10_003 ఇది వరమో ! శాపమో !!

 

 

వసుసేనుడనే రాకుమారుడు అంచల అనే నిషదదేశ రాకుమార్తె ప్రేమకథ ఇది. అంచల నిషదరాజైన హిరణ్యధన్వుని కుమార్తె, మహాధన్వుని అనుంగు చెల్లెలు. మహాధన్వుడు కురుపాండవుల చేతిలో భంగపడిన తరువాత తన బొటనవ్రేలిని పోగొట్టుకొని తండ్రి వద్దకు రాగా, సహవాసం అనే బలహీనతకు, బానిసత్వానికి లోనవటం వల్లనే ఓడిపోవటం జరిగిందని, ఇక మీదట సహవాస బానిసత్వాలు తన పిల్లలిద్దరినీ తాకకుండా ఉండేట్లు వరం ఇచ్చాడు. అయితే ఈ వరం చాలా విచిత్రమైనది. ఈ వరం కారణంగా అతనిని ఏ బాణమూ తాకలేదు. అతని శరీరాన్ని సమీపించగానే ఆ బాణాలు దీపాన్ని సమీపించిన శలభాల్లా మాడి మసైపోయేవిట ! బానిసత్వస్పర్శ తగిలిన శరసంధానం కూడా అతనికి లభించిన వరానికి లోబడి ఉండటంతో ఈ లోకం లో బానిసలు కానివారెవరు ? అనే ప్రశ్న ఇతనిని నిరంతరం వేధిస్తూ ఉండేది. అయితె ఇక్కడే ఒక కష్టం అతనిని వేధించసాగింది. బాణం మాట సరే మానవస్పర్శ కూడా అతనిపట్ల అపురూపం అయిపోయింది. అప్పటి వరకూ స్నేహితులంటూ వెంట తిరిగిన వారు సైతం అతనిని స్పృశించబోయి భంగపడ్డారు. వాళ్ళు మహాధన్వుని తాకీతాకగానే అతని శరీరం ఎర్రటి ఉక్కుముద్దగా మారి కణకణ మండటం వారు ప్రత్యక్షంగా చూడటంతో వారు అతనికి దూరం కాసాగేరు. పాపం తండ్రి వరంగా భావించి ప్రసాదించినదే అతని పట్ల శాపంగా పరిణమించిందన్నమాట !

యుద్ధలౌల్యానికి ఎన్నటికీ లొంగకూడదు. అది ఎప్పుడూ చాటుమాటు కవ్వింపులతో కన్నుగీటి పిలుస్తూనే ఉంటుంది అని అనుభవపూర్వకంగా తెలిసికొన్నాడు. విలువిద్య జీవించటానికే కాని మరణించటానికి కాదనే తన తండ్రి మాటను ఏనాడూ కాదనలేదు. ఆయన వేసిన మార్గాన్నే అనుసరించాడు మహాధన్వుడు. వసుసేనుడు మహాధన్వుని స్నేహితుడు. అతని చాపసామర్థ్యమే వసుసేనుని అతనికి స్నేహితుని చేసింది. తన అనుంగు చెల్లెలు అంచలను వసుసేనునికిచ్చి పెళ్ళి చేయటం వరకూ వారి స్నేహం సాగింది. వారిద్దరిదీ చెక్కుచెదరని స్నేహమే అయినప్పటికీ మహాధన్వుడు వసుసేనుని యుద్ధకాంక్షను ఏనాడూ కాదనలేదు. వసుసేనుడు రారాజుతో చెలిమి చేసి యుద్ధంలో అతని ప్రక్క నిలిచి, ప్రాణాపాయం చుట్టుముట్టినప్పుడు కూడా మహాధన్వుడు నిస్సంగుడై, నిర్మోహుడై, నిర్వికారుడై ఉండిపోయాడే కాని స్నేహితుని మార్గం పట్టలేదు.  స్నేహితుని సమర్థించనూ లేదు… వ్యతిరేకించనూ లేదు. అతని చుట్టుప్రక్కలకు కూడా వెళ్ళలేదు.

అంచలా వసుసేనులు రతీమన్మథులతో సమానులు. ఇద్దరూ ఒకరికోసం ఒకరు జన్మించారు. అంచలకు తగ్గ సర్వస్వతంత్ర వీరాధివీరుడు దొరికినందుకు మహాధన్వుడు చాలా సంతోషించాడు. వీరి ప్రేమకు ప్రతిఫలంగా అంచల తొలి ప్రసవానే ఐదుగురు కుమారులను కన్నది. తరువాత వసుసేనుడు తన ధనుర్విద్యా ప్రాగల్భ్యంతో రారాజు ప్రాపకంలో అంగరాజ్యానికి రాజయ్యాడు. ఆనాటితో అంచలా వసుసేనుల వలపు కథ ముగిసిపోయింది. అంచలను అందుకోబోయిన వసుసేనుని శరీరం ఎర్రటి కొలిమిని సమీపించినట్లయింది. ఎర్రటి కొలిమిలోని ఇనపముద్ద వలె కణకణమని మండసాగింది అంచల శరీరం. విరహానలంపుజ్వాలతో ఇటు అంచల, అటు వసుసేనుడు ఏకశయ్యాగతులయి కూడా ఒంటరులయ్యారు. వసుసేనుడు ఎవరికో రహస్యంగా బానిసయ్యాడని అంచలకు వెల్లడయింది.

