13_006 అమ్మకపు వస్తువులు

 

కాదేదీ….కవితకు అనర్హం అన్నట్టు గా కాదేదీ అమ్మకానికి అనర్హం…..గతం లో తిండి పదార్థాలు, గృహోపకరణాలు, బట్టలు, యంత్రాలు, ఇళ్ళు, పొలాలు….తినే జంతువులను మాత్రమే అమ్మకానికి పెట్టేవారు….

నాగరికత ఎదగక ముందు…. ఆడా, మగ, బానిసలను అమ్మకానికి పెట్టేవారు….బానిస వ్యవస్థ మార డానికి ఎన్నో యుగాల పాటు పోరాటాలు జరిగాయి….

చాలా చోట్ల బానిస వ్యవస్థ క్రమంగా అంతరించి పోయింది….కానీ ఇప్పుడు కొత్తరకం భావ దారిద్య్రం

మానవాళి కి అంటువ్యాధిలా అంటుకుంది…. అదే డబ్బు కాంక్ష, పదవి పైత్యం….దీనికి అడా మగా తేడా లేదు. అందరికీ జాడ్యం అంటుకుంది…. డబ్బు కోసం, పదవి కోసం ఎంతకైన తెగిస్తున్నారు….

ఓ నైతిక సిద్ధాంతం లేదు…..రాజకీయ దృక్కోణం లేదు… పాడు లేదు….దీనికి మేధావులము అని చెప్పుకొనే కుహనా మేధావులు కూడా పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. వీరి సంఖ్య ఓటు కి తక్కువ నోటా కి ఎక్కువగా ఉన్నారు…. దేశం ఎటుపోతే మనకెందుకులే అనే నిర్లిప్తత…..అణువు అణువునా గూడు కట్టుకుంది….

డబ్బుల కోసం గడ్డి అనేది చాలా చిన్న పదం. వీళ్ళు దేనికైనా వెను కాడడం లేదు….

ఎలక్షన్లలో సీటు కోసం రాత్రికి రాత్రి పార్టీ మారిపోతున్నారు

అంతవరకు చేసిన దూషణ భూషణ తిరస్కారాలు మరచిపోతున్నారు….

ఆఖరికి అన్నదమ్ములు… అక్కా చెల్లెలు అన్న ధ్యాస కూడా మరచిపోతున్నారు….కేవలం అధికార దాహంతో ఒకరి పై ఒకరు కత్తులు దూస్తున్నారు.

తమను కన్న తల్లితండ్రులు అన్న సంగతి కూడా మర్చిపోయి కుటుంబ గౌరవాన్ని నలుగురిలో నవ్వుల పాలు చేస్తున్నారు….

మొహాన ఉమ్మేసినా హ్హి హ్హీ…..అని నవ్వుతూ నిల్చుంటారు….

రాత్రికి రాత్రి ఓట్లు చీల్చడానికి సరికొత్త పార్టీ పెడుతున్నారు….పాలక వర్గం నుండి ప్యాకేజీ ఫుల్లు గా 

అందుకుంటారు….. ఈ ఆధునిక యుగంలో పుట్టుకొచ్చిన సరికొత్త పదజాలం ” కింగ్ మేకర్ “.  

నిజాయితీగా చెప్పాలంటే వీరిది గోడ మీద పిల్లి వాటం.  

కొద్దిపాటి జనాకర్షణతో ఓ పది సీట్లు గెలిచారంటే చాలు…..

పాలక వర్గం….ప్రతిపక్ష వర్గం వారు ఈ కింగ్ మేకర్ గారి వెంట పడటం…. వాడి ముందు మోకరిల్లి, కోట్లు కోట్లు గుమ్మరించడం పరిపాటి అయింది …

సదరు కింగ్ మేకర్ గారికి కూడా ప్రజల సంగతి పట్టదు.

ఎలక్షన్ రిజల్ట్స్ అనంతరం….. ఎక్కడ ఎక్కువ గిట్టు బాటు అయితే వారి అండన చేరి సదరు ప్రభుత్వానికి

వెన్నుదన్నుగా నిలచి జనోద్ధరణ సాగిస్తారు….

ఇక్కడ అమ్మకం అనే పదానికి బదులు రాజకీయ వ్యభిచారం అంటే సరిపోతుంది …

ప్రస్తుత సమాజంలో పుట్టుకొచ్చిన మరో కుక్కమూతి పిందె ” వ్యూహకర్త “. వీళ్ళు సరిగ్గా ఎన్నికల ముందు ఆధునిక పరిజ్ఞానంతో సర్వేలు చేయిస్తారు….

వాటిని సదరు పార్టీలకు చూపించి ఊరిస్తారు…

గెలుపు అనుమానంగా ఉన్న పార్టీలు ఈ ఉచ్చులో పడతారు…. లావాదేవీలు కోట్లల్లో సాగుతాయి.

పాలక వర్గం కూడా వీరి చేతుల్లో కిలుబొమ్మలుగా మారిపోయాయి….

ఇప్పుడు అన్ని టివీ చానళ్ళల్లో…. హాట్ డిబేట్ లు ప్రసారం అవుతుంటాయి…. ఇందులో వివిధ పార్టీల నాయకులు పాల్గొని ఒకరినొకరు తిట్టుకుంటూ …. అరుచుకుంటూ…. నానా యాగి చేస్తుంటారు…. చూస్తున్న ప్రేక్షకులకు ఆవేశం కట్టలు తెచ్చుకొనేలా ఉంటుంది వీరి వ్యవహార శైలి….

అలా కార్యక్రమం రక్తి కట్టడానికి వారికి పార్టీలు పారితోషికాలు ఇస్తారు…. అలా ప్రత్యక్షం అయి కాస్తో

కూస్తో పేరు వచ్చిన వాళ్ళు సైతం కొత్త పార్టీలు పెట్టీ ప్రజాసేవ చేయ చూస్తున్నారు….

ఒకే కుటుంబం లో ఉన్న ముగ్గురు అన్నదమ్ములు మూడు వేరు వేరు పార్టీలు పెట్టి…. కత్తులు దూసి కుత్తుకలు తెగ నరుక్కుంటున్నారు. వైరి పార్టీలు కూడా రాజకీయ లబ్ది కోసం మూతులు నాక్కుంటున్నారు….

సిద్ధాంతాలు వదిలి సిద్ధులు అవుతున్నారు.

వాళ్ళకు డిపాజిట్లు రావని తెలిసినా కేవలం ఓట్లు చీల్చడానికే ఈ శిఖండి అవతారం….

దీనికి ఐ ఏ ఎస్… ఐ పి ఎస్ లు కూడా అతీతం కాదు. మేధావి వర్గం కూడా…. ఇదే దారి…. సిద్ధాంత రాద్ధాంతాల్లేని గంప గుత్త గా అమ్మేస్తున్నారు.

కొండకచో కేంద్రం తో ముద్దులు… రాష్ట్రం లో గుద్దులు చందంగా ఉంటోంది…. ఈ మొత్తం వ్యవహారంలో ప్రజలు అమాయకపు గొర్రెల్లా…. బలి పశువులు అవుతున్నారు….. మీటింగులకు ఎగబడి జనాలు వచ్చినా అవి ఓటు క్రింద మారడం లేదు.

ఈ వికార విక్రయాల లిస్టులో మేధావులు కూడా చేరిపోవడం కొసమెరుపు….. 2023 నేర్పిన రాజకీయ పాఠాలు…..

 

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page