09_020 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – శ్రీవారు ఎక్సరసైజ్

 

                       ఎప్పుడూ స్లిమ్ గా ఉండే మావారు ఈమద్య బరువు పెరుగుతున్నారని అనిపించింది నాకు. కారణం ఏమిటా అని ఆలోచించాను. ఒంట్లో అనారోగ్యం ఏమీ లేదు. నా వంటలోనూ మార్పులేదు. ఆమాటకొస్తే వెనకటికంటే ఇప్పుడు నూనెలు అవీ తగ్గించి ఇంకా జాగ్రత్తగా చేస్తున్నాను. ఆలోచించగా ఆలోచించగా అప్పుడు తట్టింది బుర్రకు, ఇదంతా ఆ దేముడి మహత్యం అని!

భక్తిపాలు కాస్త ఎక్కువగా ఉన్న మావారు గుడికి తరచు వెళ్తూ వుంటారు. ఒక్కొక్కసారి ఆయనకు ఏమీ తోచకపోతే “అలా గుడికి వెళ్ళొస్తా” అంటూ ఉన్నట్టుండి మాయమౌతారు! పెళ్ళయి ఇన్నేళ్ళైనా మావారికి అంత భక్తుందని మా న్యూజెర్సీలో ఆలయం వెలిసేదాకా నాకు తెలీదు సుమండీ! గుళ్ళో దేముడ్ని ఎంత భక్తిగా ప్రార్ధిస్తారో నాకు తెలీదు కానీ, దేముడి ప్రసాదాన్ని మాత్రం చాలా భక్తిగా స్వీకరిస్తారు. ఆయన అక్కడ ప్రసాదాలు తిని, మాకోసం అని ప్రత్యేకంగా ఇంటికి కూడా పట్టుకొస్తారు. నేను, మా అమ్మాయి ప్రసాదాన్ని ప్రసాదంగా తీసుకుంటాం. ఆ తర్వాత తను తెచ్చినవన్నీ అక్కడే ఉండటం చూసి “అయ్యో! ప్రసాదాలు ఇలా వదిలేయకూడదర్రా” అంటూ శ్రద్ధగా పూర్తిచేస్తూ వుంటారు. మావారు ఇలా ప్రసాదాలు ఇంటికి పట్టుకొచ్చే తీరు చూస్తే నాకు పెద్ద అనుమానం వస్తుంది. గుళ్ళో ఈయనకు ఎట్రాక్షన్ దేముడా లేక ప్రసాదాలా? అని. ఫ్రీక్వెంట్ ఫ్లయిర్స్ కు లాగా “ఫ్రీక్వెంట్ డివోటీస్” కు ప్రత్యేకంగా ఎక్కువ ప్రసాదాలు పెడతారనుకుంటా!

గుడికి వెళ్లటం బాగా అలవాటైన తర్వాత మునుపటిలాగా “ఏదైనా స్వీట్ చేయ్యవోయ్!” అని అడగటం మానేసారు మావారు. నాకు శ్రమ కలిగించటం ఇష్టం లేక పాపం అడగటం మానుకున్నారని అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది అసలు కారణం. చక్కగా ఇంతలేసి నెయ్యి పోసి, జీడిపప్పులు అవీ పుష్కలంగా వేసి చేసే చక్రపొంగలి..పొంగల్, మీగడ పెరుగుతో చేసిన దద్దోజనాలు, డాలరు పెడితే బెస్ బాల్ అంత సైజులో ప్రసాదం లడ్డూలు, ఇవికాక భక్తులు వెరైటీగా చేసి తీసుకొచ్చే ప్రసాదాలు అలవాటైన తర్వాత నేను చేసే లోకేలరీ..లోఫాట్ స్వీట్లు ఏం నచ్చుతాయి?!

ఏదైతేనేం గుడికి వెళ్లటం మొదలు పెట్టిన తర్వాత నుంచీ మా వారు వొళ్ళు చేసి, రంగుతేలిన మాట మాత్రం నిజం! పోనీ ఈ గుడికి వెళ్లటం కాస్త తగ్గించటమో… లేకపోతే ప్రసాదాల కోటా కాస్త తగ్గించటమో చెయ్యమని చెప్దామనుకుని, నా మాటల్ని ఎక్కడ అపార్ధం చేసుకుంటారో, ఏం అపచారం జరుగుతుందో అని చెంపలేసుకుని నోరు మూసుకున్నా. సరే! ప్రసాదాలు తింటే తిన్నారు, దానికి తగ్గట్టు ఎక్సరసైజ్ చేస్తే ఈ వెయిట్ సమస్య ఉండదు కదా అని అనిపించింది.

