లక్కీ గర్ల్ – నేపధ్యం
చిన్నప్పుడు మా ఊరు నుంచి ఎక్కడకు వెళ్ళాలన్నాఓ అయిదు మైళ్ళు కాలినడకనో లేక ఎద్దుల బండి మీదనో వెళ్లే మాకు విమానం చప్పుడు వినిపిస్తే చాలు మా ఆనందానికి పట్టపగ్గాలు ఉండేవికావు. వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయేవాళ్ళం. అలా పరిగెత్తుకుంటూ వెళ్లే వాళ్ళలో ముందు నేనుండేదాన్ని. ఆకాశంలో మోత సన్నగా వినిపిస్తున్నా విమానం ఎక్కడుందో కనిపించేది కాదు. ముందు శబ్దం ఎటువైపు నుంచి వస్తోందో తెలుసుకుని ఆ తర్వాత జాగ్రత్తగా ఏకాగ్రతగా చూస్తే కాని విమానం కనిపించదు. ఎందుకో తెలీదు కాని నాకు ఆ విమానం మోత అన్నా…విమానాన్ని చూడటం అన్నా చాలా చాలా ఇష్టంగా ఉండేది! మెడ ఎంత నొప్పిపుడుతున్నా… అమ్మ ఇంట్లోకి రమ్మని పిలుస్తున్నా కూడా ఆ విమానాన్ని కనిపెట్టి అంది కనిపించినంత మేరా చూస్తూ ఉండిపోయేదాన్ని. నిజంగానే విమానం చూసే హడావిడిలో బిందె జారిపోవడాలు….ఎదురుగా వస్తున్న బండిని…గేదలను చూసుకోని సందర్భాలు ఎన్నో!
పంతొమ్మిదో ఏట నా అంతట నేను అమెరికా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, హైదరాబాదు నుంచి నేను న్యూజెర్సీ లో ఉంటున్న మా వారిని చేరుకోటానికి చెయ్యవలసిన ప్రయాణం తలుచుకుంటే గుండెల్లో విమానాలు పరిగెట్టినా మనసులో మాత్రం నిజంగా విమానం ఎక్కుతున్నానన్న సంతోషం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. దానికి కారణం బహుశ నా వయసనుకుంటా!
జీవితం చిత్రమైన…రహస్యమైన గిఫ్ట్ పెకెట్ లాంటిది. ఎప్పుడు ఏది లభ్యపడుతుందో మనకు తెలీదు. ఆ చిన్నతనంలో ఆకాశంలో వెళ్తున్న విమానాన్ని ఎంతో ఆసక్తిగా చూసిన నేను ఆ విమానాన్ని ఎక్కి సముద్రాలు దాటి వెళ్తున్నప్పుడు కలిగిన ఆ వింత అనుభూతి నా మనసులో ఒక ముద్ర వేసింది. ఆ భావననే అమెరికా ఇల్లాలి ముచ్చట్లలో లక్కీ గర్ల్ గా పంచుకోవటం జరిగింది.
చివరి మాటగా…కాలక్రమేణ కొన్నిమాటలు,వాడకాలు కాల గర్భంలో కలిసిపోతున్నాయి. పూర్వం ఈ విమానం అన్న మాటను ప్రయాణ పరంగానే కాకుండా, పిల్లలం అల్లరిచేస్తుంటే బళ్ళో పంతులుగారు, ఇంట్లో తాతయ్యలు.. నాన్నలు “అల్లరి ఆపకపోతే మీ వీపులు విమానం మోత మోగుతాయి” అంటూ అల్టిమేటం ఇచ్చేవారు! ప్రస్తుత కాలంలో ఈ “విమానం” అన్న మాట ఎవ్వరూ వాడటం లేదు. అందుకే నేను వాడేసుకున్నాను!
లక్కీ గర్ల్ !
మనవాళ్ళందరిని చూసి ఏళ్లయిపోయింది. ఒకసారి ఇండియా వెళ్ళివద్దాం అంటే వినిపించుకోరేం?
నాకు తెలుసులెండి, మైళ్లకు మైళ్ళు కారులో అంటే రెడీ అవుతారుగాని, విమాన ప్రయాణం అంటే విసుగు మీకు. అందుకే తాత్సారం చేస్తున్నారు. ఫ్లైట్ లో అందరం వాళ్ళిచ్చిన ఫుడ్ తిని హాయిగా నిద్దరోతే, మీరు మాత్రం వాసన పడదంటూ ఉపవాసం చేస్తూ…పక్కమీద తప్ప పడుకోలేనంటూ కళ్ళల్లో వత్తులు వేసుకుని అలా కూర్చుంటారయ్యే. గొప్పగా అమెరికా అయితే వచ్చారుకాని, అడ్జస్ట్ అవడం మాత్రం తెలీదు మీకు. నామటుకు నాకు విమానంలో అంత ఎత్తులోనుంచి వెళుతూ..ఆ వెండి కొండల్లాంటి మబ్బుల్ని చూస్తుంటే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది!
విమానంలోంచి దూకిపోయి ఆ మబ్బుల మీద పరిగెత్తి ఆడుకోవాలనిపిస్తుంది!
