09_020 కథావీధి – కొ. కు. దిబ్బకథలు 2

        మిగిలిన దిబ్బ కథలు కూడా గడచిన, వర్తమాన పాలనా వ్యవస్థల మీద  వ్యంగ్యాస్త్రాలు సంధిస్తాయి. కొడవటిగంటి వారి రచనా శైలి సామాన్యం గానే ఉంటూ విషయాలని సూటిగా ప్రస్తావిస్తూ చదివే వారిని ఆలోచింప చేస్తుంది. రచయిత ప్రత్యక్షంగా చదువరులకు కథ చెపుతున్నారు అనే విధం గా ఉంటుంది. పాత్రలు తమలో తాము మాట్లాడుకునే, సహపాత్రలతో మాట్లాడే విషయాలు అన్నీ రచయితే పాఠకులకు చేరవేస్తాడు. వర్ణనలూ, భావుకత్వం మరీ తక్కువ. దిబ్బ చరిత్రను గురించి రాసిన కథ లలో రచయిత ఈ దేశం లో అనాది నుంచీ వ్యవహారికం లో ఉన్న కాలమాన పద్ధతి అనగా ప్రభవ మొదలుగా అక్షయ వరకూ ఉన్న 60 సంవత్సరాలని ఒక యుగం గా లెక్కించే పద్ధతి ని ఆంగ్ల గణకం తో పోల్చి కొంత వెటకారం చేశారు. ఈ కథల ద్వారా రచయిత ప్రతిపాదించదలచిన విషయం వివరంగానే పాఠకులకు హత్తుకుంటుంది. సమాజంలో ని లోటు పాట్లకూ అవకతవకలకూ కేవలం పాలిత వర్గాలనే బాధ్యులని చేయకుండా పాలించబడే వారికి ఉన్న భాద్యతలనూ విధులనూ కూడా ప్రస్తావించి, పాలితులను బట్టి పాలకులు ఉంటారు అనే విషయాన్ని తెలియజేస్తుంది.
వీరి మరొక కథల సంపుటి హపూర్వ హపరాధ పరిశోధక కథలు. ఇవి ఒక కాలం లో రాజ్యం ఏలిన డిటెక్టివ్ నవలా సాహిత్యాన్ని వ్యంగంగా అనుకరిస్తూ రాసిన కథలు. నాయకుడు కే యాస్ కి ఉన్న ఏకైక జీవిత ఆశయం డిటెక్టివ్ కావాలని. ఆశయ సాధనలో భాగంగా చాలా డిటెక్టివ్ నవలలు చదివి, తల్లి సలహాలను పక్కనపెట్టి ఇంట్లో ఉన్న డబ్బు తస్కరించి మదరాసు బయలుదేరతాడు. రైల్లో తగిలిన సినిమాల్లో ఎగస్ట్రా వేషాలు వేసి పొట్ట పోసుకునే భద్రం ఇతనికి అసిస్టెంట్ గా మారి కథ నడిపిస్తాడు. వీరికి గవరయ్య మామ అనే పూర్వాశ్రమపు జేబుదొంగ మాట సాయం చేస్తూ ఉంటాడు. తన వృత్తి గురించి గవరయ్య మామ ఎన్ని క్లూ లు ఇచ్చినా డిటెక్టివ్ కే యాస్ కనిపెట్టలేకపోతాడు. వీరి పరిశోధనల పరిధి చాలా పెద్దది. అది   హత్యాశ్చర్యం లేక హంతకుడి క్లూ తో మొదలై పారిపోయిన శవం, దీపం తెచ్చిన మిస్టరీ, గవరయ్య మామ ఘోర ప్రతిగ్న, స్పుత్నిక్కుల చేజింగ్, ఐక్కే రాజ్జె సమితి సెక్రెట్రీ సేతులు నలుపుకుంటూ కే యాస్ కోసం ఎదురు చూడడం గొడవ ని పరామర్శిస్తూ సాగుతుంది.

