భళారే ‘ సినారె ‘

పౌర్ణమి నాడు పుట్టినవాళ్ళు కవులవుతారని ఒక వాదన వుంది. ఆది నిజమేనేమో ! ఎందుకంటే 1931 వ సంవత్సరం ఆషాఢ పూర్ణిమ రోజున మనకో కవి లభించాడు. తన పద్నాలుగవ ఏటనే కవిత్వం రాయడం ఆరంభించిన ఆయనే డా. సింగిరెడ్డి నారాయణరెడ్డి…… తెలుగువారు ముద్దుగా పిలుచుకునే సినారె.

 

సినారె కవిత ఎంత తీయగా వుంటుందో

సినారె గళం కూడా అంత మధురంగా వుంటుంది

 

ఆయన కవితా కులాలంకారుడు …ద్విభాషా ప్రవీణుడు

తెలుగుతో బాటు ఉర్దూ కవిత్వాన్నికూడా ఔపోశన పట్టారు

 

సాంప్రదాయ ధోరణిలో పద్యాలు రాసారు

ఆధునిక ధోరణిలో వచన కవితలల్లారు

 

లలితమైన పదాలతో గేయాలు రాసారు

తెలుగులో అందమైన గజళ్ళు పాడారు

 

ప్రణయ గీతాలు… ప్రబోధ గీతాలు…

భావ గీతాలు…. భావోద్వేగ గీతాలు…

 

…. ఇలా ఎన్నో… ఎన్నెన్నో ఆణిముత్యాలు తెలుగువారికి అందించారు

…. తెలుగు కళామతల్లి కంఠహారంలో కవితా కుసుమాలు పొదిగారు

 

ఋతుచక్రం తిప్పి కర్పూర వసంతరాయలు ను పిలిచారు

విశ్వంభర డయి ప్రపంచ పదులు చెప్పి గదిలో సముద్రం పారించారు

 

ఆయనది అలుపెరగని సాహితీ వ్యవసాయం

అందుకే అత్యున్నతమైన జ్ఞానపీఠమెక్కారు

 

 

నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని నుండి జేజమ్మా వరకూ

సినారే సినీ గీతాలు కూడా సాహిత్య పరిమళాలు వెదజల్లాయి

 

తెలుగు వారందరూ గర్వంగా చెప్పుకోగలిగిన కవి సినారె

ఆ తరానికి, ఈ తరానికి మధ్య వారధిగా నిలిచిన సినారె…. నిజంగా భళారే !!

 

ప్రముఖ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ………

 

సినారె గారి కలమే కాదు… గళం కూడా మధురమే ! ఆయనకు జ్ఞానపీఠ పురస్కారాన్ని అందించిన ‘ విశ్వంభర ‘ నుంచి, సున్నితమైన వ్యంగ్యాన్ని కలబోసిన ‘ ప్రపంచ పదులు ‘ నుంచి సినారే తన స్వంత గళంలో అందించిన కొన్ని కవితా కుసుమాలు…….

 

డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి పాటలే కాదు మాటలు కూడా బహు పసందుగా వుంటాయి. తెలుగు భాష సొగసును ఆయన మాటల్లో చూడవచ్చు. ఆయన ముఖ్య అతిథిగా వస్తే ఆ సభ కళ కళ లాడుతుంది. మాటలతో చదరంగం ఆడుకుంటారు సినారె.

 

* మన రాష్ట్రంలో పేరుపొందిన నాటక పరిషత్తులలో తూర్పుగోదావరి జిల్లా రామవరంలోని నల్లమిల్లి మూలారెడ్డి కళాపరిషత్ ఒకటి. ఒకసారి ఆ పరిషత్తు ఉత్సవాల్లో డా. సి. నారాయణ రెడ్డి గారికి సన్మానం ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు బ్రహ్మాండంగా వున్నాయి. ఇసుక వేస్తే రాలనంత జనం. ఆ సందోహాన్ని చూసి ఒక వక్తకు ఉత్సాహం పెల్లుబుకింది. ఆ ఉత్సాహంలో ఆ సభను మయసభ తో పోల్చాడు.

సినారె గారు దానికి ప్రతిస్పందిస్తూ ” ఇంతకుముందు మాట్లాడిన మిత్రులు ఈ మహాసభను మయసభతో పోల్చారు. అయితే మయసభ అంటే ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమ కల్పించడం. పైగా అపోహలూ, అవమానాలు. కనుక ఇది మయసభ అనడం సరైనది కాదు. దీన్ని మనం వాజ్ఞ్మయసభ అంటే బాగుంటుంది. ” అన్నారు. ఇక సభంతా ఒకటే కేరింతలు ఆ గిలిగింతలకి.

 

* మార్కాపురం పలకలకి ప్రసిద్ధి అని మనకందరికీ తెలుసు. రాతి పొరలనుండి ఆ పలకలు తయారవుతాయి. కొంతకాలం క్రితం వరకూ మార్కాపురం పలక మీద ఓనమాలు దిద్దని తెలుగు వారుండేరేవారు కాదు. ఇప్పటి తరానికి పలకాలంటే తెలీదేమో !

ఓసారి ఆ ఊరి కళాశాల వార్షికోత్సవానికి నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ రోజు ఆయన తన ఉపన్యాసంలో ” కొందరి గుండెల్లో పొరలు లాగే మార్కాపురం బండల్లో కూడా పొరలున్నాయి. అయితే మనుష్యుల గుండెల్లోవి పొరలు ఉండకూడని పొరలు. మార్కాపురం బండల్లో వున్న పొరలు ఉండాల్సిన పొరలు. ఎందుకంటే అవి అందరికీ పనికొచ్చేవి కనుక ” అనడంతో మార్కాపురం వాసుల ఆనందం చెప్పాలా !

 

ఇవి నారాయణ రెడ్డి పద విన్యాసానికి మచ్చు తునకలు మాత్రమే !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *