09_020 వెలుగు నీడలు

తే. గీ.     కోటిజలభాండములలోన కోటిసూర్యు

            లున్నటుల తోచినను సూర్యు డున్న దొకడె !

            కోటితనుభాండములలోన కోటియాత్మ

            లున్నటులు తోచినను ఆత్మ యున్న దొకటె !

తె. గీ.     మమత పెరిగినకొలది బంధములు పెరుగు !

            స్నేహ మంటినకొలదియు జిడ్డు పెరుగు !

            మమత తొలగినవాడు బంధములు లేవు !

            స్నేహ మంటనినా డసల్ జిడ్డు లేదు !

తే. గీ.     ఒక్కడవు – సున్నలట్లు నీప్రక్క జీవ

            కోటులను నిల్పుకొని పెంచుకొంటి విలువ !

            అణువుకన్న చిన్నగ నుండునట్టినీవు –

            అట్టె బ్రహ్మాండమం తైనగుట్టు తెలిసె !! 

తే. గీ.     కళలలో నన్నియును జీవకళలె కాని –

            నిత్యనూత్నము – శివమును – సత్యసుంద

            రమగునుకవితాకళను వర మ్మొసంగి

            నను చిరంజీవిగా చేసినావు స్వామి !

తే. గీ.     శ్వాసకె అనంతరాగాలు పలుకునట్లు

            మేళవించితి వయ్య ! నామేనివీణ !

            రసమయం బైనజీవనరాగ మెప్పు

            డాపెదొ హఠాత్తుగా నూపి రాపివైచి !

 తే. గీ.    “ ఎడదయాకాశమున సంచరించుకృష్ణ

            మేఘ మూపిరిగాలికే మెల్లమెలన

            తరలిపోవునొ ? ” అనుభీతి తవిలినంత

            నూపిరిని పీల్ప జంకెద నొకొకసారి !

ఉ.         నీకరుణాతరంగితవినీలకనీనికలందు నెన్నియో

            లోకము లట్టిటుం గదలు; లోకములందున నీవె యుంటివో –

            లోకము లెల్ల నీకనులలోననె నిల్పితివో దయామయా !

            నీకరుణాకటాక్షములనీడల నన్ను ననుగ్రహింపవే !

ఉ.         వెన్నెలబాటలో నడిపి వెన్కనె నిల్చుచు వెన్ను తట్టుచున్

            న న్నిటు ఇంతవానిగ నొనర్చితి ; పద్యములట్లు పూచునీ

            ప్రన్ననిసన్నజాజులను ప్రాణసమమ్ముగ చేసి యిచ్చెదన్

            క్రన్నన జన్మసార్థకతకై యిదె తావకపాదపూజకై.

తే. గీ.     జలధిశాయివి నీ వని జగము పలుకు –

            పాలసంద్రముకన్నను మేలిదైన

            సుకవితాసాగరము నీకు చూఱ లిత్తు ;

            ఇందు నీమెచ్చురత్నము లెన్నొ కలవు !

ఉ.         ఈకనిపించుదేహము కృశించి నశించినయంతలోన సు

            శ్లోకిత మైననాకవితలోనె చరించెద నక్ష రాకృతిన్ ;

            నాకును నీ కభేద మగు నౌ-నపు డింతటిసృష్టి చేసియున్

            లోకపుటెఱ్ఱనౌకనులలో పడబోవనినిన్ను పోలెదన్ !

తే. గీ.     పూవుల నొసంగి వలపుపూబోణి నొసగి

            పూవువంటిమన స్సిచ్చి పూవుకన్న

            మెత్త నౌకైత నిచ్చినమేటిదొరవు !

            చిత్తమున నిల్చుమయ్య నీశ్రీపదాలు !

శా.         కన్నుల్ రెం డట నీకు – సూర్యుడొక డై క్రాలంగ చంద్రుం డికో

            క-న్నాచంద్రునిలోనిమచ్చ యగు నీకన్పాప యం చెంచెదన్ ;

            అన్నా ! ఉజ్జ్వలకాంతిసంభరిత మౌఆసూర్యనేత్రమ్మునం

            దున్నన్ తారక కానిపించుటయెలేదో యేమొ ? సర్వేశ్వరా !

