10_002 కథావీధి – మధురాంతకం రాజారాం రచనలు

 

                               ” దామల్ చెరువు పెద్దాయన ” గా కథాప్రపంచంలో ప్రసిద్ధులై సుస్థిర స్థానం సంపాదించుకున్న మధురాంతకం రాజారాం గారు 1930 వ సంవత్సరంలో అక్టోబర్ నెల 5వ తేదీన చిత్తూరు జిల్లాలోని మొగరాల గ్రామంలో ఆదిలక్ష్మి విజయరంగం పిళ్ళై దంపతులకు జన్మించి 1999 వ సంవత్సరం ఏప్రియల్ నెల 1 వ తేదీన తన 69 వ ఏట సహజ మరణం పొందేవరకూ చిత్తూరు జిల్లాని విడువలేదు. విద్యాభ్యాసం ఉద్యోగం అన్నీ అక్కడే, చిత్తూరు జిల్లాలోని దామలచెరువు గ్రామం స్థిర నివాసం. ఉపాధ్యాయ వృత్తికి అంకితం. కొంత వ్యవసాయ నేపథ్యం. నాలుగువందలకు పైగా కథలూ, 2 నవలలూ, నవలికలూ, కొన్ని నాటకాలూ, సాహితీ వ్యాసాలూ, గేయాలూ, తెలుగు రచనల తమిళ అనువాదాలూ చేశారు. ఈయన రచనలు కన్నడ, హిందీ భాషలలోనికి అనువదించబడినాయి. ఈయన పెద్దకథ ” చిన్న ప్రపంచం – సిరివాడ ” రష్యన్ భాషలోకి అనువదించబడినది.     
వీరి శైలి విలక్షణమైనది. ఒక రచయిత శైలి అతని విద్యాభ్యాసం, కుటుంబ నేపధ్యం, స్నేహాల ప్రభావం, చదివిన అనేక రచయితల శైలీ నేపథ్యం, సమకాలీన జీవన విధానం, పత్రికల, సినిమాల అవసరాలూ మొదలైన వాటి పైన ఆధారపడి ఉండడం సర్వ సాధారణం, వీటన్నిటినీ క్రోడీకరించుకుని, జీర్ణించుకుని, అతను తనదైన బాణీ ని నిర్ణయించుకుని రచనా వ్యాసంగం మొదలుపెడతాడు. ఇది ఆర్ధిక పరంగా, వృత్తి పరంగా అతనికి అవసరం మార్కెట్ లో ప్రవేశించిన కొంతకాలానికి అతను ట్రెండ్ సెట్టర్ గానో, ట్రెండ్ ఫాలోయర్ గానో ముద్ర వేయించుకుంటాడు. దానిని బట్టి అతని మార్కెట్ వేల్యూ, వ్యక్తిగత ఇమేజ్ ఉంటాయి.      
రాజారాం గారి విషయం కొంచెం వేరు. ఈయన జీవన విధానమే ఈయన రచనా శైలి. వృత్తి రీత్యా ఉపాధ్యాయులు ప్రవృత్తి వ్యవసాయ నేపథ్యం, జీవన శైలి రాయలసీమ గ్రామీణం.” సత్కవుల్ హాలికులైన నేమి? ” అని ప్రశ్నించుకునే పోతన తత్వం. జీవన విధానంలో ఆర్ధిక పరమైన అంశాలకు తక్కువ ప్రాధాన్యం. రచయితగా ఏ రకమైన ఇజాలనీ, వ్యక్తిగా ఏరకమైన భేషజాలనీ సమర్ధించని వ్యక్తిత్వం. అన్ని ఇజాలకూ మూలం, వాటి సారం మానవత్వమే అని దృఢంగా విశ్వసించే నైజం. వీటన్నిటి మూలం గా వీరి రచనలలో కథాంశం, రచనా శైలి, భావవ్యక్తీకరణ, భాషాప్రయోగం అన్నీ సామాన్యంగా ఉంటూనే అసమాన్యమైన సందేశాలని అందిస్తాయి. కధాంశాలు కూడా ఎక్కువ భాగం రాయలసీమ గ్రామీణ ప్రాంతానివే. పాత్రలన్నీ సామాన్య ఆబాలగోపాలమే. రచనలలో సామెతలూ, నుడికారాలూ, చమత్కారాలూ, సున్నితంగా వేసే చురకలూ తగు మోతాదు లో ఉంటాయి. రచనా శైలిలో పిల్లలని బెత్తం తో సున్నితంగా ఆదలిస్తూ, మందలిస్తూ, మనసుకి హత్తుకునేలా పాఠం చెప్పే ఉపాధ్యాయుడు కనిపిస్తాడు. సాహితీ సృష్టిని గమనిస్తే ఆరుగాలం అలుపెరుగక మడిలో పడే శ్రమలో ఆనందించే నిత్య కృషీవలుడు మన మనసులో మెదులుతాడు.

