కం. నామంబును రూపంబును
నేమియు లేనట్టినిన్ను నే మని పిలుతున్ ?
ఏమన్నాను పలికెద వట
మామనసుల నిలచి ; యెంతమంచితనంబో !
తే. గీ. ఉర్విపై నాకసము వ్రాలకుండ నిలిపి
ఉదధి ఉప్పొంగి భువి మ్రింగకుండ ఆపి
అభయహస్తము చూపి మమ్మాదుకొనెడి
స్వామి ! నీ కిదె మానమస్కారశతము !
తే. గీ. ఇంతవెలుగనిబల్బు వెల్గింపగలదు !
వెలుగుచైతన్యమును ఆర్పివేయగలదు !
స్వల్పవిద్యుత్తులో నింత శక్తి కలుగ
నీదుసంకల్పమున కాని దేది ? స్వామి !
తే. గీ. నీవు చైతన్యరాశివి – పావనుడవు –
అన్నియును జేసి కర్తృత్వ మంటనీవు !
నగుణుడవు నిర్గుణుడ నైనజాణ వౌర !
స్వామి ! నిను పోల్చుకొనుట నాశక్య మగునె ?
తే. గీ. నీరె ఆవిరిగా మారి నింగి నంటు –
మరల ఆవిరి నీరుగా మారి భువికి
చేరు ; నీదుసంకల్పాన జీవరాశి
పయన మొనరించు క్రిందికి పైకి నిట్లె !
తే. గీ. నీటిలో నిప్పు పుట్టించునేర్పు నీది !
నరకమునె స్వర్గముగ మార్చువెఱవు నీది !
పతితులను పావనుల చేయుప్రతిభ నీది !
ఈవు తలచిన కాని దేదీ ? మహాత్మ !
ఉ. స్వాగత మీయగా హృది కవాటము నీకయి తీసియుంటి ; నీ
వేగతి వచ్చి చేరితివొ యీహృదయమ్మున ముందుగానె ; నా
లో గలని న్నెఱుంగు టెటులో కననైతిని ; నీకు నాకు నీ
దాగుడుమూత లేల ? పరదా తొలగింపవయా దయమయా !
చ. తొలకనినామదిన్ నిలువుదోపిడి యిచ్చెద ; స్వీకరించి ని
స్తులకృప తొల్కుకన్నుగవతో వరదాభయహస్తముద్రతో
అలసిరి కింపుగొల్పుదరహాసముతో కనువిందు చేయు మిం
పొలయగ కాంతు – కాంతు కనులున్నఫలమ్మున లోకమోహనా !
ఉ. ఈయెదలోనివేదన గ్రహించిన ఱాలు కరంగిపోవునే –
నీయెద యేటికిన్ కరగనేరదు ? దీనదయాళు డందురే –
నాయెడ నేర మేమయిన నే నొనరించితినా ? జగత్ప్రభూ !
తే. గీ. కోట్లు వెచ్చించి వినువీథికొసల కెగసి
అందుకొన్నాడు మనుజుడు చందమామ –
నేమి వెచ్చించి నీదరి కెగవలెనొ
తెలిసికొనవచ్చునే పామరులకు స్వామి !
తే. గీ. అదిర ! నీమోహనాకృతి ననుకరించి
ఉన్నతిం గాంచుచున్నది వ్యోమతలము !
పుడమి పులకించిపోవు నీపూజకొఱకు
చెలువపుంబూవుల నొసంగి శ్రీనివాస !
తే. గీ. బడిని చేరక తాను నీగుడిని జేరి
నీసమీపాన నిలిచి నిన్నే స్మరించు
భక్తులయెడందలన్ ప్రతిధ్వనుల నీను
నట్టిజేగంట యేమి పుణ్యమ్ము చేసె !
కం. ఒకడవె ! ఒకడవె ! ఒకడవె !
ఒకడవె లోకముల నెల్ల నున్న దొకడవే !
ఒకనీ వున్నమనస్సున
ఒకటా ? లోకమ్ము లెల్ల నున్నట్లెకదా !
తే. గీ. పుట్టగనె జీవి యేడ్చును – గిట్టినంత
గొల్లుమందురు చుట్టాలు -కుతలమందు
జన్మ దుఃఖము దుఃఖమే చావుకూడ
రెంటికి నతీతు చేయుము శ్రీనివాస !
తే. గీ. అంద మౌనాడుబొమ్మతో ననగి పెనగి
అదియె శాశ్వత మనుకొందు రవనిజనులు !
సంధిబంధాలు పూర్తిగా సడలికూడ
పూర్వసంస్కారముల త్రోసిపుచ్చలేరు !
తే. గీ. ఉభయసంధ్యలయందు నీ కుపచరించు
నమరు లల్లదె ! ఆకాశమంతయెత్తు
కుంకుమము రాశి పోసి నీకుం బదార్చ
న మ్మొనర్పగ చూచుచున్నారు స్వామి !
తే. గీ. ఏను నిన్ను విడిచి యీదూరతీరాల
నటమటించి మిగుల నలసినాను !
