09_019 వెలుగు నీడలు

కం.        లోకపుచీకటి కవ్వల

            నేకైకమహామహాస్సు వీవే ! నాలో

            చీకట్ల నోపరంజ్యో

            తీ ! కృప బోనాడు శుభదదృగ్జాలములన్.

 

ఆ. వె.     శేషతల్పమందు శ్రీమహాలక్ష్మితో

            నిండుకూర్మి నెసగుచుండుస్వామి !

            నాయెదండ కొలువు సేయుమీ విరిపాన్పు

            కన్న మెత్త నయ్య ! కవిమనస్సు !

 

ఆ. వె.     కనవె నాతపస్సు – కవితాతప స్సిది –

            వెలయుచుండు తపము పలురకాలు !

            చిన్నచూపు చూచి చిన్నబుచ్చకుము నీ

            స్నుషకు నేను కూర్మిసుతుడ నోయి !

 

తే. గీ.     శత్రులకు మూడు జన్మలే చాలు నన్ను

            పొందుటకు; వారె మిత్రు లై ముక్తి నొంద

            నేడుజన్మలు వలె నంటివే మహాత్మ !

            అయయొ ! ఇది యేమిరాజకీయమ్ము ? స్వామి !

 

ఆ. వె.     పాపపాన్పుపైన పవళించు టెప్పటి

            కైన కీడుసుమ్మి అబ్జనాభ !

            లలిత మగుచు పాపరహిత మైనట్టినా

            యెడదపాన్పుమీది కిపుడె రమ్ము !

 

ఉ.         మోహము దాహ మై బ్రతుకు ముంచెడువేళల నోడిపోయి దా

            సోఽహ మటంచు నీయడుగు లాత్మ తలంతును నీవె దిక్కుగా

            ఊహకలంత వో నడచి “ ఉంటిని నీ ” కని రాగదే ప్రభూ !

            సోఽహ మటంచు నే నెమలి నై పురి విప్పుచు నాట్యమాడగన్

 

తే. గీ.     ఎడదప్రమిదను స్నేహము నింత నింపి

            జ్ఞానదీపము వెలిగించినాను స్వామి !

            నశ్వరం బైనబ్రతుకులో శాశ్వత మగు

            మేలియానంద మిచ్చి న న్నేలుకొనుము !

 

తే. గీ.     తప్తజగతిని రవ్వంత దయ దలంచి

            నీలిమేఘాలపందిరిన్ వేసి కొసరి

            వసుధ గురియింతు ముత్యాలవానజల్లు !

            పుడమి నిలువెల్ల పులకలు పొడమునట్లు !

 

ఆ. వె.     వేపవిత్తు నాటి తీపిపం డ్లడిగిన

            నీవుమాత్ర మెట్టు లీయ గలవు !

            పాపకర్మ చేసి ఫలము మంచిది కోరు

            ఖలులకోర్కె తీర్పగలవె ? స్వామి !

 

తే. గీ.     పూలపై నుండి వచ్చెడుగాలికైన

            జంటగా వచ్చి వాసన లంటుచుండ

            నింద్రియమ్ములసంగతి నింత చిక్కు

            ప్రజకు వాసన లంటు టబ్రమ్మె ? స్వామి !

 

తే. గీ.     తాను నిర్మించుగూటిలో తానె చిక్కి

            బేల యై యంతరించును సాలెపురుగు ;

            కోరికలసాలెగూటిలో కూలబడుచు

            కోరి చిక్కులు కొనితెచ్చుకొను నరుండు !

 

తే. గీ.     మానవుండుగ జన్మించేనేని దేవు

            డైన మాయకు లోబడు టబ్బురంబె ?

            అకట ! బంగారులేడికై యాస జేసి

            రాము డెన్నెన్నియాపదల్ కాంచలేదు ?

 

తే. గీ.     మట్టిలో మట్టి కానున్నమర్త్యు డకట !

            అవని యంతయు తనసొంత మని తలంచు !

            ప్రాణవాయువు రవ్వంత పైకి పోవ

            తనదిగా నెంచుతనువైన తనది కాదు !

