ఈసారి తోక లేని పిట్ట ఒక వినూత్నమైన జాతి కి చెందినది.
అవునండీ నిజమే ! ఇంతవరకు, అంటే ఇంతకుముందు ఈ శీర్షిక లో చోటు చేసుకున్నవి మరొక తరగతి కి చెందినవి. ఉదాహరణకు కవులు, కళాకారులు, ఈ దేశం వారు, ఇతర దేశాల వారు, ఉద్యోగస్తులు, విశ్రాంత ఉద్యోగస్తులు, ఇలా — వారి వారి తోక లేని పిట్టల ద్వారా ఇక్కడ రంగ ప్రవేశం చేశారు. మిమ్మల్ని అలరించారు.
అయితే ప్రస్తుతం ఇక్కడ చోటు చేసుకోబోతున్న వారు ఒకప్పటి విద్యార్థి… అంటే నా సహ విద్యార్థి. ప్రస్తుతం వ్యాపారస్తుడు. పేరు వాసిరెడ్డి రాజశేఖర్. చాలా స్నేహపాత్రుడు. సౌజన్యమూర్తి రాజశేఖర్ కి నాకు మధ్యన ఉన్న స్నేహానికి బీజం పడింది 1953 సంవత్సరం లో. అదెలాగో వివరిస్తాను.
చేబ్రోలు గ్రామం, గుంటూరు జిల్లా – తెనాలి తాలూకా లో నా ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. మా నాన్నగారు శ్రీ ఓలేటి వెంకటరత్నం గారు అక్కడ సూర్యదేవర నరసయ్య ఉన్నత పాఠశాల లో లెక్కల మాస్టారు గా పని చేసేవారు. ఆయన అనుసరించే క్రమశిక్షణ, విద్యాబోధన ఎంతమందినో ఆకర్షించింది.
పాఠశాల వ్యవస్థాపకులు, ప్రధానోపాధ్యాయుల వారు, ఇతర ఉపాధ్యాయ బృందం ఆయనను మన్ననతో చూసేవారు. ఇక విద్యార్థిని – విద్యార్థులయితే చెప్పనే అక్కరలేదు. వారు ఆయన బోధనా విధానానికి ఎంతగానో ఆకర్షితులై అభిమానించేవారు… ఆయనను ఆరాధించేవారు కూడా. లెక్కల బోధన చాలా కష్టతరమైనది. ఏమంటే అందులో నేర్పు… ఓర్పు రెండూ ఉండాలి. నాన్నగారు హయ్యర్ ఫార్మ్స్ (అంటే ఫోర్త్ ఫారం నుండి సిక్స్త్ ఫారం వరకూ కాంపోజిట్ మరియు జనరల్ మాథ్స్ ) కి లెక్కలు బోధించేవారు. పిల్లల తల్లిదండ్రులకు కూడా మా నాన్నగారంటే అపారమైన అభిమానం, గౌరవం ఉండేవి.
రాజశేఖర్ తండ్రిగారు మెయిన్ రోడ్ లో ఒక బుక్ & స్టేషనరీ షాప్ ని నిర్వహించేవారు. మేము మాకు కావలసిన టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అదే షాప్ లో కొనుక్కునేవాళ్ళం. టెక్స్ట్ బుక్ కొనుక్కుంటే దానికి అలంకారం గా అట్ట గా వేసుకోవడానికి బ్రౌన్ పేపర్ షీట్ ను ఉచితం గా ఇచ్చేవారు. ఆ షాప్ అంటే నాకు ఉన్న ఇష్టత మా మధ్య స్నేహాన్ని బలీయం చేసింది. ఆ స్నేహం మరి ఈనాటికీ మర్రి ఊడలా విస్తరించి మమ్మల్ని మరింతగా దగ్గర చేసింది.