వీరి కథలలో ప్రతిపాదనలూ, ఆవిష్కరణలూ, సందేశాలూ మాత్రం చాలా ఉన్నతంగా ఉంటాయి. వీరి వాదం జాతీయవాదానుకూలం. నేపథ్యం గ్రామీణం కథలలో సందేశం కధా పాత్రల ప్రవర్తన నుంచే వస్తుంది. రచయిత గారి అభిభాషణలు ఉండవు. రచయిత అభిప్రాయాలు పాత్రల పైన రుద్దడం ఉండదు. 1951 వ సంవత్సరంలో ఆంధ్రపత్రిక లో ప్రచురించబడిన ‘ పరమానందయ్య శిష్యులు ‘ అనే కథాగేయం వీరి మొదటి రచన కాగా ‘ కుంపట్లో కుసుమం ’ వీరి ప్రచురితమైన మొదటి కథ. 1968 వ సంవత్సరంలో ఉత్తమ కథకుడిగా సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు.

వ్యక్తిగతం గా నిరాడంబరులు. సాహితీ ప్రియులైన అతి కొద్దిమంది  రాజకీయ నాయకులు వీరి రచనలు చదివి ఆసక్తులయి, వీరితో పరిచయం పెంచుకుని వీరికి హైదరాబాదు నగరానికి ట్రాన్స్ఫర్ తెప్పిస్తామనీ, దానివలన వీరు పత్రికా సంపాదకులతో పరిచయాలూ అవీ  పెంచుకోవచ్చుననీ సలహా ఇవ్వగా సున్నితంగా తిరస్కరించి, తన జన్మస్థలమైన చిత్తూరు జిల్లా అంటే తనకి మక్కువ అనీ, తనని ఆ జిల్లాకే పరిమితం చేయవలసింది గా వీరు కోరారు. ఈ విషయం చాలామంది రచయితలు కొన్ని సభలలో ప్రస్తావించారు. కాగా అందరికీ తెలిసిన విషయం ఒకటి ఉంది. అది ప్రపంచ తెలుగు మహాసభ ప్రాంగణం లో ఆలపించబడిన ” మా తెలుగు తల్లికి…. ” గీతాన్ని విని ముగ్దులైన అప్పటి విద్యాశాఖా మంత్రి గారు ఆ గీత రచయిత గురించి వీరిని భోగట్టా చేయగా వీరు గీత రచయితా, తన మానసిక గురువులూ ఐన శంకరంబాడి సుందరాచార్య గారిని వారికి పరిచయం చేయడం ఆ తరువాత పరిణామాలూ అందరికీ తెలిసినవే.

వీరి సాహితీ పరిధి పెద్దది, రచనలు అసంఖ్యాకం. అన్నీ ఎన్నదగినవే సాహితీకారుల మెప్పు పొందినవే. వీరు అమెరికా దేశపు నేపథ్యంలో రాసిన కొన్ని కథలు మాత్రం విమర్శకుల మెప్పు పొందలేకపోయాయి!

1993 వ సంవత్సరంలో వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. రచనా వ్యాసంగం తొలినాళ్ళ మొదలు చివరి వరకూ వీరికి లభించిన పురస్కారాలూ జరిగిన సన్మానాలూ లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి.

వీరి కథలు చాలావరకూ దూరదర్శన్ తెలుగు ఛానెల్ లో లఘు చిత్రాలు గా ప్రదర్శితమై ప్రేక్షకుల మెప్పుపొందాయి. వీరి ‘ ఎడారి కోయిల, సర్కస్ డేరా, అప్పుల నరసయ్య, వగపేటికి చల్ల చిందినన్ ’ మొదలైన కొన్ని కథలను క్లుప్తంగా పరిచయం చేసుకుందాం.

