10_002 తో. లే. పి. – సత్తిరాజు రామ్‌నారాయణ

 

సత్తిరాజు వారి వంశ పెన్నిధి లో మూడు అనర్ఘరత్నాలు ~ 

ముగ్గురు అన్నదమ్ములు. 

లక్ష్మీనారాయణ గారు, శంకరనారాయణ గారు, రామ్‌నారాయణ గారు.

అయితే విశేషమేమంటే ఈ ముగ్గురికీ మారు పేర్లు, బ్రాండ్ నేమ్స్ కూడా ఉన్నాయి. అవేమిటంటే…

లక్ష్మీనారాయణ గారు — బాపు గారు

శంకర నారాయణ గారు – శంకర్ గారు 

రామ్‌నారాయణ గారు – రాంపండు గారు. 

ఈ ముగ్గురూ, వీరి కుటుంబాలు కూడా నాకూ, మా కుటుంబానికీ కూడా ఎంతోకాలం గా అత్యంత సన్నిహితులు. మేము అందరం అప్పుడప్పుడు సరదాగా కలుసుకోవడం, కలిసి కబుర్లు చెప్పుకోవడం, తరచుగా ఉత్తరాలు రాసుకోవడం, వీలయితే ఫోన్ చేసి మాట్లాడుకోవడం పరిపాటి. 

అయితే బాపు గారి గురించి, ఇటీవల శంకర్ గారి గురించి ఈ శీర్షిక లో ప్రస్తావన చేయడం జరిగింది. 

 కాగా, ప్రస్తుతం రాంపండు గారి గురించి ఈ తోకలేని పిట్ట లో ప్రస్తావిస్తున్నాను. 

రాంపండు గారు, ఆయన శ్రీమతి, వారికి ఒక కుమార్తె… ఇదీ వారి కుటుంబం. రాంపండు గారు అప్పట్లో మ్యూజియం రోడ్, విజయవాడ లో బెస్ట్ ప్రెస్ ని స్థాపించి నిర్వహించేవారు. వ్యాపారం బాగానే సాగిపోయేది. రెండు, మూడు సందర్భాల్లో వారికి కలుసుకోవడం జరిగింది. నా అభ్యర్థనపై బాపు గారు నాకు లెటర్‌హెడ్ డిజైన్ చేసి పంపగా దానితో లెటర్‌హెడ్ పుస్తకాలను రాంపండు గారి బెస్ట్ ప్రెస్ లోనే ప్రింట్ చేయించుకున్నాను రాంపండు గారి సహకారంతో. అప్పట్లో నేను ఉద్యోగ రీత్యా ధవళేశ్వరం, ఖమ్మం లలో ఉండేవాణ్ణి. అక్కడనుండి పని మీద విజయవాడ వస్తే ఆయనను కలుస్తూ ఉండేవాడిని. తరువాత మరికొంత కాలానికి గుంటూరు కి ట్రాన్స్‌ఫర్ మీద వచ్చాను – అప్పుడప్పుడు విజయవాడ కి పని మీద రావలసిన సందర్భాలు ఉండేవి. రాంపండు గారు సొంతం గా ఇల్లు కొనుక్కుని మారుతీ నగర్ లో విశ్వనాథ సత్యనారాయణ గారి వీధి లోనికి మారారు. అక్కడ వాళ్ళ ఇంటికి వెడుతూండడం జరిగింది. వారి శ్రీమతి గారు డబుల్ ఎం. ఏ. చేసి నిర్మల కాన్వెంట్ లో ఉపాధ్యాయురాలుగా పని చేసేవారు. అప్పటికి వారి అమ్మాయి గాయత్రి చిన్న పిల్ల. ఆ పాప చేతిలో చాకలెట్ల పేకట్ పెడితే ముఖం వెలిగిపోయేది. సంతోషం తో నన్ను అప్పటినుండి చాకలెట్ల అంకుల్ అని పిలిచేది. వారి ఇంటి చుట్టూ ఉన్న పెద్ద పెరటి స్థలంలో మామిడి చెట్లు వాటికి నిండా మామిడికాయల గుత్తులు వేళ్ళాడుతూ ఉండేవి. వెళ్ళినప్పుడల్లాగా, ఆ కాయలు కోసి నా చేతులలో పెట్టేవారు రాంపండు గారు, ” వీటితో పప్పు గానీ, పచ్చడి గానీ చేసుకోండి… బాగుంటాయి ” అంటూ. మధ్యలో చిన్న చిన్న సీసాలలో మామిడికాయ ఊరగాయలు నింపి ప్రేమగా ఇచ్చేవారు ఆ దంపతులు. అలా అక్కడ నేను ఉన్న సందర్భం లోనే ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారి పుత్రుడు, పావని శాస్త్రి గారు వారింటికి రావడం జరిగింది. రాంపండు గారు నన్ను ఆయనకు పరిచయం చేసారు. అదొక మధురమైన అనుభూతి. 

ఒకసారి నా శ్రీమతి సీతాదేవి అస్వస్థురాలు అయింది. వైద్యుని సంప్రదించి తాను ఇంటివద్దే చికిత్స తీసుకుంటుండగా… సంగతి తెలుసుకుని ఒకరోజు డాక్టర్ ఫణి గారి ( వారి అన్న శంకర్ గారి బావమరిది ) ని తనతో వెంటబెట్టుకుని తీసుకువచ్చారు రాంపండు గారు. ఫణి గారు విషయమంతా విని చికిత్స విషయమై తగు సలహాలు ఇచ్చారు. 

నాకు మరొక సందర్భం లో తీవ్ర అనారోగ్యం సంభవించి కోలుకుంటున్న దశ లో రాంపండు గారు నాకు ధైర్యం చెప్పి గాయత్రీ మంత్రం నిరంతరం జపిస్తూ ఉండమని సలహా ఇస్తూ, ఆ మంత్ర ప్రాధాన్యత గురించి వివరిస్తూ ఒక ఉత్తరం వ్రాసారు. అదే ఈనాటి తోక లేని పిట్ట !

కొంతకాలానికి కొన్ని కుటుంబ పరిస్థితుల దృష్ట్యా, విజయవాడ లో ఇంటిని అమ్మేసి మకాం హైదరాబాద్ కి మార్చి అక్కడే స్థిరపడ్డారు రాంపండు గారు. అయినా అక్కడ నుండి మధ్య మధ్యలో నాకు ఫోన్ చేసి మాట్లాడుతూండేవారు. 

రాంపండు గారు నిగర్వి మాత్రమే కాదు… స్నేహశీలి… చాలా సరదాగా నిర్విరామంగా మాట్లాడుతూ కబుర్లు చెబుతూ ఉండేవారు. అల్లాంటిది ఉన్నట్టుండి ఆయనకు ఆరోగ్యం తీవ్రం గా దెబ్బ తిని, ఆపరేషన్ చేయించుకుని మరి దాని నుండి కోలుకోలేక కన్నుమూసారు. ఈ దురదృష్ట సంఘటన జరిగిన కొంత కాలానికే వారి శ్రీమతి గారు కూడా పరమపదించారు.   

రాంపండు గారికి, వారి శ్రీమతి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి స్మృతి కి ఈ వ్యాసాన్ని అంకితం చేస్తున్నాను. 

ధన్యవాదాలు ~ 

<><><><> నమస్తే <><><><>