ఆలోచన రావడమేమిటి, వెంటనే పుట్టినరోజు వంకతో “అన్నప్రాసన నాడే ఆవకాయ” సామెత గుర్తుంచుకుని సింపులుగా ఎక్సర్సైజ్ బైసికిల్ ఒకటి కొన్నా మావారికి. పాపం! బర్త్ డే నాడు లేవగానే స్వీటుతో నోరు తీపి చేస్తాననుకున్నారు కాబోలు, అలాంటి కార్యక్రమం ఏమీ లేకుండా నేను ఉత్తినే సైకిల్ చూపించేసరికి నిరుత్సాహ పడిపోయి “గుడ్..గుడ్.. నైస్ గిఫ్ట్!” అంటూ గుడికి వెళ్ళిపోయారు. కొద్ది రోజులైన తర్వాత తెలిసింది మావారు ఎక్సర్సైజ్ చెయ్యటం లేదని.

మొదటి రెండు రోజులు, నేనేమనుకుంటానో అని చేసాననిపించారు. కారణం ఏమిటీ అని అడిగితే దానికి “ఉట్టినే ఎక్సర్సైజ్ చెయ్యాలంటే బోర్ గా ఉందోయ్” అన్నారు. పేపరు చదవటం లాంటి అలవాటు లేదని తెలిసి “పోనీ ఏదైనా పుస్తకం చదువుకోండి, చక్కగా వాటర్ బాటిల్..పుస్తకం…కళ్ళజోడు పెట్టుకోడానికి ఎంత సౌకర్యంగా అమర్చారో చూడండి!” అన్నా కాస్త తనని ఉత్సాహపరిచే ఉద్దేశ్యంతో. దానికి మావారు వెంటనే “అదీ అయింది. పుస్తకంలో ఒక పేజీ చదవకుండానే నిద్ర ముంచుకు వస్తోంది” అన్నారు.

“అయితే ఎలా మరి? ఈ మధ్య డాక్టర్ కూడా చెప్పినట్టున్నాడు, మీ వెయిట్ తగ్గాలని” అన్నా ఎలాగైనా ఈయన్ని దోవలో పెట్టాలని. “అదే ఆలోచిస్తున్నా, ఎక్సర్సైజ్ చెయ్యాలంటే ఏదో ఒక ఇన్సెంటివ్ కావాలని మాత్రం తెలిసిపోయింది” అని అన్నారు.

ఒకరోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి మావారు చాలా హడావిడిగా కనిపించారు. ఏమిటబ్బా! అని అనుకునేలోపే, నా చెయ్యి పట్టుకుని గబగబా బేస్మెంట్ లోకి లాక్కెళ్ళారు. అప్పుడే షాప్ వాళ్ళు డెలివర్ చేసిన హైటెక్ టీవీ, ఉన్నవి చాలలేదన్నట్టు ఇంకో డీవీడీ…స్పీకర్లు గట్రా అన్నీ అక్కడ ఉన్నాయి. నేను నోరు తెరిచి అడిగేలోపే మావారు నావైపు చూస్తూ “ఇవన్నీ నీకోసమే కొన్నా” అన్నారు.

హతోస్మి! టీవీ ముందు పట్టుమని పదినిముషాలు కూడా కూర్చోలేని నాకా ఇవన్నీ?” అని అనుకున్నా. నా భావాన్ని గ్రహించినట్టున్నారు, వెంటనే “అదేనోయ్….నీకోసం అంటే నాకోసం అన్నమాట! నాచేత ఎక్సర్సైజ్ చేయించాలని ముచ్చట పడుతున్నావు కదా! నీ కోరిక తీరుద్దామని ఇవి కొన్నా. నేను ఎక్సర్సైజ్ చెయ్యాలంటే ఏదైనా కాలక్షేపం ఉండాలి అని అన్నాను కదా? అయినా ఎన్నో రోజులుగా బేస్మెంట్ లో ఎంటర్టైన్మెంట్ సిస్టం ఒకటి అమర్చాలని అనుకుంటున్నదేగా! ఒకే దెబ్బకు రెండు పిట్టలని కొనేసా” అన్నారు గర్వంగా.

