమే నాన్నగారితో అంటే ఆయనకి వెంటనే వనజ గుర్తుకు వచ్చింది. వనజ నాన్నగారి స్నేహితుని కుమార్తె. గుప్త గారని నాన్నగారి స్నేహితుడు బందరులో వుండేవారు. ఆయనకి ఫోటో స్టూడియో వుండేది. ఫోటో అనగానే నాన్నగారు గుప్తాగారిని గుర్తు చేసుకొనేవారు. ఆయన పొట్టిగా, లావుగా నవ్వుతూ వుండేవారు. ఆరోజులలో ఆడ పిల్లలు సినిమాలలో వేషం వెయ్యడం అంటే ఎవరికీ ఇష్టం ఉండేదికాదు. నాన్నగారు గుప్త గారిని వప్పించి, కె.వి. రెడ్డిగారికి, కామేశ్వర రావు గారికి వనజను చూపించారు. వారికి వనజ నచ్చింది.

కే.వి. రెడ్డిగారు. కామేశ్వర రావు గారు మద్రాసు తిరిగి ప్రయాణమైనారు. వారిద్దరూ కృష్ణారావుగారి దగ్గర సెలవుపుచ్చుకు రైల్వేస్టేషనుకు వెడుతుంటే గుప్తగారు, వారి అమ్మాయి వనజ వచ్చారు. నాన్నగారు నన్ను తీసుకువెళ్ళారు. అక్కడ వారికి పూల గుచ్చాలు అందించారు. ప్లాటుఫారం మీద అందరికి ఫోటో తీసారు. వనజ వాళ్ళ నాన్న దగ్గర నుంచుంది. నేను మానాన్నగారి ముందు నిలబడ్డాను. ఫోటో తీస్తూంటే కదలకూదడనే విషయం కూడా పట్టించుకోని వయసు నాది. సమయానికి కదులుతానని మా నాన్నగారు రెండు చేతులతో రెండు బుగ్గలు అదిమి పట్టుకొని సరిగా తిప్పబోతుంటే ఫోటో తీసారు. మొత్తానికి వంకర తలతోనే ఫోటోలో పడ్డాను. ఆ ఫోటో చాలా రోజులు వుంది. తరవాత మాయమయింది.

బందరు వదిలాక వనజను చూడనే లేదు. ఎప్పుడూ ప్రవాస జీవితమే! నాళం వనజా గుప్త పేరు ఆ ఫొటోలో ముఖం ఇప్పటికి బాగా గుర్తు నాకు. వనజ రాజమండ్రి లో వుందని విన్నాను, కాని కలుసుకోలేదు. ఇప్పుడు ఆ సినిమా చూస్తోంటే ఈ విషయాలన్నీ కళ్ళముందు కదిలాయి.

ఇంకో జ్ఞాపకం. పోతన గారి భార్యగావేసిన హేమలతదేవి గారు మాకు పరిచయం. మా నాన్నగారు కృష్ణా పత్రిక వదలి సినిమాలకు వెళ్ళడానికి ఆమె కారకురాలు. వారికే నాన్నగారు మొట్టమొదటి సినిమా వ్రాసారు. ఆ సినిమా పేరు “లక్ష్మి”. ఆ సినిమా మళ్ళి చూద్దామంటే దొరకలేదు. నాన్నగారిని వారు చాలా గౌరవంగా చూసేవారు. ఆమెని తెరపై చూసాక మా మద్రాసు ప్రయాణం గుర్తుకు వచ్చింది.

ఒక్కొక్క వ్యక్తి మన జీవిత గ్రంధంలో ఒక్కొక్క పుటగా నిలిచిపోతారు. కొందరి కథ చాలా పేజీలు. కొందరిది ఒక చిరునవ్వు. కొందరిది ఒక తియ్యటి మాట.

కొందరిది మనమోహనకరమైన చిత్రం మాత్రమే ! ఇవన్నీ తిరగేస్తుంటే ఏదో నూతనత్వం వస్తుంది. వయసు పెరిగాక మిగిలేవి వజ్రాల వంటి విలువైన జ్ఞాపకాలే !

***************************

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page