దిబ్బ కథల రచనా కాలం 1947 నుంచి 1963 వరకూ సాగింది. హపూర్వ హపరాధ పరిశోధక కథల రచన 1950 వ దశకానికి కొంచెం ముందూ వెనుకా ఉన్న కాలం. దిబ్బ కథలు అన్నీ ఆనాటి పత్రికలలో ప్రచురించబడగా, హపూర్వ హపరాధ పరిశోధక కథలు కొన్ని మాత్రం పత్రికలలో ప్రచురితం, కొన్ని కొడవటిగంటి వారు స్వయం గా సంకలనం చేసుకున్నారు. వీరి సాహిత్యాన్ని విశాలాంధ్ర వారు సంకలనం చేసి ప్రచురించారు.
వీరి మరో కథ ‘ పెళ్లి చెయ్యకుండా చూడు ‘ ప్రచురణ 1967 జ్యోతి దీపావళి సంచిక… కథ లో విషయం, శైలి లతో పాటు పాత్రలు అన్నీ సగటు మనుషులవే. ఈ కథలో రచయిత పరోక్షంగా కర్మ సిద్ధాంతాన్ని సమర్థించి అంగీకరిస్తాడు. ఇది ఆయన వ్యక్తిగత నైజానికి విరుద్ధం. ఈ కథని రచయిత పాఠకులకి స్వయంగా చెప్పినట్టు ఉంటుంది. ఈ కథని మనకి చెప్పే ఆయన మదరాసు లో ఒక  ప్రభుత్వ శాఖ లో ఉన్నతోద్యోగి. లంచం పట్టడానికి ఆస్కారం, పట్టగల వ్యక్తిగత నైపుణ్యం ఉన్నవాడు. ఇతని అర్ధాంగి విద్యాగంధం లేని మనిషి. భర్త అంటే ప్రేమ ఉంది కానీ గౌరవం తక్కువ. భర్తకు ఏదో ఉద్యోగం చేసి నాలుగు రాళ్లు వెనకేయడమే తప్ప వ్యవహార జ్ఞానం లేదు అని ఆవిడ అభిప్రాయం. స్వతహా లౌక్యురాలు కాదు కనక భర్త వెలిబుచ్చిన అభిప్రాయాలను వ్యతిరేకించడమే సక్రమం అని అనుకుని ఆచరిస్తూ ఉంటుంది. వీరి ఏకైక కుమార్తె కాంతం FA చదువుతూ ఉంటుంది. తెలివైన మనిషే కానీ బద్ధకం పాలు ఎక్కువ. తండ్రి వెనకేసింది ఉండగా అనవసరంగా మనం వళ్ళు వంచడం ఎందుకు. చెప్పిన మాట వినే వాడిని కట్టుకుని కాలక్షేపం చేస్తే సరిపోతుంది అని ఆ అమ్మాయి నిశ్చితాభిప్రాయం. కొంచెం కమ్యూనిస్టు వాసనలు ఉన్నాయి. మొత్తానికి గుంభన గా ఉంటుంది బయటపడదు. ఇదీ ఈ కుటుంబం నేపథ్యం. ఇంటి యజమాని సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే వేళకు వీరి ఇంట్లో కనకయ్య అనే అతను ఇతని భార్య తో కబుర్లు చెపుతూ కూర్చుని ఇతను రాగానే కలసి కాఫీ తాగి కాసేపు కూర్చుని దీపాలు పెట్టే వేళకు నింపాదిగా ఇంటికి వెడుతూ ఉంటాడు. ఇది ప్రతి రోజూ క్రమం తప్పకుండా జరిగే కార్యక్రమం.
