09_020 ఆనందవిహారి – మాయాబజార్

మాయాబజార్” మాటలు తెలుగువారి జీవితాల్లో మమేకమైపోయాయి 

ప్రముఖ సినీ గీత రచయిత వెన్నెలకంటి

వెండితెరపై వెన్నెల సంతకం అనదగిన “మాయాబజార్” సినిమాలోని మాటలు తెలుగువారి జీవితాల్లో మమేకమైపోయాయని, పింగళి రచనా పటిమ అంతటి గొప్పదని ప్రముఖ సినీ గీత రచయిత వెన్నెలకంటి ప్రశంసించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి యూట్యూబ్ లో ఏర్పాటు చేసిన “నెల నెలా వెన్నెల” కార్యక్రమంలో ఆయన “మాయాబజార్ సినిమాలో మాటల మాయాజాలం” అంశంపై అత్యద్భుతంగా ప్రసంగించారు. శనివారం సాయంత్రం ప్రసారమైన ఈ కార్యక్రమంలో ఆయన ఆ చిత్రంలో మొదటి నుంచి చివరి వరకు సాగిన ప్రతి ఘట్టంలోని సంభాషణా ప్రత్యేకతను వివరించి ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేశారు. తాను 250 సార్లకి పైగా ఆ చిత్రాన్ని చూశానని వెల్లడించి ఆశ్చర్యపరిచారు. తరాల అంతరం లేకుండా అందరికీ అభిమాన చలన చిత్రం ‘మాయాబజార్’ మాత్రమేనని ఘంటాపథంగా చెప్పగలనని  వ్యాఖ్యానించారు. ఆ చిత్రం స్క్రీన్ ప్లే వంటిది మరొకటి తెలుగు తెరపై రాలేదని అన్నారు. దర్శకుడు సగం రచయిత అని, రచయిత సగం దర్శకుడని, ఆ ఇద్దరి పట్ల అవగాహన కలిగితే అద్భుతాలే జరుగుతాయని చెప్పారు. 

కొత్త మాటల ఊట 

ఆ చిత్రంలోని మాటల ప్రత్యేకతను వివరిస్తూ…. “ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?” అని మాయాబజార్ లో ఒక పాత్రతో చెప్పించిన రచయిత పింగళి తనే అనేక మాటలను ఆ చిత్రంలో, మరికొన్ని చిత్రాల్లో పుట్టించారని పేర్కొన్నారు. ఆయన సొంతంగా కొన్ని పదాలను పుట్టించి, మరికొన్ని మరుగున పడిన, వాడుకలో లేని మాటలను ప్రచారంలోకి తెచ్చినట్టు పింగళి స్వయంగా చెప్పిన విషయాన్ని  గుర్తు చేశారు. “డింభకా” అన్న మాటను భాగవతంలో పోతన ఉపయోగించారని గుర్తు చేశారు.  

 గగ్గోలు పెట్టడం, గందరగోళ పరచడం అనే లక్షణాల ఆధారంగా ఇద్దరు రాక్షసులకు రచయిత “గగ్గోలకుడు”, “గందరగోళకుడు” పేర్లను పెట్టడం చమత్కారమైన కొత్త మాటలను సృష్టించడమేనని వెన్నెలకంటి కొనియాడారు. ఇక మనవాళ్ళు, ఆత్మీయులు అన్న అర్థంలో ఉపయోగించే ‘అస్మదీయులు’కి వ్యతిరేకంగా ‘తస్మదీయులు’ అంటూ ప్రయోగించడం మాటల సృష్టి అలవోకగా జరిగిపోవడానికి ఉదాహరణ అని పేర్కొన్నారు.  

 

ఎప్పటికీ నిలిచిపోయే ఆ మాటల చమత్కారం

చిత్రంలో మాటలన్నీ తూకం వేసినట్టుగా ఉంటాయని, అందులోనే విజయం దాగి ఉందని వక్త ప్రశంసించారు. 

“ఇదే మన తక్షణ కర్తవ్యం” అనే దుశ్శాసనుడి మాట (mannerism dialogue), 

శశిరేఖను అభిమన్యుడికి ఇచ్చి వివాహం చేస్తానని బలరాముడి వద్ద సుభద్ర మాట తీసుకొనే విధంగా కృషుడు చూపిన మాటల నేర్పు, ‘పురోగమించడం’, ‘తిరోగమించడం’ అన్న మాటలతో శర్మ, శాస్త్రిలు, అభిమన్యుడి బాబాయిల సంఖ్యతో లక్ష్మణ కుమారుడి  బాబాయిల సంఖ్యను పోలుస్తూ సారథి పాత్ర వెర్రివాడైన లక్ష్మణ కుమార పాత్రని ఉద్దేశించి అనడం పింగళి మాటల చమత్కారమేనని వివరించారు. ఈ చిత్రంలో ఎవరూ కనీవినీ ఎరుగని పెళ్ళి రిహార్సల్స్ చేసే సన్నివేశం ఉంటుందని, అందులో చివరి ఘట్టం అనగానే “అయితే, ఇది అంత్యక్రియ” అని లక్ష్మణ కుమారుడు అనడం కడుపుబ్బ నవ్విస్తుందని పేర్కొన్నారు. (అయితే, ఈ సన్నివేశంతో పాటు మరి రెండు సన్నివేశాలు ఈమధ్య తొలగించారని వెల్లడించారు.) 

