ఆధునిక తెలుగు సాహితీ పూదోటలో తనదైన మధువులొలికించిన మహారచయిత్రి, తెలుగు మహిళా “హృదయనేత్రి” శ్రీమతి మాలతి. తన తొలి రచన “రవ్వల దుద్దుల” తో తెలుగుసాహిత్యంలో తళుకులు కురిపించారు. కృష్ణజిల్లా నూజివీడులో పుట్టిన మాలతీ చందూర్ నోరూరించే నూజివీడు రసాలవంటి  రచనలనెన్నిటినో చేసి, ఆధునికాంధ్ర సాహిత్యంలో చైతన్యదీప్తి ని వెలిగించి, ఒక విశిష్టమైన స్థానాన్ని అందుకున్నారు. శ్రీమతి మాలతి 1928 లో పన్నాల వెంకటేశ్వర రావు,జ్ఞానాంబ దంపతులకు జన్మించారు. ఎనిమిదో తరగతి వరుకు విద్యనభ్యసించి ఆ పైన తన మేనమామతో కలిసి అనేక సాహితీ సభలకెళ్ళేవారు. విశ్వనాథ, కృష్ణ శాస్త్రి వంటి మహామహుల పరిచయాలు కలిగాయి. మేనమామ సాంగత్యం, నిరంతర పుస్తక పఠనం ఆమెలో రచయిత్రిని మేలుకొలిపాయి.  తొలికథ “రవ్వల దుద్దులు”, మాలతి క్రమం తప్పకుండా చదివే ఆనందవాణి అనే పత్రిక కోసం వ్రాసారు. 1948లో మేనమామ చందూర్ నే వివాహమాడారు. స్వాతంత్ర్యానంతరం మద్రాసు నగరంలో రిజిస్టర్ పెళ్ళి చేసుకున్న తొలిజంటగా వాసికెక్కారు శ్రీమతి మాలతీ చందూర్ దంపతులు.

 

శ్రీమతీ మాలతీ చందూర్ గా మద్రాసు మహానగరంలో సాగర తీరాన గల కచేరీ రోడ్డులో చక్కటి గృహంలో కొలువుదీరి వారి సాహితీ దాంపత్యానికి శ్రీకారం చుట్టారు.  జీవిత భాగస్వామి చందూర్  శిక్షణలో రచయిత్రిగా ఓనమాలు దిద్దుకున్నారు. ఇంతింతై వటుడింతైగా తెలుగు జాతికి అందునా మహిళలకి ఒక చైతన్య స్ఫూర్తిగా వారింటి దీప్తిగా వెలిగారు. చందూర్ గారు  మంచి  కథకుడు, జర్నలిస్టు. జగతి మాసపత్రికతో  తన జీవిత పర్యంతం ప్రపంచానికి తెలుగువెలుగులను ప్రసరింపజేశారు. మామయ్య సాంగత్యం తో తన సృజనాత్మకతని వెలికితీసి మెరుగులద్దారు మాలతీ చందూరు. లజ్ కార్నర్, డాబాఇల్లు వంటి కథలు  ప్రారంభార్థంలో వచ్చిన చక్కటి కథలుగా చెప్పవచ్చు. మాలతిగారు పెద్ద పాఠకురాలు. దంపతులిద్దరు కలిసి మద్రాసులో ఉన్న కన్నెమరా గ్రంథాలయంలోని వేలపుస్తకాలను వల్లె వేశారు. చదవడంతో ఆగిపోలేదామె. చదువులలోని మర్మమెల్లచదివిన ఆధునిక మహిళ. చదువుతున్నప్పుడు తానూ చవిచూసిన స్వానుభవాలని నలుగురికి పంచాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచ సాహిత్యాన్ని ఒక చుట్ట చుట్టి వచ్చారు.దాన్ని సంక్షిప్తపరిచి తెలుగుప్రజానీకానికి సులభంగా విశ్వసాహిత్యాన్ని “పాతకెరటాలు” గా అందించారు. ఎక్కడ ఏమూల ఏ పుస్తకం వెలువడినా అమె చేతిలో  “చిక్కి” తెలుగు పాఠకులకు “స్వాతి” ముత్యమై వారి కంఠాలనలంకరించింది. రమారమి 30ఏళ్ళు స్వాతి మాసపత్రికలో ప్రతినెలా ప్రపంచ సాహిత్యంలో వచ్చిన అనేక ఆంగ్ల నవలలను పాత కెరటాలు, కొత్త కెరటాలు అని రెండు భాగాలుగాను, నవలామంజరి పేరుతో 6 సంపుటాలు గాను, మొత్తం 450  పైచిలుకు నవలలను సంకలనం చేసారు. తెలుగు సాహిత్యంలో ఇది అపూర్వం, అద్వితీయం, అసాధారణ విషయమని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. టాల్ స్టాయి  నుండి ఎందరో ఆంగ్ల రచయితల నవలలను ఆంధ్రీకరించి అందించారు.

