అడుగువేయగానే మడుగులొత్తే పరివారం, కష్టపడకుండానే ఖర్చు పెట్టగలిగే అధికారం, అయినా సంగీతం నేర్చుకోవడం, నేర్పించడం, కచ్చేరీలు చేయడంపై మమకారం ఏర్పడింది అతనికి. ‘మనం కళా పోషకులుగా ఉండాలి కానీ కళాకారులుగా కాదు’ అన్న కుటుంబ సభ్యుల మాటలను లెక్కచేయకుండా తన అభిరుచిని కొనసాగిస్తున్నారు ప్రిన్స్ ‘అశ్వతి తిరునాళ్ రామవర్మ. వాగ్గేయకారుడు తిరువాన్కూర్ మహారాజు స్వాతితిరునాళ్ వంశీకుడైన రామవర్మ తన అంతరంగం ఆవిష్కరించారు.
భాషలందు తెలుగు లెస్స
వంశపారంపర్య మహత్యమేమో నాకు మలయాళంతో పాటు తమిళం, హిందీ, కన్నడ, ఫ్రెంచ్, ఆంగ్ల బాషలు వచ్చు. సొంపైన తెలుగు సాంతంగా అర్ధమవుతుంది. తెలుగు మాటలలోని ప్రతి చివరి అక్షరం హల్లులతో కలిసి ఉంటుంది. ఉదాహరణకి ‘రాముడు’, ‘రామ’ అంటూ దీర్ఘం తీయటానికి ఎంతో సౌకర్యం.
తపస్సుగా…
చిన్నప్పుడు నా స్నేహితుడు జయకృష్ణన్ తో ఎక్కువ సమయం గడిపేవాడిని. అతనితో బృంద గానంలో భాగస్వామిని అయ్యాను. అప్పుడు మాకు లభించిన బహుమతి గురించి తెలిసి మా తాతమ్మ, (మహారాణి సేతుపతి బాయి) చాలా సంతోషించింది. అలా నా 9వ ఏట వెచ్చూర్ హరిహర సుబ్రమణ్యయ్యర్ దగ్గర సంగీతం నేర్చుకునేందుకు చేరాను. 18వ ఏట ఆర్. వెంకటరామన్ వద్ద వీణలో శిక్షణ ప్రారంభించాను. తరువాత కేఎస్ నారాయణస్వామిని ఆశ్రయించాను. గాత్ర గురువు ‘ వెర్చూర్ ’ పరమపదించాక సద్గురువు కోసం వెతికాను. అప్పుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ రూపంలో నా తపస్సు ఫలించింది. 13 సంవత్సరాలు పైగా ఆయన శిష్యరికం చేసాను. ఒక సందర్భంలో నా గాత్రానికి వయొలిన్ సహకారం అందించిన స్నేహశీలి బాలమురళీకృష్ణ.
నిరంతర విద్యార్థిని
కచేరీలు చేయడం కన్నా నేర్పించడం ఇష్టం. నేర్పించడం కన్నా నేర్చుకోవడం ఇంకా ఇష్టం. నిరంతర విద్యార్ధిని. దాదాపు 12 సంవత్సరాలు ఇంగ్లండ్, ప్యారిస్, ఆమ్‌స్టర్‌డ్యాం లలో సంగీత విద్యార్ధులకు వర్క్‌షాపులు నిర్వహించాను. ఏడాదిన్నరగా హైదరాబాదు, కేరళ, కర్ణాటక సరిహద్దులో వర్క్ షాపులు నిర్వహస్తున్నాను. ఏ సంగీతాన్ని నేర్చుకున్నవారైనా నా సంగీతం త్వరగా అబ్బేందుకు కావలసిన ప్రాథమిక అభ్యాస పాఠాలను రూపొందించాను. వాటితో పాటు బాలమురళీ కీర్తనలను, త్యాగరాజు, స్వాతి తిరునాళ్ కీర్తనలు నేర్పుతాను. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నాగురించి తెలుసుకున్న అబ్దుల్ కలాం రాష్ట్రపతి భవన్ కు నన్ను ఆహ్వానించారు. నా కచ్చేరీ విని అభినందించారు. నా 22వ ఏట టీవీ గోపాలకృష్ణన్ ప్రోద్బలంతో మొదటి కచ్చేరీ చేశాను.
కళా నిర్వాహకుడిగా
‘హిస్ హైనెస్ రామవర్మ ట్రస్టు’ ద్వారా కేరళ ప్రభుత్వం నిర్వహిస్తూ వచ్చిన ‘స్వాతి సంగీతోత్సవం’ ఒక్కసారిగా ఆగి పోయింది. ఆ నిర్వహణా భారాన్ని నా భుజాల మీద వేసుకున్నాను. 300 సంవత్సరాలుగా ప్యాలెస్‌లో ఏర్పాటవుతున్న “కుతిరమాలకోత్సవం’ ఉండనే ఉంది. కర్ణాటక సంగీతం ప్రయోగాలకు ఎంతో అనువైనది. అందుకే ఇందులోనే కొనసాగి తరిస్తాను.
*****************************************
ప్రతి సంవత్సరం జనవరి లో మహారాజ స్వాతి తిరునాళ్ నివసించిన కేరళ రాష్ట్రం, తిరువనంతపురం లోని కుత్తిరమాలిక ప్యాలెస్ లో నిర్వహించే శాస్త్రీయ సంగీత ఉత్సవాలలో ప్రిన్స్ రామవర్మ మాయామాళవగౌడ రాగంలో ఆలపించిన స్వాతి తిరునాళ్ కృతి……
***************************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page