13_002 మందాకిని – నీలోత్పల
ఉత్తుంగ తరంగాలతో ఎగిసిపడే ఈ జలవాహిని చూస్తూ వుంటే కాలంతో పోటీగా పరుగెత్తాలని ప్రయత్నిస్తుందా అనిపిస్తుంది. పరవళ్ళు తొక్కుతూ పరుగెత్తుకొచ్చే అలలకు కూడా గమ్యం లేదు. నేను ముందంటే నేను ముందు అంటూ వచ్చి ఒడ్డును తాకే అలలు, ఆ అలలు మోసుకొచ్చే అల్చిప్పలు, సముద్రం మీద నుంచి వీచే స్వచ్చమైన గాలి, విస్టారంగా విశ్వమంతా పరుచుకొని ఎక్కడో కనుచూపుకి ఆననంత దూరంగా సముద్రాన్ని తాకుతున్నట్లున్న నీలాకాశం, ఆకాశంలో గుంపులు గుంపులుగా ఎగురుతూ గూళ్లను చేరుకొంటున్న పక్షులు ఇదంతా చూస్తూ వుంటే సృష్టి ఇంత అద్భుతమైనదా ? అని ఆశ్చర్యం కలుగుతుంది. రాత్రనక పగలనక హోరుమని శబ్దం చేస్తూ ఉండే ఈ జలరాశి ఇక్కడ ఎప్పటి నుంచి వుంది ? కొన్ని కోట్ల సంవత్సరాల నించి ఇలాగే వుందా ? కదలకుండా ఇక్కడే వుండమని ఎవరు శాసించి వుంటారు ? ఏది ఏమైనా సముద్రం వంక చూస్తూ వుంటే మనల్ని మనం మనం మర్చిపోతాం. ప్రపంచాన్ని మర్చిపోతాం. బాధలు, భయాలు, ఆశలు, నిరాశలు సమస్తం మాయమయి పోతాయి.