13_008 సాక్షాత్కారము 11

 

మనసులో పతిఁ దలచి

“హర!హరా!” అనుచునే

ఆడపావుర మప్పు

డగ్నిలో దూకినది!

 

            తనువు పై కాంక్షవీ

            డినకపోతాంగనయు

            అతిప్రశాంతమనస్క

            యై అగ్ని దూకినది!

చిన్ని పావుర మగ్ని

శిఖలన్ జ్వలించినది!

పక్షిత్యాగము నరయు

పక్షిఘాతకునెడద

 

            ఱాయివంటిది చంద్ర

            శిలయై ద్రవించినది!

            పూవుగా మాఱి వల

            పులను ఎగజిమ్మినది!

 

చిన్ని పావుర మగ్ని

శిఖలన్ జ్వలించినది!

ఆకిరాతకుగుండె

చెఱు వౌచు పొంగినది!

            వానికన్నులలోన

            వరద లుప్పొంగినవి!

            మానవత్వము వాని

            లోన పెల్లుబికినది!

 

‘అధమాధముడ నేను

అఘరూపుడను నేను!

నాయంతపాపాత్ము

డీయవనిపై లేడు!

 

            పాడుపొట్టను నింప

            పక్షులను వేటాడి

            అది మహాఘనకార్య

            మని మురిసిపోయితిని!

 

ౙాలి యెఱగక పక్షి

ౙ౦టలను విడగొట్టి

కరుణ యెఱుగక వాని

కాల్చుకొని తిన్నాను!

 

            ఇంత నీచునిపట్ల

            అంతదయ చూపించి

            తనప్రాణములు పక్షి

            త్యాగ మొనరించినది!

 

మనిషిగా పుట్టియును

మానవత్వము లేక

రాక్షసత్వమ్ముతో

బ్రతికినా నిన్నాళ్లు!

 

తే.గీ.      గడ్డి పెట్టిననైనను కమ్మనైన

      పాలనే యిచ్చు గేదెలు ఆలుకూడ!

      క్రూరు డై నట్టియజమాని కొట్టినను హ

      యమ్ము సేవ లొనర్చు కి మ్మనక యుండి

 

 

తే.గీ.      తన్ను త్రొక్కిననేకాని త్రాచుపాము

      ఎదుటివానిని పగపట్టదే – అ దేమి

      మాయరోగమొ మనుజజన్మమ్ము నంది

      కుమతి త్రావెడుఱొమ్మును గ్రుద్దుచుండు!

 

ఉ.         ఎంతమహాఋషుల్ సయిత మింద్రియనిగ్రహ ముజ్జగించి వి

      భ్రాంతికి దాసులై క్షుధకు బానిస లై విలపింప కన్నులన్

      వంతులువోయి ఉప్పె నగుబాష్పజలమ్ముల నిల్వరింపలే

      కెంతటికాశినైనను శపింపగ బూనెద రేమిచోద్యమో!

 

తే.గీ.      నీటిలో పుట్టి నీటిలోనే వసించు

      చేపలను పట్టి నరుడు భక్షించుచుండు

      కూడు నీ ళ్ళిచ్చి తా నాదుకొన్న యట్లు;

      ఇట్లు ౘ౦పెడుహ క్కెవ్వ డిచ్చినాడు?

 

తే.గీ.      చెట్టున చిటారుకొమ్మపై చితుకు లుంచి

      గడ్డి గాదము తెచ్చి అక్కడనె గూడు

      కట్టుకొని హాయిగా నుండుపిట్ట నిట్టె

      కొట్టి ౘ౦ పెడునరు డెంతకుమతియొ కద!

 

            దేవు డిచ్చిన తెలివితేటలు

            జీవులను హతమార్చు మనియా?

            మానవత్వము నుజ్జగించుచు

            స్వార్ధమునకై పరుల ౘ౦ పెడు

            హంతకుడుగ కిరాతకుడుగా

            మూగజీవులపచ్చినెత్తురు

            త్రాగి బ్రతుకుకసాయివాడుగ

            రకరకమ్ములహింస చేసెడు

            రాక్షసుం డౌమనిషికన్నను

            సాధు వై జీవించుచుండెడు

            జంతు వెంతో నయము! నయము!

            ఏయడవిలో కందమూలము

            లే భుజించెడు ఋషులె నయము!

            పరమధర్మముగా అహింసను

            పరిగణించెడువాడె నయము!

 

ప్రాణములు పోయుట యెఱుఁ గని

తాను ప్రాణము లపహరించెడు

హక్కు నరునికి ఎవ్వ రిచ్చారు?

దిక్కు మాలినజీవరాశికి

దిక్కుగా మనలేనినరునికి

అల్పజీవులప్రాణములు గొను

హక్కుమాత్రము ఎవ్వ రిచ్చారు?

 

తే.గీ.      నరుడుగా పుట్టి పరపీడన మ్మొనర్చి

      పాడుపొట్టను నింపుచు పాడుబ్రతుకు

      బ్రతికినన్నాళ్లు బ్రతికి ఆ పైన ౘచ్చు

      నాకు నల్లికి భేద మున్నదియె చూడ?

 

కటకటా! పక్షి నా

కళ్లు తెరపించినది !

నాలోనిఅజ్ఞాన

మీనాడు తొలగినది!

 

 

ఈ వేటబట్టతో

ఇక నాకు పని లేదు!

పిట్టలను వేటాడి

పొట్ట నింపుట లేదు!’

 

            అనుచు పశ్చాత్తాప

            మందినకిరాతకుడు

            బుట్టలో పక్షులను

            ఒక్కటొక్కటె తీసి

 

ప్రేమగా ౙాలిగా

పిట్టలశరీరాలు

నిమిరి కన్నీటితో

తడిపి ముద్దులు నింపి

 

            పక్షులను వదలగా

            ‘బ్రతుకు జీవుడ’అనుచు

            పిట్ట లన్నియు గగన

            వీధులకు ఎగసినవి!

 

జన్మాంతరీయసం

స్కార మువ్వెత్తుగా

ఉద్బుద్ధ మై బోయ

ఉర్వి నిల్వగలేక

 

            తనదు పైశాచిక

            త్వము భయంకరముగా

            కనులముందు కరాళ

            నాట్య మొనరింపగా

 

తరువాయి వచ్చే సంచికలో….

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page