మహోన్నత వ్యక్తిత్వంతో, మేరునగధీరత్వంతో ఆరూఢయౌవనవతిగా, నిరుపమాన సౌందర్యంతో యోజనగంధిగా అగ్నితేజస్సుతో యజ్ఞగుండం నుండి ఉద్భవించింది ద్రౌపది.
“ సర్వయోషి ధరా కృష్ణా నినీఘ క్షత్రియాన్ క్షయాన్ ” –
క్షత్రియ సంహారకారిణిగా ఆకాశవాణి ఈమెను పేర్కొంది.
ద్వాపరయుగం లోని దుష్టరాజుల సంహారం కోసం కృష్ణ, కృష్ణుడు అవతరించారు.
ద్రోణునిపై కక్ష సాధింపు చర్యగా ‘ రణరంగమున ద్రోణు వధియించు నట్టి కొడుకును, అర్జునునకు దేవి యగునట్టి కూతురును బడయగోరి ’ ద్రుపదుడు నిర్వహించిన యజ్ఞంలో ద్రౌపదీ దృష్టద్యుమ్నులు జన్మించారు.
కిరీట కవచాలతో రధంపై నుండి దృష్టద్యుమ్నుడు యజ్ఞగుండం నుండి తొలుత వెలువడగానే – “ పాంచాల దేశానికి యశస్సును కలిగిస్తాడని, ద్రోణుని వధిస్తాడనీ, రాజు శోకాన్ని పోగొడతాడని ” ఆకాశవాణి పలికింది.
చామనఛాయతో అసమాన సౌందర్యంతో కృష్ణ సహోదరి కృష్ణ దేవతల మన్ననలందుతూ “ ఈమె వల్ల కౌరవులకు భయం కలుగుతుందని ” ఆకాశవాణి పలుకుతుండగా దివి నుండి భువికి దిగివచ్చిన శక్తిస్వరూపిణి ద్రౌపది – ఇలా వీరి పుట్టుకలే ప్రత్యేకమైనవి.
మత్స్యయంత్రాన్ని ఛేదించగలవాడు పాండవమధ్యముడు అర్జునుడు మాత్రమే అనే ఉద్దేశ్యంతో ద్రుపదుడు వర పరీక్ష పెట్టాడు.
బ్రాహ్మణ వేషం లో ఉన్న అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించాడు. సౌందర్యరాశి ద్రౌపదిని వెంటబెట్టుకుని పాండవులు కుంతి వద్దకు వెళ్ళారు. మేమొక ‘ భిక్ష ’ తెచ్చామని వారు చెప్పడం, వివరం తెలసికోకుండానే “ మీరేవురూ ఉపయోగింపుడని ” కుంతి కుమారులను ఆదేశించడం జరిగింది. ద్రౌపదిని చూడగానే కుంతి తన నోటి వెంట అటువంటి మాట ఎందుకు వచ్చిందనే సందేహాన్ని తన పెద్దకొడుకు ధర్మరాజుతో చర్చించింది.
ద్రుపదుడు ద్రౌపదికి ఐదుగురితో వివాహం ధర్మబద్ధం కాదని తొలుత అంగీకరించలేదు.
“ నా నోట అసత్యం పలకదు. నా బుద్ధి అధర్మం వైపు ప్రసరించదని ” చెబుతూ ధర్మరాజు తన తల్లి దైవ ప్రేరణతోనే పలికిందని అమె మాటలు అసత్యాలు కావని వివరించాడు.
శ్రీకృష్ణుడు చర్చకు కొనసాగింపుగా ధర్మసూక్ష్మం లోకవిదితమనీ సూక్ష్మధర్మం పైకి అధర్మం లా కనబడినప్పటికీ ధర్మబద్ధమైనదని వివరించాడు.
ఈ వివాహచర్చలో అనేకమంది జ్ఞానులతోబాటు రాగద్వేషాలకు అతీతులైన మనువు, అత్రి, యజ్ఞవల్కుడు, శుక్రాచార్యుడు, పరాశరుడు, వశిష్టుడు, వ్యాసుడు పాల్గొన్నారు.