ఈ కనకయ్య ఉద్యోగం ఇంటాయన ఆఫీసులోనే. ఇంటాయన కింద పని చేసే ఉద్యోగి. ఇంటాయన బల్ల కింద సంపాదన వివరాలు క్షుణ్ణంగా తెలిసిన వాడు. వయసులో పెద్ద. ఇంటాయన కన్నా లౌక్యుడు. సాటి కులస్థుడు. ఇంటాయన అంత కాకపోయినా తన పరిధికి తగిన పై సంపాదన కలవాడు. ఇంటాయన భార్య చేత అన్నయ్య గారూ అని పిలిపించుకునే అంత చనువు ఉన్నవాడు. కనకయ్యగారికి ఒక్కగానొక్క కొడుకు పట్టాభి BA పాసయ్యే ప్రయత్నాలలో ఉంటాడు.
రోజూ తమ ఇంటికి వచ్చి తేరగా కాఫీ తాగి, ఇంటి విషయాలు కూపీ లాగి, తాము అడక్కపోయినా సలహాలూ, అభిప్రాయాలూ చెప్పడానికి కనకయ్య ఉన్న కారణాలు, అవసరాలు ఏమిటో అని భార్యాభర్తలు చర్చించుకున్నా ఏకాభిప్రాయం కుదరదు. భర్త చెప్పిన అభిప్రాయాలని భార్య ఒక్క ముక్కతో కొట్టి పడేసి, కనకయ్య భార్యకు సాయంత్రం  కాఫీ తాగే అలవాటు ఉండి ఉండకపోవచ్చు అనీ, తనొక్కడికీ కాఫీ కాయించుకు తాగడం కనకయ్య కి ఇష్టం లేకపోవచ్చు అనీ కనకయ్య ఆర్ధిక పరిస్థితి రెండో పూట కాఫీకి అనుమతించకపోవచ్చనీ, ఇలాంటి అతకని అభిప్రాయాలు చెప్పి భర్త నోరు మూయించి, ఐనా తమకున్న స్థోమతకి ఒక మనిషికి కాఫీ ఇవ్వడం వల్ల ఏమీ ఇబ్బంది లేదనీ, మంచీ చెడ్డా విచారించే కనకయ్య కు ఒక గ్లాసు కాఫీ పోస్తే భర్తకు అభ్యంతరం చెప్పే అవసరం లేదు అనీ తీర్మానించి చర్చను శాశ్వతంగా ముగిస్తుంది.
కనకయ్య కు తన బల్ల కింద వ్యవహారాల గురించి తెలిసినా, కేవలం పలకరింపులు కాఫీల తోనే సరిపెడుతున్నాడు కనక మంచివాడే ననీ, ఇంకో గండ్ర మనిషి అయి ఉంటే హెచ్చరించో, బెదిరించో డబ్బులు లాగేవాడనీ, ఇతను రోజూ కబుర్లు చెప్పి కాఫీ తాగిపోతే తనకు వచ్చిన నష్టం ఏమీ లేదనీ, అతనికి ఇచ్చే కాఫీ లో భార్య ఎలాగూ కొంచెం నీళ్ళు కలిపే ఇస్తుందనీ ఇంటాయన సమాధాన పడతాడు. అయినా మనసులో ఒక మూల ఏదో సంశయం ఉంటుంది. కూతురు కాంతానికి కనకయ్య అంటే అస్సలు పడదు. ఎదురుపడ్డా పలకరించదు. ఇలా కొంతకాలం సాగాక ఇంటాయనకి తన మనసు మూల సందేహం సరి ఐనదే అని ఋజువు దొరుకుతుంది.