 

తే. గీ.     దేహము గతింపగానె ఆస్తియు గతించు

            జీవుడు గతించినను వానిచెంతనుండి

            పుణ్య మతనిని పరలోకమునను గాచు !

            పుణ్యమును మించెడుధనమ్ము పుడమి లేదు.

 

తే. గీ.     మనిషిగా పుట్టి చూడుము – మాయవస్థ

            తెలియవచ్చును నీకు ఓదేవదేవ !

            అవనిపై రాముడుగ పుట్టి అపుడు నీవు

            పడిన కష్టాలు మఱచినావా ? మహాత్మ !

 

శా.         చూచీ చూడక యెఱ్ఱయందు కడు మోజుం జెంది ముం దేగి జి

            హ్వాచాపల్యముచేత గాలమున తా నై చిక్కుమత్స్యమ్మటుల్

            నీచం బౌనిహలోకవాంఛల నశాంతిం జెంది చిత్తమ్ము ఫ్రే

            రేచన్ జేనెడుపొట్టకై నరుడు బారెండాసతో కూలడే ?

 

చ.         శరణము కోరుచుంటి సువిశాలప్రపంచము చూచి భావనా

            హరిణము సత్పథమ్ము విడనట్లుగ చూడగదే యటంచు నీ

            చరణము లాత్మలో తలతు సంయమిచిత్తనివాస ! నీకృపా

            కిరణము సోకనిమ్ము పులకించి భవమ్ము తరించిపోవగన్.

 

ఉ.         ఉత్తమ మైనజన్మ మిది యొక్కటి మాకు నొసంగినావు దే

            వోత్తమ ! అందులోన సగ మూరక నిద్దురలోన ముంచినా

            వత్తెఱ గేమి ? పట్టపవ లంతయు పూర్తిగ పొట్టత్రిప్పలై

            యెత్తఱి నిన్నుగూర్చి స్మరియుంతుము ? స్వామి ! అనుగ్రహింపవే !

 

తే. గీ.     ఆపదల మ్రొక్కులిడి భోగమందు నిన్ను

            జనులు మఱచుచు నుండెద రని తలంచి

            ఉల్లమున నిన్నె స్మరియించుచుంటకొఱకు

            ఆపదలు తెచ్చి పెట్టెదవా ? మహాత్మ !

 

ఆ. వె.     నిన్ను తలచువేళ నేను నేనే కాను !

            నీవ నేను – ఎఱుగ నేర్తునేని !

            అరయ లోనిమాయతెర యడ్డు తొలగుచో

            నేను లేను – కలవు నీవ స్వామి !

 

తే. గీ.     పేరుకొనునూనెలో వత్తి వెలుగుచుండ

            క్రమముగా నూనె యంతయు కరగిపోవు

            ప్రాణదీపము సుంత యారగనె యింత

            కాయమున రక్త మంతయు గడ్డకట్టు !!!

 

తే. గీ.     ఎంత పెనుగాలి వీచిన నిన్నియేండ్లు

            ప్రాణదీపము వెలుగుటకై రవంత

            కానిపించనితైల మెక్కడిది తెచ్చి

            పోసితీవొ ? విప్పు మీగుట్టు పురుషసింహ !

 

తే. గీ.     ప్రముఖులకు తోచు సప్తస్వరాలవఱకె !

            ఇన్నికోట్లగళాలలో చిన్నిస్వరము

            లెన్నికోట్లనొ దేని కదే విలక్ష

            ణముగ నిలిపితి ! నీనేర్పునకు జొహరు !

 

తే. గీ.     మండుచుండెడువాయువు నిండుకొన్న

            ప్రాత దయ్యు “ సిలెండరు ” పనికివచ్చు !

            ప్రాణవాయువు ఖర్చైనప్రాతదేహ

            మెందులకు కూడ పనికిరా దేమి ? చెపుమ !

 

తే. గీ.     కూటిపేదల కెందఱో కోట్లకొలది

            పుట్టుకొనివత్తురు దరిద్రపుంజనాలు !

            నీదయాదృష్టి యిసుమంత లేదయేని

            ఆలుమగ లెల్ల గొడ్డు వా రై తపింత్రు !