ప్రస్తావన
ఒక ప్రక్క ముందే వచ్చిన వేసవి వేడి… దానితో బాటే వచ్చిన ఎన్నికల వేడి.
పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలం పైన నీరు వేడి పెరిగితే ఏర్పడేది ఎల్‌నినో ఈ ఎల్‌నినో సమయంలో దక్షిణ అమెరికా ప్రాంతం నుంచి వేడిగాలులు ఆసియా వైపు వీస్తాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరిగి అసాధారణ రీతిలో వేడి పెరుగుతుంది. శాస్త్రజ్ఞుల పరిశీలన ప్రకారం ప్రస్తుతం ఆ స్థితి నడుస్తోంది. భయంకరమైన వేడి, ఉక్కపోత. చినుకు జాడ లేకపోవడం వలన క్షామ పరిస్థితులు. ఇలా మానవ జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ ఎల్‌నినో. మరో రెండు నెలల వరకు ఇదే పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితేనే మధ్యాహ్నం వేళల్లో బయిటకు వెళ్ళాలి. మంచినీరు ఎక్కువగా త్రాగాలి. దానితో బాటు కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు, పలుచటి మజ్జిగ వంటివి తరచుగా తీసుకోవాలి. కృత్రిమ రుచులతో, రసాయనాలతో చేసే కూల్ డ్రింక్ లు అసలు త్రాగకూడదు. బాగా చల్లబరచిన నీటిని తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వలన వచ్చే ముఖ్యమైన సమస్య, డీ హైడ్రేషన్. ఒంట్లోని నీరు అంతా ఆవిరైపోతుంది. ఫలితంగా నీరసించి ప్రాణానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఎండ వేడిని తట్టుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక ఎన్నికల వేడి. ఇది కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవలసిన అంశమే. ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజాసేవ. మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధాన మంత్రులుగా పనిజేసిన ప్రకాశం పంతులు, లాల్ బహదూర్ శాస్త్రి గారు వంటి వారు అనంతరకాలం లో చేతిలో చిల్లిగవ్వ లేకుండా కాలం గడిపారు. ఆ తరం గురించి చెప్పుకోవడానికి కూడా ఇప్పటి రాజకీయనాయకులు ఇష్టపడటం లేదు. అలా నిస్వార్థంగా ప్రజాసేవ చెయ్యడం ఇప్పటి రోజుల ప్రకారం చేతగానితనమే. ఇప్పుడు రాజకీయం కూడా వ్యాపారమే అయిపోయింది. అది దిన దినాభివృద్ధి చెందుతూ, భారత రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదిగింది. వ్యాపారంలో లాగే పెట్టుబడులు పెరిగాయి. పెట్టుబడికి తగ్గట్లు రాబడి కూడా పెంచుకుంటున్నారు. వ్యాపార వస్తువు అయ్యాక సహజంగానే పోటీ కూడా ఉంటుంది. ప్రచార తత్వం కూడా పెరిగింది. ‘ కాదేదీ ప్రచారానికి అనర్హం… ’ అన్నట్లు రాజకీయాల్లో ‘ తిట్లు ’ కూడా ప్రచార వస్తువు అయిపోయింది. తాము గెలిస్తే ప్రజలకు ఏ రకంగా సేవ చేస్తామో చెప్పుకోవడం తక్కువై, ప్రత్యర్థులను రాయలేని భాషలో తిట్టడం ప్రధానమైన అర్హతగా మారిపోయింది. రాజకీయ విమర్శ అంటే ఇప్పుడు తిట్లే.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారాల తీరుతెన్నులు ఎలా ఉంటున్నాయో ప్రత్యేకంగా వివరించనక్కరలేదు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్నట్లు… తమ సంగతి మర్చిపోయి ప్రత్యర్థి మీదో, అతని పార్టీ మీదో ఎంత బురద జల్లితే, ఎన్ని తిట్లు తిడితే అంత బాగా ప్రచారం చేసినట్లుగా భావిస్తున్నారు. ఆ భాష వినడం కష్టంగా ఉంటోంది. కాబోయే ప్రభుత్వాధినేతలు… గట్టిగా మనమేదైనా అంటే రేపొద్దున్న పీఠం ఎక్కాక ఆ భాషనే అధికార భాషగా ప్రకటించే రోజు కూడా వస్తుందేమో ! అందుకని ఆ ఎన్నికలు పూర్తయేదాకా చెవులు మూసుకుని ఉండడం ఉత్తమమేమో ! ప్రస్తుత పరిస్థితులు అలా ఉంటే గత కాలంలో ఎన్నికల ప్రచారాలెలా ఉండేవో మచ్చుకు ఒక సంఘటన………
చెరుకువాడ నరసింహం గారని గొప్ప జాతీయవాది. ఆయన ఉపన్యాసాలు వ్యంగ్యంతో నిండి అవసరమైన చోట్ల చురకలతో వినోదాత్మకంగా సాగుతూ అందర్నీ అలరిస్తూ ఉండేవి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఆయన ప్రచార ప్రసంగం చేస్తే ఆ అభ్యర్థి విజయం తథ్యమని నమ్మేవారు. ఎదుటి పార్టీ అభ్యర్థులపై ఆయన వేసే సున్నితమైన చురకలు ఓటర్ల మనసులలో చురకత్తుల్లా గుచ్చుకునేవి. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉండేది.
