13_005 డేకేర్ సంస్థలు – ఒక వరం

 

నేటి అమెరికన్ డే కేర్ సంస్థలు వృద్ధులకు ఒక వరం !

 

యునైటెడ్ స్టేట్స్‌లో 2014లో 4,800 నమోదిత పెద్దల డేకేర్ సెంటర్‌లు పనిచేస్తున్నాయి. 282,000 కంటే ఎక్కువ మంది వృద్ధ అమెరికన్లకు సంరక్షణ అందిస్తున్నాయి. 44.2% కేంద్రాలు లాభాపేక్షతో కూడిన సంస్థలుగా పనిచేస్తున్నాయి. రోజువారీ రుసుము గృహ ఆరోగ్య సందర్శన కంటే తక్కువగా ఉండవచ్చు మరియు నైపుణ్యం కలిగిన నర్సింగ్ సౌకర్యం యొక్క సగం ఖర్చు కానీ, అందించిన సేవలపై ఆధారపడి ఉంటుంది. పార్టిసిపెంట్ ఫీజులు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, పబ్లిక్ మరియు దాతృత్వ మూలాల నుండి నిధులు వస్తాయి.

మా అమ్మాయి అమెరికా లో ఉంటుందని, పురుళ్ళకి వెళ్ళి తిరిగి హైదరాబాద్ వచ్చేసే వాళ్ళము. అమెరికా లో నివసిస్తున్న భారత దేశ వృద్ధులకు సమయము యెట్లా గడుస్తున్నది అనే దానికి నేను, మా వారు… మేమే ఒక నిదర్శనము. ఇంట్లో అమ్మాయి – అల్లుడు ఉదయాన్నే ఉద్యోగరీత్యా బయిటకు వెడతారు. వారి పిల్లలు… మా మనవలు, మనుమరాలు స్కూల్, కాలేజీలకు వెళ్తారు. ఇక మేము ఉదయం నుంచి సాయంకాలం వరకు, వాళ్ళు ఇంటికి వచ్చేదాక ఏమి తోచక కాలం గడపాలి !!! మాకు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినప్పుడు చూసే వాళ్ళు వుండరు. అప్పుడు, అమ్మాయికి వీలైతే ఆఫీసుకి సెలవు పెట్టి ఇంటి నుంచి పని చేసుకుంటుంది. అలా వీలు కానప్పుడు మాకు మేమే తప్పదుగా. అప్పుడప్పుడు ఆఫీసు నుంచి ఫోన్ చేసి క్షేమ సమాచారం తెలుసుకుంటుంది. ఇక్కడ ఇల్లు దూరంగా వుండటం వల్ల, సహజముగా చుట్టూ ప్రక్కల వాళ్ళతోటి స్నేహత్వము తక్కువ వుంటుంది. ఎవరికీ వారే యమునా తీరే అనే పద్దతిలో వుంటుంది.

మేము వున్న చోట ‘ స్టెర్లింగ్ మెడికల్ డే కేర్ సెంటర్ ’ వున్నదని మా అమ్మాయి తెలుసుకొని వెళ్ళింది. ఈ సంస్థ డైరెక్టర్ ఇoడియన్ అమెరికనే, ఇక్కడ పని చేస్తున్న వారిలో కూడా చాలామంది ఇoడియన్ అమెరికన్లే. వారందరూ ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాట్లాడేవారే అంటూ వివరాలు సేకరించి వచ్చింది. మేము కూడా వెళ్ళి చూసి, బాగుందనిపించి చేరాము. 

ఈ సంస్థ ఒక పెద్ద ఆవరణ లో కలదు. రవాణా సౌకర్యమై 6 బస్సులు, 4 వ్యాన్లు, 8 కార్లు వున్నవి. భవనములో 3 పెద్ద హాల్స్, దేవుని ప్రార్థన గది, మెడిటేషన్ రూమ్ ( ధ్యాన గది ), వైద్య గదులు, ఫిజియోథెరపీ గదులు, వీటికి తగట్టుగా వాష్ రూమ్స్ కలవు. ఈ సంస్థ 200 మంది సభ్యులకు ఆసరా కల్పించగలదు. 

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పని చేస్తుంది. సభ్యులందరినీ వాళ్ళ వాళ్ళ ఇళ్ళ నుంచి వారి రవాణా సౌకర్యముతో ఉదయము 9:30 గంటల లోపుగా తీసుకొని వస్తారు. అపుడు ఉదయం టిఫిన్స్, టీ / కాఫీలు ఇస్తారు. ఇక్కడ పాలు, సిరియల్స్ ఇస్తారు, గుజరాతీ బ్రేక్ ఫాస్ట్ లేదా బ్రెడ్ బట్టర్ మొదలగునవి మనకు కావలసినవి ఇస్తారు.

ఆ తరువాత 10:30 గంటల నుంచి మధ్యాహ్నము వరకు సభ్యులందరు బింగో గేమ్ తోటి, క్రాస్వర్డ్ పజిల్స్, సుడోకో తోటి కాలక్షేపం చేస్తారు. ఇవే కాకుండా సభ్యులు వారి ఇష్టానుసారంగా పేకాట, బిలియర్డ్స్, చదరంగం, క్యారమ్స్ ఆడుకొనవచ్చును. వ్యాయామం కూడా చేయిస్తారు. అందరు కూర్చొన్న గదులలో కాలక్షేపానికి నాలుగు పెద్ద టివిలు ఉన్నాయి.

