09_019 ‘ మురళీ ‘ మాధురి

ఆ మహానుభావుడు… మహానుభావుడైనప్పటికీ సామాన్యుడిలాగా అందరితో కలిసిపోతూ నవ్విస్తూ ఉండేవారు. ఆయనతో కలిసి హాయిగా నవ్వినదీ, ఆయన ఎంతో ఉత్సాహంగా “చెవాలియర్” అవార్డు చూపించిందీ…”ఈనాడు” పనిలో భాగంగా గాని, ఆయన అభిమానిగా గాని ఎప్పుడు నమస్కారం పెట్టినా “హలో” అంటూ మంద్రస్వరంతో పలకరించిన సందర్భాలన్నీ మళ్ళీ జ్ఞాపకాలుగా పలకరించాయి. అదేనండీ, బాలమురళి గారి గురించి. ఆయన జయంతి అనగానే, “పుట్టినరోజు” అనకుండా “జయంతి” అంటున్నారే అని బాధపడుతుండగా నా ఆలోచనలు మాత్రం మరొకసారి వెనుక బాట పట్టాయి…..

అవి మేము కొత్తగా చెన్నై వచ్చిన రోజులు. ఎమ్మెస్, బాలమురళి, బాలసుబ్రహ్మణ్యం, పీబీ శ్రీనివాస్, అంజలీదేవి, కె. విశ్వనాథ్, రాజసులోచన  గార్ల వంటి వెనకటి తరం తెలుగు ప్రముఖులందరూ ఇక్కడే ఉంటారు, సాంస్కృతిక కార్యక్రమాలకి వస్తూ వుంటారు అని తెలిసి సంబరపడ్డాను. కంట్రీ క్లబ్ కార్యక్రమంలో (2004) అనుకోకుండా పీబీ శ్రీనివాస్ గారిని చూడడం, ఆయనతో ఫోటో దిగడం కూడా జరిగింది. సరే, ఇక్కడికొచ్చిన ఏడాదికి ఈనాడు తమిళనాడులో పని చేసే అవకాశం రావడంతో గొప్పవాళ్ళని ప్రత్యక్షంగా కలిసి ఇంటర్వ్యూ కూడా చేసే అవకాశం రావడం నా సుకృతమే అనిపించింది. ఈ నేపథ్యంలో.. 2005లో అక్కడ చేరాక చెన్నైలో ప్రతి ఏడూ డిసెంబర్, జనవరిలలో పెద్ద ఎత్తున జరిగే “మార్గళి” (మార్గశిర) సంగీతోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనాలు రాయమన్నారు. అప్పుడు అనుకున్న అనేక అంశాలలో “fusion” సంగీతం గురించి కూడా రాద్దామని, బాలమురళి గారి అభిప్రాయం కోసం ఫోన్ చేశాను. “Fusion is confusion” అంటూ చాలా బాగా మాట్లాడారు. అయినా ఫోన్లో కాకుండా నేరుగా వస్తే ఇంకా బాగా చెప్పగలనన్నారు. ఆయన ఆహ్వానానికి పొంగిపోయా.

ఒకసారి పవన్, నేను ఇద్దరం వెళ్ళాము. ఆ ఇంట్లోని మొదటి అంతస్తు అంతా ఆయనకే కేటాయించబడింది. అక్కడి హాల్లోనే అతిథులను కలుస్తారు. చాలా బాగా మాట్లాడారు. కాసేపటి తరువాత తన గదిలోకి తీసుకెళ్లి తన “చెవాలియర్” మెడల్ ( 27 దేశాలు ఏకగ్రీవంగా అనుకొని ఫ్రాన్స్ లో ప్రదానం చేసినది ) ఎంతో అపురూపంగా చూపించారు. ఆ అవార్డు తనకి ప్రకటించినప్పుడు ‘ద హిందూ’ దినపత్రిక ఒక పేజీ మొత్తం తన గురించి రాసిన విషయాన్ని సంతోషంగా గుర్తు చేసుకున్నారు. తెలుగు దినపత్రికలు వార్త మాత్రం ప్రముఖంగా ఇచ్చి ఊరుకున్నవైనాన్ని(ఆయన కోసం ఎక్కువ స్థలాన్ని కేటాయించకపోవడాన్ని) గుర్తు చేశారు. ఆ తరువాత “మీరు మాతో ఒకసారి భోజనానికి రావాలి” అంటే, “ఎందుకూ? అందరం కలిసి ఇక్కడే భోంచేద్దాం.” చాలా మామూలుగా అనేశారు. ఆ మాటకి (మూటకి) మేమిద్దరం ఉబ్బి తబ్బిబ్బైపోయాం. అంతలోనే, “అందరూ కచేరీ చేయండనేవాళ్ళే కానీ భోజనం చేయండని అనేవాళ్ళు లేరు” అని నవ్వించారు. “ఐ వాంట్ బార్ విత్ సాంబార్” అని కూడా అన్నారు. ఆ తరువాత కిందికెళ్ళి బయటికెళ్తూ అమ్మగారికి నమస్కారం చేశాం. ” అప్పుడప్పుడూ ఇలాగే వస్తూ పోతూ ఉండండి” అని ఆ మహాఇల్లాలు ఆప్యాయంగా అనేసరికి మనసంతా ఎంతో హాయిగా అనిపించింది. వీళ్ళూ మనలాంటి వాళ్ళుగా ఉండడం ఆశ్చర్యం కలిగించింది.

