13_005 తో. లే. పి. – అన్నయ్య వి. భూపతిరావు

 

ఈసారి ఈ తోకలేనిపిట్ట… అంశం బాధాతప్తహృదయం తో వ్రాస్తున్నాను.

మా అన్నయ్య భూపతిరావు. నాకంటే వయసు లో మూడేళ్ళు పెద్ద. నిజం చెప్పాలంటే వయసులోనే కాదు.. వాడిది పెద్ద మనసు… దొడ్డ మనసు !

నాకు 3 ఏళ్ళ వయసులో మా అమ్మ కాలం చేసింది. ఇంకా లోక జ్ఞానం తెలియని ఆ వయసులో తల్లి లేని పిల్లలమని మాఇద్దరిని అత్యంత ప్రేమతో పెంచింది మా బామ్మగారు. కాని, వార్ధక్యం మీద పడడంతో రోజులు గడిచే కొలదీ బామ్మకి మా పెంపకం కష్టతరమయింది. దాంతో, పసిపిల్లలమయిన మా సంరక్షణ భారాన్ని వహించేందుకు అనువుగా పునర్వివాహం చేసుకోమని మా నాన్నగారిని పోరడం, ఆయన ఆ వచ్చే సవతి తల్లి మమ్మల్ని సరిగ్గా చూసుకోదేమో అన్న శంకతో మొదట వాయిదా వేసినా, చివరకు మా బామ్మ మాట ను కాదనలేకపోయారు. ఆయన ఆ రోజులలో నైజాం సంస్ధానంలో, హైదరాబాద్ లో నారాయణగూడా లోని హైస్కూల్ ( నేటి మాడపాటి హనుమంతరావు స్కూలు లో ) లెక్కల మాస్టారు గా పనిచేసేవారు. అలాగ, నాన్నగారి అంగీకారంతో మా బాగోగులను చూసుకునేందుకు, మా జీవితాల లోనికి ( కొత్త గా మరో ) అమ్మ రంగ ప్రవేశం చేసింది. అయితే, తాను మమ్మల్ని ఎల్లప్పుడూ తన కన్నబిడ్డల్లా చూసుకునేదే తప్ప ఏనాడూ, మమ్మల్ని సవతి బిడ్డలమనుకోలేదు.

సరే…

నా బాల్యంనుండీ, చదువుసంధ్యలు, తదితర విషయాలకు సంబంధించి నా కేర్ టేకర్ మా అన్నయ్య అనే చెప్పాలి. ఏమంటే, నాన్నగారికి స్కూలు పనితో క్షణం తీరిక దొరికేది కాదు. ఇక అమ్మ, బామ్మ సరేసరి ! ఎప్పుడూ ఇంటి పని, వంట పని వగైరా… ఆ రకంగా నాకు ఇంట్లో టీచరు అన్నయ్యే!

మా బాల్యం తదుపరి దశలో స్కూల్ చదువులు గుంటూరు జిల్లా, చేబ్రోలు గ్రామంలో శ్రీ సూర్యదేవర నరసయ్య హైస్కూల్ లో జరిగాయి.. మాకు ముగ్గురు తమ్ముళ్లు.

స్కూల్ చదువు పూర్తి అవగానే మా అన్నయ్య కాకినాడ, పి.ఆర్. కాలేజీ లో ఇంటర్మీడియట్, ఆంధ్ర విశ్వ విద్యాలయం, వాల్తేరు లో B.E., ( Electrical Engineering ) పూర్తి చేసాడు. అప్పుడు కాలేజిలో వాడికి కొలీగ్స్.. ఆప్తమిత్రులు గొల్లపూడి మారుతీరావు, వీరాజీ‌, జ్యేష్ట, కొండముది శ్రీరామచంద్రమూర్తి ప్రభృతులు. వీరి సాహచర్యంలో వాడికి నాటకాలు, రచనలు‌, పాటలు పాడడం వగయిరాలతో అనుబంధం ఏర్పడింది.

తరువాత ఉద్యోగ పర్వం.

ఏ.పి.ఎస్.ఇ.బి. లో జూనియర్ ఇంజనీర్ గా గరివిడి లోనూ, నేషనల్ న్యూస్ ప్రింట్ అండ్ పేపర్ మిల్స్, నేపానగ‌ర్, మధ్య ప్రదేశ్ లోనూ పనిచేసి, చివరకు Indian Air Force లో పైలట్ ఆఫీసరు గా చేరి, వివిధ రాష్ట్రాలలో ఉద్యోగ నిర్వహణ అనంతరం Wing Commander గా పదవీ విరమణ చేసి కుటుంబం ( భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ) తో న్యూఢిల్లీలో స్ధిరపడ్డాడు. పిల్లలు, వారి వివాహానంతరం ముంబై లో అబ్బాయి చంద్రశేఖర్, పెద్ద అమ్మాయి వసుంధర కెనడాలోనూ, 2వ అమ్మాయి జ్యోత్స్న అమెరికాలోనూ ఉంటున్నారు.

ఇటీవల తన 85వ ఏట తాను కొంత అనారోగ్యానికి గురవడంతో హాస్పటల్ లో చేరి చికిత్స పొందుతూ నవంబరు 23/24 నాడు రాత్రి గం.1-00 కు కన్నుమూసాడు.

ఈ విషాదవార్త ను అందుకుని, ఆ వెంటనే నేను, నాకు సాయంగా మా పిన్నిగారి అల్లుడు చి. శ్రీరామచంద్రమూర్తిని తోడుకుని హుటాహుటిన ఢిల్లీ కి చేరి చివరిసారిగా అన్నయ్య భౌతిక కాయాన్ని దర్శించుకుని, అన్నయ్య ఆశీస్సులను పొందే అదృష్టాన్నైనా అందుకోగలిగాను. తదుపరి అంత్యక్రియలు, తదితర కార్యక్రమాలలో పాల్గొని, భారమయిన హృదయంతో విజయవాడ లో నా గూటికి చేరాను.

అన్యయ్య తో ప్రత్యక్షంగా, ముఖాముఖి కలసి మాట్లాడలేకపోయినా కనీసం మరో విధంగానైనా చూడగలిగే అవకాశమయినా నాకు లభించడం కేవలం ఆ భగవంతుని కృపగా భావిస్తున్నాను.

అందరికీ నమస్కారములు.

 

***************************

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page