 

ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో “ప్రమదావనం”   పేరిట కాలమిస్టుగా తెలుగు ప్రమదల జీవితాల్లో వెలుగులను నింపిన నిరంతరాన్వేషి మాలతీ చందూర్. కుట్లు, అల్లికలు, వంటలు, వ్యక్తిగత, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, సంప్రదాయాది ఆని అంశాలపైన అడిగిన అన్ని ప్రశ్నలకి నిక్కచ్చిగ, నిబద్ధతతో ఆమె ఇచ్చే సమాధానాల కోసం తెలుగు మహిళా లోకం ఎంతో అత్రుతగా పడిగాపులు గాచేది. తెలుగింటి ఆడపడుచుల కష్టాలకొక కల్పలతగా భాసిస్తూ ప్రమదావనం సుమారు 50 ఏళ్ళ పాటు ఆంధ్ర మహిళలను అలరించింది. ప్రమదావనంలో మాలతి గారు ఎందరికో ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా, వదినగా, ఆడపడుచుగా,అత్తగా చివరికి దైవం గా అనేక అవతారాలెత్తి అంతటా తానై గుభాళించారు. 50 సంవత్సరాలుగా ఒక పత్రికలో కాలమిస్టుగా ఉండడమన్నది అనితరసాధ్యం. అది మాలతీ చందూర్ కే సాధ్యమైంది. దీని కొనసాగింపుగా అన్నట్లు స్వాతి వారపత్రికలో “నన్ను అడగండి” అంటూ ఎందరికో ఒక దిక్సూచి గా, మార్గదర్శి గా, జీవితాల్లో పీటముడులుగా ఉన్న సమస్యలనెన్నిటినో పరిష్కరించారు. అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో, బాణీలో, సందర్భోచితంగా కొండొకచో కటువుగా కూడా చెబుతూ తర్కబద్ధమైన సమాధానాలతో పాఠకులకు ఆత్మీయురాలై 20 వసంతాలు కాలమిస్టుగా వ్యవహరించారు.

 