కం.        ఇది నా దని – అది నా దని

            యెదలో గర్వింతు కాని – యీయన్నిట నీ

            పదముద్రలె కన్నప్పుడు

            ఎదలో నిజ మెఱిగి నీకు నెద నర్పింతున్.

తే. గీ.     గారడీవస్తువులను నిక్క మని నమ్మి

            ప్రముద మందెడుపసిపిల్లవాడువోలె

            బుద్బుదమువంటితనువుపై బుద్ధి నిలిపి

            శాశ్వతసుఖమ్ము ప్రజలు చే జార్చుకొండ్రు !

తే. గీ.     వైద్యునిన్ నమ్ము ! మంగలివాని నమ్ము !

            కులుకుగుబ్బలకుటిలాలకలను అమ్ము !

            దైవమును నమ్మ-డేమిచిత్రమొ నరుండు !

            రోగికిం బథ్యవస్తువు రోత కాదె ?

తే. గీ.     విఱిగిపొయినబొమ్మకై వెక్కి వెక్కి

            యేడ్చుపసివానివలె నైహికేచ్ఛలందు

            జీవితం బెల్ల వృధ యైన జీవు డంత్య

            కాలమున భగ్నహృదయు డై కూలిపోవు.

కం.        కారాగారమె సుఖ మని

            కేరి అదే కోరుప్రాత “ కేడీ ”వోలెన్

            శారీరకబంధనమునె

            కోరును జీవుండు మాయకున్ దాసుండై.

తే. గీ.     వేదనోన్ముఖహృదయు డై విశ్వమయుని

            భక్తి గాంచక జీవుండు ముక్తి కనడు !

            ప్రసవవేదన నందక నిసుగు గనిన

            కుసుమకోమలి యైందైన వసుధ గలదె ?

కం.        ఏచిరకాలముక్రితమో

            మాచిరునామాలు మేము మఱచితిమి ప్రభూ !

            ఏచిరునామాకో నీ

            వే చేర్పుము – నీవు సకల మేఱుగుదువుకదా !

తే. గీ.     కవితలో కోటిస్వర్గాలు కనుచు నుండ

            నందులో నీవె కన్పింతు వయ్య ! స్వామి !

            ఏసుడవొ ? కృష్ణుడవొ ? వేంకటేశ్వరుడవొ ?

            మాకు తెలుపుము సుంత నీమర్మ మేమొ !

తే. గీ.     గుల్ల యనట్టివెదురుబొంగును మురళిగ

            వాడుకొన్నట్టివేణుగోపాలదేవ !

            కోర్కులు తలంపులును లేక గుల్ల యైన

            మనసునం దుందువా ? స్వామి ! మనసుపడుచు

తే. గీ.     ఒడుదొడుకుగుండెయుయ్యాల ఊగుచుండు

            నంతసేపును దానియం దధివసించి

            ఆగిపోయినయూయెల నట్టె విడుతు

            వేవిచోద్యము ? స్వామి ! ఇం కేది దారి ?

తే. గీ.     ఆయు వనునూనెతో దివ్వె వై వెలింగి

            గుండెగుడిలోన నిలిచి కొల్వుండుస్వామి !

            నీవు నిర్మించుకొనుగుడిన్ నీవె విడిచి

            మట్టిపాలేయు టిది చిత్ర మౌగదోయి !     

కం.        పూవులలో దారమువలె

            నీవు నిలచి లోకములను నిలిపెద వటనే !

            పూవులలో పరిమళమటు

            నీ వుండియు కంట పడక నెగడెద వటనే !

తే. గీ.     నీవు శూన్యమ వై జగన్నిచయమునకు

            ఉండుటకు చో టొసంగెద నోమహాత్మ !

            నీవె ఊపిరిగాలి వై జీవరాశి

            లో వసింతువు బ్రతికింతు లోకములను !