13_007

 

ప్రస్తావన

మనిషికి కనీసావసరాలు అంటే ఎవరైనా ఠక్కున బతకడానికి తిండి, తల దాచుకోవడానికి గూడు, ఒంటిని కప్పుకోవడానికి గుడ్డ… అని చెబుతారు. కొంతకాలం క్రితం వరకు ఇవి సమకూర్చుకున్నాకే మిగిలిన వాటి గురించి ఆలోచించేవారు. వాటిని విలాస వస్తువులుగా పేర్కొనేవారు. అయితే ఒకప్పుడు విలాస వస్తువులుగా ఉన్నవాటిలో కొన్ని ఇప్పుడు కనీసావసరాలుగా మారిపోయాయి. ‘ కడుపు నిండిన బేరం ’ అని విలాసంగా జీవించేవారిని అనేవారు. అంటే ముందు ప్రాధాన్యత ఆకలి తీరడంగా ఉండేది. తరువాతే మిగిలినవన్నీ. ఇప్పుడు అంతకంటే కొన్నిటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఒకప్పుడు సైకిల్ విలాస వస్తువు. అవసరమే అయినా దానికి డైనమో లైట్ ఉండడం లగ్జరీ. ఎందుకంటే అంతకు ముందు సైకిల్ కి కూడా కిరోసిన్ దీపాలు వాడేవారు. వీధిలో ఒకరికి సైకిల్ ఉంటే గొప్పగా ఉండేది. కాలినడకనే ఎంత దూరమైనా వెళ్ళే రోజులవి. తర్వాత సైకిల్ కూడా సామాన్యుల వస్తువుల్లో చేరిపోయింది. ఆ స్థానాన్ని మోటార్ బైక్ లు, స్కూటర్ లు ఆక్రమించాయి. అందులోనూ ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి కావల్సిన సౌకర్యాలతో వివిధ ధరల్లో ఉండేవి. అంటే వాటిని బట్టి వారి ఆర్థిక స్థాయిని కూడా అంచనా వేసే పరిస్తితి. వాటిని కలిగి ఉండడమే ఒక హోదాకి గుర్తుగా ఉండేది. కేవలం ధనిక వర్గానికే పరిమితమైన కార్లు నిదానంగా మధ్యతరగతిలోకి ప్రవేశించాయి. బ్యాంక్ లు, ఆర్థిక సంస్థలు కార్లు కొనుక్కోవడానికి సులభంగా అప్పు లివ్వడం, నెలవారీ వాయిదా పద్ధతులు రావడంతో కొంచెం వెసులుబాటు ఉన్న మధ్యతరగతి వారు కూడా కారు కొనుక్కోవడం ప్రారంభించారు. అలాగే ఒకప్పుడు ధనికులకు, అధిక ఆదాయ వర్గాలకు, వ్యాపార వర్గాలకు మాత్రమే పరిమితమై, విలాస వస్తువుగా చూసే ఫోన్ ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఒకటి….. కొందరికి రెండు కూడా… ఉంటున్నాయి. దాంతో ఫోన్ విలాస వస్తువు నుంచి కనీసావసర వస్తువుగా మారిపోయింది. కొన్నాళ్ళ క్రితం వరకు ప్రతి ఇంటి ముందు విశాలమైన అరుగులు కనబడేవి. కొన్నిచోట్ల పల్లెటూళ్లలో ఇప్పటికీ అలాంటి ఇళ్ళు కనబడతాయి. ఎవరు వచ్చినా, ఎందరు వచ్చినా ఆ అరుగుల మీదే కూర్చుని స్వచ్చమైన గాలి పీలుస్తూ మాట్లాడుకునేవారు. ఇప్పుడు అరుగులే కరువయ్యాయి. అపార్ట్మెంట్ సంస్కృతి పెరిగాక సగం మందికి బయిట ప్రపంచం కూడా కనిపించటం లేదు. అయినా అపార్ట్మెంట్ ఉండటం ఒక హోదాగా భావిస్తున్నారు చాలామంది. తల దాచుకోవడానికి గూడు స్థాయి నుంచి ఆర్థిక స్తోమతను బట్టి విలాసవంతమైన ఇల్లు ఉండాలని భావించేవారే ఎక్కువగా కనిపిస్తారు మన సమాజంలో. ఒకప్పుడు రేడియో ఉండడమే విలాసమైతే ఇప్పుడు టీవీ కనీసావసరం. అది కూడా ఎంత పెద్దదైతే అంత గొప్ప. కుర్చీలు అవసరమే లేకుండా చక్కగా హాయిగా క్రింద చాప మీద కూర్చుని కబుర్లు చెప్పుకునే పరిస్తితి నుంచి కుర్చీల మీద తప్ప కూర్చోలేకపోవడం వరకు వచ్చింది. అందుకే విలాసవంతమైన ఫర్నీచర్ మార్కెట్ లో దిగుతోంది. అప్పో సొప్పో చేసి అవి కొని తమ స్థాయిని పెంచుకోవడానికి తహ తహ లాడుతూ ఉంటారు కొందరు. మరో కనీసావసరమైన బట్టల పరిస్తితి కూడా అంతే ! పెద్ద పెద్ద షోరూమ్ లలో కళ్ళు చెదిరే డిజైన్లు ఆకర్షిస్తూ ఉంటాయి. కొనకుండా ఉండలేని పరిస్తితి.

ప్రజల కోరికలకు అనుగుణంగా క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత, వినియోగ వస్తువుల కొనుగోలుకు అప్పులు…. ఆకర్షణీయమైన నెలవారీ కిస్తీ లు అని వినియోగదారులను ఊరిస్తూ ఉంటాయి బ్యాంక్ లు, ఆర్థిక సంస్థలు. ఇవన్నీ అవసరమా అంటే కాకపోవచ్చు. అయినా ఒకేసారి చెల్లించి కొనే అవకాశం లేనపుడు, వాయిదాలలో కట్టే అవకాశం ఉన్నపుడు కొనుక్కోవడం లో తప్పు లేదుగా… అనేది వారి ఆలోచన. అయితే తర్వాత వాయిదాలు కట్టలేక చతికిలబడితే ఉన్న వస్తువూ పోయే… కట్టిన డబ్బూ పోయే… అన్నట్లు తయారవుతుంది పరిస్తితి. అందుకే పెద్దలు చెప్పారు….అప్పు చేసి పప్పు కూడు తినడం అంత శ్రేయస్కరం కాదని. వాయిదాల్లో వస్తున్నాయి కదా అని కనిపించిన ప్రతి వస్తువును కొనెయ్యకుండా మన స్థాయిని బట్టి, అవసరాన్ని బట్టి మొత్తం చెల్లించి కొనుక్కోవడం ఉత్తమం. 

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Please visit this page