“మామయ్యా!” అని సంబోధించే తన భర్త చందూర్ గారి పాత్ర తనని రచయిత్రిగా మలచడంలో ఎంతో ఉందని బాహ్యంగానే గొప్పగా చెప్పుకునేవారు మాలతి. ఆమె చదివింది ఎస్సెల్సి నే అయినా మనస్తత్త్వాలను, సమాజాన్ని, జీవితాలను ఎంతగానో చదివి, కాచి వడబోసారు. తొలిరచనల కాలంలో వెలువడిన చంపకం-చెద పురుగులు లాంటినవలలు  ఎంతో పేరు  ప్రఖ్యాతులు పొందాయి. ఏమిటీ జీవితం, ఆలోచించు, శతాబ్ది సూరీడు, కాంచన మృగం, శిశిర వసంతం,మనసులో మనసు, మధురస్మృతులు, రెక్కలు చుక్కలు లాంటి నవలలు సుమారు 30 వరకు రచించారు. వీటితో పాటు కొన్ని తమిళ అనువాద నవలలు తెలుగువారి  కందించారు. అదే కాకుండా మాలతి  నవలలెన్నో తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోకి  అనువదింపబడ్డాయి.కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాన్ని అందుకున్న వీరి “హృదయనేత్రి” తెలుగు సాహిత్యానికి ఒక ఉదయనేత్రి. స్వాతంత్ర్య సంగ్రామ కాలంలో చీరాల పేరాల ఉద్యమాన్నినేపథ్యంగా చిత్రించిన ఈ నవల భారతీయ భాషా పరిషత్, కలకత్తా వారి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాన్ని కూడా వరించింది.”గౌతమీ పుత్ర” ఆమె చిట్టచివరి నవలగా వాసికెక్కింది.

 

తల్లి జ్ఞానాంబ పెంపకంలో వంటిల్లు చూసిన మాలతీ చందూర్ రచనా వ్యాసంగంలో ఉండి బొత్తిగా వంటింటి వైపు చిన్న చూపు వేసారు.  అయినా అనేక తెలుగు వంటిళ్ళు ఆమె “వంటలు-పిండివంటలు”  పుస్తకంతో ఘుమఘుమలాడేవి. మా పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్న వంటలతో పాటు ఎప్పటికప్పుడు కొత్త వంటలు తెలుసుకుని రాసానని చెబుతుండేవారు. ఎన్నో వేల పుస్తకాలు పలు పునర్ముద్రణాలతో అమ్ముడయ్యాయి.

నిరంతరాధ్యయనం, పుస్తక పఠనం, సత్సాంగత్యం, భర్త చందూర్ గారి సాహచర్యం ఇవన్ని కలగలిసి అమె జీవిత పర్యంతం సాహిత్య, సామాజిక కృషి చేస్తూనే ఉండేవారు. మాలతీచందూర్ దంపతులు ముదిమిలో సైతం తెలుగు సమాజానికి ఎనలేని సేవ చేసారు.దుర్గాబాయి దేశ్ముఖ్ గారు స్థాపించిన “ఆంధ్రమహిళా సభ” నిర్వహణా బాధ్యతలు చేపట్టి, దాని అభివృద్ధికి అహరహం శ్రమించారు. ఉన్నది మద్రాసులో అయినా ఆంధ్రదేశం నుండి తరలి వచ్చే అశేష సాహితీ అభిమానులను ఆప్యాయంగా పలకరించి, ఆదదరించే తీరు , వారి ఆతిథ్యం అందుకున్న వారికి అబ్బురంగా అనిపిస్తుంది. 1970 దశకంలో కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా చిత్ర పరిశ్రమ ప్రముఖులకు మాలతీచందూర్ చిరపరిచితురాలు. తమిళ రచయిత/త్రులైన జయకాంతన్, శివశంకరి వంటి వారు ఆమెనెంతో గౌరవించేవారు.

 