దారితప్పుబాటసారి నై నిను చేరు
దారి గనక నిన్నె తలచినాను !
తే. గీ. పరమకల్యాణరూప ! నీదొరతనమ్ము
సాగునంతకు దేహ ముజ్జ్వలత గాంచి
ఈవు ద వ్వైన కుళ్ళిపోయిన ది దేమి ?
కట్టియలపాటి చేయ కీకాయ మవుర !
తే. గీ. ఎందఱెందఱో క్రొత్తస్నేహితుల కలసి
కష్టకాలము వారితో గడపినాను ;
నన్ను నొంటరిగా చేసి కన్ను మూసి
ఏయెఱుంగనియెడకొ వా రేగినారు !
తే. గీ. శ్రీశుశ్రీపాదముల కభిషేక మగుచు
నిర్మలం బయ్యె మందాకినీజలమ్ము !
ప్రభుని కారతి యౌకప్పురమును గలసి
పరిమళించిన దంట పావకునిబ్రతుకు !
ఆ. వె. తల్లి కసరినంత దవుదవ్వులకు పోయి
బుంగమూతి పెట్టుబుజ్జిబాబు
బుజ్జిగించినత పొంగిపోయెడునట్లు
నన్ను నేను మఱతు నిన్ను చేరి !
తే. గీ. నన్ను జూటును – నాలోని నిన్ను జూతు !
నిన్ను జూటును నాలోని నిన్ను జూతు !
నీవునేనులభేదముం దెలియలేక
నన్ను నీలోన చూడగన్ మనసుపడుదు !
కం. నిండితి వటనే యీబ్ర
హ్మాండమ్ముల నెల్ల నీవ యై లోకేశా !
కొండంతదేవుడవు నా
గుండెలలో నెట్టు లిరికికొన్నావు ప్రభూ !
శా. నీపాదాబ్జమరందధాఁ లొలయున్ నేత్రమ్ములం దేళు లె
న్నోపోంగారు నెడంద ఉప్పెనయి ; కన్నుల్ చూపుకోల్పోవునే !
నీపాదమ్ములు నీరజమ్ము లగుచో నీర్నిండునాకన్నులన్
రూపుం దాల్పక నీట చూపు చెడు టెట్లో ఆత్మరూపప్రభూ !
మ. ఒడ లెల్లం గను లై నినుం గనగ నెంతో వేచియుండన్ దడా
దడిగా నాకలలందు కన్పడుచు నంతన్ మాయ మౌ దేమి ? లే
చెడువేళన్ నిదురించి స్వప్నముననే జీవుండు మేల్కాంచునా ?
బడు గౌమాబ్రతు కెల్ల స్వప్న మగుచో బాగుండిపోవుంగదా !
తే. గీ. భక్తు డపుడప్దుమాత్రమే పరము దలప
నాస్తికుడు స్వప్నమునకూడ హరినె తలచు
నాస్తికునికన్న భక్తు డీయవని లేడు !
నాస్తికత్వము ముక్తికి నడ్డదారి !
తే. గీ. చేదుపూల తీయనితేనె చేదుకొనెడు
తెలివి తేనెటీగల కిచ్చుదేవదేవ !
కష్టమయజీవితాన సుఖమ్ము లందు
కొనెడునే ర్పిచ్చి మ మ్మాదుకొనుము స్వామి !
కం. ఒక్కడవే ! ఒక్కడవే !
ఒక్కడవె ! అనాదినుండి ఉన్నది నీవే !
ఒక్కడవే ! ఒక్కడవే !
ఒక్కడవే ! చివరివఱకు నుండెదు నీవే !
తే. గీ. నీలినీలిమబ్బులలోన నీవె కలవు !
మెఱపుమెఱపును నీకంటిమెఱపె స్వామి !
పువ్వుపువ్వును నీనవ్వె పురుషసింహ !
అణువణువునందు నీవే మహానుభావ !
తే. గీ. కావ్యముల నీవె ! సంగీతకళవు నీవె !
వెన్నెలలు నీవె ! చెరగనివెలుగు నీవె !
తెలియ దగువాడవును నీవె ! తెలివి నీవె !
సృష్టిలో శాశ్వతం బైన దెల్ల నీవె !
తే. గీ. మెఱపుతీవలు కనులలో మిలమిలమను
నీలమేఘాకృతివి నీవు – నిన్ను కనిన –
నాకనుల్ వర్షఋతువుల కాకర మయి
నామనస్సు మయూరి యై నాట్యమాడు !
తే. గీ. జీవనాకృతి వై భువిం జేరి ప్రజకు
ఆకలియు దప్పికయు దీర్చి ఆడుకొందు
ధారుణికి నిట్లు జీవనాధార మైన
నీఋణము నెట్లు తీర్చుకోనేర్చు జగము ?
తే. గీ. వసుధ వై జీవరాశులబరువు మోసి
గుండె చీల్చినన్ ప్రజలకు తిండి పెట్టి
కొండలను మోసి కడలినిగూడ మోసి
ఆదుకొనుస్వామి ! జోహారు లయ్య నీకు !