‘ తమ్ముని భార్య కూతురు ’, ‘ అన్న భార్య తల్లి కదా ! ’ అన్న సందేహాన్ని వ్యక్తం చేసిన ద్రుపదునికి వ్యాసుడు ద్రౌపదీ, పాండవుల పూర్వజన్మ వృత్తాంతాలను దర్శింపజేసాడు.
వ్యాసుడు పంచేంద్రియోపాఖ్యానాన్ని చెప్పి ఇంతకుమునుపు స్వర్గాధిపతులైన నలుగురు ఇంద్రులతో బాటు ప్రస్తుత స్వర్గాధిపతియైన ఇంద్రుని తేజస్సుతో వీరు భూలోకంలో జన్మించి ఈశ్వరుడు నియోగించిన క్షత్రియ సంహారం చేస్తారనీ, వీరికి నారాయణుడు బలరామకృష్ణులుగా అవతరించి సహాయకులుగా ఉంటారని చెబుతాడు. రుద్రుడు నియోగించినట్లు వీరు ధర్మ, వాయు, ఇంద్ర, అశ్వనీ దేవతల అంశలతో కుంతీ గర్భంలో ప్రవేశించి పాండుకుమారులు అయ్యారు.
గతజన్మలో రాజర్షి కాశీరాజు కుమార్తె ద్రౌపది. సర్వగుణ సంపన్నుడైన పతిని పొందగోరి పరమేశ్వరునికై తపస్సు చేసింది. ఈశ్వరుడు ప్రత్యక్షమై ‘ నీకు అయిదుగురు పతులౌతారని వరమిచ్చాడు. ‘ పతిందేహి ’ అని అయిదుసార్లు అడిగావని, రాబోవు జన్మలో ఐదుగురికి భార్యగా రూపంలో, గుణంలో, భాగ్యంలో గొప్పదానివై ప్రఖ్యాతి పొందుతావని పరమేశ్వరుడు అనుగ్రహించాడు.
ఆ మాటలకు ఆమె ఆశ్చర్యపోయింది. సమయస్పూర్తితో ప్రత్యేక పతి సాంగత్యంలో కన్యత్వాన్ని పొంది, మహిమాన్వితవై పరమ పతివ్రతగా పరిగణింపబడతావని, పూజనీయవౌతావని ఈశ్వరుడు అనుగ్రహించాడు.
ద్రౌపదీ పాండవుల దాంపత్యం ధర్మబద్ధమైన నియమాలతో అపూర్వంగా, అనూహ్యంగా ( సామాన్య మానవుల ఊహకు అందనిది ), అసాధారణంగా, అకళంకంగా, అప్రమేయంగా, అనితరసాధ్యంగా, మహిమాన్వితంగా, అసిధారావ్రతంగా సాగింది. అనితర సాధ్యమైన ద్రౌపది వ్యక్తిత్వం, పాతివ్రత్యం పురజనుల, సామంతుల ప్రశంసలకు పాత్రమై ఆమెను పట్టపురాణిగా నిలబెట్టి పట్టాభిషేకం చేయించింది.
హరికి లక్ష్మి, ఇంద్రునికి శచి, వశిష్టునకు అరుంధతి వలె తన పతులను భక్తితో సేవించి వీరులైన ఉపపాండవుల్ని బిడ్డలుగా పొందింది.
ధర్మరాజు చరిత్ర రెండు యజ్ఞాలతో ప్రకాశించిన ప్రఖ్యాతేతివృత్తం ‘ రాజసూయం, అశ్వమేధం ’
దుర్యోధనాదులుండగా, ధర్మరాజును స్వతంత్ర్యంగా సమ్రాట్టుగా ప్రకాశింపజేసిన యజ్ఞం రాజసూయం. దీనివల్ల ఇహంలో ప్రజలు, పరంలో పాండురాజు లాభించారు. పాండవుల వైభవం దుర్యోధనాదులలో ఈర్ష్యాగ్ని రగిలించి పాండవులు అష్టకష్టాలు పడడానికి కారణ మయ్యింది. మయసభలో పొందిన ఐశ్వర్యమంతా మాయా జ్యూదంలో పోయింది.
