10_002 డొక్కా సీతమ్మ గారి నిత్యాన్నదాన వ్రతం

 

అన్ని దానాలలోకి అన్నదానం గొప్పదని అంటారు. మానవ సేవే మాధవ సేవ అని సంపూర్ణంగా నమ్మిన మహనీయురాలు, నిరతాన్నదాత్రిగా ప్రఖ్యాతి గాంచిన సాధ్వీమణి కీ. శే. డొక్కా సీతమ్మ గారు. గోదావరి నీళ్ళలో అతిథి సత్కారాలు సహజంగానే కలగలసి ఉంటాయని చెప్పుకోవడం వింటూ ఉంటాం. ఇప్పటికీ గోదావరి ప్రాంతం వారి ఆతిథ్యాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటారు మిగిలిన ప్రాంతాల ప్రజలు. అయితే అన్నార్తులు ఏ ప్రాంతం వారైనా, ధనికులైనా, పేదవారైనా, కులమేదైనా, మతమేదైనా వారి ఆకలి తీర్చడమే తన విధి అని నమ్మి జీవితాంతం ఆచరించిన గొప్ప వ్యక్తి సీతమ్మ గారు.

డొక్కా సీతమ్మ గారి వంశంలోని అయిదవ తరానికి చెందిన డొక్కా శ్రీనివాసరావు గారు తమ వంశానికే కాదు కోనసీమ వాసులందరికీ....  ఆ మాటకొస్తే యావత్తు తెలుగు వారికి గర్వకారణంగా నిలిచిన నిరతాన్నదాత్రి సీతమ్మ గారి జీవితంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనలు శిరాకదంబం తో శ్రీనివాసరావు గారు పంచుకున్నారు.

 

**********************************************

 

శ్రీమతి సీతమ్మ గారు పుట్టిన ఊరు మండపేట, తూర్పు గోదావరి జిల్లా. వీరి తండ్రి అనిప్పిండి భవాని శంకరం గారు. శ్రోత్రియుడు. నిత్య నిష్టా గరిష్టులు. ఒకసారి శ్రీ డొక్కా జోగన్న గారు వేద సభలకు వెళ్లి తిరిగి వస్తూ మార్గ మధ్యమున వీరింట సేద తీరడానికి వెళ్ళినారు. ఆ సమయమున భవాని శంకరం గారు ఇంట్లో లేరు. అయినప్పటికీ సీతమ్మగారు ఎంతో ఆదరంగా ఆయనను లోపలికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి నాన్న గారు వస్తారు ఉండండి అని వారికి కావలసిన భోజన సదుపాయాలు అవీ కలగచేసారట. ఆవిడ ఆదరణకు, అతిథి మర్యాదలు కు మురిసిపోయిన జోగన్న గారు ఆమెను వివాహం చేసుకొంటామని, ఆ ప్రస్తావన భవాని శంకరం గారి దగ్గరకు తీసుకురావడం, ఆమె వివాహం జోగన్న గారితో అవడం జరిగిపోయింది.

కోనసీమ లోని పి. గన్నవరం ఆక్విడక్ట్

ఆవిడ మెట్టినింట కాలిడినది మొదలు ఆవిడ ఆఖరి శ్వాస వరకు అన్నార్తులను అదుకొంటూ అన్నదానం చేస్తూనే వుండేవారు. అన్నిటికన్నా ఆవిడ ఆదరణ అందరినీ మంత్ర ముగ్ధులను చేసేదని ప్రజలు చెప్పుకొనేవారు.

మా పెద్దలు మాకు చెప్పగా, మా అమ్మ గారు వాళ్లు మాకు ఆవిడ గురించి చెప్పిన కొన్ని విషయాలు ఉటంకిస్తున్నాను.

