సప్తస్వరాలే వారికి ప్రాణం
సంగీతం..
అదో ప్రపంచం. అభిరుచి, ఆసక్తి, కఠోర సాధన ఎంతో అవసరం. అన్నీ కలగలిస్తేనే రాణించగలరు. అలాంటిది ఒకే కుటుంబం నుంచి వచ్చి తమ అద్వితీయ ప్రతిభతో సంగీతాభిమానులను అలరిస్తున్నారీ ద్వయాలు. సంగీతోత్సవాలలో తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను మైమరింపజేస్తున్నారు. అలాంటి వారిపై ప్రత్యేక కథనమిది.
చిన్ననాటి నుంచి అదే ప్రపంచం
శ్రీరాం ప్రసాద్, రవికుమార్ సంగీత కుటుంబానికి చెందిన అన్నదమ్ములు. వీరి తండ్రి సూరిబాబు, ఆయన తమ్ముడు మల్లాది సోదరులుగా ఖ్యాతి పొందారు. అయినా శ్రీరాంప్రసాద్, రవికుమార్లను ఇద్దరినీ ‘గాత్రద్వయం’గా తీర్చిదిద్దాలన్న ఆలోచన కుటుంబంలోని ఎవరికీ లేదు. వయసు రీత్యా రెండేళ్ల తేడా ఉండటంతో ఒకేసారి సంగీతాన్ని నేర్పేవారు. సాధన కూడా అలాగే చేయించేవారు. పాఠశాల స్థాయిలో జరిగిన కార్యక్రమాలు, పోటీలలో కూడా విడివిడిగానే పాల్గొనేవారు. 1983 నుంచి కలిసి కచేరీలు ప్రారంభించారు. మిగతా ప్రపంచంపై ఆసక్తి పెంచుకోలేదు. సంగీతం కోసం వృత్తివిద్య అంటే ఇంజినీరింగ్, వైద్యవిద్య వంటివి వద్దనుకుని బీఎస్సీ పూర్తి చేశారు శ్రీరాం. రవి కూడా బీకాం చదివారు. డాక్టర్ శ్రీపాద పినాకపాణి, నేదునూరి, వోలేటి, తండ్రి సూరిబాబుల వద్ద శిక్షణ తీసుకున్నారు. విద్వాంసులుగా ఎదిగారు. బిరుదులు, పురస్కారాల గురించి ఏనాడూ ఆలోచించలేదు. సాధనపైనే మనసు లగ్నం చేశారు. సంగీత, నాద, స్వర సిద్ధి కలగడానికి సాధన ఒక్కటే మార్గం. 25 ఏళ్ళు పైబడి ఈ యాత్ర పూర్తైనా ఇంకా సాధనా క్రమంలోనే ఉన్నామని పేర్కొన్నారు. శ్రీరాం ప్రసాద్ ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రంలో నిలయ విద్వాంసులుగా… రవికుమార్ నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో సంగీత విభాగాధిపతిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
కుటుంబ వారసత్వం పాటిస్తూ…
‘లాల్గుడి’ అంటేనే సంగీతానికి పెట్టింది పేరు. వయొలిన్ విద్వాంసుడిగా, వాగ్గేయకారుడిగా ఖ్యాతి కెక్కిన జి.జయరామన్ సంతానమే కృష్ణన్, విజయలక్ష్మి. చిన్న వయస్సులోనే తండ్రి చేయి పెట్టుకుని సంగీత ప్రపంచంలో అడుగుపెట్టారు. 1973 నుంచే కృష్ణన్ తండ్రితో కలిసి కచేరీలు ప్రారంభించారు. తర్వాత ఆరేళ్లకు విజయలక్ష్మి కూడా వారితో కలిశారు. కృష్ణన్, విజయలక్ష్మి… ఈ తరం లాల్గుడి ‘వాయులీన ద్వయం’గా రూపొందారు.
కృష్ణన్ చదవు ముగించి ఒక సంస్థలో కొంతకాలం పనిచేశారు. విజయలక్ష్మి ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. సంగీత కుటుంబంలో ఐదో తరంగా త్యాగరాజస్వామి శిష్య పరంపరలోని వారిగా వచ్చిన గుర్తింపు… వారిని పూర్తిగా సంగీతంలోనే కొనసాగేలా చేసింది. విజయలక్ష్మికి ఎంతో ఇష్టమైన గాత్ర సంగీతంతో సీడీలు విడుదల చేశారు. ఇద్దరూ విడివిడిగా ఇతర కళాకారులకు వయొలిన్ పై సహకారం అందిస్తారు. అయినా లాల్గుడి ‘వాయులీన ద్వయం’గా తమ ఆలోచనలు దాదాపు ఒకటే అంటున్నారీ అన్నా చెల్లెలు. అదే తమనొక్కటిగా నడిపిస్తోందని, ఏ కొత్త ప్రయోగమైనా అందుకు లోబడే ఉంటుందని వివరించారు.
