జానపద సాహిత్యం జానపద కళకు సంబంధించిన సృష్టి. తెలుగు జానపద సాహిత్యానికి కాల పరిధిని నిర్ణయించాలంటే లిఖిత రూపంలో కనబడుచున్నంత వరకూ అవి క్రీ. శ. 12వ శతాబ్ది అవతలి వైపు లభించవు. కానీ శ్రీనాధుని వంటి పండితుల ఆదరణ మూలంగా విద్యావంతుల సమాజంలోనికి పలనాటి వీర చరిత్ర చొచ్చుకొని వచ్చింది. అయినా ఈ సాహిత్యానికి ప్రముఖ లక్షణమైన మౌఖిక ప్రచారం కారణంగా ఏనాడూ పుట్టినా, ఎంత ప్రాచీన చరిత్ర కలిగి ఉన్నా అదంతా మనకు స్పుటంగా తెలిసే అవకాశం లేకుండా పోయింది. మనకు స్పష్టంగా తెలియనంత మాత్రాన దాని ప్రాచీనతను శంకించనవసరం లేదు.
జానపద కథల్లో రేణుకా ఎల్లమ్మకు మాతృపూజ చేస్తారు. మాతృపూజా పద్ధతి ఈనాటికీ జానపద కథల్లో నిత్యహరితంగా నిలిచిపోయి ఉంది. జానపద సాహిత్యంలో ఎన్నో కథల్లో ప్రాముఖ్యం వహించేది ఈ అంశమే. ఇక్కడ ప్రతి గ్రామదేవత రూపంలోనూ తల్లి దేవత ప్రత్యక్షమవుతుంది. కొండాపురం, ఎల్లేశ్వరం, సంగమేశ్వరం, ఆలంపురం వంటి అనేక శిల్పాఖనులైన స్థలాలలో ఉండే స్త్రీ ప్రతిమలను చూస్తే, ఈ అంశం స్పష్టంగా తెలుస్తుంది. నగ్న ప్రతిమలు చేతులలో మామిడి పండ్లు పూర్ణకలశాలు ధరించిన ప్రతిమలు, శిశురూపాలను చేరువగల ప్రతిమలు గ్రామ దేవతా రూపంలో తల్లిదేవతను తలపిస్తుంది. రేణుక అనే నామాంతరం కల ఎల్లమ్మ జానపదుల తల్లి దేవత.
ఈ మాతృ పూజా విధానంలో కొన్ని ప్రక్రియలు విశిష్టంగా కనిపిస్తాయి. అవి 1) ప్రార్థన, 2) బలివిధానం, 3) పవిత్రీకరణ, 4) ఆత్మహింస అనేవి వీటికన్నింటికీ జానపద కథలలో సముచిత స్థానం ఉంది.
ఈ గ్రామ దేవతలకు సంబంధించిన పూజా కలాపంలో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం లేదు. ఆయా దేవతలకు కాలక్రమాన నిర్ణయించిన స్వరూప స్వభావాలను అనుసరించి జన చరిత్రను బట్టి ఒక్కొక్క తెగవారు పూజారిగా వ్యవహరించడం జరిగింది. ఆంధ్రదేశంలో గ్రామదేవతల చరిత్ర పరిశీలిస్తే రేణుక బైండ్ల వారి ఇంట్లో జన్మించింది. గంగమ్మ యాదవుల కులదైవం. అందుకే ఎల్లమ్మ పూజారుల బైండ్ల వాండ్లు గంగమ్మ పూజారులు యాదవులు. పిన్నమ్మ, పోశమ్మ వంటి దేవతలకు ఒక్కొక్కసారి చాకలి పౌరోహిత్యం ఉంటుంది. ఈ పూజారులు ఉచ్చరించే మంత్రాలన్నీ తెలుగు మంత్రాలే.
స్తోత్రాలు చాలా వరకు కీర్తనలుగా ఉంటాయి. ఎక్కువగా ద్విపదలు ఉంటాయి. దేవి ముందు జానపదులు నేఱపే ప్రార్థనలు కుతూహలన్నీ కలిగిస్తాయి. పంటకోసం గింజలు ఎదురుగా పెడుతూ లచ్చమ్మ దేవతను కొలిచే వాళ్ళు.
“ సామి అమ్మ, లచ్చిమి అమ్మ, మంచిగ వండితె నీకు పెడ్టం ” అంటారు. కోతల ముందు అన్నం వండి మూడు రాళ్ళచే నిర్దేశించబడ్డ లచ్చమ్మ దేవత ముందు పెట్టి.
“ సామి తల్లి, లచ్చమ్మతల్లి పండిన మటుకు మేము పెట్టినాము దండం అంటారు. పెండ్లివేళ బోరమ్మ తల్లీ పిలగాడు పిల్ల మంచిగ బతకాలి ” అని ప్రార్థిస్తారు.
ప్రసవ సమయంలో గార్ల మైసమ్మనుద్దేశించి పిల్లవాడు ఊడిపడ్తే సేరుజొన్నలు తెచ్చి నీకు మొక్కుతాం “ అంటారు.
బలిక్రియ :
గత్తర చెలరేగినప్పుడు పోశమ్మనుద్దేశించి “ పోశమ్మ తల్లీ ! ఏటుకు శాయకు మాకు దొరికింది నీకు పెడతాం తినిపో ” అని ఆర్థిస్తారు.
పుట్టు వెంట్రుకలు తీసినపుడు వాటిని పారే ప్రవాహంలో వేసి గంగమ్మకు మొక్కుతూ – “ గంగమ్మ తల్లీ పుట్టుగెంటి గెలు నీ పొట్టల యేసినాం. మా పిల్లలు మంచి గుండాల – అని ప్రార్థిస్తారు.
వేటలో జంతువు దొరికితే దాని ముంగలి ముక్క కొంత కోసి దాన్ని కాలేయాన్ని అడవి వైపు విసరేసి “ సామి దేవరా మేము తింటున్నాం నీవు తిను ” అని కృతజ్ఞత చూపిస్తారు.
ఇక్కడ దేవతల అంగాంగ వర్ణన కానీ, మిగిలిన దేవతా చక్రంలో ఉండే సంబంధం కానీ మహాత్త్వ ప్రశంస కానీ లేదు. మనిషికీ, దేవుడికి మధ్య గట్టి బంధాన్ని కలగజేసేది కేవలం ఆహార నివేదనం మాత్రమే అన్న అభిప్రాయం ఇక్కడ స్పస్తంగా కనిపిస్తుంది. ఈ నైవేద్య సమర్పణము దానికి సంబంధించిన ఉదంతాలన్నీ జానపద కథల ద్వారా వివరంగా గ్రహించడానికి వీలున్నది.
***************************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page