మనకున్న అరవై నాలుగు కళలలో అభినయం ప్రధానమైనది. ఆ అభినయ కళను ఔపోసన పట్టి ఆరు దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకుల్ని ఆనందామృతాన్ని పంచిన మహానటుడు అక్కినేని.
ఆయన ఎక్కని ఎత్తులు లేవు. కీర్తి అనేది ఒక శిఖరమనుకుంటే ఆయన ఆ శిఖరాన్ని ఎప్పుడో ఎక్కేసారు. అఖండ కీర్తి అనేదానికి ఆయనో సజీవ సాక్ష్యం. ఎంత ఎత్తు ఎదిగినా ప్రతీ మనిషీ తనేమిటో మర్చిపోకూడదనే సత్యాన్ని ఆయన తన జీవనశైలితో నిరూపించారు. అందుకే అంటారు అక్కినేని……..
” నేను సినిమాల్లో అభినయిస్తాను. జీవితంలో అనుభవిస్తాను. కానీ అభినయించడంలో కూడా అనుభవిస్తూనే నటిస్తాను. అప్పుడే అభినయం నాకు తృప్తినిస్తుంది. రక్తికడుతుంది కూడా ! నా జీవితానికి నా నటన ఉదాత్తతనందించింది ”
అవును. ఆయన అనుభవిస్తూ అభినయిస్తారు కాబట్టే ఆయన ధరించిన ప్రతీ పాత్రా… అది సీరియస్ పాత్ర అయినా, అల్లరి చిల్లరి పాత్ర అయినా సరే… సజీవంగా మన కళ్ళ ముందు కదులుతాయి. మహాకవి కాళిదాసు, విప్రనారాయణ, అమరశిల్పి జక్కన, దేవదాసు, తెనాలి రామకృష్ణ, బాటసారి, భక్త తుకారాం, బుద్ధిమంతుడు, దసరాబుల్లోడు…. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో… ఎన్నెన్నో…..
ఆయనకు లభించిన ఈ కీర్తి అంత సులభంగా లభించలేదు. ఎంచుకున్న వృత్తినే దైవంగా భావించి, భక్తిభావంతో ఆరాధించి, ఎదురైన కష్టనష్టాలన్నిటినీ భరించి….. ఒక్క మాటలో చెప్పాలంటే తపస్సులా భావించిన వ్యక్తికి విజయం తథ్యమని నిరూపించారు. ఆకర్షణలకు లొంగిపోక, విజయాలను సోపానాలుగా చేసుకుని ఎదిగిన మనిషి అక్కినేని. అందుకే ఆయన నటనే కాదు… ఆయన జీవితం కూడా ఆదర్శప్రాయమే అందరికీ !
తన వృత్తి నటన. తన రంగం చలనచిత్ర రంగం. అంతే ! ఎంతమంది ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా రాజకీయ రంగంలోకి రాలేదు. తను నమ్ముకున్న చిత్ర కళామతల్లి సేవలోనే తరించారు. ఒక్కసారి ఆయన ఎక్కిన మెట్లు గుర్తు చేసుకుంటే అవి మనకి స్పూర్తిని అందిస్తాయి.
1924 లో కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా లోని వెంకట రాఘవాపురంలో జన్మించిన అక్కినేని 1934 లో తొలిసారిగా స్త్రీ పాత్రతో రంగస్థలం ఎక్కారు. అక్కడినుంచి చిత్రసీమలో కాలుపెట్టాక ఆయన నటించిన తొలి చిత్రం ‘ ధర్మపత్ని ‘ 1941 లో విడుదలయింది. అయితే కథానాయకుడిగా ఆయన నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం 1944 లో వచ్చిన ‘ సీతారామజననం ‘. అరవై చిత్రాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని 1957 లో డా. బెజవాడ గోపాలరెడ్డి గారి చేతుల మీదుగా ‘ నటసామ్రాట్ ‘ బిరుదు అందుకున్నారు. 1962 వ సంవత్సరంతో వంద చిత్రాలు పూర్తయ్యాయి. 1968 లో పద్మశ్రీ బిరుదనందుకున్నారు. కథానాయకుడిగా రజతోత్సవాన్ని 1969 లో జరుపుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1977 లో ‘ కళాప్రపూర్ణ ‘ గౌరవ డాక్టరేట్ నందించింది. 1982 తో 200 చిత్రాలు పూర్తయ్యాయి. 1988 లో ఆయన ‘ పద్మభూషణ్ ‘ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత రఘుపతి వెంకయ్య పురస్కారం 1990 లో లభించింది. మరుసటి సంవత్సరం 1991 లో భారత ప్రభుత్వ అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. 1993 లో నాగార్జునా విశ్వవిద్యాలయం గౌరవ డి. లిట్ట్. పట్టా నందించింది. 1995 లో జీవిత సాఫల్య పురస్కారం, తమిళనాడు ప్రభుత్వం ‘ అన్న ‘ పురస్కారం పొందారు. మరో ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు పేరున స్థాపించిన ఎన్టీయార్ జాతీయ చలనచిత్ర పురస్కారం తొలిసారిగా 1996 లో అందుకున్నారు. అదే సంవత్సరం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘ కాళిదాస్ కౌస్తుభ్ ‘ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. ఆటా, తానా లతో బాటు అనేక విదేశాల్లోని సంస్థలు జీవిత సాఫల్య పురస్కారాన్ని 2000 వ సంవత్సరంలో అందించాయి. అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రంగస్థల, చలనచిత్ర మరియు టీవీ రంగాల అభివృద్ధి సంస్థ సలహాదారుగా నియమితులయ్యారు.
ఇవన్నీ అక్కినేని అధిగమించిన సోపానాలు. ఈ విజయాల వెనుక మొక్కవోని కృషి వుంది. తపన వుంది. సాధన వుంది. అన్నిటినీ మించి అంతులేని ఆత్మస్థైర్యం వుంది. అందుకే అక్కినేనికి ఇవన్నీ సాధ్యమయ్యాయి. ఎనభై ఎనిమిది సంవత్సరాల పరిపూర్ణ జీవితాన్ని అనుభవించిన ఆయన ఇంకా యువకుడే !