10_002 శ్రీపాద కథలు – గూడు మారిన కొత్తరికం

 

                              గ్రామీణ వాతావరణం నేపథ్యంలో బ్రాహ్మణ సంసారాలు – సంప్రదాయాలు, మర్యాదలు శ్రీపాద వారికి సుపరిచితం కనుక ఈ కథ కథలా కాకుండా, కల్పనలా కాక నిజజీవితం లాగే పాఠకుణ్ణి కట్టి పడేసే శైలిలో సాగుతుంది. ప్రతీ కథలాగే వీరి ఈ కథ కూడా మహేంద్రవాడ – రాజమహేంద్రవరం నేపథ్యంలో సాగుతుంది. ‘ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి ’ – అన్నట్లు మహేంద్రవాడ అంటే శ్రీపాద వారికి ఎనలేని ప్రేమాభిమానాలు అన్న విషయం ప్రతీ వాక్యంలోనూ ఋజువు అవుతుంది. ఆ గ్రామ పరిసర ప్రాంతాలన్నింటినీ సందర్భం కూర్చుకుని తనివితీరా వర్ణిస్తారు. ప్రతీ గ్రామం పేరూ ఆనందంగా చెప్పుకుంటారు.

నాలుగు మైళ్ళుంది అనపర్తి స్టేషన్ కూ, మహేంద్రవాడ కూ. లేకపోతే తణుకయి మాచవరం లాగ ద్వారపూడి లో రైలు దిగి జట్కా కుదుర్చుకుని మండపేట వంతెన మీద నించి మాచవరం రేవులోంచి రాయవరం మీదుగా చుట్టూ తిరిగి చేరుకోవాలి. కథాగమనంలో ఈ గ్రామ నామాలను చెప్పడం కూడా కల్పించి చెప్పినట్లు కాక కథలో అమిరిపోవడం శ్రీపాద వారి చమత్కారం.

అరటి తోటలు, చెరుకు తోటలు, బత్తాయి తోటలు, సన్న వరి పండే సుక్షేత్రాలు, ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, చుట్టూ గోదావరి కాలువలు, వూరి మధ్య దేవాలయానికానుకుని చక్కని చెరువు నీటితో శాంతి, దానికి భంజకం కాని వుల్లాసం, నిగ్రహం, దానికి అభ్యంతరం కలిగించని ఉత్సాహం, హద్దులేని విద్యలు, వాటికి వెలుగు తెచ్చే శమదమాలు. నిజంగా ఋషి వాటికలా లేదూ ఆ ఊరు.

ఎవరి హద్దులో వారుంటూ యువతీయువకులు ఆ ఊళ్ళో ఉన్నంత కలిసికట్టుగా మరే ఊళ్ళో ఉన్నారు ?

సభ్యత గుర్తుంచుకుని మసలుకోగల వారికి, సార్థక నామం అయి ఆ ఊరు కలిగించే మధురానుభూతి మరచిపోవడం శక్యమా ? అని తమ ఊరినీ, అక్కడ ప్రేమాభిమానాలు, ఆదరణ, ఆప్యాయత లను మధురానుభూతులన్ను మురిసిపోతూ వర్ణిస్తారు శ్రీపాద వారు. చిత్రం ఏంటంటే పాఠకులను ఆ పరిసరాలలోకి లాక్కొని వెళ్లిపోతారు. రచయితలాగే పాఠకుడు కూడా ఆ గ్రామీణ వాతావరణంలో తాదాత్మ్యం పొంది కథలో పాత్రలా మమేకం అవుతారు.

పాత్ర చిత్రణ నైపుణ్యం, కథాగమనం ప్రవాహం లాగా సాగడం, సన్నివేశానికి తగిన సంభాషణా చాతుర్యం పాఠకుని కట్టిపడేస్తుంది. నిజానికి కథలో కథ అంటూ ఏమీ లేదు. అలా అని లేకుండానూ లేదు. కథాకథన  నైపుణ్యంతో ఇటువంటి సంభాషణాత్మకమైన కథను చెప్పి పాఠకుని ఒప్పించవచ్చని మరోసారి శ్రీపాద వారు నిరూపించుకున్నారు.

