13_008 తో. లే. పి. – మే‌రి ఎకనమౌ

 

1963 లో ఇంజనీరు గా ఉద్యోగంలో కొత్తగా చేరిన రోజులు. ఒక ఏడాదిపాటు ప్రాజక్టు నిర్మాణ దశలో దివారాత్రాలు పనిచేసాకా, అదృష్టవశాత్తూ నా ప్రతిభకు గుర్తింపు లభించడంతో, నన్ను ఛీఫ్ ఇంజనీర్ ఆఫీసుకి ట్రాన్స్‌ఫర్ చేసారు. అప్పటికింకా నేను బ్రహ్మచారిని. ఏమాటకామాటే ! ఆఫీసులో ఏ శుభముహూర్తాన అడుగు పెట్టానోగానీ, అప్పటినుండి నా తనువు ప్రశాంతంగా ఉండేవి. ఇక పని భారం కూడా అంతంత మాత్రమే!

రోజూ హిందూ పేపరు కొని చదువుకొనడం, దేశ విదేశాలకు సంబంధించిన కలం స్నేహితుల (pen-friends) ఎడ్రస్‌లను సేకరించి, వారితో ఉత్తరప్రత్యుత్తరాలను జరపడం… వీటిలో ఎంతో ఆనందం లభించేది ! ఏమంటే, అప్పట్లో ఫోనులు,ఇంటర్నెట్ సదుపాయాలు అయితే లేనేలేవు కదా మరి !

ఇదుగో…ఆ వ్యాసంగంలో నాకు తటస్తపడినవారే మేరీ ఎకనమౌ. తొలుత ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియా లో ఉండేది ఈ అమ్మాయి. అప్పుడే కైరో పట్టణపు Picture-postcards ని కూడా  పంపింది. ఆ పిమ్మట గ్రీస్ దేశపు రాజధాని ఏథెన్స్ కి చదువు నిమిత్తమై మకాం మార్చింది. ఆ దేశపు సంస్కృతీ‌ సాంప్రదాయాలలో ఒక ప్రత్యేకత ఉందని చెప్పవచ్చును. ఇందుకు ఒక ఉదాహరణగా మేరీ పంపిన పిక్చర్ పోస్ట్ కార్డులలోని అంశాలను పేర్కొనవచ్చును. ఒకవంక తాను చదువుసంధ్యలలో తలమునకలవుతున్నా, విదేశీయులు, వారి జీవనవిధానాలను గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి, అభిలాష మేరీ కి ఉన్నవన్న విషయాన్ని ఆమె వ్రాసిన ఉత్తరాల ద్వారా గ్రహించాను. ఆమెకు ప్రత్యేకించి చిత్రకళ పట్ల ఎంతో ఆరాధనా భావం ఉంది.

కలం స్నేహం మనసులకు వారధి. ఆలోచనలు‌-అభిరుచులకు ఒకరికొకరు చిరుకానుకలను జతచేసి పంచుకోవడం ఆనాటి ఆ స్నేహం లోని ఒక ప్రత్యేకత. ఆ స్నేహమాధురి అనుభవైకవేద్యం. నిజానికి, అక్షరాలలో ఇమడనిది. భగవద్దత్తమైన ఈ చెలిమి కలిమిని నేను కేవలం మన భా‌రతవాసులతో మాత్రమే కాకుండా, ఇతర దేశాలకు చెందినవారితో సహా ( శ్రీలంక, నేపాల్, ధాయిలాండ్, బ్రిటన్,అమెరికా, ఫ్రాన్స్, జర్మని, నెదర్ లాండ్స్ మొదలయిన దేశస్ధులతో సహా) పంచుకోవడం నాకొక మధురానుభూతి.

ఈనాడు మీ అందరితోనూ సహృదయురాలు మేరీ ఎకనమౌ ఆప్యాయంగా పంపిన తోకలేని పిట్ట ( దీని వయసు తక్కువేమీ కాదు.. నేటికి దాదాపు 56 ఏళ్ళు!) విన్యాసాలను సమిష్టిగా సమర్పించుకుంటున్నాను…

ధన్యవాదాలు~ నమస్కారములు.

 

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page