వెనకటికి ఈయనలాంటి వాడే “నాడా దొరికింది కదా అని గుఱ్ఱం కొన్నాట్ట! ఏదో రోజు కాసేపు తొక్కమని నేను  సైకిల్ కొనిస్తే, ఈ వంకతో బోలెడంత డబ్బు పెట్టి అక్కర్లేని నానా చెత్తా కొన్నారు మావారు. తను కొన్నవన్నీ చక్కగా పదికాలాల పాటు పనిచెయ్యాలని వెంటనే గుడికి వెళ్ళి పూజలు చేయించి ప్రసాదాలు కూడా పట్టుకొచ్చారు.

ఇప్పుడు మా శ్రీవారు ప్రతిరోజూ బోలెడంత సేపు ఎక్సర్సైజ్ చేస్తున్నారు! ఎక్సర్సైజ్ కు ముందు మావారి కార్యక్రమం చూడముచ్చటగా ఉంటుంది. నీరసం రాకుండా తెచ్చుకున్న ప్రసాదాలు తింటూ..గొంతెండి పోకుండా సోడాలు..జ్యూసులు తాగుతూ..బోర్ కొట్టకుండా వైడ్ స్క్రీన్ మీద జోరుగా తెలుగు సినిమాలు చూస్తూ..చెమటలు పట్టి చికాకు కలగకుండా చక్కగా ఎయిర్ కండిషన్ వేసుకుంటూ క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్!

ఎటొచ్చి మావారు మునుపటికన్నా ఇంకా కాస్త ఒళ్ళు చేసినట్టు మీకు కనిపిస్తే, ఆ మాట మాత్రం మావారితో అనకండే౦!!  

తొలి ప్రచురణ “తెలుగు జ్యోతి” 2006           

 శ్రీవారు-ఎక్సర్సైజ్ – నేపధ్యం

మా న్యూ జెర్సీలో మేం ఉంటున్న ఏరియాలో వెంకటేశ్వర ఆలయం వచ్చినప్పటి నుంచీ గుళ్ళో అందే రుచికరమైన ప్రసాదాలకు మేమందరం అలవాటుపడిపోయాం! ఒకసారి మా ఫ్రెండ్ ని కలిసినప్పుడు దేవాలయం ప్రస్తావన వచ్చి ఆయన “టెంపుల్ లో వారానికి నాలుగు రోజులు వాలంటీర్ సర్వీస్ చేస్తూ, మోతాదుకు మించి స్వీట్ తింటున్నానని గమనించుకోలేదు. మొన్న బ్లడ్ టెస్ట్ లో రిజల్ట్స్ అన్నీ కాస్త అటు ఇటుగా వచ్చాయి.” అంటూ చెప్పి నవ్వారు!

కొన్నేళ్ళ కిందట మావారు రోజు ఎక్సర్సైజ్ చెయ్యాలని డాక్టర్ చెప్పినప్పుడు ఆ రొటీన్ కు అలవాటు పడటానికి తనకు చాలా రోజులు పట్టింది. ఎక్సర్సైజ్ బైక్ ని ఇంట్లో పైకి కిందకీ మార్చడం…కావలసిన హంగులు, సౌకర్యాలు సమకూర్చుకోడం చూస్తే నవ్వొచ్చేది! ఒకసారి కాలేజీ హాస్టల్ లో ఉంటున్న మా అమ్మాయి ఇంటికి వచ్చింది. పైన బెడ్ రూమ్ లో ఉన్న నేను బేస్మెంట్ లో కెళ్ళి ఏదో వస్తువు తెమ్మని అడిగాను. అది పైకి వచ్చి వస్తువు నా చేతికిస్తూ “డాడ్ స్నాక్ తింటూ..జ్యూస్ తాగుతూ..సినిమా చూస్తూ భలేగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు!” అంటూ వర్ణించి చెప్తుంటే ఆ వర్ణనలోనే, మా ప్రసాదాల ప్రాబ్లం కూడా కలిసిపోయి “ముచ్చట”లా వచ్చింది!!   

***********************************