“ నరసమ్మ అదే తొలిమాటు కాపురానికి వెళ్ళడం ” – అంటూ కథను ప్రారంభిస్తారు రచయిత. కాపురానికి వెళ్ళిన కొత్తలో అదే గూడు మారిన కొత్తరికం. కొత్త జంట కాపురంలో జరిగిన రసవత్తరమైన ప్రణయ సన్నివేశాలను రమణీయంగా ప్రబంధ కవిలాగా వర్ణిస్తారు శ్రీపాద వారు.

కథలో పాత్రలు – సోమసుందరంకు రెండవ పెళ్లి. పెళ్ళాం రాజమ్మకు ఏకైక సంతానం నరసమ్మ. మొదటి భార్యకు ఇద్దరు మగపిల్లలు. గారాబాల కుమార్తె నరసమ్మ. తల్లిదండ్రులకు ఆడ పిల్లంటే ఎనలేని ప్రేమాభిమానాలు. పిల్ల పెళ్లి చేసి ఏడాది అయినా వదిలి ఉండలేక ఆమెను కాపురానికి రాజమహేంద్రవరం పంపలేదు. కానీ అల్లుడు మరీ పట్టుబట్టడంతో అతికష్టం మీద నరసమ్మను రాజమహేంద్రవరం పంపిస్తారు. ఆమె వెళ్ళిన అయిదు రోజులకే సోమసుందరం ఓసారి వెళ్లి కూతురిని చూసి వచ్చాడు. అల్లుడూ, కూతురూ దాంపత్యాన్ని చూసి మురిసిపోయాడు. నరసమ్మ, భర్త రామారావు ఒకటే మాట, ఒకటే ప్రాణంగా ఆనందంగా ఉన్నారు.

వేసవిలో రాజమహేంద్రవరం వేడి మంగలం లాగు మిట మిటలాడిపోతూ ఉంటుంది. అరిటి బోదెలు నిండి ఉన్న ఇంట్లో మసిలిన మా చిట్టితల్లి ఒక్కమాటుగా అంతమార్పు సహించగలదా ? అని కూతురి పట్ల మమకారం గల తండ్రి హృదయాన్ని పరుస్తారు రచయిత.

విధిలేక కూతుర్ని అత్తారింటికి పంపాల్సి వస్తుంది. కాచిపొయ్యడానికటయినా, యిటయినా యే ముసలమ్మయినా ఉంటే ఇప్పుడయినా అతనింత ససేమిరా అనకపోను.

భోజనం దాకా యెందుకూ శీతాకాలంలో స్నానానికి కాసిన్ని వేణ్ణీళ్ళు కావాలన్నా, వేసవిలో రవంత మంచిగంధం కావాలన్నా, వర్షాకాలంలో తేరిన గోదావరి నీళ్ళు కావాలన్నా స్వప్న ఫలంగా వున్నాయతనికి.

ఆ రోజుల్లో ఆ తరంలో బ్రాహ్మణ కుటుంబాలలో ఉండే పరిస్థితులన్నీ కళ్ళకు కట్టే వర్ణనలు ఇవన్నీ. మూడు కాలాలలోనూ ఉండే శీతోష్ణ పరిస్థితులకు అనుగుణంగా సాగే ఉపచారాలు, ఆచారాలు అన్నీ చక్కగా తెలియజెప్పారు రచయిత.

కూతురి కాపురం చూసి తిరిగి వెళ్లిపోతున్న తల్లి, తండ్రితో మహేంద్రవాడ వెళ్ళి రెండు రోజులుండి రావాలనుకుంది నరసమ్మ. కానీ భర్తను విడిచి ఉండలేదు. తన తెలివి తేటలతో తననీ, భర్తనీ మహేంద్రవాడకు రమ్మని తల్లితో పిలిపించుకుని భర్తతో ప్రయాణమైన జాణ నరసమ్మ. పెళ్ళాం నేర్పుకి పరవశుడయిపోయాడు భర్త రామం.