 చిత్రంలో అసూయాపరుడైన దుర్యోధనుడి కుమారుడికీ అదే లక్షణం ఉన్నప్పటికీ ఆ భావాన్ని హాస్యస్ఫోరకమైన మాటలతో మలిచారని అన్నారు. అభిమన్యుడికి దక్కేవన్నీ తనకూ కావాలనే లక్ష్మణ కుమారుడి అసూయ, పోటీ తత్వాన్ని గురించిన  కొన్ని సంభాషణలను ఉదహరించారు. 

“వెనక్కి తిరిగి వెళ్ళడం మనకి తెలియని విద్య” అన్న అభిమన్యుడి మాటలో ఎంతో అర్థం ఉందని, మహాభారత యుద్ధంలో జరిగిన పద్మవ్యూహ ఘట్టాన్ని ఒక చిన్న సంభాషణలో చెప్పడం పింగళికి మాత్రమే సాధ్యమైందని వ్యాఖ్యానించారు. 

హిడింబి – ఘటోత్కచుడు, కృష్ణుడు – ఘటోత్కచుడు మధ్య జరిగే సంభాషణలు, మాయా శశిరేఖ పెళ్ళి సందర్భంగా ఆయా పాత్రలు మాట్లాడే మాటలు,  వాటి ప్రత్యేకతలను వివరించారు. 

 

ఉత్తరాదివారి తెలుగు పెళ్ళి

హస్తినాపురానికి చెందిన దుర్యోధనుడికి, ద్వారకలో జరిగే పెళ్ళికి సంబంధం లేకపోయినప్పటికీ తెలుగు సినిమాలో  తెలుగువారు అమితంగా ఇష్టపడే గోంగూరను చాలా జాగ్రత్తగా పింగళి ఉపయోగించారని, “ఆంధ్ర శాకం” అని అనడంలో ఆ జాగ్రత్త తెలుస్తుందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చే అతిథులకు దేశంలోని అనేక ప్రాంతాల ప్రత్యేక వంటకాలను వండించి వడ్డించడమనే ప్రక్రియను ఈ చిత్రంలో ఈ రకంగా ఆయన ఉపయోగించుకున్నారని వెన్నెలకంటి అన్నారు. తెలుగు పెళ్ళిలోని తెలుగు మాటలు, హాస్యోక్తులు ఎప్పటికీ నిలిచిపోయేలా పింగళి రాశారని చెప్పారు. 

 

తరువాతి చిత్రాలకు ఆదర్శం

“ఏనుగులు మింగావా? పర్వతాలను ఫలహారం చూశావా?” అన్న మాట ఇటీవల తీసిన చిత్రంలో ఉపయోగించడం “మాయాబజార్” ప్రభావాన్ని తెలుపుతుందని అన్నారు. “అన్నమయ్య” చిత్రంలో వేటూరి “తస్మదీయ” పదాన్ని ఉపయోగించారని గుర్తు చేశారు. 

 

ఆ మాటలు సార్వజనీనం, సార్వకాలీనం 

అనాదిగా ముఖస్తుతి చేసేవాళ్ళు ఉంటూనే ఉన్నారని, ముఖస్తుతికి పడిపోనివాళ్ళు లేరని, ప్రతి తరంలో.. తాము మాత్రమే సొంత తెలివితేటలు కలిగి ఉన్నామని నమ్మే యువత, తరువాతి తరాల వాళ్ళని ఉద్దేశించి “ఈ కాలం పిల్లలు ఇంతే” అనే పెద్దలు ఉన్నారని  “మాయాబజార్” నిరూపించిందని వెన్నెలకంటి పేర్కొన్నారు. ఈ మాటలు సార్వజనీనం, సార్వకాలీనమని వ్యాఖ్యానించారు.  

అసూయతో రగిలిపోయిన దుర్యోధనుడు సుయోధనుడు కాడు, ఈసు(అసూయ)దోయనుడు అని వ్యాఖ్యానించి వెన్నెలకంటి తన మాటల చమత్కారాన్ని కూడా ప్రసంగవశాత్తూ వెల్లడి చేశారు. 

 

ఆ ఒక్కటీ ఇంకోలా ఉండుంటే….  

శశిరేఖ పెళ్ళికి లగ్నం నిర్ణయించుకొని వచ్చిన శకుని తదితరులతో, “వధూమణి వారి జాతకం ప్రకారం చూస్తే, ఇది దగ్ధ యోగం. ఈ లగ్నంలో అసలు పెళ్ళే జరగదు” అని శంఖుతీర్థులవారు అంటారని, కానీ అదే శశిరేఖకి అదే లగ్నంలో ఘటోత్కచుడి ఆశ్రమంలో అభిమాన్యుడితో పెళ్ళి జరుగుతుందని గుర్తు చేశారు. ఇది తనకు ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని, ‘వధూమణి’కి బదులు “వరుడి జాతకం ప్రకారం’ అని ఉండుంటే ఇంకా బాగుండేదని అభిప్రాయపడుతూ వెన్నెలకంటి ప్రసంగాన్ని ముగించారు. 

యువ రచయిత్రి నవీన కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆకట్టుకున్నారు. ముళ్ళపూడి ప్రసాద్ వీడియో సహకారాన్ని అందించగా సాంకేతిక సహకారాన్ని విజయవాడకు చెందిన శిష్ట్లా రామచంద్రరావు అందించారు. 

ఈ కార్యక్రమాన్ని ఈ క్రింది వీడియో లో వీక్షించండి…..