తే. గీ. గాలివై వచ్చి మము కూర్మి కౌగిలించి
పూలపరిమళములు మాకు మోసి తెచ్చి
జాలితో మాకు నూపిరిగాలి వౌదు !
స్వామి ! నీదయ లేక మాబ్రతుకె లేదు !
తే. గీ. చెలువ మొలికెడుచీకటిచెట్టు వీవు !
చిఱునగవువెన్నెలలు – కంట సిరులు కురియు
మెఱపుతీవెలు మిలమిల మెఱయుచుండ
నీ వెచట నున్న అటనె దీపావళి కద !
తే. గీ. నీవు నే నౌట యేమి ? నీలో వసించి
జగము లుండుట యేమి ? యీజగములందు !
నీవు వసియించు టేమి ? సందేహ మయ్యె !
విశ్వ మంతయు నేనె నీవే కదోయి !
తే. గీ. అణువులో నుందు వంట ! బ్రహ్మాండమందు
నిండి యుండెద వట ! యెంతనేర్పు నీది !
అణువయిన నీవె ! బ్రహ్మాండమైన నీవె !
ఈవూ కానిది సృష్టిలో నేది కలదు ?
తే. గీ. పురుషుఁడవొ ? ఆదిశక్తివో ? హరివొ ? హరుఁడ
వౌదొ ? క్రీస్తువొ ? అల్లావొ ? ఆదిదేవ !
ఎవ్వ రెటు పిల్వ నటు గోచరింతు వంట !
మమ్ము దయ జూచునీదు ప్రేమకు జొహారు !
తే. గీ. అత డ ట్లుండ డి ట్లుండ డనుటెకాని
ఉపనిషత్తులు తెలుపలే వున్నతీరు !
ఎట్టు లుందువొ నిన్ను మే మెఱుగగలమె ?
వాక్కునకు నూహ కందనివాడ వంట !
తే. గీ. నీవు దేవుడ వని నమ్మి నిన్ను కొలుచు
భక్తు లున్నంతవఱకె నీప్రాభవమ్ము !
నిన్ను స్మరియించువారు లేకున్ననాడు
ఓరి దేవుడ ! నీ కూరు పేరు లేదు !
తే. గీ. శాశ్వతుడ వైననీసృష్టి నశ్వరమ్ము
ద్వంద్వదూషితమును – అశాశ్వతుడు నరుడు
సలుపు నానందమయసృష్టి శాశ్వతముగ ;
కావుననె మోము చెల్లక కానబడవు !
తే. గీ. నీయశాశ్వతసృష్టిలో నేను గూడ –
నొకడ నయ్యు నశింపక యుండగలను !
శారదానుగ్రహమ్మున శాశ్వతత్వ
మంది కవితలో నివసింతు ననవరతము !
తే. గీ. ఆలి నిచ్చినవాడు మర్యాద చేయ
మామయింటనె కడు రుచి మరగినావు !
పడదు సంద్రపుగాలి – ఆపైన స్వామి !
ఇల్లఱికపల్లు డన్న నీ కేమి గొప్ప ?
తే. గీ. పాముపడగనీడలలోన పవ్వళించు
టెంతటిప్రమాదమో అది యెఱుగ లేవె ?
మృదుల మౌపూవువంటినాహృదయ మిదిగొ !
చేరి యిం దుండు హాయిగా శేషశాయి !
తే. గీ. సార్థక మ్మైనమానవజాతిలోన
కవిగ పుట్టించి నను మహాకవిగ మలచి
తేమి చేసిన నీఋణ మింత తీరు ?
కవిత నందులకే నీకు కాన్క నిత్తు.
తే. గీ. భళిర ! ప్రాణాంతక మ్మైనపామువిషము
ప్రాణుల నొకొక్కవేళ కాపాడుచుండు !
ఓప్రభూ ! యెంతటిదయామయుండ వోయి !
వ్యర్థవస్తువు నీసృష్టియందు లేదు !
తే. గీ. అణువులో నుందు – బ్రహ్మాండమందు కలవు
సూక్ష్మరూపము తక్కువ, స్థూలరూప
మధికమును గాదు – ముఖ్య మౌ నాత్మశక్తి !
ఎంత చిన్నయొ అంతపె ద్దెవ్వడైన !
ఆ. వె. జగతి నిన్నికోట్లజన మెవ్వరికి వారె –
మాటతీరు రూపు మనసు వేఱు !
ఇంతవింతసృష్టి నెట్లు చేసితి ప్రభూ !
శిల్ప మన్న నీదె జీవితేశ !
ఆ. వె. శ్రీ నెడంద నిలిపి ఙ్ఞానస్వరూపుడ
వైననీవు జీవులందు వెలుగ
ప్రాణీకోటి కింతఅఙ్ఞాన మది యేల ?
ప్రజకు పేదఱికపు బాధ లేల ?
తరువాయి వచ్చే సంచికలో…..
*****************************************************************