కురుక్షేత్ర సంగ్రామం మొదలయింది. వసుసేనుడు అంగరాజ్యాధిపతిగా దుర్యోధనుని పక్షాన యుద్ధంలో పాలుపంచుకోవలసిన సమయం ఆసన్నమయింది. యుద్ధం చాలా భీకరంగా జరుగుతూంది. ఒకనాడు శ్రీకృష్ణుడు అంచలను చూడటానికి వచ్చాడు. ఆమె భర్త వాగ్దత్తబానిసత్వంలో మునిగి ఉన్నాడని, అతనిని ఆ బానిసత్వం నుండి విడుదల చేస్తే ఆమె వాడవుతాడని, అపుడు రాజ్యాధికారమంతా వసుసేనునిదేనని, సామంతునిగా ఉండనేల ? సర్వం సహా భూమండలానికి చక్రవర్తి కావచ్చని, తొలినాటి వలె ఇద్దరూ మళ్ళీ మన్మథసామ్రాజ్యాన్నేలవచ్చని రహస్యం పలికేడు. అంచల మారుమాట్లాడలేక కన్నీరు విడిచింది. శ్రీకృష్ణుడు వసుసేనుని కలిసి… ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వాగ్దత్వబానిసత్వం నుండి నిన్ను విముక్తుని చేస్తాను, అంచల మళ్ళీ నీదవుతుంది సుమా అంటూ గుసగుసలాడేడు.

శ్రీకృష్ణుడు నాడు చెప్పేదాకా అంచల పొందిన వరం గురించి వసుసేనునికి తెలియదు. వసుసేనుడు నిలువునా దిగ్భ్రాంతుడయ్యాడు. అసంకల్పితంగా అతని కంటి వెంట కన్నీరు కారుతూనే ఉంది. అంచల తన దగ్గిర దాచిన రహస్యం గురించి తెలిసి వసుసేనుడు నివ్వెరపోయాడు, నిలువునా నీరయ్యాడు. రారాజుకు తాను వాగ్ధత్వబానిసననే రహస్యం అంచలకు తెలిసి కూడా ఆమె తనపట్ల చూపిన ప్రేమానురాగాలకి, గౌరవప్రపత్తులకి కదిలిపోయాడు. అతని హృదయం గర్వంతోనూ, ఆనందంతోనూ తొణికింది. తన విద్యను ఒకరి ఎదుట ప్రదర్శించి మెప్పు పొందాలనే తన అల్పబుద్ధి వల్ల తానేం కోల్పోయాడో అర్థం అయ్యాక కదిలిపోయాడు. ఇప్పుడు రహస్యం బహిర్గతమైనందువల్ల ప్రయోజనమేముంది ? యుద్ధంలో చాలా మంది వీరస్వర్గమలంకరించారు. తాను సేనాధిపతిగా మృత్యుముఖం ముందు నిలబడి పోరాడవలసిన సమయం ఆసన్నమయింది. ఈ చివరి క్షణాల్లో వసుసేనునికి రారాజు యుద్ధకాంక్ష, కీర్తికండూతి వెగటు పుట్టించాయి. తన ప్రేయసి అంచలతో తన పూర్వ జీవితంలోకి పారిపోగలిగితే ఎంత బాగుంటుందో అనుకొన్నాడు. కాని తన చేతిలో ఏదీ లేదన్న కఠోరసత్యం కళ్ళెదుట కరాళ నృత్యం చేస్తుంటే నిరుత్తరుడై ఉండిపోయాడు.

“ శ్రీకృష్ణా ! మృత్యుముఖాన ఉన్న నన్ను ఎందుకు ప్రలోభపెడుతున్నావో తెలిసికోవచ్చునా ? నాకూ అంచలకూ తప్ప తెలియటానికి ఆవకాశం లేని ఈ రహస్యాన్ని నువ్వు తెలిసికోగలిగేవు. అగ్నిలా నన్ను కాలుస్తున్న ఈ సత్యాన్ని నువ్వు తెలిసికొన్నావు. అంగదేశానికి రాజైన నాటి నుండీ నేటి దాకా ప్రతి రాత్రి విషాదమే ! ఇది బానిసత్వమని నాకు తెలియదు. నాకు జరిగిన అవమానం తన అవమానంగా భావించాడు రారాజు. కులహీనుడిగా అవమాన భారంతో మ్రగ్గిపోతున్న నన్ను కులోన్నతుని చేసేడు. స్నేహహస్తం చాచాడు. ఆ స్నేహహస్తాన్నే కదా నేను అందుకొన్నది ? ఇది బానిసత్వమెలా అవుతుంది ? ” అని ప్రశ్నించాడు వసుసేనుడు.

