13_008 మేలుకొలికే అద్భుతాలు

 

వారి కీర్తనలు మేలుకొలికే అద్భుతాలు

వాగ్గేయకారులైన అన్నమాచార్యులు, త్యాగరాజస్వామికి ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరూ తమ కృతులతో పామరుల నుంచి జ్ఞానులను సైతం ఆలోచింపజేశారు. ఆధ్యాత్మిక, వాస్తవికత, సమాజహితం… ఇలా అన్ని అంశాలను మేళవించి ప్రతి హృదయాన్ని పులకింపజేశారు. అందుకే వారి కీర్తనలు ఎప్పటికీ మానవాళిని మేలుకోలుపుతుంటాయి. వారు రాగం, భావం, సంగీతం సమపాళ్లలో రంగరించడంవల్లే ఎప్పటికీ నిత్యనూతనంగా విరాజిల్లుతున్నాయి. ఔత్సాహికులే కాదు, సంగీతజ్ఞానులు సైతం ప్రతి కచేరీలోనూ వారి కృతులనే ఏరికోరి శ్రోతలకు వినిపిస్తున్నారు. తన్మయత్వంతో కీర్తనలను ఆలపిస్తూ సంగీతాభిమానులనేకాక పామరులనూ అలరిస్తున్నారు. సంగీతోత్సవాల సందర్భంగా ఆ కీర్తనల ఔన్నత్యం ఒక్కసారి పరిశీలిస్తే…

అన్నమాచార్యులు

***************************************************

సందెకాడ బుట్టినట్టి ఛాయల పంట వాడల వాడల వెంట వాడేవో వాడేవో….

****************************************************

ఇలా తన సంకీర్తనలలో వ్యవసాయం, నేతపని వంటి వివిధ సామాజిక వృత్తులు, పరికరాలను అన్నమయ్య వివరిం చారు. జీవనానికి ఆవశ్యకాలైన ఈ వృత్తులను పరిరక్షించే అవసరాన్ని ఆయన గుర్తించారు. సువ్వి పాటలు, గొబ్బిపాటలు, ఉగ్గుపాటలు, ఊయల పాటలలో పల్లె జీవితంలో నిత్యమూ కనిపించే దృశ్యాల వర్ణనలతో భక్తిని మిళితం చేశారు. అందుకు పామరుల భాషనే ఎంచుకున్నారు.

**************************************************

పొంకపు శేషాదులు తుంబుర నారదాదులు, పంకజ భవాదులు నీ పాదాలు చేరి, అంకెలనున్నారు లేచి అలమేలు మంగను, వెంకటేశుడా రెప్పలు విచ్చిచూచి లేవయ్యా

***************************************************

(విన్నపాలు వినవలె) అంటూ గృహస్థుకి భార్య (కుటుంబమే) మొదటి ప్రాధాన్యత. ఇతరులు ఎంతటి వారైనా ఆ తరువాతేనన్న సందేశాన్నిచ్చారు. మరికొన్ని కీర్తనలలో అలనాటి బృందావనం వంటి సామూహిక జీవనమే సముచితమని పేర్కొన్నారు. ‘ తెలియ చీకటికి దీపమెత్తక పెద్ద వెలుగులోపలికి వెలుగేల ‘ ఈ కీర్తనలో ఆపన్నులు, పాపులు, అన్నార్తులకేగానీ సుఖంగా ఉన్నవారికి సహాయంతో పనేమిటని ప్రశ్నించారు. సేవలోనే ఆధ్యాత్మిక ఎదుగుదల సాధ్యమన్నారు. ‘బ్రహ్మమొక్కటే’, విజాతులన్నియు వృథావృథా అంటూ అందరిలోని అంతరాత్మ ఒకటేనని ఎలుగెత్తి చాటారు. వైష్ణవులు, శైవులు, వేదాంతులు అందరూ కొలిచేది ఒక్కడే భగవంతుడినన్న సత్యాన్ని ‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన ‘ అన్న కీర్తనలో విడమరిచి చెప్పారు.

‘యద్భావం తద్భవతి’ అన్నట్టు భగవంతుని అల్పునిగా భావించేవారికి అల్పుడేనని, ‘ఘనము’గా గుర్తించిన వారికి ఘనుడేనని అన్నారు. పలు కీర్తనలలో కాలం పరుగెడుతున్నదని పనులతో సద్వినియోగ పరచుకోవాలని హెచ్చరించారు. ‘కడలుడిపి’ అన్న కీర్తనలో సాగరం లోని అలలన్నీ ఆగిన తరువాత సముద్రాన్ని దాటుతాననడం అవివేకమన్నారు. త్వరపడి విజ్ఞానాన్ని పొందే ప్రయత్నాలు చేయాలని బోధించారు.

