రేణుకా అయోలా గారి ‘మూడవ మనిషి’ కవిత్వ సమీక్ష
కవిత్వం తట్టుకోలేని ఆవేదన కలిగినప్పుడు ఆవేశంతోనూ, ఉద్విగ్నతతోనూ అభివ్యక్తి పొందుతుంది. అయితే ఒక దీర్ఘ కవిత రాసేటప్పుడు ఇది మరింత పటిష్టమైన నిర్మాణ పద్ధతిని అవలంబించాలి. దీనికి అంత సాంద్రమైన ఇతివృత్తం తో బాటు చదివించే బిగి ఉండాలి. అలాంటి దీర్ఘ కవితని అందించిన కవయిత్రి రేణుకా అయోలా. సృష్టి లోని అపశ్రుతిగా సృజియింపబడిన ఇటు స్త్రీ గానీ , అటు పురుషుడుగానీ కాని మూడో మనిషి గురించి ఒక దీర్ఘ కవితని రాయాలని పూనుకోవడం ఈ కవయిత్రి చేసిన సాహసమనే చెప్పాలి. ‘ఒక హిజ్రా ఆత్మ కథ’ రేవతి అనే ఒక హిజ్రా ఆత్మకథ ప్రేరణ గా ఆ ఇతివృత్తాన్ని కవిత్వీకరించడం రేణుక గారు చేసినది ఈ దీర్ఘ కవితలో. కవిత్వం రాసేవారు ఆ సమస్య తీవ్రతకు కలత చెంది మమేకమై రాస్తారు కొందరు, పైనుండి సానుభూతిని వ్యక్తం చేస్తూ రాస్తారు కొందరు. రేణుక మొదటి కోవకు చెందిన వారు. ప్రతి సమస్యకి వైయక్తిక, సామాజిక , ఆర్ధిక కోణాలుంటాయి. రేణుక అన్నీ కోణాలనుండి పరిశీలనాత్మక వ్యాఖ్యగా ఈ కవితను రచించారు. ఇది ఎంతో సహానుభూతి ఉంటే తప్ప సాధ్యం కాదు. ఆ విషయం లో కవయిత్రి ఎవ్వరూ ఇంతవరకూ తీసుకోని ఇతివృత్తాన్ని తీసుకుని రాయడం ముదావహం. అదీ ప్రపంచంలో తమకంటూ ఒక స్థానం ఉందనీ , దానికోసం పోరాటం చెయ్యక్కర్లేకుండా తమకు వెసులుబాటు ఉండాలని ఒక మానవ ప్రాణి కోరుకోవడం అసహజం కాదు కదా అనే సహానుభూతితో. ఏదో సృష్టి వైపరీత్యం లే అని వారిని వారి బ్రతుకు బ్రతకనిస్తున్నామా, మనలో ఒకరుగా స్వీకరిస్తున్నామా ఈ ప్రశ్నలు తన ఆత్మను వేధించగా తను ఈ దీర్ఘ కవితను రాసానని రేణుక స్వయగా చెప్పుకున్నారు తన మాటల్లో. ప్రసిద్ధ కవయిత్రి శీలా సుభద్రా దేవి కూడా మూడవ మనిషి హృదయం లోకి కవయిత్రి రేణుక పర్కాయ ప్రవేశం చేసి రాశారని అభినందించారు.
ముందు మాటల్లో ఆత్మీయాభినందనలు తెలుపుతూ రచయిత్రి వినోదిని గారు రాసిన మాటల్లో రెండు ముఖ్య విషయాలకు రేణుకాను అభినందించారు. ఒకటి కవయిత్రులెవరూ ఎంచుకోని దీర్ఘ కవితా ప్రక్రియను ఎన్నుకోవడం , రెండు ఎవరూ ఇంతవరకూ కవితా వస్తువుగా (తెలుగులో) ఎన్నుకోని ఇతివృత్తాన్ని ఎన్నుకోవడం. ఈ రెండూ చాలా సమర్ధవంతంగా అర్ధవంతంగా ఆర్ద్రతతో నిర్వహించారు రేణుక గారు. ఈ సుదీర్ఘ కవితలో ప్రతి వాక్యం, పద చిత్రం సహానుభూతినీ, సానుభూతినీ వ్యక్తం చేస్తున్నాయి.