గుజరాతీ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఇండియా న్యూస్, వినోదపు ధారావాహికలు, క్రికెట్ ఆటలు చూపిస్తారు. అక్కడ వున్నప్పుడే సభ్యులకు అవసరమైతే ప్రతి రోజు గుడికో లేదా షాపింగ్ మాల్ కో వారి రవాణా సౌకర్యమిచ్చి పంపిస్తుంటారు. ఒక్కొక్కప్పుడు పూర్తిగా రోజంతా గడిపేటట్లు క్రూయిజ్ కి, పండుగలప్పుడు ప్రత్యేకమైన హాల్స్ ను తీసుకొని ఆట పాటలతో కాలక్షేపం చేయిస్తుంటారు.

ఈ సంస్థ సోమవారం నుండి శుక్రవారం వరకు సభ్యులతో కాలక్షేపం చేస్తారు. శనివారం, ఆదివారం సెలవు దినములు కావున మన ఇంటి సభ్యులతో కులాసాగా కాలక్షేపం చేయుటకు అనుకూలముగా ఉంటుంది.

మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 గంటల వరకు భోజనం ఇచ్చెదరు. మనకు అనుకూలముగా ఉండునట్లు పంజాబీ / గుజరాతీ భోజనం పెట్టెదరు. భోజనములో రోటి, అన్నము, పప్పు, కూర, సాలేడ్, ఒక స్వీట్ ఉంటాయి.. ఉదయం టిఫిన్స్ తో బాటుగా ఒక ఆపిల్, బత్తాయి లేదా అరటి పండు. ఇక ఆ తరువాత వారి వారి ఇళ్ళకు వెళ్లేందుకు బస్ / వ్యాన్ / కార్ల తో ఏర్పాట్లు చేస్తారు。

ఈ సంస్థ రెండు షిఫ్ట్ లలో పని చేస్తుంది. ఉదయం షిఫ్ట్ లో భారతీయులకు, అమెరికన్లకు ఏర్పాట్లు చేసారు. ఈ షిఫ్ట్ లో 160 మంది సభ్యులు ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు చైనీస్ వారికీ ఏర్పాట్లు చేసారు. ఏ సభ్యునికైనా, ఎటువంటి అనారోగ్యం కలిగినా చూచుకొనుటకు మెడికల్ సహాయము కలదు. అవసరమున్న వాళ్ళకు రక్త పరీక్షలు, బి.పి. మొదలగునవి చేస్తారు. డాక్టర్ కి సలహాల కోసం పంపిస్తారు. అవసరమైతే ఫిజియోథెరపీ చేస్తారు. 

ప్రతి నెలాఖరున (వర్కింగ్ డే) ఆ నెలలో పుట్టిన రోజు వున్న వారందరిని పిలిచి వేడుక చేస్తారు. మరియు ప్రతి హిందూ పండుగకు తగిన విధముగా కార్యక్రమములు జరుపుతారు.

ఇందు సభ్యత్వము పొందుటకు 18 సంవత్సరములు నిండిన ప్రతి అమెరికన్ పౌరుడు అర్హులే, అయితే వారు మెడికైడ్ సభ్యులై వుండాలి. ఈ సంస్థ న్యూ జెర్సీ రాష్ట్ర పరిధి లో ప్రభుత్వ సహాయంతో నడుస్తుంది. ఏ సభ్యుడు కూడా ప్రతి నెలా డబ్బేమీ ఇవ్వనవసరము లేకుండ సంస్థ కు వెళ్ళి రావచ్చును. అయితే సంస్థ నియమనిబంధనలకు అనుకూలముగా నడుచుకోవాల్సి వుంటుంది.

ఈ విధముగా, అన్ని వసతులు కలిగి, అందరు కలిసి, స్నేహభావము తో కలిసి కాలక్షేపం చేయడం మాకు నచ్చింది. ఒంటరితనం అనే మాట లేకుండ, మనోవేదన పడకుండ, ఆహ్లాదంగా వుంటూ మంచి ఆరోగ్యంతో వుండటం జరుగుతుంది.

డేకేర్ సెంటర్లలో వృద్ధుల ఆరోగ్యంగా ఉండేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించటంతో పాటు, వారి కోసం ఫిజయోథెరఫీ, యోగా, పాలియేటీవ్ కేర్‌లను అందుబాటులో ఉంచుతూ, వృద్ధుల జీవితాల్లో కొంత వినోదాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నింపటంతో పాటు వారిని ఫిజికల్ ఫిట్‌గా తయారు చేయాలనే సంకల్పంతో ‘ స్టెర్లింగ్ మెడికల్ డే కేర్ సెంటర్ ’ సహ వ్యవస్థాపకురాలు సేజల్ దాసోణ్డి మరియు తదితర సిబ్బంది సేవలు ప్రశంసనీయం, అభినందనీయం.

 

***************************

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page