ఒకరోజు యధాప్రకారం గా కనకయ్య కాఫీ తాగుతూ ఉండగా కాంతం కాలేజీ నుంచి వచ్చి అతన్ని పలకరించకుండా పైకి వెళ్ళిపోయింది. మేడ మీద  కూతురికి కాఫీ అందించిన తల్లి కిందకి కాంతం F A పాసయ్యింది అని శుభవార్త మోసుకొస్తుంది. కనకయ్య ఖంగు తిని క్షణంలో తేరుకుని ” అమ్మాయిని ఏమి చేద్దామనుకుంటున్నావయ్యా? ” అని భోగట్టా చేయగా ఇంటాయన యధాలాపం గా ” BA లో చేర్పిద్దాం అనుకుంటున్నానండీ ” అని సమాధానం ఇవ్వగా “BA ఎందుకయ్యా తరవాత MA, పెళ్ళి కొడుకుని తీసుకు రావాలి “అని కనకయ్య అన్నప్పుడు యజమానికి కనకయ్య ఎత్తు అర్ధం అవుతుంది. ఇదంతా వింటున్న యజమాని భార్య అడ్డం పడి “అలా చెప్పండి అన్నయ్య గారూ ఈయనకి ఏదో ఆ ఉద్యోగం చేసి నాలుగు రాళ్లు సంపాదించడం తప్ప మరేమీ చేతకాదు ఐనా ఆడపిల్లలకి చదువులేమిటి? చదివించింది చాలు ఇంక పెళ్ళి ప్రయత్నాలు చేయమని చెప్పండి ” అంటూ కనకయ్య కు వత్తాసు పలుకుతుంది.
పనిలో పనిగా పట్టాభి గురించి ఆరాలు తీసి అతనిని మెచ్చుకుని కనకయ్య ఆశలకు నీళ్లు పోస్తుంది. కనకయ్య తన  కొడుకు పట్టాభి ని కాంతానికి కట్టబెట్టి ఆస్తి కాజేసే ఉద్దేశ్యం లో ఉన్నాడని తేటతెల్లమైంది. పట్టాభి మీద కాంతం తండ్రి కి మంచి అభిప్రాయం లేదు. పట్టాభి కాంతానికి తగిన వరుడని కాంతం తల్లి చేత ఒప్పించగల సమర్ధుడు కనకయ్య. తాను వద్దంటే భార్య అదే పని చేస్తుంది. రోజూ ఇంటికి వచ్చి తేరగా కాఫీ తాగి పోయే కనకయ్య తన సంసారం చుట్టూ అల్లిన ఉచ్చు లోనించి తన భార్యా కూతుళ్ళని తీసుకుని జాగ్రత్తగా బయటకి రావాలి. కనకయ్య తో ప్రత్యక్ష యుద్ధం నష్ట దాయకం. ఆఫీసు లో ఉద్యోగానికి ప్రమాదం. ఇంట్లో పొరపొచ్చాలు. అందుచేత కూతురికి నచ్చ చెప్పి BA లో చేర్పిస్తాడు. కనకయ్యకు నిరాశ మిగులుతుంది. కొంత కాలానికి తేరుకుని ఇంకో ఎత్తు వేస్తాడు. దాన్ని యజమాని తిప్పికొడతాడు. యజమాని భార్య విషయం గ్రహించకుండా కనకయ్య కు సహకరిస్తూ ఉంటుంది. ఇలాగ బంతి అటూ ఇటూ తిరుగుతూ గెలుపు ఓటములని అటూ ఇటూ తిప్పుతూ కొంతకాలం గడుస్తుంది.
ఒకరోజు పట్టాభి కాంతం తండ్రిని కలుసుకుని తనకి కాంతం అంటే ఇష్టం అనీ, ఆమె తో తన పెళ్ళికి అంగీకరించమనీ కోరగా కాంతం తండ్రి తమ ఆర్ధిక పరిస్థితిని ప్రస్తావిస్తాడు. పట్టాభి ఆ డబ్బు ఎలా వచ్చిందో తనకు తెలుసుననీ, అలాంటి డబ్బు తన తండ్రి దగ్గర కూడా ఉందని, అలాంటి సంపాదనపై తనకు ఏవగింపు అనీ, దాని ప్రసక్తి వద్దనీ చెప్పి కాంతం తండ్రి తిరస్కారానికి గురి అవుతాడు. తరవాత రెండు రోజులకి కాంతం ఇంటికి ఒక శుభలేఖ పోస్ట్ లో వస్తుంది. అది పట్టాభీ, కాంతం కలసి రాసినది. తమ పెళ్ళి రెండు రోజుల తరువాత టౌన్ హాల్ లో స్నేహితుల సమక్షంలో జరగబోతుంది అనీ పెళ్ళి కీ, ఆ తరవాత తేనీటి విందుకీ తప్పనిసరిగా హాజరు కావాలనీ, కానుకలు స్వీకరించబడవనీ దాని సారాంశం.
విచిత్రం గా ఈ పెళ్లిని వధూవరుల తల్లితండ్రులు తిరస్కరిస్తారు. ఎవరి కారణాలు వారికి ఉంటాయి. కొత్త దంపతులిద్దరికీ కమ్యూనిస్టు లక్షణాలు సోకడం కాంతం తల్లిదండ్రులూ… కట్నం, అత్తగారి, ఆడపడుచు లాంఛనాలు దక్కక పోవడం పట్టాభి తల్లిదండ్రులూ  జీర్ణించు కోలేక పోతారు.
ఏదీ మన చేతిలో ఉండదనీ, కానున్నది కాక మానదనీ ఆ రకంగా కథలో ప్రతిపాదించబడుతుంది.