వచ్చి కొద్ది దినాలే అయినా, యిదే తొలిమాటు రావడమున్నూ అయినా ఇంట్లో మూడోవాళ్లు ఎవళ్లూ లేకపోవడం వల్లా యవ్వన వ్యగ్రతవల్లా, వూరకలు వేసుకువచ్చే మహోత్సాహంతో ప్రణయసాగరంలో ఓలలాడించేస్తుంది ఆమె మరి ఆతణ్ణి.

ఆమె లేకపోతే నట్టిల్లు కారడవి అనుకునేటంతటి వెర్రివాడయిపోతున్నాడతను. ఆమె నిర్వహణ లేకుండా యే పనీ సాగదతనికి. భోజనం దగ్గర అతను ఏక పంక్తికి రమ్మంటే ఎవరయినా వస్తారేమో బాబూ అంటూ గునిసి గునిసి కూర్చుంటుంది పదార్థాలన్నీ చేతికందేటట్టుంచుకుని – అంటూ నరసమ్మ గడసరితనాన్ని చెప్తారు రచయిత.

పల్లెటూరి పిల్లయినా నాగరిక విలాసాలన్నీ బాగా తెలుసు ఆమెకి. ముసిముసి నవ్వులు నవ్వితే తాంబూల రాగానిక్కూడా జీవకళ పుట్టించే సహజ రక్తిమ గల ఆ పెదవులూ, విచ్చిన తామరపువ్వు మీద వాలిన జంట తుమ్మెదల్లాగ పచ్చని మొగానికి శోభకూర్చే కాటుక్కళ్లూ, నల్లతాచులాగ వాలుజడా, గూడకట్టు – వీటితో చికిలీ చేసిన మన్మథ బాణం లాగ ఆమె యెదుట మసలుతూ వుంటే అతనికిక నిద్రాహారలక్కర్లేదు – ప్రబంధ కవుల పోకడలో నరసమ్మ సౌందర్యాతిశయాన్ని వర్ణిస్తారు శ్రీపాద వారు.

నాగరికత తెలుసంటే బద్ధకం మనిషీ, రాయసం మనిషీ కాదామె. ఇంటి ముసలావిడ దగ్గర రకరకాల పిండివంటలు చెయ్యడం నేర్చుకుంది. ఆమె దగ్గర పొదుపూ, దక్షతా కూడా నేర్చుకుంది. తాను పులు కడిగిన ముత్యంలా వుంటూ ఇల్లు శుభ్రంగా ఉంచడం నేర్చుకుంది.  షట్కర్మయుక్త అయింది – అని ఆమె చురుకుదనాన్ని మెచ్చుకుంటారు.

ఈ యువదంపతుల వైవాహిక జీవన మాధుర్యాన్ని, హద్దు మీరని శృంగార చేష్టలు, అందంలో చికిలీ చేసిన మన్మథ బాణం, గడుసుతనం నోరు విప్పి చెప్పకుండా తెలివి తేటలతో యుక్తిగా తన కోరికలను నెరవేర్చుకోగలిగిన నెఱజాణతనం – వీటన్నింటినీ స్వభావరమణీయంగా చిత్రించారు శ్రీపాద వారు.

ఈ కథలో తల్లి రాజమ్మా. కూతురు నరసమ్మా, భర్త రామారావు పాత్రల సంభాషణల పాఠకులను కట్టిపడేస్తాయి.