*********************************************************

నీ గుణము నేనెరిగి నిన్ను కొలువగ నేర, | నా గుణము నీవెరిగి నన్ను నేలుకోవయ్య

**********************************************************

అని నిన్ను (పరమాత్ముని) తెలుసుకోవడం నాకు చేతకాదు. నీవే నా స్వభావాన్నెరిగి ఆ విధంగా నన్ను అనుగ్రహించు అని ప్రార్ధించారు. నేనొక్కండే లేకపోతే నీ కృపకు పాత్రమే’ అంటూ జీవాత్మ ఉండబట్టే పరమాత్మ కరుణ ఉపయుక్తమవుతున్నదని, దేవుడికి కీర్తి కలుగుతున్నదని అన్నారు. ‘నీవు దేవుడవు’ అనే కీర్తనలో నీ ( భగవంతుని ) అనుగ్రహాన్ని కురిపించకపోతే నీ గురించి ఎలా ఆలోచించగలను, నిన్ను ఏ విధంగా తెలుసుకోగలనని ప్రశ్నించారు. మరొక కీర్తనలో నేను అజ్ఞానం చేత దారి తప్పి ఉండవచ్చుగాక. మంద నుంచి తప్పిపోయిన ఆవును గోవుల కాపరి తిరిగి తెచ్చినట్టు నీవే నన్ను కాపాడాలి అని స్వామిపైనే తనను కాపాడే భారం వేశారు. సాధనా క్రమంలో అలవరచుకోవలసిన మానసిక లక్షణాలను అన్యాపదేశంగా వివరించారు. కష్టాలను అధిగమించే క్రమంలో భక్తిమార్గంలో సామాన్యుల ప్రయత్నంకన్నా, భగవంతుడి బాధ్యతే ఎక్కువని చెప్పి వారికి కొండంత అండగా నిలిచారు.

త్యాగరాజస్వామి

త్యాగరాజస్వామి యువకుడిగా ఉన్నప్పుడు ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. వేదికపై పాడుతున్న వ్యక్తి అట్టహాసంగా సంగీత విన్యాసాలను ప్రదర్శిస్తుండగా అది సరికాదని అన్నారు. రాగ, భావ, సాహిత్యాలు సమపాళ్లలో ఉండాలన్నారు. ఆ వ్యక్తి, ఇతర పండితులు త్యాగయ్యకు విసిరిన సవాలుకు సమాధానమే ‘ఎందరో మహానుభావులు’ (శ్రీరాగం). ఫలితంగా కఠినంగా మాట్లాడిన వారే చేతులు జోడించారు. ప్రతిభగా, ప్రదర్శనగా కాకుండా సంగీతాన్ని సాధనా మార్గంగా ఎంచుకున్నారు త్యాగయ్య అందుకు ‘తెలియలేదు రామ’ అన్న కృతిలో బాహ్యశుద్ధియే అంతః శుద్ది అనుకునేవారిని చూసి జాలిపడ్డారు. ధ్యానమే వరమైన గంగా స్నానము’ (ధన్యాసి రాగం) అన్నారు. ‘మనసు స్వాధీనమైన ఘనునికి మరి మంత్ర తంత్రములేల’ (శంకరాభరణం) అని మనశ్శాస్త్ర మూలాన్ని ఆవిష్కరించారు.

**********************************************

‘అత్త (ఐశ్వర్యం) మీద కమలాశతో దాసులైరి

సత్త భాగవత వేషులైరి’ అవి ఎంత ముద్దో ఎంత

***********************************************

(బిందుమాలిని రాగం) అన్న కృతిలో పేర్కొన్నారు. ‘అనురాగములేని మనసున సుజ్ఞానము రాదు’ (సరస్వతి రాగం) అంటూ భక్తి, ప్రేమ కలిగి ఉంటేనే జ్ఞానం లభిస్తుందన్నారు. ‘నీ వల్ల గుణ దోషమేమి’ (కాపీరాగం) అన్న కృతిలో ఎవరి స్థితికి వారే కారణమని దేవుని నిందించాల్సిన పనిలేదన్నారు. సమయము తెలిసి’ (అసావేరి రాగం) కృతిలో ‘ధరలోన ధనకోట్లకు యజమానుడు దయ్యమైతేనేమి లోభి అయితేనేమి’ అనడంలో ఇతరులకు ఉపయోగింపని ధనం నిరర్థకమని నిర్ధరించారు. ‘దుడుకుగల’ (గౌళ రాగం) అన్న పంచరత్న కీర్తనలో జీవన విధానంలో మనిషి ఎన్ని రకాల దుడుకుదనానికి లోనవుతాడో అన్నింటినీ వివరించారు. ‘శాంతములేక సౌఖ్యము లేదు’ అని బోధించారు. జీవిత పర్యంతం సన్మార్గంలో ఉంటూ విలువల వల్ల కలిగే ఆత్మ విశ్వాసాన్ని తన రచనలలో ప్రతిఫలింప చేశారు.

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page