 

“ వగపేటికి చల్ల చిందినన్ ” ( 01-06-1963 భారతి సంచికలో ప్రచురించబడినది )

కథ పేరులో సూచించినట్టు వైరాగ్యం ప్రధాన రసంగా కొనసాగుతుంది. కథలోని నాయిక ఒక వృద్ధ స్త్రీ. ఆమె భర్త గురించిన ప్రస్తావన ఎక్కువ గా రాదు. ఈ కథ పేరు కాశీ మజిలీ కథలలోని ‘ గొల్లభామ ‘ కథలోని నాయిక తన అవస్థని వివరిస్తూ ” పతి చంపితిన్…. ఈ పనికొప్పుకుంటి నృపతీ వగపేటికి చల్ల చిందినన్ ” అని చెప్పిన పద్యం లోనిది.
జీవితం అంతా తమ కోసం అంటూ ఏమీ మిగుల్చుకోక, ఉన్నదంతా కన్నవారి ఉన్నతి కోసం ధారపోసిన తల్లితండ్రులు, పెరిగి పెద్దయిన సంతానం, తమదారి తాము చూసుకుని, తమని కన్నవారిని ఉపేక్షిస్తే ఏమి చేయగలరు ?
కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. విషయం బయట పెడితే ఇంటా, బయటా పల్చన అవుతారు. పరువు తక్కువ. సహించుకుని జీవితం గడుపుకోవాలనుకుంటే సవాలక్ష ప్రశ్నలు. కడుపు నింపుకోవడం కోసం కష్టపడడానికి వయసు, ఆరోగ్యం సహకరించవు. అభిమానం, ఉక్రోషం అన్నీ మనసు మూలలలో తొక్కి పెట్టుకుని, కడుపులోని దుఃఖాన్ని, మునిపంట పెదవి తో నొక్కి పట్టి, నడుం బిగించి, తన కడుపూ, తన మీద ఆధారపడ్డ జీవిత భాగస్వామి కడుపు నింపడం కోసం కార్యరంగం లోకి దిగాలి. ప్రాణం ఉన్నంత కాలం బతకడం తప్పుదు కదా !
అలా దిగిన ఒక స్త్రీ కథ ఇది. కడుపు కట్టుకుని, కళ్ళల్లో వత్తులు వేసుకుని పెంచిన కొడుకు ఉద్యోగం లో చేరగానే పట్నం లోని ఆఫీసులో పై అధికారి అన్ని విషయాలూ గ్రహించుకుని, ఇతన్ని గద్ద లా తన్నుకు పోయి తన కూతుర్ని కట్టపెట్టేస్తాడు. పెళ్లి సందర్భంలో అర చేతిలో స్వర్గం చూపించి, పెళ్లి కాగానే నిజ విశ్వరూపం చూపిస్తాడు. ఫలితంగా కొడుకు తల్లి తండ్రులకు దూరం అవుతాడు. దూరపు ఊళ్ళో ఉద్యోగం చేసుకుంటున్న కొడుకు యొక్క  చిన్ననాటి స్నేహితుడు ఒకానొక సందర్భం లో పుట్టిన ఊరికి వచ్చే మార్గంలో కలుసుకోగా ఈ కొడుకు ఆతిధ్యం ఇస్తాడు. అది స్వీకరించిన పరదేశి తన స్వగ్రామానికి వెళ్లడానికి బస్టాండ్ లో నిలబడగా ఆ ఎండలో చెప్పులు లేని పాదాలతో నెత్తిమీద చల్ల ముంతల తట్ట బరువుని భారంగా మోస్తూ, చెమటలు కారుకుంటూ గస ( ఆయాసానికి రాయలసీమ మాండలీకం ) పోసుకుంటూ వచ్చిన ఒక వృద్ధురాలు ఇతన్ని తన ఊరికి వెళ్లే బస్సు వెళ్లిపోయిందా సామీ అని ఆదుర్దాగా అడిగి వెళ్లలేదని తెలుసుకుని శాంత పడి, నెత్తి మీద తట్టను దింపుకొని కొంగుతో ముఖం తుడుచుకుంటున్నప్పుడు తన స్నేహితుని తల్లి గా గుర్తించిన ఆ పరదేశి తాను ఫలానా అని తెలియజేసుకుని ఇద్దరమూ ఒకే బస్సు లో వెళ్లాలి అని చెప్పి ఆమెకు ఒక చల్లని సోడా ఇప్పించి, స్నేహితుడి గురించి అడుగగా కొడుకునీ, కోడలినీ చెడ్డ చెయ్యకుండా తాను వెలితి పడకుండా ఆ తల్లి చెప్పిన విషయమే ఈ కథాంశం. పరదేశి తాను కొడుకు ఆతిధ్యాన్ని స్వీకరించినట్టు చెప్పడు! సంగతి సవ్యమైన మార్గంలో పడడానికి తాను ఏమైనా చేయగలడా? అని పరదేశి ఆలోచనలో పడడం తో కథ ముగుస్తుంది.

 

తరువాయి వచ్చే సంచికలో…..

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