” ఆవిడ ఆర్తి ఎంతలా ఉందేదంటే ఒకసారి ఆవిడ అనుకున్నారట. ఎంతసేపు ఈ వచ్చే పోయే అతిథులతో సరిపోతోంది. ఒక్కసారైనా ఆ స్వామి లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం చేసుకోవాలి… అంతర్వేది వెళ్ళాలి అనుకున్నారట. జోగన్నగారు ఆవిడ అభిప్రాయాన్ని మన్నించి వెంటనే మేనా ఏర్పాటు చేసి పంపారట. ఈవిడ వెళుతుంటే మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న యాత్రికుల సంభాషణ వినడం జరిగిందట. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ, చిన్నపిల్లల్ని సముదాయిస్తూ “ ఎంతమ్మా ! మనం సీతమ్మ గారి ఊరికి దగ్గరలోనికి వచ్చేసాం ! ఆ తల్లి మనకి వేడి వేడి పాలు అవీ ఇస్తుంది. అన్నపానాలు సమకూరుస్తుంది. మనం సేద తీరి వారింట ఈ రాత్రి విశ్రాంతి తీసుకొని మరునాడు ప్రొద్దున్నే వెళ్ళవచ్చు ”  అని అనుకుంటున్నారట. ఆ మాటలు ఆవిడ చెవిన పడగానే ఆవిడ ఈ సమయాన నేను ఇంటిన లేకపోతే వీరికి తగిన సదుపాయాలు ఎవరూ చేయరు, ఆ స్వామి దర్శనం మరెప్పుడైనా చేసుకోవచ్చునని తలంచి వెంటనే మేనాని గన్నవరానికి తిరిగి తీసుకు వెళ్ళమని చెప్పారట. అలాగే ఆమె వారికన్నా ముందుగానే ఇంటికి వచ్చి వారికి కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారట. అన్నార్తుల హృదయాలలో ఆ స్వామి ని దర్సించగలిగిన సాధ్వీమణి ఆమె”.

ఆ రోజులలో అంతా ఆవిడే పర్యవేక్షణ చేసేవారట. ప్రతీ వ్యక్తి దగ్గరకు వెళ్ళి నాయనా కడుపునిండా తినండి. కొంచం కూర కావాలా, కొంచం మజ్జిగ పోసుకొంటారా అని ఆప్యాయంగా అడిగే వారట. ఒకసారి కొంతమంది బ్రాహ్మణులు భోజనానికి వస్తే ఆమె అందరికీ వడ్డించి ఔపోసన పట్టమని అభ్యర్థించారు. ఆ పంక్తిలో అందరూ ఔపోసన పట్టగా ఒక బ్రాహ్మణుడు మాత్రం ఔపోసన పట్టకుండా ఆమె వంకే దీనంగా చూస్తున్నారట. ఆ రోజులలో పంక్తిలో ఎవరు ఔపోసన పెట్టకపోయినా మిగతా వారెవరూ భోజనానికి ఉపక్రమించే వారు కాదు. సీతమ్మ గారు ఇది గమనించి “ ఓ బ్రాహ్మణోత్తమా ! మీరు కూడా ఔపోసన పడితే మిగతావారు భోజనానికి ఉపక్రమిస్తారు. మీకేమైనా కావాలా లేక ఏదైనా కోరిక ఉంటే చెప్పండి తీరుస్తాను ” అన్నారట. అంత ఆ బ్రాహ్మణుడు ” అమ్మా సీతమ్మ తల్లీ ! నాకు పెళ్లీడు కొచ్చిన ఆడపిల్ల ఉన్నది. ఆమెకు వివాహం చేసి అత్తవారింటికి పంపేటంత ద్రవ్యం నా దగ్గర లేదు. మీ మెడలో ఉన్న కంటె ( కంటాభరణం ) ఇస్తే అది అమ్మి నా కూతురి వివాహం జరిపించుకొంటాను ” అని అన్నారట. అప్పుడు ఆమె “ అయ్యో ఇంతమాత్రానికేనా మీరు ఇంతలా తటపటాయిస్తూన్నది ” అని వెంటనే ఆమె మెడలో ఉన్న కంటె తీసి ఇచ్చారట. “ మీరు సంతృప్తిగా భోజనం చెయ్యండి స్వామీ ! ” అని అన్నారట. ఆ బ్రాహ్మణుడు ఆ కంటె తన పీట కింద పెట్టుకొని ఆనంద భాష్పాలు తో కళ్ళు తుడుచుకుంటూ తృప్తిగా భోజనం చేశారట. ఆ భోజనాలు అయిపోయిన తరువాత, ఆ విస్తర్లు అవి తీసి శుభ్రం చేస్తుంటే ఆ కంటె అక్కడే ఉన్నదట. కానీ ఆ బ్రాహ్మణుడు ఎంత వెదికినా కనిపించలేదు. అప్పుడు సీతమ్మ గారు మనస్తాపం చెంది రాత్రి నిద్ర పట్టక సతమత మౌతుంటే తెల్లవారుజామున ఆమె కలలో శ్రీమన్నారాయణుడు కనపడి ” ఎందుకు సీతమ్మా అంత చింత పడతావు ? నేనే ఆ బ్రాహ్మణుడు రూపంలో నిన్ను పరీక్షంచడానికి వచ్చాను ” అని చెప్పి అంతర్ధానం అయ్యారట. తన నిష్కామ కర్మతో ఆ శ్రీమన్నారాయణుని సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఆమె.

