09_019 ద్విభాషితాలు – అద్దం

నది పారుతున్నట్లు….

నల్లటి కురులు!

పచ్చటి ఫాలభాగం మధ్యన…

గుండ్రంగా అరుణం.

తెల్లటి పాలవరుసకు….

దగ్గరలో చెక్కిలి పై చిన్న లోయ!

కొంచెం పైకెడితే….

కాంతులు చిందే ….

నయన సోయగం!

అందమైన  అరవిందాన్ని…

నిత్యం ….

పలుమార్లు చూసుకొనే నేను…

నీ భక్తురాల్ని.

నిమిష నిమిషాలు …

నన్ను కలల్లో ముంచెత్తే నీ శక్తికి ….

నేను నిరంతర దాసురాల్ని !

#######

నిన్ను…

తరచూ చూడలేక ….

తప్పించుకు తిరుగుతున్నాను.

నువ్వెదురుపడితే…

రాలిపోయిన నవ్వుకై….

అన్వేషణ!

నొసటిపై గీత నుంచి…

ఓ వెక్కిరింత!

పెదవి విరుపు లోంచి…

జారే విషాదం.

#########

చివరికి……

నిన్ను ద్వేషించడమే…

ఈ క్షణాలకు మిగిలింది.

నిన్ను చూడలేను.

నీ ముందుకు రాలేను.

నీ వికృత వికటాట్టహాసాన్ని…

భరించలేను.

అందుకే…..

నిన్ను విసిరికొట్టాను.

వేలాడే దవడలతో…

ఊడుతున్న తెల్ల వెంట్రుకలతో…

కాంతివిహీనమైన కళ్ళతో…..

భయంకరంగా…

నన్ను పరిహసిస్తూ….

పగిలిన ముక్కల్లోంచి….

వేలరూపాల్లో…..

మళ్ళీ …

నా శత్రువులా…

నువ్వే!

########