కొంత కాలం తరువాత మా అక్క కూతుర్లు విష్ణు మహతి (మా అక్కా బావ అనుకోకుండా పెట్టారు ఈ పేరు. బాలమురళి గారి ఒక కూతురి పేరని అప్పట్లో వాళ్ళకి తెలీదు), రామ లహరి, ఆడపడుచుల కూతుర్లు అపురూప, వీణ వచ్చిన ఒక వేసవిలో ఫోన్లో appointment తీసుకొని ఆయనింటికి వెళ్ళాం పవన్, నేనూ మా పిల్లవాడు వినయ దత్తని కూడా వెంటేసుకొని. పవన్ తన కొత్త, పెద్ద కెమెరా తీసుకురావడం మరచిపోలేదు సుమా! సరే, వెళ్ళాక ఆయన ఎంతో సరదాగా మాట్లాడారు. వాళ్ళు పాడిన “శ్రీ గణనాథ” పిళ్ళారి గీతం విని బాగుందన్నారు. ఫోటోలు తీసుకుంటుంటే “నువ్వు గురువువి (పిల్లలకి), నువ్వూ రా” అన్నారు. అక్కడున్నంతసేపూ పిల్లలని, మమ్మల్నీ హాయిగా నవ్వించారు. పిల్లలు అక్కడ ఉన్నంతసేపూ ఎంతో సంతోషంగా గడిపారు. ఆబాలగోపాలన్నీ అలరించడం అంటే అదే అనిపించింది. ఆ తరువాత ఇంకొక్కసారి నేనొక్కదాన్నే పని మీద వెళ్ళాను. మళ్ళీ ఎప్పుడూ వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం రాలేదు, నేను కల్పించుకోలేదు. (దివికేగడం వల్ల చివరిలో ఆయనే పిలిపించుకున్నారు.)

మళ్ళీ కొంత కాలం తరువాత కంచి మహస్వామికి సంబంధించిన కార్యక్రమంలో బాలమురళి గారి రికార్డింగ్ ఉందని ఆకాశవాణి, చెన్నైలో (అప్పట్లో తెలుగు విభాగంలో ప్రొడ్యూసర్ గా, అనంతరం మార్కెటింగ్ శాఖలో పని చేసిన) ప్రస్తుతం సహాయ సంచాలకురాలిగా విధులు నిర్వహిస్తున్నలలిత అక్క ( గోడా లలిత) నాకు ఫోన్ చేసి చెప్పి నన్ను రమ్మంటే, నా స్నేహితురాలు శ్రీదేవిని కూడా తీసుకొని వెళ్ళాను. రికార్డింగ్ తరువాత ఆయన, లలితక్క, ఆ కార్యక్రమ సిబ్బంది, మేమిద్దరం కాసేపు బయట నిలబడి మాట్లాడుకున్నాం. ఆయన చుట్టూ మూగిన మా అందరితో ఎంతో చక్కగా మాట్లాడారు. కొన్ని రికార్డింగుల విషయం, ఆమధ్యలో విడుదలైన ‘శ్రీరామదాసు’ సినిమా పాటల గురించి ప్రస్తావించారు. మేమిద్దరం ఆయనతో ఫోటోలు కూడా దిగాము. వాటిని శ్రీదేవి FB లో పోస్ట్ చేస్తే ఎంత స్పందన వచ్చిందో!