పురుష శరీరం, స్త్రీ మనస్తత్వం తో ఒక మానవ ప్రాణి పడే ఈ అవస్తను, ఈ సంఘర్షణను చిత్రించడం లో కవయిత్రి కృతకృత్యులయ్యారు. కుటుంబం సైతం చీదరించుకున్న మనిషిని సమాజం అదరిస్తుందా. పుట్టుకతో గుడ్డిగానో, చొట్టగానో పుట్టిన వారిని సానుభూతితో ఆదరించే ఈ సమాజం వీరినెందుకు అసహ్యించుకుంటుంది? ఇది భయంకరమైన సమాధానం రాని ప్రశ్న. ఎవ్వరూ అలా పుట్టాలనికోరుకోరు కదా. ప్రకృతి వైపరీత్యానికి నిండు మనసున్న మనిషి బలికావాల్సిందేనా. కాస్తంత జాలి కరుణా చూపించలేమా? అన్నదే రేణుక ఆవేదన. ఈ ఆవేదన ఆమె మాటల్లో చూడండి “ రూపాన్ని వ్యక్త పరచలేని/ఒక దేహ చరిత్ర రాసుకోవాలనుకున్నప్పుడు/అక్షరాల గాయాలు రహదారిలో నిలబడి/దిక్కులు చూస్తున్నాయి’. తన దేహాన్ని తల్లే దాచేసినప్పుడు ఇక రూపంలేని తనని గురించి రాసుకోవాలంటే అక్షరాలు దిక్కులు చూస్తున్నాయి ఎలా పదాలై వ్యక్తీకరించుకోవాలో అని. పుట్టింది మగపిల్లాడు అని సంతోషించేలోపల అది మగా ఆడా కాని శిశువు అని తెలిసి , తాను ఎదుగుతున్న సమయాలలో ఈ ఆడంగితనం నీకేల కొడుకా అని రోదించే తల్లి. కనీసం చదువుకున్న కాలేజీ అయినా తన జీవితాన్ని నిలబెడుతుoదనే ఆశతో ఎంతో నిరీక్షణ. కానీ అక్కడా నిరాశే ఎదురయింది. “ కాలేజీ మెట్లు దిగిన పాదం/ మరో ప్రపంచం కోసం/మనసు సరిహద్దులు దాటి వెతికేది”. కఠోర వాస్తవం లో దేనికీ చెందక తూనీగ ప్రపంచాన్ని అందుకోలేక ఎన్ని మార్లు కూలిపోతూ ఉంటే ఇక నిలబడటం ఎలా అన్నదే ఈ థర్డ్ జెండర్ సమాజానికి వేస్తోన్న ప్రశ్న.
ఈ దీర్ఘ కవితలోని ఐదవ భాగం లో ఈ మూడవ మనిషి తనలాంటివారినే కనుగొనడం జరుగుతుంది. “ ఆ కొండ మీద వాళ్ళు నృత్యం చేస్తూ /కనిపించడం ఒక వరం/” అంటూ వాళ్ళని చూస్తూనే “కొత్త ప్రపంచ ద్వారాలు తెరుచుకున్నాయి” అనడం లో ఒక ఆవేదనాత్మక జీవన రాజీ తత్వం కనిపిస్తుంది. అయితే ఈ మూడవ మనిషి ప్రయాణం వీరితో సహ యాత్రికునిగాసాగలేదు. “ ఎక్కడినుండి మొదలవుతుందో/ తెలియకపోయినా ప్రయాణం ఆగలేదు”. ఏడవ భాగం లో “ ఊపిరి సలపని ఉద్రేకంతో /స్త్రీగానే బతకాలని పచ్చని కోరికతో/కట్టెలు కొట్టే గొడ్డలిలా/శరీరాన్ని చెక్కుకుంటూ/వయసు తెస్తున్న మార్పుల లోయలోకి/జారుతూ రేపు అనే మలుపులో/ప్రతి ఉదయాన్ని ఆశగా చూడడం/ఈ జీవితం లో నేర్చుకున్న మొదటి పాఠం”. తన ఆస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనే తపన స్త్రీగానే బతకాలనే ఆకాంక్ష బతికించాయి ఈ మూడవ మనిషిని.