శ్రీకృష్ణుడు ఒక చిన్న మందహాసం చేసేడు. “ రారాజు నీకు హితుడే కాని స్నేహితుడు కాడు. ఆ సమయంలో నీకు జరిగిన అవమానం వైదొలగి ఉంటే అది ఇప్పుడు నీకు ఙ్ఞాపకం ఉండి ఉండేది కాదు. నువ్వు కులోన్నతుడవై ఉంటే నీ కులహీనత ఇప్పుడు నీకు ఙ్ఞాపకం ఉండేది కాదు. ఉన్నవేవీ పోలేదు. పైపెచ్చు ఈ బానిసత్వం నీకు నువ్వే చుట్టబెట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు నీ బానిసత్వం వదిలి అంచలను చేరుకోవటానికి రెండే మార్గాలున్నాయి. ఒకటి రారాజును చంపి నువ్వే చక్రవర్తివి కావటం. అప్పుడు నువ్వు సర్వస్వతంత్రుడివవుతావు. లేదా నడియుద్ధంలో నిరాయుధంగా నిలబడి అధర్మపద్ధతిలో సంధింపబడ్డ బాణం దెబ్బకు గురి కావటం. ఈ రెండవపద్ధతిలో నువ్వు వాగ్దత్వబానిసత్వం నుండి విముక్తుడివై సర్వస్వతంత్రుడవు అవటమే కాక అంచలను కూడా అందుకోగలవు. కాని అదే నీ అవసానదశ అవుతుంది. అంచల ఒడి చేరి ఆత్మకింపుగా కన్నుమూయటానికి మాత్రమే నీ ఆయుస్సు మిగిలి ఉంటుంది. ఈ రెండు పద్ధతుల్లో యేది కావాలో కోరుకో ! ” అన్నాడు శ్రీకృష్ణుడు. వాగ్దత్వబానిసత్వానికి సంపూర్ణంగా బానిసైన వసుసేనుడు “ కృష్ణా ! నేను నడియుద్ధంలో నిరాయుఢిగా ఉండగా అధర్మంగా పడగొట్టటానికి సాయం చెయ్యి ” అన్నాడు. .

బానిసలు అధికారాన్నీ వదులుకోలేరు. ప్రియురాలినీ పొందలేరు, ప్రాణాలనీ నిలుపుకోలేరు. అధికారం, ప్రియురాలు, ప్రాణాలు మూడూ తృణప్రాయంగా తలచిన వసుసేనుని చూసి వీడు సంపూర్ణబానిస. పరమాత్మని కరుణాకటాక్షాలు పొందే స్వేచ్ఛ కూడా లేని కరుడుగట్టీన బానిస. ఇంద్రుడు కోరాడని ఆలోచించకుండా కవచకుండలాలు వొలిచి ఇచ్చేసిన ఆత్మాభిమానం లేని బానిస. ఇక అవసానదశలో యుద్ధరంగంలో వసుసేనుని తన ఒడిలోకి చేర్చుకోగలగటమే అంచలకు మిగిలింది. వారి ప్రేమ ఈ విధంగా విషాదాంతం కావలసిందే అని అనుకొన్నాడు శ్రీకృష్ణుడు.

శ్రీకృష్ణుడు చెప్పినట్లే జరిగింది. వసుసేనుడు అధర్మయుద్ధంలో పడగొట్టబడ్డాడు. మరణం ఆసన్నమయి అవసానదశలో కురుక్షేత్రాన యుద్ధక్షేత్రంలో అంచల చల్లని ఒడిలో వసుసేనుడు సేదతీరాడు. ఇంతకాలానికి ప్రేయసి ఒడి ఎర్రని కొలిమిలా మండిపోక చక్కని నీడనివ్వటంతో ఆఖరి క్షణాలు ప్రశాంతంగా గడీపేడు. అప్పుడన్నాడు వసుసేనుడు “ నేను బానిసను కాను ” అని. మరుక్షణం కణకణలాడవలసిన అంచలా వసుసేనుల శరీరాలు శాశ్వతంగా మంచుముక్కల్లా మారిపోయాయి. పరలోకానికి పయనమయిపోతూ తమ దురదృష్ట గాథ ఎవరికీ తెలియకుండా ఉండటానికి తన పేరు ప్రక్కన తన భర్త ప్రసిద్ధనామం చేర్చి పలుకరాదని శ్రీకృష్ణుని వద్ద మాట తీసికొంది అంచల. కర్ణపత్ని అంచల అన్న విషయం చరిత్రపుటల్లో మాయమయిపోయింది. వారి ప్రేమ మాత్రం అజరామరం.