ఆయన కచేరీకి వెళ్ళి, కచేరీ తరువాత ఆయన ఇంటికి వెళ్తుండగా ఆతృతగా ముందుకెళ్ళి, “నమస్కారం గురువు గారూ. ఈనాడు నుంచి” అనగానే గుర్తు పట్టకపోయినా, మంద్రస్వరంలో “హలో” అనేవారు. మళ్ళీ కొంత కాలానికి “మైలాపూర్ కాపాళీశ్వర దేవాలయంలో బాలమురళి కచేరీ, వెళ్దామా?” అని మా (ఆయన) తాతగారు గుడిమెళ్ళ వెంకటేశ్వర్లుగారు అడిగితే… ఆయన, పవన్, పిల్లవాడు, నేనూ వెళ్ళాము. అయన గాత్రం ఆద్యంతం మమ్మల్ని తడిసి ముద్ద చేయగా, కచేరీ అయ్యాక ఆయనను పలకరించడానికి వెళ్ళాము. ఆయన బయటికి వచ్చే దారిలో అటూఇటూ జనం. కష్టమ్మీద ఆయన ముందుకి వెళ్ళి, మళ్ళీ పరిచయం చేసుకొని, “హలో” అని మంద్రస్వరంలో అనిపించుకొని, తాతగారిని పరిచయం చేశాను. ఆయన వెంటనే తాతగారి చేతిని తన చేతిలోకి తీసుకొని తలమీద పెట్టుకున్నారు, ఆశీర్వదించమని. తాతగారి ఆనందానికి అవధులే లేవు!

ఆ తరువాత కూడా శ్రీకృష్ణ గానసభలో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ కార్యక్రమంలో ఆయన కచేరీ ఉందని ప్రకటిస్తే మళ్ళీ అందరం వెళ్ళాం. ఆయన రెండు పాటలు పాడేసి వెళ్ళిపోయారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆయన పేరు చెప్పుకొని జనాన్ని పోగేసుకున్నారని తిట్టుకున్నాం. సరే, బాలమురళి గారు అక్కడినుంచి వెళ్ళేటప్పుడు.. షరా మామూలే.. నా ప్రవర అంతా చెప్పాను. “హలో” అనిపించుకున్నాను. అదే చివరి “హలో” అని మాత్రం అనుకోలేదు. మూడు నాలుగేళ్ళు అలా వెళ్ళిపోయాయి. కొన్ని నెలల క్రితం ఆయన పుట్టినరోజు ( 86 నిండిన ) సందర్భంగా జరిగిన కార్యక్రమానికి శ్రీదేవి, మా మంచి స్నేహితులు  కమలాకర రాజేశ్వరి ఆంటీ, శివరామ్ అంకుల్ వాళ్ళు వెళ్ళారు. నీరసంగా ఉండి నేను వెళ్ళలేకపోయాను. మరింక వెళ్ళలేను కూడా.