**********************************************************************************

 

కళాభినేత్రి

చిన్నప్పట్నుంచీ సావిత్రిని అభిమానించిన వాణిశ్రీ… మరుపురాని కథ తమిళంలో సావిత్రి చేసిన పాత్రను తెలుగులో చేసి తన భవిష్యత్తుకు బాట వేసుకున్నారు. తొలిరోజుల్లో చిన్న హీరోలతో నటించినా, తర్వాత నాగేశ్వరరావు గారితో ఆత్మీయులు, రామారావు గారితో నిండుహృదయాలు చిత్రాల్లో తొలిసారిగా కథానాయికగా నటించారు.సావిత్రికి వారసురాలిగా చెప్పుకునే వాణిశ్రీ తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయంతో డెబ్భైల ప్రారంభంలో తనదైన ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు.     

వాణిశ్రీ చీర కట్టు…
వాణిశ్రీ హెయిర్ స్టైల్
వాణిశ్రీ మేచింగ్…
వాణిశ్రీ నడక…

… ఇలా తనకంటూ కొన్ని ప్రత్యేకతలతో ప్రేక్షకులను, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

వాణిశ్రీ ధరించినన్ని వైవిధ్యమైన పాత్రలు మరే కథానాయిక ధరించలేదేమో ! బంగారు తిమ్మరాజు లాంటి చిత్రాల్లో హాస్యరస పాత్రలు, మరపురాని కథ.. సుఖదుఃఖాలు లాంటి చిత్రాల్లో చెల్లెలుగా, ఇద్దరు అమ్మాయిలు.. గంగ మంగ లాంటి చిత్రాల్లో విభిన్న మనస్తత్వాల గల రెండేసి పాత్రలు, కథానాయిక మొల్ల లాంటి చారిత్రక పాత్రలు, వినాయక విజయం…సతీసావిత్రి లాంటి చిత్రాల్లో పౌరాణిక పాత్రలు, జీవనజ్యోతి..కృష్ణవేణి లాంటి చిత్రాల్లో మానసిక సంఘర్షణతో కూడిన పాత్రలు…. ఇలా ఎన్నో రకాల పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసారు. వీటిలో చాలావరకూ గ్లామర్ తో కూడినవే ! అసలు ఏమాత్రం గ్లామర్ కు అవకాశం లేని పాత్రలను గోరంత దీపం, అనుగ్రహం చిత్రాల్లో ధరించి గ్లామర్ మాత్రమే కాదు, పాత్రే ముఖ్యమని నిరూపించుకున్నారు.  

తొలిరోజుల్లో హాస్యనటుల ప్రక్కన, చంద్రమోహన్ లాంటి చిన్న హీరోల ప్రక్కన నటించిన వాణిశ్రీ రామారావు, నాగేశ్వరరావు లాంటి అగ్రతారలతో… కృష్ణ, శోభన్ బాబు లాంటి తర్వాత తరం తారలతో… రంగనాథ్, శ్రీధర్, రామకృష్ణ లాంటి చిన్న తారలతో కూడా తరతమ బేధాలు లేకుండా నటించింది.

వాణిశ్రీ కున్న మరో ప్రత్యేకత నవలా నాయికా గుర్తింపు.  ప్రేమనగర్, జీవనతరంగాలు, చక్రవాకం, సెక్రటరీ, విచిత్రబంధం ( విజేత ) …. ఇలా నవలల ఆధారంగా వచ్చిన చిత్రాల్లో వాణిశ్రీయే కథానాయిక.  

తెలుగుతో బాటు తమిళంలో దాదాపు ఎనభై చిత్రాల్లో, కన్నడంలో సుమారు ముఫ్ఫై చిత్రాల్లో, మలయాళంలో రెండు చిత్రాల్లో నటించారు వాణిశ్రీ. తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక శకాన్ని ఏర్పరచుకున్నారు వాణిశ్రీ.

అగ్రకథానాయికగా వెలుగొందుతున్న రోజుల్లో తీరిక సమయాలు, తనదైన జీవితం కోల్పోయిన వాణిశ్రీ… తనకంటూ వ్యక్తిగత జీవితం కావాలని కోరుకుని డా. కరుణాకరన్ ని వివాహమాడారు. కొంతకాలం సంతృప్తిగా కుటుంబ జీవితం గడిపిన వాణిశ్రీ… పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక మళ్ళీ తన నటనా ప్రతిభను వెలికి తీసారు. కొన్ని చిత్రాల్లో నటించారు…. నటిస్తున్నారు.

 ఆగష్టు 03 వ తేదీ కళాభినేత్రి వాణిశ్రీ జన్మదినం సందర్భంగా …… 

******************

 

You may also like...

Leave a Reply

Your email address will not be published.