మద్రాసులో జరిగే అన్ని సాంస్కృతిక సాహిత్య సభలకు పతీసమేతంగా హాజరై బాగోగులు చూస్తూ కార్యక్రమాల సమాచారాన్ని తమ జగతి పత్రికలో ప్రచురించి జగత్తుకంతటికి తెలియజెప్పేవారు. శ్రీమతి మాలతీ చందూర్ ఒక వ్యక్తిగా కాక మహిళశక్తిగా, చైతన్య దీప్తిగా, ఒక వ్యవస్థగా సమాజానికి , సాహిత్యానికి చిరస్మరణీయమైన సేవలందించారు. ఇంతటి మహోన్నత రచయిత్రికి  పురస్కారాల పూదోట గుభాళింపులెన్నో ఉన్నాయి. కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి పురస్కారం, కళా ప్రపూర్ణ, భారతీయ భాషా పరిషత్ వారి పురస్కారం, ఆంధ్రా  విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ వంటివెన్నో అవార్డులు ఆమెని వరించాయి. ఆమె రచనల పైన పలు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగడం విశేషం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రార్థం ఆమరణ నిరాహార దీక్షతో అసువులు బాసిన ప్రదేశం మద్రాసు మైలాపూరులో”అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక సంస్థ” కి సభ్యురాలిగా, తదనంతరం అధ్యక్షురాలిగా సంస్థ అభివృద్ధికి నిరంతరం పాటుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  నుండి రావల్సిన ఆర్థిక సాయం కోసం కొన ఊపిరి వరుకు పోరాడారు. వారి అధ్యక్షతన ఎన్నో తెలుగు కార్యక్రమాలకు ఆ సంస్థ ఆలవాలమైంది. ఈ సంస్థతోటి వీరి అనుబంధం ఎప్పటికీ స్మరణీయమే.

 

ఎంత ఎదిగినా, ఎన్ని పురస్కారాలు పొందినా ఎందరి హృదయాల్లోనో చెరగని ముద్ర వేసుకున్నా ఎప్పుడూ నిరాడంబరంగా,  సాదాసీదా మహిళగా, ఎంతో ఉన్నతంగా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చిరునవ్వులు చిందిస్తూ నిర్మొహమాటంగా ఉండడం ఆమెలోని విశిష్టత.తన మరణానంతరం భౌతిక కాయాన్ని శ్రీరామచంద్ర వైద్య కళాశాల విద్యార్థులకు పరిశోధనార్థం  అర్పించమని చెప్పిన మహోన్నత వ్యక్తిత్వం మూర్తీభవించిన మహిళ శ్రీమతి మాలతీ చందూర్.ఆగస్టు 21, 2013లో శ్రీమతి మాలతీ చందూర్ తిరిగి రాని లోకాలకు మరలి పోయారు. ఆమె చెప్పినట్లే భౌతిక కాయాన్ని వైద్య కళాశాలకి అప్పగించారు. ఆమె నిర్ణయానికి చకితులైన  ప్రముఖులు కొందరు తాము కూడా మరణానంతరం తమ భౌతిక కాయాన్నిఇలాగే పరిశోధన నిమిత్తం వైద్య కళాశాలకి  అర్పించాలని మాలతి నివాళి సభలో తెలియజేసారు. తెలుగు ప్రజల “హృదయ నేత్రి”గా కలకాలం నిలిచిపోయారు శ్రీమతి మాలతీ చందూర్.

ఈ ఆదర్శ దంపతుల పేర్లమీద” ఎన్నార్ చందూర్ జగతి పురస్కారం, శ్రీమతి మాలతీ చందూర్ పురస్కారం”  అని ప్రతి ఏడూ ఒక ఉత్తమ  జర్నలిస్టుకి  జగతి పురస్కారాన్ని, ఒక ఉత్తమ రచయిత్రికి శ్రీమతి మాలతీ చందూర్ పురస్కారాన్ని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సంస్థ వారు, శ్రీమతి మాలతీ చందూర్ కుటుంబ సభ్యులు సంయుక్తంగా ,ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

*************************************************************

ఈ సంవత్సరానికి గాను ఫిబ్రవరి 21 వ తేదీన న్యూఢిల్లీ లోని ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు గారి చేతులమీదుగా, వారి కార్యాలయంలోని సమావేశమందిరంలో అంతర్జాతీయ మీడియా లో ప్రముఖుడైన శ్రీ రాజు నరిశెట్టి గారికి ఈ పురస్కార ప్రదానం జరుగుతుంది.

*************************************************************

…… 8. అమెరికా ఇల్లాలి ముచ్చట్లు                                                                                                                                            10. మందాకిని …..