13_006 తో. లే. పి. – వి. బస్సా

 

పుదుచ్చేరి …

పేరు వినిన వెనువెంటనే సాధారణంగా మన మనసులో ప్రప్రధమంగా మెదలేది శ్రీ అరవిందాశ్రమం.

ఆ ఆశ్రమంతో  నాకు తొలిసారిగా అనుబంధం  ఏర్పడింది 1968 అక్టోబరు లో జరిగిన నా వివాహ అనంతరం. అయితే, శ్రీ అరవిందుల వారి దర్శనం చేసుకునే అదృష్టం నాకు దక్కలేదు గాని,1969 లో మా పెద్ద అబ్బాయి చి. సుధాకర్ పుట్టాకా‌, మేమందరం కలసి సకుటుంబంగా పాండిచ్చేరి వెళ్ళి శ్రీమాత దర్శనం చేసుకునే మహద్భాగ్యం మాత్రం లభించింది. కాగా, తన శతసంవత్సర జీవనయానంలో, మా మామగారికి పుదుచ్చేరి లో శ్రీ అరవిందులవారి ప్రత్యక్ష దర్శనభాగ్యం ( ఒకటి, రెండుమార్లు ) లభించడం నిజంగా ఆయన పూర్వజన్మసుకృతమని చెప్పక తప్పదు!

ఇంతేకాదు.. ఆయన శ్రీమాత‌, శ్రీ అరవిందులవారి ఆంగ్ల గ్రంధాలనెన్నిటినో తెలుగులోనికి అనువదించి ప్రచురించారు.

పుదుచ్చేరి కి సందర్శించిన వివిధ సందర్భాలలో, ఆశ్రమ దర్శనంతో బాటుగా కొంతమంది స్ధానిక ప్రముఖులతో నాకు పరిచయాలు, మైత్రి ఏర్పడ్డాయి. వారిలో కొందరు “ అర్క” రాజుగారు, దాదా గారు ( శ్రీ మన్మోహనరెడ్డి గారు), మూర్తిగారు‌, మాధవరావు గారు, ప్రొఫెసర్ మనోజ్ దాస్ గారు‌, శ్రీ రాజా గారు‌, శ్రీ కృష్ణారావు గారు‌, డా. వేలూర్ ఎ. ఆర్. శ్రీనివాసన్ గారు‌‌, శ్రీ వి. బస్సా గారు.

వీరిలో శ్రీ బస్సా వారి గురించి, ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను.

ఒక పర్యాయం మా మామగారు‌, మాకు మరో ఆప్తులు అయిన దాదా గారితో కలసి బస్సా గారిని వారింట కలవడం జరిగింది. మా మాటలలో శ్రీ అరవిందులవారి ప్రస్తావన రావడంతో బస్సావారు మాతో చెప్పారు….

వారింటికి చేరువలో గతంలో శ్రీ అరవిందులవారు వారి అనుయాయులయిన శ్రీ శంకరచెట్టి గారింట బసచేసేవారని… ఆ నివాసం దర్శింప యోగ్యమని చెబుతూ దాని నేపధ్యం చెప్పారు.. శ్రీ అరవిందుల వారు కలకత్తాను వీడి పాండిచ్చేరి కి రహస్యంగా ఆయన స్వరక్షణ కొరకు రావడానికి కారణమేమంటే, నాటి బ్రిటిష్ పాలకులు నిష్కారణంగా దేశ స్వాతంత్ర్యపోరాటానికి పూనుకున్న ఆయనపై అభియోగాన్ని మోపి ఆయనకు జైలు శిక్షను విధించడం.

బస్సాగారి ఆసక్తికరమయిన కథనాన్ని వినడంతో మాకు ఆ రహస్య నివాసాన్ని చూడాలన్న దృఢసంకల్పం కలిగి.. వెంటనే అందరం అతి చేరువలోఉన్న ఆ నివాసానికి వెళ్ళి చూసాము…. అక్కడ‌ అరవిందులవారి గోప్యమైన గదీ, గదికి ఆనుకుని దిగువ బిలంలా గోచరించే రహస్య మార్గం … దర్శనమిచ్చాయి !

వీటి ఛాయా చిత్రాన్ని మీరు ప్రక్కన చూడవచ్చును.. అలాగే, అక్కడ తీసిన మరొక ఫొటో ( పైన ) లోని నలుగురు వ్యక్తులు.. ఎడమ నుండి కుడికి వరుసగా.. బస్సా గారు, దాదా గారు, మా మామగారు, నేను. నిజానికి, ఇది చాలా విచిత్రమైన సంఘటన..

మరువరానిది..మరువలేనిది.

ఈ సంఘటన ని గుర్తుకు తెస్తూ నేను బస్సా గారికి ఉత్తరం వ్రాయడం‌‌, వారు ప్రత్యుత్తరం ఇవ్వడం జరిగింది. అదే నేటి తోలేపి…

బస్సాగారు తమ కుటుంబ బాధ్యతలను అనుసరించి తదనుగుణంగా పారిస్ (ఫ్రాన్స్‌) నగరానికి సకుటుంబంగా తరలి వెళ్ళి అక్కడే స్ధిరపడ్డారు. వెళ్ళేముందు పుదుచ్చేరి లోని తమ స్వంత భవనాన్ని 

శ్రీ అరవిందాశ్రమానికి తమ సమర్పణ గా ఇచ్చేసారు. అది ఆయన దానశీలతకు ఒక నిదర్శనమని చెప్పవచ్ఛును.

మరికొంత కాలానికి బస్సాగారు పరమపదించారన్న విషాదవార్తను వారి కుటుంబ సభ్యులు నాకు ఫోను ద్వారా తెలియజేసారు. చాలా బాధాకరం.!

కాలధర్మం అని సరిపెట్టుకోక తప్పదు‌ మ‌రి.

 

 

 *** ధన్యవాదాలు-నమస్కారములు***

 

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page