శరీరం లోని స్త్రీగా ఎదగనివ్వని, అలా అని ఎందుకు పనికి రాని పురుషాంగాన్ని ఖండించుకుని ఆ నొప్పిని బాధని ఓర్చుకుని బతకడానికి సిద్ధపడే సన్నివేశాన్ని హృదయవిదారకమైన ఆ వాస్తవికతని “విడిపోయిన అంగంతో శరీరం/చీకటి రాత్రుళ్ళ గుడారంలో/ ఏడుపుని నోక్కెసి/నొప్పిని ఒర్చేసుకుని/సరికొత్తగా ఉదయించే/వెలుగులో/మాటల సముద్రం మీదుగా /వెక్కిరింత లోయల మీదుగా/స్వేచ్ఛగా ఎగిరే లోపలి స్త్రీ/ ఆనందంతో సంతోషంతో తేలికగా ఎగురుతూ/జన ప్రవాహంలో ఆకాశంలో తేలుతున్న/రంగు రంగుల గాలిపటపు దృశ్యం వెంటబడింది/ ఇప్పుడు నేను స్త్రీని/అందమైన జీవితంతో/నీలినదిలో పడవలో తేలుతున్న చంద్రవంకని/రేపటి వెలుగులోకి తొంగి చూస్తున్న/ఒంటరి నక్షత్రాన్ని”. అయితే ఈ కొత్త రూపాన్ని ప్రపంచం ఒప్పుకుంటుందా సభ్య సమాజం అదరిస్తుందా అసలు బతకనిస్తుందా అన్నది మళ్ళీ పెద్ద సందేహమే. చేతులు చాచి చాచి అలసి పోయి, పదాలు నర్తించి పుళ్లు పడి కన్న తల్లి ఉన్న ఊరు గుర్తొచ్చి మరలా ఒక ఎగిరిన విత్తనం లా తన ఊరిలో వాలింది ఈ ప్రాణి.
కానీ అక్కడా ఘోర నిరాశ నిరాదరణ ఎదురయ్యాయి. నిర్దయగా అందరూ కలిసి మాటలతో చేతలతో హింసించితే “ వెళ్లిపోవాలి ఇక్కడనుండి వెళ్లిపోవాలి/మగవాడిని కానందుకు /విలయతాండవం/ఆడదానిని అయినందుకు/అసహ్యం/రెండు శరీరాలను /మోస్తున్నందుకు ఏవగింపు”. స్త్రీగానే బతకాలని నిశ్చయంతో మళ్ళీ బతుకు జంఝాటనలో తిరుగు ప్రయాణం. “ కొద్దిగా మిగిలిన చిరునామాలన్నీ/కాల ప్రవాహంలో కొట్టుకుపోయి ఉంటాయి/నగరం కొత్తగా లేదు/నా మనసే మండుతున్న కాగడాలా ఉంది/ఇప్పుడు ఈ పోరాటం/ పూర్తిగా నాదే అయినప్పుడు/ప్రతి ఒక్కడు వెలిగించే/వెకిలి కాగడాలోనే ముఖం దాచుకోవాలి/మసికట్టీ నలుపెక్కిన దీపం వత్తికి/మనసు లోపలి ఆశతో/నూనె పోసి వెలిగించినట్లు/ జీవితాన్ని వెలిగిస్తూ ఉండక తప్పదు”.