డొక్కా సీతమ్మ గారు నివసించిన ఇల్లు

ఇటువంటి దృష్టాంతాలు కోకొల్లలు. మచ్చుకి ఒకటి రెండు పైన ఉదహరించాను.

ఇక సీతమ్మ గారి వంశవృక్షం విషయానికి వస్తే…..

వారికి ఇద్దరు కుమారులు. (1) డొక్కా సుబ్బారాయుడు గారు, (2) డొక్కా గోపాలం గారు.

డొక్కా గోపాలం గారికి అందరూ ఆడపిల్లలే. అందుకే ఆయన తాతా వారి అబ్బాయిని దత్తత చేసుకొన్నారు. ఇక వంశానుగతం గా వచ్చిన అన్నదానం అనే అనుసృతం సుబ్బారాయుడు గార్కి వచ్చింది. సుబ్బారాయుడు గార్కి ముగ్గురు మగ పిల్లలు. (1) రామజోగయ్య గారు (2) సూరన్న గారు (3) రామభద్రుడు గారు.

రామభద్రుడు గారు ఆ ఇల్లు వదిలి అమలాపురం వచ్చేశారు.

సుబ్బారాయుడు గారి నుంచి మళ్ళీ సూరన్న గారు అన్నదాన వ్రతాన్ని స్వీకరించారు.

డొక్కా సూరన్న గార్కి ముగ్గురు కొడుకులు. (1) డొక్కా వీరభద్రం గారు ( మా నాన్నగారు ) (2) డొక్కా గోపాలకృష్ణ గారు (3) డొక్కా సుబ్బారాయుడు గారు.

డొక్కా సూరన్న గారి పెద్ద కొడుకైన వీరభద్రం గారు ( మా నాన్నగారు ) మళ్ళీ వంశానుగతం గా వస్తున్న అన్నదానం అనే పరమ పవిత్రమైన కార్యాన్ని తన ఆఖరి క్షణం వరకు ఎంతో నిబద్ధత తో నిర్వర్తించారు. మా నాన్నగారి 21 వ సంవత్సరంలో మా తాత గారు స్వర్గస్థులు అయినారు. అప్పటినుంచి మా నాన్నగారు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని కష్టనష్టాలను భరించి బాధ్యతలను నిర్వర్తించారు. మా నాన్నగార్కి మేం నలుగురు కొడుకులం. 

డొక్కా సూర్యనారాయణ మూర్తి

డొక్కా సత్యనారాయణ

డొక్కా నరసింహ మూర్తి

డొక్కా శ్రీనివాస రావు (నేను).

సీతమ్మ గారి జీవితంలో జరిగిన మరొక రెండు ముఖ్య సంఘటనల గురించి క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను.

” అవి వానాకాలం, వరద ఉప్పొంగి ప్రవహిస్తున్న రోజులు. మామూలుగానే ప్రతిరోజూ రాత్రి పదకొండు గంటల వరకు అందరు అతిధి అభ్యాగతులు భోజనం చేశారా లేదా అని ఆవిడ స్వయంగా పర్యవేక్షించి ఇక నిద్రకి ఉపక్రమిద్దామని అనుకుంటున్నారట. ఆ రోజులలో ఆవిడ లాంతరు వెలుగులో వీధిలో పడుకొన్న అందరినీ పలకరించి అడిగి తెలుసుకొనేవారట. 