- ఒకసారి ఎన్నికలలో ఒక అభ్యర్థి తరఫున ప్రచారం చెయ్యవలసి వచ్చింది. అప్పుడక్కడ పోటీ తీవ్రంగా ఉంది. సరే ! ఈయన ప్రచార సభలో ప్రసంగం ప్రారంభించారు. అందరూ ఊహించినదానికి భిన్నంగా ” మా గురించి మేము చెప్పుకోవడం అంత బాగుండదేమో ! అందుకే మా ప్రత్యర్థి గురించి రెండు ముక్కలు చెబుతాను. ఎందుకంటే అతను నాకు చిన్నప్పట్నుంచీ తెలుసు. ఒకసారి ఏం జరిగిందంటే, అప్పుడు అతను రెండో తరగతో, మూడో తరగతో చదువుతున్నట్లున్నాడు, వాళ్ళమ్మ ఒక అణా ఇచ్చి కరివేపాకు తెమ్మంది. కొట్టుకి వెళ్ళాక అతనికి శనగపప్పు తినాలనిపించింది. అంతే ! అమ్మ ఇచ్చిన డబ్బులతో శనగపప్పు కొనుక్కుని తినేసాడు. ఇంటికి వెళ్ళి అమ్మకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అంతే ! సరాసరి వెళ్ళి ఆ ప్రతి పక్ష పార్టీలో చేరిపోయాడు. అదీ సంగతి. ఇక ఓటు ఎవరికి వెయ్యాలో మీ ఇష్టం ” అని ముగించారు.
- సరే ! అది తమ పార్టీకే చెందిన వేరే అభ్యర్థి గురించి చేసిన ప్రచారమైతే ఒకసారి ఆయనే స్వయంగా ఎన్నికలలో పోటీ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆయనే స్వయంగా చేసుకునే ప్రచారోపన్యాసం ఎలా ఉంటుందో ఊహించండి. ఇదిగో ఇలా …….
” అయ్యా ! ఇంతకాలం మంత్రసానితనం చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఆ మంత్రసానే ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. అందులోనూ ఇప్పుడు ఈ ముసలి వయసులో….. ” అంటూ సాగింది. ఇప్పటి ఎన్నికల ప్రచారాల్లో ఇటువంటి భాషను, చమత్కారాలను ఊహించగలమా ?
పోటీలో ఉన్న పార్టీలు ఏవైనా, నాయకులు ఎవరైనా ఈ ఎన్నికల వేడిని తట్టుకోగలగడానికి ముఖ్యంగా తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు….. ముందుగా వ్యక్తి పూజ కూడదు. పోటీ చేసే వ్యక్తి కి ప్రధానమైన అర్హత ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన, ప్రజా సంక్షేమం కోసం తీసుకున్న లేదా తీసుకోబోయే చర్యల గురించి స్పష్టమైన వైఖరి, ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధత మాత్రమే కొలబద్దగా ఉండాలి. కులం, మతం, జాతి, వర్గం వంటివి కాదు చూడవలసింది. అలాగే పార్టీ సిద్ధాంతాలను మాత్రమే చూస్తే సరిపోదు… వాటి అమలు తీరుని కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. అన్నిటికంటే ఉచిత ప్రలోభాలకు ఎట్టి పరిస్థితులలోనూ లొంగకూడదు. ఏ నాయకుడు, ఏ అభ్యర్థి కూడా తన స్వంత నిధులను ఖర్చు చేసి ఉచిత హామీలు ఇవ్వడు. రాజకీయాలు ఫక్తు వ్యాపారమైపోయిన ఈరోజుల్లో పది రూపాయలు ఉచితంగా ఇస్తే వంద రూపాయలు మన దగ్గరనుంచి ఏదో రూపంలో గుంజుకుంటారు. ఎన్నికలలో గెలిచిన వారు ప్రజా ప్రతినిధులు అవుతారు గాని, ప్రజలను పాలించే రాజులు కారు. ప్రజల తరఫున, ప్రజల సమస్యలను చట్ట సభల్లో ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కారించడమే వారి పని. ప్రజా ప్రతినిధులు ఉన్నది ప్రజలకు సేవ చెయ్యడానికి. ప్రజా సంక్షేమం అంటే ప్రజలను తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చెయ్యడానికి కావల్సిన వసతులు, వనరులు కల్పించడానికి కావల్సిన పధకాలను రచించి అమలు చేయడం వలన దేశంలో ఉత్పాదకత పెరిగి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. కేవలం ఉచిత నగదు పధకాల వలన ప్రజలు నిర్వీర్యం అయిపోయి బిచ్చగాళ్ల సంఖ్యలో మాత్రమే అభివృద్ధి కనబడుతుంది గాని దేశాభివృద్ధి ఏమాత్రం జరుగదు.
ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే ఎన్నికల వేడి ని తట్టుకుని సరైన అభ్యర్థిని మన ప్రతినిధిగా చట్ట సభలకి పంపగలుగుతాము. బలహీనతలకు లొంగిపోయి అయోగ్యుడిని ఎన్నుకుంటే మరో అయిదు సంవత్సరాల వరకు విచారిస్తూ ఉండవలసిందే ! ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉన్నా కూడా అయోగ్యులు ఎన్నికవడానికి మనమే కారణమౌతాము. కాబట్టి రాజ్యాంగం మనకిచ్చిన ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకుని యోగ్యులైన వారిని ప్రతినిధులుగా ఎన్నుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది… తద్వారా దేశ భవిష్యత్తు బాగుంటుంది. ఓటు వేసేటప్పుడు కావాల్సింది వివేకం.
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలతో……
***************************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page