చేబ్రోలు లో నా హైస్కూల్ చదువు 1957 లో ముగిసిన తరువాత కాలేజీ చదువులు గుంటూరు, కాకినాడ లలో జరిగాయి. చదువు తరువాత ఉద్యోగం, ఆ పరం గా దేశాటన అంతా మామూలే..! అయితే రాజశేఖర్ పై చదువులకు వెళ్ళలేదు. కారణం కుటుంబ పరిణామాలు. తన తండ్రి గారు గతించడం తో షాప్ నిర్వహణ బాధ్యతలు తనపై పడ్డాయి. వివాహం జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కలిగారు. వాళ్ళ ఆలనా పాలనా, పెళ్లిళ్లు. మరొక ప్రక్క బుక్ షాప్ నిర్వహణ పనులు. ఇవీ అతని వ్యాసంగాలు. నేను ప్రభుత్యోద్యోగం చేస్తూ పెళ్లి, సంసారం. ఆ బాధ్యతలు నిర్వహించి ఉద్యోగ అనంతరం పదవీ విరమణ, విశ్రాంతి జీవనం గడుపుతూ చివరకు విజయవాడ లో స్థిరపడడం జరిగింది. మా ఆవిడ గుంటూరు, నంద్యాల లలో మహిళా డిగ్రీ కళాశాలలో సంస్కృతం లెక్చరర్ గా పనిచేసేది. దురదృష్టవశాత్తూ అనారోగ్య కారణం గా 2004 లో తాను కాలం చేసింది. అంతకు ముందుగానే మా పిల్లల పెళ్లిళ్లు అయి… వాళ్ళు విదేశాలలో కుటుంబంతో స్థిరపడడం జరిగింది.
మా నాన్నగారు హైదరాబాద్ లో మా తమ్ముళ్ల వద్ద ఉంటూ సెప్టెంబర్ 2000 సం. లో స్వల్ప అనారోగ్యం చేసి దివంగతులయ్యారు. వారి అంత్యక్రియలు హైదరాబాద్ లోనే జరిగాయి. ఆ కార్యక్రమానికి చేబ్రోలు నుండి రాజశేఖర్ వచ్చి వాటిలో పాలుపంచుకున్నాడు. అతని గురుభక్తి కి ఇది ఒక తార్కాణం.
ఇంచుమించు ప్రతీ ఏడాది చేబ్రోలు లో జరిగే మా స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం వేడుకలకు నేను హాజరు అవుతూనే ఉంటాను. విజయవాడ కి చేబ్రోలు దగ్గరగా అందుబాటులో ఉండడం వలన ఇది సాధ్యపడుతూ ఉంది. చిన్నప్పుడు చదువుకున్న మా పాఠశాల, ఆ పరిసరాలు, వాటిని చూస్తూ నాటి పూర్వ విద్యార్థులు ఆనందం గా కలుసుకుని కబుర్లు చెప్పుకోవడం, అందరూ కలిసి భోజనం చేయడం ఒక చక్కటి అనుభూతి.
చేబ్రోలు వెళ్ళినప్పుడల్లా – స్కూల్ పూర్వ విద్యార్థుల వేడుకలలో పాల్గొనడం తో బాటుగా – నేను తప్పనిసరిగా చేసే మరో పనులు రెండే రెండు…..
ఒకటి — మా రాజశేఖర్ ని, కుటుంబాన్ని కలవడం
రెండోది — చేబ్రోలు గ్రామం లో దాదాపు ఒకే ప్రాంతాన ఉన్న 101 ప్రాచీన పవిత్ర దేవాలయాలను సందర్శించడం… అలాగే వాటికి దగ్గరలోనే మా బాల్యం గడచిన ఇల్లు, పరిసరాల సందర్శన కూడా…
పాత వూరు.. పాత మిత్రులు – ఆ సందర్శన అందించే అనుభూతి మాత్రం అనుభవైకవేద్యం.
***<><><>నమస్తే~ ధన్యవాదాలు <><><>***