అంతలో ఆవిడకి ఒక్కసారిగా ” అమ్మా ! సీతమ్మతల్లీ ! ఆకలితో చచ్చిపోతున్నానమ్మా ! గుప్పెడు అన్నం పెట్టి నా ప్రాణాలు కాపాడమ్మా ! ” అని కేక వినబడిందట. అంత ఆవిడ వంటగదిలోకి వెళ్ళి చూస్తే వండిన పదార్థాలన్నీ అయిపోయి అడుగుబొడుగున ఉన్నాయిట. అవి ఒక వ్యక్తికి సరిపడే భోజన పదార్థాలు కావని తలచి అప్పటికప్పుడు వంటకి ఉపక్రమించారు. భోజన పదార్ధాలు అన్ని ఒక మూటలో పొందికగా కట్టి భర్తని లేపి ” ఏవండీ ! నా బిడ్డడు ఒకడు ఆవలి గట్టున ఆకలితో తాళలేక అల్లాడుతున్నాడు. మీరు ఈ భోజనాన్ని తీసుకుని వెళ్లి అతనికి ఇవ్వండి, అలాగే మీ దగ్గరున్న కొన్ని చుట్టలు కూడా తీసుకొని వెళ్ళండి. పాపం అతను భోజనం చేసిన తరువాత చుట్ట కాల్చుకొని సేద తీరతాడు ” అని అన్నదట. అంత జోగన్న గారు నిర్ఘాంతపోయారట. “ ఏవిటీ ? ఇంత అర్ధరాత్రి వేళ ఆవలి గట్టుకి ఎలా వెళ్ళాలి ? గోదావరి నిండుగా ప్రవహిస్తోంది. రానురాను నీకు చాదస్తం ఎక్కువైపోతోంది సీతా ! ” అని కొంచం మందలింపు ధోరణిలో అన్నారట. “ ఏవండీ ! ఆకలితో ఉన్న కడుపుకి సమయం ఇతర పరిస్థితి ఏమీ తెలియదు. సరే ! మీకు అంత కష్టం అయితే నేనే వెళ్ళి ఇచ్చి వస్తానులెండి. అక్కడ నా బిడ్డడు ఆకలితో అలమటిస్తూ ఉంటే ఇక్కడ నాకు నిద్ర పట్టదు ” అని ఆవిడే వెళ్ళడానికి ఉపక్రమించారుట. ఇక ఇటువంటి విషయాలలో ఆవిడ తన పట్టు వీడదన్న విషయాన్ని గ్రహించిన భర్త జోగన్న గారు ఒక నావని చేసుకొని ఆవలి గట్టుకు వెళ్ళి రావి చెట్టుకింద కూర్చున్న హరిజనునికి భోజనం అందించారట. అంత అతను చలికి ఒణికిపోతూ “ ఆ తల్లి సీతమ్మ నాకు బువ్వ పంపిందా ? ” అని తృప్తిగా తిని నాకు కాల్చుకోవడానికి చుట్టలు కూడా పంపిందా అని అడిగి తీసుకొన్నాడట. చుట్టలు పంపిన సంగతి ఇతనికి ఎలా తెలుసు అని ఒకింత ఆశ్చర్యానికి లోనయి ఏమైతేనేం నా భార్య కోరిక మేరకు ఇతనికి భోజనం అందచేసాననే తృప్తి తో నావెక్కి తిరుగుముఖం పట్టారట. కొద్దిదూరం వెళ్ళగానే ఆయనికి ఇది ఎందుకో ఒకింత ఆశ్చర్యం గాను, లీల గాను అనిపించి వెనక్కి తిరిగి చూసారట. అక్కడ ఆ వ్యక్తి లేడట. అంతర్ధానం అయ్యాడట. ఇది రాస్తుంటే నాకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. 

ఒక రకంగా ఆమెను పరీక్షించడానికే ఆ శ్రీమన్నారాయణుడు ఈ విధంగా చేశాడని చెప్పుకుంటారు.

ఎందుకో నాకు ఈ సంఘటన విన్నప్పుడు కోల్‌కత్తా లోని దక్షిణేశ్వరం లో ఆ రామకృష్ణ పరమహంస వారు ఆ తల్లి కాళీమాతకి భోజనం తినిపించేవారట. ఆ సంఘటన గుర్తుకు తెస్తుంది. ఏది ఎందుకు గుర్తుకొస్తుం దో, దేనిది దేనికి కలయికో ఆ పరమాత్మునికే తెలుసు.