మీరు మన పెళ్ళి ఇలా అయిందోలేదో చెప్పాపెట్టకుండా అలా అమెరికా వచ్చేసారు. ఓ ఏడ్నర్ధం తరవాత అనుకుంటాను, మీరు మా నాన్నకు ఉత్తరం రాసిపడేసారు పిల్లను పంపమని. నన్ను మీ దగ్గరకు పంపించడానికి అటు మీవాళ్ళు, అటు మావాళ్ళు కలిసి మంచి రోజు కోసం చూడ్డం మొదలు పెట్టారు. అప్పట్లో మీరంటేనే భయంగా ఉండేది. డానికి తోడు అమెరికా గురించి ఆవగింజంతైనా తెలీదు నాకు. అయినా ప్రయాణం ఎప్పుడా అని ఎదురు చూసాను..ఎందుకో తెలుసా?
అసలు సంబరమల్లా విమానం ఎక్కబోతున్నానని!
విమానం అంటే మీకు వెగటు కానీ నాకు మాత్రం చిన్నప్పటినుంచి బోలెడంత ఇష్టం!
మా చిన్నతనంలో విమానం చప్పుడు వినిపిస్తే చాలు, పిల్లలం అందరం ఉన్నపళాన బయటికి పరిగెత్తే వాళ్ళం. మెడలు పైకెత్తి కళ్ళార్పకుండా ఆ విమానం కనిపించినంత మేరకు వెళ్ళేవాళ్ళం.
మీకు తెలుసో లేదో! విమానం చప్పుడు వినిపిస్తున్నా చుక్కల్లే ఆకాశంలో ఎక్కడో వెళ్ళే విమానాన్ని వెతికి పట్టుకోవడం అంటే మాటలు కాదు. దానికి చాలా టాలెంటుండాలి! మీలాంటి బస్తీ వాళ్లకు చస్తే చాతకాదు!
ఒకసారి నేను చెరువు నుంచి నీళ్ళుతెస్తూ విమానం చప్పుడు విని వెంటనే పైకి చూసాను.
ఇంకేముంది! ధబెల్ మని బిందె కాస్తా పడిపోయింది. బిందె పడితే పడ్డది కానీ మొత్తానికి విమానం కనిపించింది!
ఏమిటీ….బిందె పడేసినందుకు మీ వాళ్ళేం అనలేదా అంటారా?
అనకపోవటమేమిటి…బంగారంలాంటి బిందె సొట్ట పెట్టినందుకు వీపు విమానం మోత మోగితేనూ. అయితేనేం ఇట్స్ వర్తిట్!
ఒక్కొక్కసారి పిల్లలమే కాకుండా, పెద్దవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు విమానం చూడ్డానికి. ఒకసారి ఏమైందనుకున్నారూ.. మా రెండిళ్ళ అవతల లక్షమ్మగారని బామ్మగారు ఉండేవారు. వయసుకు బామ్మగారైనా భలే హుషారుగా ఉండేది. మా అందరికీ ఆవిడ చేగోడీలు, గవ్వలు, అప్పుడప్పుడు సున్నుండలు కూడా పెడుతుండేది. మీకు చెప్పానో లేదో వామనగుంటలు ఆట ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను. మధ్యాహ్నం పూట ఏమి తోచకపోతే ఇద్దరం కూర్చుని చింతపిక్కలాట ఆడుకునేవాళ్ళం!
ఏమిటీ…పాయింటు వదిలేసి పక్కదార్లు పడుతున్నానంటారా?
ఇదుగో వస్తున్నా..ఒకరోజు వంటింట్లో ఉన్న బామ్మగారు విమానం చప్పుడు, పిల్లల అరుపులు విని గబగబా ఆ మడిబట్టతోనే వచ్చింది విమానం చూడ్డానికి “ఎక్కడర్రా” అంటూ. ఆవిడా మాతో సమానంగా విమానం ఎక్కడుందో వెతికి పట్టుకోడానికి పైకి చూడ్డం మొదలు పెట్టింది.
మొత్తానికి పట్టేసి, “ఇదిగోనర్రా విమానం” అంటూ మాకు చూపించబోయే హడావిడిలో బామ్మగారి మడిబట్ట కాస్తా గోవిందా…..!!
ఎక్కడో మబ్బుల్లో దాక్కుని ఆకాశాన్నంటుకుని వెళ్ళే విమానాన్ని కుతూహలంగా చూసిన ఓ పల్లెటూరి పిల్ల అదే విమానంలో ఆకాశంలో ఎగిరి ఆ మబ్బుల్ని చూసి పరవశించి పోతున్నదీ అంటే… షి ఈజ్ ఎ లక్కీ గర్ల్!!
ఏమిటీ…ఇవ్వాళ విమానాల విందేనా, అసలు వంట ఏమన్నా ఉందా అంటారా?
భలేవారే! ఇదిగో క్షణంలో వడ్డించెయ్యనూ!
….. 7. నేను సైతం – రేణుక అయోల′ మూడవ మనిషి ‘ 9. మాలతీ సాహితీ మధువు …..
చక్కని సందేశాత్మక కథలు. అభినందనలు.
చక్కని కథలు.అభినందనలు
ధన్యవాదాలు విశ్వ మోహనరావు గారు.