09_020 చినుకు చిత్రం

రాత్రంతా వాన కురిసింది.

కప్పుకున్న నల్లదుప్పటి తొలగించి…

బయటకు అడుగుపెట్టాను.

తడిసిన దేహాల్ని పొడుచుకొంటూ…

ఆరబెట్టుకుంటున్న….

పక్షుల రెక్కల్ని తడిమాను.

ఆకు నుంచి జారుతున్న..

ఆఖరి చినుకు చుక్కను..

చెక్కిలిపై చేర్చుకొన్నాను.

పొదరింటికప్పు లోంచి …

వెలువడుతున్న నీలి పొగను…

అందంగా అల్లుకున్నాను.

తడి ఆరని పుడమి తనువు పై…

నా ప్రతి బింబాన్ని …

నింపుకొన్నాను.

తొలికిరణం ఎక్కుపెట్టిన…

హరివిల్లు శరాన్ని…

వేల కళ్ళలో గుచ్చాను.

నేను…

రాత్రి చినుకు గీసిన …

ఉదయచిత్రాన్ని !

************************************

‘ శాస్త్రీయ ‘ రచయిత

శాస్త్రానికి, సాహిత్యానికి మధ్య కొంత అంతరం కనబడుతుంది. శాస్త్రకారులు సాహిత్యం జోలికి ఎక్కువగా వెళ్లరు. వెళ్ళినా అందులో తమ శాస్త్ర పరిజ్ఞానాన్ని జోడించరు. తమకు తెల్సిన శాస్త్రాన్ని అక్కడక్కడ అవసరానికి వాడుకున్నా, శాస్త్రాన్నే విషయంగా తీసుకుని రచనలు చెయ్యరు. అందులోను తెలుగులో శాస్త్రీయ అంశాల నేపథ్యంలో రచనలు ఎక్కువగా కనిపించవు. కొంతమంది చేసినా అవి పాఠ్య పుస్తకాల కోవలోనే ఉంటాయిగానీ, సాధారణ పాఠకులకి ఆసక్తి కలిగించవు. అయితే అక్కడక్కడా శాస్త్ర విశేషాలని అందరికీ ఆసక్తి కలిగించేలా మలచి రచనలు చేసేవారు మనకి కనిపిస్తారు. అలాంటివారిలో ప్రథమంగా చెప్పుకోవాల్సిన రచయిత మహీధర నళినీమోహన్ రావు గారు .

 పండితోత్తములకు ప్రసిద్ధి కోనసీమలోని ముంగండ గ్రామం. మొగల్ పాదుషాల ఆస్థానంలో ప్రముఖుడిగా సత్కారాలు పొందిన జగన్నాథ పండితరాయలు పుట్టిన ఊరు ముంగండ అగ్రహారం. వేద పారాయణంతో, సాహితీ వ్యాసంగంతో నిండిన ఆ ఊళ్ళో ఓ పండిత కుటుంబానికి చెందినవారు మహీధర రామమోహన్ రావు గారు. చాందస భావాలు అధికంగా గల సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆయన ఆ చాందస భావాలను, కట్టుబాట్లను కాదని కమ్యూనిస్ట్ , సోషలిస్ట్ భావాల పట్ల ఆకర్షితులయ్యారు. ప్రజాశక్తి, విశాలాంద్ర పత్రికలలో పనిచేసారు. అభ్యుదయ భావాలతో ఎన్నో రచనలు చేసారు. ఆయన కుమారుడే నళినీ మోహన్ రావు గారు.

 భౌతిక శాస్త్రవేత్తగా, అంతరిక్ష శాస్త్రవేత్తగా పనిచేసిన ఆయన శాస్త్రీయ విషయాలతో చాలా పుస్తకాలు రాసారు. మామూలు పాఠకుడిని కూడా అవి ఆసక్తితో చదివిస్తాయి. అవి ఓ కథ చదువుతున్నట్లో, ఓ నవల చదువుతున్నట్లో వుంటాయి తప్ప పాఠం చదువుతున్నట్లు వుండవు.  శాస్త్రీయ పరిజ్ఞాన్ని పెంచుకోవడానికి అవి బాగా ఉపకరించేవి. ఆయన పుస్తకాలలో లాగే ఆయన ఉపన్యాస శైలి కూడా…. ఓ మిత్రుడు మన ముందు తీరిగ్గా కూర్చుని కబుర్లు చెబుతున్నట్లు ఉండేది.

 1974 – 75 ప్రాంతాలలో అని గుర్తు. నేను ఇంటర్ చదువుతున్న రోజులని మాత్రం బాగా గుర్తుంది. సందర్భం గుర్తులేదు గానీ ఓ సారి ఆయనకు మా ఊళ్ళో సన్మానం జరిగింది. ఆ సభలో ఆయన కొన్ని సైన్సు సంగతులను చెప్పిన తీరు నన్నే కాదు అందర్నీ ఆకట్టుకుంది. అప్పటికి సైన్సు విద్యార్థిని కనుకనో, అప్పటికే పత్రికలలో ఆయన వ్యాసాలూ, కొన్ని పుస్తకాలు చదివి వుండడం వల్లనో నాకు మాత్రం బాగానే అర్థమయినట్లు అనిపించింది. సభ ముగిసిన తర్వాత సైన్సు అంటే భయపడే కొందరు మిత్రులతో సహా అందరూ ఆ విశేషాలే ముచ్చటించుకోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పటికే అంతరిక్ష పరిశోధనలు జరుగుతున్నా ఆ విశేషాలు ఇంకా అందరికీ అవగాహనలోకి రాలేదు. ఆయన ఆ విశేషాలను వివరిస్తుంటే అందరూ ఎంతో ఆసక్తితో విన్నారు. అదీ నళినీ మోహన్ రావు గారి ప్రతిభ. పండితులకు కూడా క్లిష్టంగా కనిపించే శాస్త్రీయ విశేషాలను అతి సామాన్యులకు కూడా అర్థమయ్యేలా మలచడంలో దిట్ట నళినీమోహన్ రావు గారు. ఇంతకంటే ఎక్కువగా వివరాలు గుర్తు లేవు.

మహీధర నళినీ మోహన్ రావు గారి పుస్తకాలన్నీ పిల్లలకోసం అన్నట్లుగా వున్నా సైన్సు తో అంతగా పరిచయం లేని వారిని కూడా ఆసక్తితో చదివిస్తాయి…

జూలై 4వ తేదీ ‘ శాస్త్రీయ ‘ రచయిత మహీధర నళినీ మోహన్ రావు గారి జయంతి సందర్భంగా ….

*****************************************************************