ఇక సీతమ్మ గారి జీవితంలో ప్రముఖమైన ఘట్టం – సీతమ్మగారి కీర్తిని, ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన ఘట్టం – ఆవిడకి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం రావడం.

సీతమ్మ గారు అన్నార్తులకు చేస్తున్న నిస్వార్థ సేవ ఆనోటా ఆనోటా ప్రాకి క్రమేపీ ప్రభుత్వ కార్యాలయాలలో చర్చించుకోవడం, అనేక ప్రశంసలు పొందడం జరిగింది. ఎందుకంటే ఆవిడ జాతి, మత కుల వివక్షత లేకుండా వచ్చిన వ్యక్తిలో పరమాత్మను దర్శించి ఎంతో ప్రేమతో ఆప్యాయతతో ఆదరించేవారట.

సీతమ్మ గారి సేవలకు గుర్తింపుగా 7వ ఎడ్వర్డ్ రాజు ఇచ్చిన ధృవపత్రం

ఈ నేపథ్యంలో ఈ విషయాలన్నీ ప్రభుత్వ దృష్టికి వెళ్ళి అప్పటి బ్రిటిష్ రాజు 7వ కింగ్ ఎడ్వర్డ్ ( King Edward VII ) తన పట్టాభిషేక మహోత్సవానికి లండన్ కి రావాలని ప్రభుత్వం తరఫున సగౌరవంగా సీతమ్మ గారికి సాదరంగా ఆహ్వానం పంపారు. కానీ ఆమె తను ఖండాంతరాలకు రాలేనని, తను ఇవేమీ ఆశించి చేయటంలేదని సున్నితం గా చెప్పారట.

అంత ఆ కింగ్ ఎడ్వర్డ్ ఆవిడ రాకపోయినా కనీసం ఆవిడ ఫోటో అయినా పంపమని డిస్ట్రిక్ట్ కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఆవిడ వ్యక్తిగతంగా అక్కడ ఉండకపోయినప్పటికీ ఆవిడ ఫోటోను పక్కన పెట్టుకొని తను పట్టాభిషేకం చేసుకుందామనే ఆలోచనతో.

ఆ ఆదేశాలు అందుకొన్న అప్పటి తహశీల్దార్ గారు గన్నవరం గ్రామానికి విచ్చేసి సీతమ్మ గారిని కలిసి ఆమెతో మీ ఫోటో ఒకటి కావాలని అభ్యర్థన చేశారట. అంత ఆమె “ అయ్యో ! ఈ ఫోటోలు అవీ నాకెందుకయ్యా ? నేను ఫోటోలు, సత్కారాలు, సన్మానాలు ఆశించి ఇవేవీ చేయడంలేదు. అయినా నేను విధవరాలిని. ఏదో నాలుగు గోడల మధ్య ఉంటూ వచ్చిన వారికి నాకున్నంతలో మర్యాద చేసి పంపడం కన్నా నేను ఏమి ఘనకార్యాలు చేస్తున్నాను. నాకివేమీ వద్దయ్యా ! ” అని సున్నితంగా చెప్పి ఫొటోకి సుముఖత చూపలేదు. ఆ రోజులలో స్త్రీలు ముఖ్యంగా భర్త పోయిన స్త్రీలు ఎక్కడకి బయటకు వెళ్లడం చేసేవారు కాదు. 

అంత ఆ తహశీల్దారు గారు ఆవిడ కాళ్ల మీద పడి ” అమ్మా ! ఇప్పుడు మీరు ఫోటో తీయించుకోవడానికి ఒప్పుకోకపోతే నా ఉద్యోగానికి హాని కలుగుతుంది. కాబట్టి మీరు ఫోటో తీయించుకోడానికి ఒప్పుకొని నా ఉద్యోగం నిలబెట్టాలి ” అని ప్రాధేయపడినారు. 