అన్ని జ్ఞాపకాల కన్నా ముందు……                       

హైదరాబాద్ లో ఉండగా ఆయన కచేరీలు ఎన్నో చూశాను. తెలుగు విశ్వవిద్యాలయంలో ఆయన సప్తస్వరాల గురించి చిన్న ఉపన్యాసం చెప్పగా విన్నాను కూడా. నిజానికి ఆరోజు పాపం ఆయన ప్రసంగిద్దామని వచ్చారా… సభా మర్యాదను అనుసరించి ఆయన గురించి మూడు పేజీల పరిచయ వాక్యాలను నిర్వాహకులు చదివారు. ముప్పై పేజీల వివరాలను అతి కష్టమ్మీద కుదిస్తే మూడు పేజీలకి వచ్చిందని చెప్పారు. సరే, ఇక ప్రసంగం మొదలవుతుందా… అంటే, అప్పుడే ఎలా అవుతుంది! అందరూ ఆ వాగ్గేయకారుడిని సత్కరించుకోవాలని, కాళ్ళకి దండం పెట్టి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని అందరికీ ఉంటుంది మరి. సంగీత, నాట్య విభాగాలకి చెందిన ఆ విశ్వవిద్యాలయ సిబ్బంది అంతా, మరికొంతమంది కార్యక్రమం చూడడానికి వచ్చిన ప్రముఖులూ ఒకరి తరువాత ఒకరు ఆయన దగ్గరికి వెళ్ళి శాలువా, పుష్పగుఛ్ఛం ఇలా ఏదో ఒకటి సమర్పించుకొని సంతృప్తి పడ్డారు. విశ్వవిద్యాలయం వారు బాలమురళి గారిని మైసూరు పేటా వంటి అలంకారాన్ని ఆయన శిరసు మీద ధరింపజేశారు. ఇక అప్పుడు ఆయనకి మాట్లాడే అవకాశం వచ్చేసరికి సహజంగానే సమయాభావమైంది. ఆయన మాట్లాడుతూ, “ సప్తస్వరాల గురించి మాట్లాడాలంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్వరం గురించి మాట్లాడాలి, ఇలా ఈ కాసేపు సరిపోదు. మీరు ఏర్పాటు చేస్తే ఒక వారం పాటు ఈ విషయం మీద కార్యక్రమం పెట్టుకుందాం.” అన్నారు. వెంటనే విశ్వవిద్యాలయం వారు ‘ఏర్పాటు చేస్తామ’ని సంతోషంగా సమాధానం ఇచ్చారు.( కానీ ఇది కార్యరూపం దాల్చినట్టు లేదు. ఒక విశ్వవిద్యాలయం వారం పాటు సమయాన్ని కేటాయించడం, అందులోనూ బాలమురళి గారికి కుదరడం అంటే మాటలు కాదన్నది సత్యం.) ఇక్కడ కొసమెరుపుగా ఇంకొక విషయం గురించి చెప్పుకోవాలి. ఎంతమంది ఆయన కోసం వరుసగా నిలబడినా, ఎంత కాలాతీతమైనా ఆయన ఏమాత్రం విసుక్కోకపోవడమే కాదు, అందరినీ నిజమైన చిరునవ్వుతో పలకరించారు. మైకందుకున్నాక ‘మళ్ళీ వచ్చినప్పుడు ఈ సన్మానాలన్నీ వద్దు’ అని స్పష్టంగా చెప్పారు. ‘ఈ కిరీటం లాంటివి కూడా వద్దు, బంగారందైతే తప్ప’ అన్నారు. ఇక సభ ఎలా స్పందించి ఉంటుందో వేరే చెప్పాలా! నాకనిపిస్తుంది, ఆయన గొప్పదనం ఒక్క పాటలోనే (సాహిత్యంతో కలిపే అంటున్నా) లేదు. పాటలో ఎంతుందో,  మామూలుగా మాట్లాడే మాటలో కూడా ఉంది. ఆ సమయస్ఫూర్తి, ఆ హాస్యధోరణి తిరుగులేనివి. పైగా ఆయన ఓపిక కూడా మహా గొప్పది. ఆయన గురించి చెప్తూ ‘నవ్వుతూ’, ‘నవ్వారు’ లాంటి మాటలని అప్పుడప్పుడూ ఉపయోగించాను. అసలు ఆ మాటలే అనక్కరలేదు. ఆయన ఎప్పుడూ సహజంగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు.      

 ఒకసారి ‘శిల్పారామంలో బాలమురళి గారు కొంతమంది విద్యార్థులకి పాటలు నేర్పుతారు, అందరూ రవచ్చ’ని సాంస్కృతిక శాఖ ప్రకటించింది. మా అమ్మ తోడు రాగా నేనూ ఒకరోజు వెళ్ళాను. ఆరోజు నేర్పిన పాట “రాజరాజ రాజేంద్ర రాజ గురురాజ రాఘవేంద్ర! శరణం శరణం శరణం శరణం పరివ్రాజ.” ఆరోజుతో నేనూ ఆయన ప్రత్యక్ష శిష్యురాలినైపోయా. ఇది జరగడానికి కొన్ని సంవత్సరాలకి ముందు ఆయన కచేరీ శిల్పారామంలోనే ఒక కొండ మీద జరిగితే మా అక్క కుటుంబంతోపాటు వెళ్ళాను. ఆ సందర్భంగా మా గురువు నీతా చంద్రశేఖర్ గారు నన్ను పరిచయం చేశారు… “నా స్టూడెంట్ మాధురి” అని. వెంటనే ఆయన “మురళీ మాధురి” అన్నారు. వెలకట్టలేని ఆ మాట ఆయన అన్నాక నాకు కలిగిన సంతోషం ఇంతని ఎవరైనా లెక్కగట్టగలరా!?  

***************** *****************