కలిసిన అభిరుచులు….
ఎన్. శశికిరణ్ తన మేనత్త కొడుకు ఆర్. గణేశ్ తో కలిసి కచేరీలు ఇస్తుంటారు. ఈ అపూర్వ కలయికకు పునాది వేసింది చిత్ర వీణ నరసింహన్. పురాతన, అరుదైన గోటు వాయిద్యానికి చిత్రవీణగా జనాదరణ కల్పించారు ఆయన. మొదటి కుమారుడు ‘చిత్రవీణ’ రవికిరణ్ గా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. రెండో కుమారుడు శశికిరణ్, వీరితోపాటు సోదరి కుమారుడైన గణేశ్ కు కూడా సంగీతంపై ఆసక్తి పెంచారు నరసింహన్. బెంగళూరులోని వారి కుటుంబాన్ని చెన్నై రప్పించారు. ఈ క్రమంలో శశికిరణ్ గాత్రాన్ని ఎంచుకోగా… గణేష్ ఒకవైపు పాడుతూనే, చిత్రవీణ కూడా చేత బట్టారు. రవికిరణ్ ఏషియా బ్రదర్స్’గా చిత్రవీణ కచ్చేరీలు విరివిగా చేశారు. శశికిరణ్ గాత్ర శైలికి ఆకర్షితులైన గణేష్… 1998 నుంచి ‘కర్ణాటిక్ బ్రదర్స్ ‘గా మొదటి గాత్ర కచేరీ చేశారు. అప్పటి నుంచి వారి ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి. 12వ తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పారు గణేష్. శశికిరణ్ క్రికెట్లో రాణించినా.. తన గమ్యం సంగీతమే అని భావించారు. కచేరీలతో పాటు నిర్వాహకుడిగానూ ఎదిగారు. సంగీతంలో ఎంఏ పూర్తి చేశారు. ప్రస్తుతం పరిశోధన కొనసాగిస్తున్నారు. ఇద్దరూ తరచూ కలిసి సంగీత సాధన చేస్తారు. విదేశీ పర్యటనలలో ఎక్కువ సమయాన్ని సాధనకు కేటాయించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. కన్నవారు, గురువు… దైవం తమకు సరైన మార్గాన్ని చూపారని అంటారు.
వైద్యవిద్య.. క్రికెట్.. వదిలేశారు!
ప్రియాసిస్టర్స్.. చిన్నవయసులోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గాత్ర విద్వన్మణులు. ఇరువురికి ఎన్నో ఆసక్తులు, అభిరుచులు ఉన్నాయి. తండ్రి సుబ్బారాం నేర్పించిన సంగీతం మాత్రం ఇద్దర్నీ ఒక్కటిగా నడిపిస్తోంది. 1989 నుంచి కలిసి కచేరీలు ఇస్తున్నారు. సంగీతం కోసమే చెన్నై వచ్చి స్థిరపడ్డారు. వైద్యవిద్య చదవాలనుకున్నారు అక్క షణ్ముఖప్రియ. దీనికోసం వేరే ఊరు వెళ్లాల్సి వస్తుందేమోనని విరమించుకున్నారు: హరి ప్రియకు క్రికెట్ ఆడాలని ఎంతో కోరిక. తమిళనాడు రాష్ట్రం తరపున అండర్-15, అండర్-18లో కూడా ఆడి రాణించారు. మరి మండుటెండలో ఆడితే గాత్రం పాడై పోదూ? అందుకే ఆ కెరీర్ని వదులుకున్నారు. పెళ్లిళ్లు ఆయిపోయినా… రోజూ సాయంత్రం తప్పని సరిగా కలుసుకుంటారు. సాధన చేస్తారు. వారి జీవిత భాగస్వాములూ ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచంలో ఎంత పేరున్న వారైనా… పిల్లలకు తల్లులే. వారి ఆలనా పాలనా చూసి అన్నీ సమకూర్చాకే కచేరీలకు వెళతారు. వారిలో సంగీతాభిలాషకు బీజం వేసి తీర్చిదిద్దిన సుబ్బారాం.. ఇప్పుడు మరో విధంగానూ తోడ్పాటు అందిస్తున్నారు. ఇతర ప్రాంతాలు, విదేశీ పర్యటనలకు షణ్యుఖప్రియ వెళ్లాల్సి వస్తే ఆమె కుమార్తెలిద్దరి బాగోగులనూ 75 దాటిన వయసులోనూ ఆయనే చూస్తుంటారు.
***************************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page