అంత ఆవిడ “ అయ్యో నాయనా ! నీ ఉద్యోగానికి హాని కలుగుతుంది అంటే నేను ఉరుకోగలనా ? తప్పకుండా ఫొటో తీయించుకొంటాను ” అని అభయమిచ్చి, “ నాయనా ! నీవు ఈ రోజు ఇక్కడ ఉండి, తృప్తిగా భోజనం చేసి కొంచం సేద తీరిన తరువాత తప్పకుండా ఫోటో తీసుకో ! ” అని అతనిని ఎంతో ప్రేమతో ఆదరించి పంపారు. అదిగో ! అప్పుడు తీసిన ఫోటోయే ఇప్పుడు మన దగ్గర ఉన్నది. ప్రస్తుతం అంతర్జాలం లో డొక్కా సీతమ్మ గారు, ఆమె భర్త అని చెబుతూ వైరల్ అవుతున్న ఫొటోలేవీ వారివి కావు. కింగ్ ఎడ్వర్డ్ తీయించిన ఫొటో ఒక్కటే ఆవిడ అసలు ఫొటో. నిజానికి ఆవిడ భర్త గారితో కలసి ఉన్న ఫోటో గానీ, మరి ఏ ఇతర ఫొటోలు గానీ ఏమీ లేవు.

అప్పుడు 7వ ఎడ్వర్డ్ రాజు ( king Edward VII ) ఆమె ఫోటోను సింహాసనం మీద ఉంచి ఆ ఫోటోకి పూలమాలలు వేసి సత్కరించి, ఆ పక్కన మరొక కుర్చీలో కూర్చుని తన పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపించుకున్నారట. ఇప్పటికీ లండన్ మ్యూజియం లో సీతమ్మ గారి ఫోటో ఉంది.

” ఎంతసేపూ నిష్కామ కర్మ గా తన పని తను చేసుకుపోవడమే గాని ఆర్భాటాలకు, హంగులకు పోని నిస్వార్థ వ్యక్తి డొక్కా సీతమ్మ గారు “.

ఇక ఆవిడ చరమ దశలో ఆవిడకి చేతిమీద రాచపుండు ( పుట్ట వ్రణం ) వేసిందట. అంత బాధలోనూ  తన బాధను ఎవరికీ కనపడనీయకుండా తను బాధపడుతూ కూర్చుంటే వచ్చిన అతిథులకు ఎక్కడ ఆదరణ లోపం జరుగుతుందో అని సరైన సదుపాయాలు అవి ఎక్కడ జరగవో అని తపిస్తూ అంత బాధలోనూ చేతికి తడి గుడ్డ కట్టుకుని మరీ పర్యవేక్షణ చేస్తూ నాయనా కడునిండా తినండి, మొహమాట పడవద్దు అని పలకరించేవారు. 

నిస్వార్థ జీవితానికి ఆవిడ నిలువెత్తు దర్పణం.

” ఒకసారి మధ్యాన్నం దాటిన వేళ విశ్వేశ్వరుని అగ్రహారం లో నలుగురు వేద పండితులు వేదాంత పరమైన చర్చ / ఇష్టాగోష్టి జరుపుతున్న సమయాన వారు ఆకాశంలో ఒక కాంతి పుంజం కదలి వెళ్లడం గమనించారట. ఓహో ! ఒక మహావ్యక్తి నిష్క్రమణ జరిగింది అని వాళ్ళల్లో వాళ్లు మాట్లాడుకున్నారట. ఆ తరువాత వారికి తెలిసిందట… సీతమ్మ గారు స్వర్గస్తులైనారని “.

ఇవి ఆవిడ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలు.

మన దృష్టికి రానివి, మనకు తెలియనివి దృష్టాంతాలు కోకొల్లలు ఉండి ఉండవచ్చు.

సీతమ్మ గారి క్రొత్త వారసురాలి ప్రవేశం

ఆ వంశ వారసుడిగా నాకు తెలిసిన మేరకు విషయ వివరణ చేశాను.

నాకు ఒక అబ్బాయి. పేరు శరత్. ఇటీవలే అతని వివాహం అందరి దివ్య ఆశీస్సులతో విశాఖపట్నంలో జరిగింది. మా వంశంలోనికి సీతమ్మ గారి ఆరో తరం వారసురాలిగా కొత్త కోడలు అడుగు పెట్టింది.  

 

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