09_019 తో.లే.పి. – షేక్ దావూద్ షరీఫ్

1971-77 మధ్యకాలం…

ఉద్యోగరీత్యా నేను ధవళేశ్వరం లో గోదావరి బేరేజ్ ప్రాజెక్టు లో పని చేసిన రోజులవి. సర్కిల్ ఆఫీసులో జూనియర్ ఇంజినీర్ గా పనిచేసాను. మాకు పై అధికారిగా శ్రీ షరీఫ్ గారు ( పి. ఏ. టు సూపరింటెండింగ్ ఇంజనీరు ) ఉండేవారు. అధికారి అయినా ఏనాడు దర్పంతో వ్యవహరించేవారు కారు.

ఆప్యాయంగా పలకరిస్తూ మా అందరికీ ఒక కుటుంబ పెద్దలా ఉండేవారు.. సామాన్య వస్త్రధారణతో సాదాసీదాగా ఉండేవారు. తరచు చార్ మినార్ సిగరెట్లను కాల్చడం ఆయన అలవాటు. అలాగే, సాయంత్రం ఆఫీసు టైం ముగిసాకా మిత్రులతో క్లబ్ లో ఆరుబయట కాసేపు ( డబ్బులతో.. పెద్ద స్టేక్ కాదు ! ) పేకాట ఆడేవారు. ఆ ఆటలో కాస్తో, కూస్తో డబ్బులు వచ్చినా, ఆ మొత్తం సొమ్ముతో అందరికీ కాఫీ, టిఫిన్లు తెప్పించేవారు. నేను లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ సాహితీ కార్యదర్శిగా నెలకొకసారి సాహితీ సదస్సు ని నిర్వహించేవాడిని. దానిలో పాల్గొనడం కోసం చేరువ పట్టణాలనుండి, గ్రామాలనుండి సాహితీవేత్తలను ఆహ్వానించేవాళ్ళం. ఆ సదస్సులు ప్రధానం గా తెలుగుభాషలో జరిగినప్పటికీ, ప్రతీ సదస్సుకీ ఉర్దూ మాతృభాష అయినా తెలుగు భాష యందు అవగాహన ఉన్న షరీఫ్ గారు ఆసక్తితో ‌హాజరవుతుండేవారు.. వారు అంతకుముందు నాగార్జున సాగర్ లో పనిచేసేటప్పుడు వీరి పొరుగింటివారు తెలుగువారవడంతో వారి మధ్య సాంగత్యం లోనూ, రాకపోకలతోనూ, వీరికి తెలుగు వంటబట్టి, తనకు ఆ భాష పట్ల ఆసక్తి ఏర్పడినదని షరీఫ్ గారు నాకొక సందర్భంలో చెప్పారు.

మా ఆఫీసులో ప్రతి శనివారం ఉదయం 7 – 8 గంటల సమయంలో రమారమి ఒక గంట సేపు శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ, అటు తరువాత ప్రసాద వితరణ జరిగేవి. దీనికిగాను ఆఫీసులో ప్రతీ ఒక్కరినుండి నెలకు ఇంతని నామమాత్రంగా వసూలు చేసేవారు. షరీఫ్ గారు ఈ పూజలకు హాజరవడంతో బాటు, తమవంతు పైకం నెలనెలా గుర్తుంచుకుని ఇస్తూ ఉండేవారు.

“ మీ ఉన్నత విద్యాభ్యాసం ఎలా జరిగింది ? ” అని ఓసారి ఆయన్ని నేను అడిగాను‌.‌ ” సుబ్బారావు గారూ.. నా చిన్నప్పుడే మా నాన్నగారు కాలం చేయడంతో, మా పినతండ్రి గారు, కుటుంబం నన్ను పెంచి పెద్దచేసారు. మా చిన్నాన్న గుంటూరు లో గుర్రపు బండి తోలి, ఆ రాబడి తో కుటుంబాన్ని పోషించేవారు.. నా ఇంజనీరింగ్ చదువు కు పెట్టుబడి కూడా ఆయన సంపాదన నుండే ! ”

నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. ఆయన మాటలు వింటూంటే… అవును మరి పసితనంలోనే తాను కష్టాన్ని స్వయంగా అనుభవించిన వ్యక్తి కనుక, అవతలివాడి కష్టమేమిటో ఆయనకి సంపూర్ణ అవగాహన ఉండేది. అందువలననే ఎవరైనా తప్పు చేసినా వారికి సౌమ్యంగా తెలియజెప్పేవారే కాని, పరుషంగా మందలించేవారు కాదు.

ఇక, నా రచనా వ్యాసంగానికి స్ఫూర్తి ఆయన మాటలే.. నా రచనలను ఆమూలాగ్రం ఆసక్తితో చదివి తన ఉత్తరాలద్వారా వాటిపై చక్కటి సమీక్షను చేసేవారు. 

పదవీవిరమణ అనంతరం కుటుంబంతో నెల్లూరు లో స్ధిరపడ్డారు. ఉత్తరాల ద్వారా ఆయన నన్ను పలకరిస్తూనే ఉండేవారు. నెల్లూరు వెళ్ళి ఒకసారి ఆయనను సందర్శించి వచ్చాను. నన్ను చూడగానే ఆయనకు పట్టరాని ఆనందం !!! ఆ కళ్ళల్లో ఎంత ఆనందమో, మాటల్లో చెప్పలేను! 

అలాంటి సహృదయుడు శ్రీ షరీఫ్ గారు ఆమధ్య కాలం చేయడం నిజంగా బాధాకరం !!! ఈనాడు భౌతికంగా మన ఎదుట లేకపోయినా షరీఫ్ గారు మన ఆలోచనలలో చిరంజీవి !!!

ఆయనకు నా హృదయపూర్వక నమస్కారములు.

మీకు అనేక ధన్యవాదాలు.