చివరికి దేహాన్ని అమ్ముకునే వృత్తిలో “ వెర్రి వెన్నెలలో, కటిక చీకటిలో/ వర్షాలలో, ఉక్కపెట్టే రాత్రుళ్ళలో/రోడ్డు మీద గోడ వారగా/రేకు తలుపులు ఆనుకుని/దేహాన్ని అమ్మకానికి పరిచిన/ ప్రతిసారీ/ఒక నొప్పి పేగులు తెంచుకొని/రక్తాన్ని బయటికి తెస్తూనే ఉంది/నాతోపాటు వరుసగా నిల్చున్న/స్త్రీలందరి ముఖాలలో నొప్పి/ఆ శరీరాలకి వెల ఉంది/ప్రేమకు వెలలేదు/ దేహానికి నోటు ఉంది/ఆప్యాయాతకి ఆసరా లేదు/చేతినిండా దాహపు పాత్రలే/ఆ పాత్ర నిండా ఆకలి/ఒకరి కోసం ఒకరు పడే పోటీలో నొప్పి/ఆకలి నొప్పి/అసహ్యాల నొప్పి/వెలివేసిన జీవితాల మీద నొప్పి/దేహాన్ని తన్నుకుని వెళ్ళే/మగ దేహాల సంతృప్తే ఓ పెద్ద నొప్పి!”.
దయనీయమైన శరీర బాధ ఇంత దారుణమైతే ఇక “ ఉద్యోగం కోసం వేట మొదలై నప్పుడు/ప్రతీ దరక్ఖాస్తులోను/అతడు, ఆమె కానీ నువ్వు/సందేహంతో తల ఎత్తే చూపులకు/ నా సమాధానం ‘స్త్రీ’ నేను స్త్రీని/ ఎంత నిబ్బరంగా మాట్లాడినా/ఒక అంగం వెనుక చరిత్ర/వెలివేత హింసలో కూరుకుపోతుంటే/జన్మ కారణం తెలియకపోయినా వికృతమైన చూపులకి/శరీరాన్ని ఒప్పచెప్పడం అలవాటయింది”. ఇది భరించలేని మానసిక మైన బాధ ఈ వివక్ష హీనపరిచే చూపులు తట్టుకుంటూ నిలవడం ఒక అగ్ని పరీక్ష. 12 భాగాలలో ఈ మూడవ మనిషి స్థితిని వర్ణించి చివరి భాగాలలో ఈ సమాజాన్ని, రాజ్యాంగాన్ని తమకు రక్షణ కల్పించే చట్టాలనుచేయాలని కోరుకుంటుంది మూడవ మనిషి. “మళ్ళీ ఒక జాతిని/నిర్మించడం దేనికి?/వివక్షతకి కొత్త దేహాలెందుకు?/ఒక మూడవ పేరు నిర్మించడం దేనికి?/స్త్రీగా ఉండనిస్తే చాలు/మామూలు మనిషిగా-స్త్రీలా /బాత్రూమ్ ల దగ్గర/ఉద్యోగాల దగ్గర/గుర్తిస్తే చాలు/’లా లు కోర్ట్లు, చట్టాలు/వీటి విలువ తెలిసిన మనుషులకి-/వలస బతుకులై సముద్రాలు దాటి/తప్పిపోయి చరిత్రలో కరిగిపోయి/చట్టాలు అంటే ఏమిటో తెలియని/పేదరికపు మనుషులకి ఏం తెలుస్తుంది?/మామూలు మనుషులుగా /గుర్తించాలి/ఆ మూడవ జాతి నిర్మాణం /ఆగిపోవాలి/ఎలాంటి ముద్రలు లేని/స్వాతంత్ర్యం కావాలి”అని ఆక్రోశిస్తుంది మూడవ మనిషి. జీవన పోరాటం లో డస్సిపోయిన ఆత్మ కథ చివరి అంకం లో “ వెనక్కి తిరిగి చూసుకుంటే /జీవితం గూడులో ఏముంది?/ప్రతి బాటన గాయపు సంకేతం తప్పా!/నిరంతరం స్త్రీగా బతకాలనుకున్న కోరిక/’స్త్రీని’ ఎప్పటిలాగే తిప్పి కొట్టిన సమాజం/ఒక శరీరం మీద అనేక అలజడులు” అంటూ వాపోతుంది.