ఆప్యాయత ఒలికిస్తూ, నిండు మనసుతో మాటలాడే మహేంద్రవాడ గ్రామంలోని మహిళలు, వారి నామధేయాలు కూడా విలక్షణమే. లచ్చమ్మ, పరాచికాలాడే సోదెమ్మా, గున్నమ్మా, నిమ్మన్న గారి సీతమ్మా, నువ్వెప్పులు వచ్చావే నలసమ్మ వొదినా అంటూ ముద్దు ముద్దు మాటలతో మురిపించే చిన్నపిల్ల సుందరమ్మా – ఇత్యాది స్త్రీ పాత్రలు, వారి సంభాషణా వైచిత్రి పాఠకులకు ఆనందం కలిగిస్తుంది. ఆ పాత్రల మాటలు వింటూ పాఠకుడు వాళ్ళలో తానూ ఒకడయిపోయి కథలో తాదాత్మ్యం చెందుతాడనడంలో అతిశయోక్తి లేదు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథాకథన నైపుణ్యం అంత గొప్పది. ప్రతీ కథలో లాగే ఈ కథలోనూ తూర్పు గోదావరి జిల్లాలోని వెలనాటి వైదిక కుటుంబాలలో నిత్యమూ వాడుకలో ఉన్న భాషను యథాతథంగా ప్రయోగించి పాఠకులను మమేకం అయ్యేలా చెయ్యడంలో శ్రీపాద వారి ప్రతిభ నిరుపమానమైనది.

విషయం ఏమీ లేకుండా నిజానికి కథ కూడా ఏమీ లేకుండా కేవలం పాత్రల సంభాషణా చాతురితో పఠితలను మెస్మరైజ్ చేసే గారడీ శ్రీపాద వారికి తెలిసినంత బాగా ఇంక ఎవరికీ తెలియదేమో ?

అప్పుడే కరిగిపోసిన బంగారు కణిక మీద పూతలాగా తన రాకతో ఆపాదమస్తకమూ అతని మేన మహోల్లాసం ఉరకలు వేస్తోంది. చాలా సమయం తరువాత దగ్గరకి వచ్చిన భార్యను చూసిన భర్త హృదయ స్పందనను మధురమైన భాషలో చెప్తారు.

ఆమె రాకా, ఈమె పోకా – పువ్వులూ, రాళ్ళు కలిసి శిరస్సున పడ్డట్టానిపించాయి రామారావుకి – వంటి పద ప్రయోగాలు విశేషంగా కనిపిస్తాయి.

ఆ రోజుల్లో డికాషన్ గుడ్డతో వడగట్టే అలవాటును కూడా చెప్తారు శ్రీపాద వారు.

మనస్సు చమత్కృతం అయింది ఆమెకు. అతని చేతులలో కరిగిపోవాలి.

ఇది మధురానుభూతే కాని అవతల రాజయోగం భంగపడిపోయింది. ఇలా ఒక్కొక్క భావాన్ని ఒక్కొక్క వాక్యంలో చెప్తూ తర్వాత ఏమి చెప్తారోనన్న ఉత్కంఠ పాఠకునికి రేకెత్తించడంలో సిద్ధహస్తులు శ్రీపాద వారు.

పల్లెటూళ్ళో ఒక్కొక్క ఇంటినించి వ్యక్తులు వచ్చి పలకరింపులు, మర్యాదలు సహజంగా వర్ణించారు.

ఆలస్యమైనా ఇంటికి రాని భర్త కోసం ఎదురు చూస్తున్న నాయికా వర్ణన…..  

నవ మన్మథాకారంలో రామం స్పురిస్తాడు…..  

వచ్చేశారేమో అని వెడుతుంది మెరుపు తీగ అయి….  

ఇంట్లోకి దూకేస్తుంది ఉత్తరక్షణాన….  

హాలులోనే ఉన్నా చూపులు వీధి గుమ్మంలోనే ఉంచి…  

చీమ చిటుక్కుమంటే ఉలిక్కిపడుతుంది…..  

ఒళ్ళు ఝల్లుమందామెకి. మనసు ప్రఫుల్లం అయింది…..  

– ఇలా వర్ణనా నైపుణ్యంతో, చక్కని సంభాషణా చాతుర్యంతో పాఠకులను పరవశింపజేస్తారు రచయిత. కథా సన్నివేశానికి తగిన వాతావరణాన్నీ, నేపథ్యాన్ని చక్కగా అమర్చుకున్నారు. పాత్రల సంభాషణకు అగ్రస్థానం ఇచ్చారు. కథా కథనా శైలితో నైపుణ్యంగా కథను చెప్పి పాఠకులను కూడా కథలో లీనం చేయడంలో శ్రీపాద వారు కృతకృత్యులయ్యారు.

 

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