పద్యం తెలుగు భాషకు అందమైన అలంకారం. మన తెలుగు భాషలో రత్నాల వంటి కవులు ఎందరో ఆణిముత్యాల వంటి పద్యములను రచించారు. మన కవులలో నవరత్నాలు అన దగ్గ కవులు తొమ్మిది మంది కలముల నుంచి వెలువడిన పద్యములు కొన్ని ఓలేటి వారి గళంలో…. మీకోసం…..

 

సరస్వతీ ప్రార్థన

 

తల్లీ ! నిన్నుఁదలంచి పుస్తకము చే

           తన్ బూనితిన్ నీవు నా

యుల్లంబందున నిల్చి జృంభణముగా

                 నుక్తుల్ సుశబ్దంబు శో

భిల్లం బల్కుము నాదువాక్కులను సం

             ప్రీతిన్ జగన్మోహినీ !

పుల్లాబ్జాక్షి ! సరస్వతీ ! భగవతీ !

              పూర్ణేందు భింబాననా !

 

నన్నయ పద్యము

 

అంబ ! నవాంబుజోజ్జ్వల కరాంబుజ ! శారద చంద్ర చంద్రికా

డంబర చారుమూర్తి ! ప్రకటస్పుట హాటక రత్నదీపికా

చుంబిత దిగ్విభాగ ! శ్రుతిసూక్త వివిక్త నిజ ప్రభావ ! భా

వాంబర వీథి విశ్రుత విహారిణి ! నన్ గృపచూడు భారతీ !

 

తిక్కన పద్యము

 

కరకమలంబునందుఁ బటికంపుఁ గమండలు పచ్ఛకాంతి భా

సురమగు మౌక్తికంపు జపసూత్రము దాల్చుట బ్రహ్మవాదియై

పరఁగిన హంసమున్ బిలిచి బాలమృణాళముఁ జూపు చందమై

సిరిఁ దిలకింప నొప్పు బుధసేవితమూర్తిఁ దలంతు భారతిన్

 

శ్రీనాథుని పద్యము

 

రాజీవభవుని గారాపుఁ బట్టపుదేవి

            యంచబాబా నెక్కు నలరు బోణి

పసిఁడి కిన్నెర వీణె పలికించు నెల నాఁగ

              పదునాల్గు విద్యల పట్టుఁగొమ్మ

ఈరేడు భువనంబు లేలు సంపద చేడె

                 మొలకచందురుఁ దాల్చు ముద్దరాలు

తెలిచాయ కొదమ రాచిలుక నెచ్చెలికత్తె

                   ప్రణవ పీఠిక నుండు పద్మగంధి

 

 

మందరాచల కందరా మద్యమాన

దుగ్ధ పాథోధి లహరికా ధూర్తయైన

లలిత సాహిత్య సౌహిత్య లక్ష్మినొసఁగు

వరదయై మాకు వినత గీర్వాణి వాణి

 

పోతన పద్యము

 

క్షోణితలంబు నెన్నుదురు  సోఁకగమ్రొక్కి నుతింతు సైకత

శ్రోణికిఁ జంచరీకచయసుందరవేణికి రక్షితామర

శ్రేణికిఁ దోయజాతభవచిత్తవశీకరణైకవాణికిన్

వాణికి నక్షదామ శుకవారిజపుస్తక రమ్యపాణికిన్

 

శ్రీకృష్ణదేవరాయలు పద్యము

 

తెలుఁ గదేల యన్న దేశంబు తెలుఁగేను

తెలుఁగు వల్లభుండ ; తెలుఁ గొకండ ;

యెల్లనృపులు కొలువ నెఱుఁగవే బాసాడి

దేశభాషలందుఁ దెలుఁగు లెస్స

 

అల్లసాని పెద్దన పద్యము

 

చేర్చుక్కగా నిడ్డ చిన్నిజాబిలి రేక

            సిందూర తిలకంబు చెమ్మగిల్ల

అవతంస కుసుమంబునందున్న యెలదేఁటి

             రుతి కించిదంచితశ్రుతుల నీన

ఘనమైన రారాపు చనుదోయి రాయిడిఁ

               దుంబీఫలంబు తుందుడుకుఁజెంద

తరుణాంగుళీచ్ఛాయ దంతపు నరకట్ట

                 లింగిలీకపు వింతరంగు లీన

నుపనిషత్తులు బోటులై యోలగింపఁ

బుండరీకాసనమునఁ గూర్చుండి మదికి

నించు వేడుక వీణ వాయించు చెలువ

నలువ రాణీ మదాత్మలో వెలయుఁగాక !

 

రామరాజ భూషణుని పద్యము

 

రమణీయాక్షనరాకృతిన్ బొలుచు వర్ణశ్రేణీ వీణానులా

పముచేతం గరఁగించి యందు నిజబింబంబొప్ప స

చ్ఛామృతత్వము నాత్మప్రతిపాదకత్వము తద్వర్ణాళియం దెల్లఁబూ

ర్ణము గావించిన వాణి

 

ఆతుకూరి మొల్ల పద్యము

 

మేలిమి మంచుకొండ నుపమింపఁగఁ జాలినయంచనెక్కి వా

హ్యాళి నటించివచ్చు చతురాస్యునెదుర్కొని నవ్వుదేరఁగా

వాలిక సోగకన్నుల నివాళి యొనర్చి ముదంబుఁగూర్చు వి

ద్యాలయ వాణి శబ్దముల వర్థములన్ సతతంబు మా కిడున్

 

నృసింహకవి పద్యము

 

కాసారంబులు సాహిణంబులు సరిత్కాంతుండు పూఁదోఁట, వి

ద్యాసీమంబులు రచ్చపట్లు సురకాంతాలోక సీమంత భూ

షా సిందూరము పాదలాక్షయగు భాషాదేవి మత్ప్రౌఢ జి

హ్వాసింహాసన మూనుఁగాక ! కృతియుక్తాలంక్రియాహంకృతిన్  

 

కొన్ని తప్పొప్పులు :

 

తిక్కన 2వ పద్యం

తప్పు – జవసూత్రము              ఒప్పు – జపసూత్రము

పెద్దన పద్యం:

తప్పు-శ్రుణుల నీన                              ఒప్పు-శ్రుతుల నీన

ఆతుకూరి మొల్ల పద్యం :

తప్పు- చతురాన్యునెదుర్కొని            ఒప్పు: చతురాస్యునెదుర్కొని

నృసింహ కవి:

తప్పు: రచ్చనట్లు                                 ఒప్పు: రచ్చపట్లు

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