జీవితానికి గమ్యమే లేదా , ఈ జన్మ కి ప్రయోజనమే లేదా అనుకున్నప్పుడు ఇద్దరు అనాధ పిల్లలకు తాను ఆలంబన అయింది అమ్మా అని వారి చేత పిలిపించుకుంది. “ అమ్మా అమ్మా అంటూ/వేల సార్లు పిలుస్తారు/అనుభవాలు గడ్డ గట్టీ ఘనీభవించిన ప్రతీసారీ పిలుస్తారు/ రేపొకసారి మళ్ళీ వీళ్ళని /సమాజం ప్రశ్నిస్తుంది /జవాబు ఇవ్వకుండా/నిలబడి జీవించడానికి/అంతులేని అంతర్యుద్ధం చేయడానికి/వాళ్ళలో శక్తి ఉంది/శక్తి ఉంటుంది కూడా” ఆశావాహ దృక్పధం తో జీవన తాత్వికతతో కవిత ఇలా ముగిస్తుంది కవయిత్రి
“ఆత్మ ఘోషలోంచి/రాలిపడ్డ నెమలీక/పెన్నులా నటించింది/ ఆ నటన లోంచి వడకట్టిన /కాగితం మీద అక్షరాలు నల్ల చీమల్లా/ నల్లని ఆకాశాన్ని/నల్లని మౌనాన్ని/చీకటి డేరానీ తోసేస్తూ /ఉదయపు వెలుగులో మెల్లమెల్లగా /ఒక సైన్యమై నడుస్తున్నాయి/పగటి ఆకాశం మీదకు వస్తున్న సిపాయిల్లా/కాగీతాలన్నీ /చిన్న దారంతో కలిపి కుట్టేస్తుంటే/ఒక పుస్తకం లా/ ఒక చరిత్రలా. ఒక స్త్రీ గుండె కథని./ ఒక ఆత్మ కథని/వినిపించడానికి సిద్ధంగా ఉన్నాయి”.
బాధామాయమైనప్పటికీ నేటి సమాజం లో ప్రత్యక్షమై ఉన్న అంశానికి దీర్ఘ కవితా రూపమిచ్చిన రేణుకా అయోలా గారికీ అభినందనలు. ఇదే ఇత్రివృత్తం తో ప్రఖ్యాత రచయిత సలీం రాసిన కథ “ కొండయ్యమ్మ” , ప్రసిద్ధ కవయిత్రి కమలా దాస్ రాసిన ‘ద డాన్స్ ఆఫ్ ద యునక్స్’ ఇవి కొంత ఈ అంశాన్ని ప్రస్తావించినప్పటికీ ఒక దీర్ఘ కవితగా దీన్ని సమర్ధవంతంగా సాంద్రంగా ఆవిష్కరించిన కీర్తి కవయిత్రి రేణుకా అయోలకు దక్కుతుంది. ఈ పుస్తకాన్ని జె వి పబ్లికేషన్స్ హైదారాబాద్ వారు ప్రచురించారు వేల 50 /- మనసున్న ప్రతి వారూ చదివి స్పందించాల్సిన కావ్యం.
……. 6. ద్విభాషితాలు -ప్రస్థానం 8. అమెరికా ఇల్లాలి ముచ్చట్లు …..
చక్కని కథాంశము.