సభాపర్వం ప్రథమాశ్వాసంలో ధర్మతేజం సముజ్జ్వలంగా ప్రకాశించింది. ద్వితీయాశ్వాసంలో కుత్సిత స్వార్థ దురహంకారం అసూయాగ్నితో విజృంభించి ధర్మతేజాన్ని చుట్టుముట్టింది. ఆదిపర్వంలో ఆరిపోయినట్లు కనిపించిన పాండవ కౌరవ ద్వేషం సభాపర్వంలో కార్చిచ్చులా రగిలి ధార్తరాష్ట్ర వనాన్ని దహించడానికి పూనుకొంది.
ధర్మరాజు రాజసూయ యాగాన్ని నిర్వహించినపుడు యాగానికి వచ్చిన రాజుల్ని, బంధుమిత్రుల్ని, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను, సేవకులను ఆదరించి వారందరి భోజనాలు పూర్తయ్యాకా ద్రౌపది భుజించే దని దుర్యోధనుడే ద్రౌపది సేవా తత్పరతను, కార్యదీక్షను ప్రశంసించాడు.
పుట్టినింట మెట్టినింట మన్ననలతో, భర్తల అనురాగంతో చక్కని సంతానంతో, ప్రజల గౌరవాభిమానాలతో పాండురాజు కోడలు ద్రౌపది ‘ పుణ్యాంగన ’ – అని రాజసూయయాగంలో ప్రశంసలందిన ద్రౌపది దేదీప్యమానంగా వెలిగిపోయింది.
“ భావి పురాత నాద్యతన పార్థివలక్ష్ములు పాండవేయు లక్ష్మీ విభవంబులతోడ నుపమింప సమంబులు గావు ” – అంటూ రారాజు దుర్యోధనుడే ఈర్ష్యపడ్డ పాండవుల వైభవానికి జూదంలో ఓటమితో పతనం ప్రారంభమయ్యింది.
సభాపర్వంలోని ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టం కౌరవవంశాన్ని నాశనం వైపు నడిపించింది.
కురుకుల నాశనానికి నడుం కట్టిన శకుని మాయా జూదంలో ధర్మరాజుని ఓడించాడు. ధర్మరాజు రాజసూయ యాగంలో తన వశమైన సకల సంపదల్నీ, సోదరులను పణంగా పెట్టి ఓడిపోయాడు. శకుని ప్రేరణతో కులసతి ద్రౌపదిని పణంగా పెట్టాడు.
ద్రౌపదిని సభలోనికి ఈడ్చుకొని రమ్మని దుర్యోధనుడు ప్రాతిగామిని పంపించాడు.
ధర్మరాజంతటివాడు భార్యను పణంగా పెట్టే జూదగాడా ? అనే ప్రశ్న ఉదయించక మానదు. సుహృద్యోతం తప్పు కాదు. పాండవుల సంపదల్ని చూసి అసూయతో వేగిన దుర్యోధనుడు శకునితో ఆలోచించి ధర్మరాజును జూదానికి పిలిపించాడు. “ నీవు పాచికాలాడడంలో నేర్పరివని, స్నేహంగా జూదమాడడం తప్పుకాదని ” దుర్యోధనుడు ధర్మరాజును జూదానికి ఒప్పించాడు.
“ మోసం, జూదం క్షత్రియ ధర్మానికి తగినవి కావని, ధర్మాన్ని ఆచరించే రాజులు వాటిని విడచిపెట్టాలని, జూదం వల్ల పార్థివులు పాపవృత్తులై చెడిపోతారని ” ధర్మరాజు చెబుతాడు. శకుని మాటలు విని చెడిపోవద్దనే ధర్మరాజు హెచ్చరిక ఇక్కడ కనబడుతుంది.
కానీ విధి బలీయమైనది. మాయాజ్యూతంలో పాండవుల ఓటమి, ద్రౌపదీ వస్త్రాపహరణ ప్రయత్నం జరుగకపోతే దుష్ట సంహారం కోసం పాండవులు చేయబోయే ప్రతిజ్ఞలు వెలువడవు కదా ! – కౌరవనాశనానికి ఈ ఘట్టం నాంది అని చెప్పాలి.
తనను సభకు రమ్మంటున్నారని పిలిచిన ప్రాతిగామితో –
“ మున్ను దన్నోటు వడి మఱి నన్ను నోటు
వడియెనో ? నన్ను మున్నోట వడి విభుండు
గ్రన్న దన్నోట వడియె నో యన్న ! నాకు
నెఱుగ జెప్పుము దీని నీ వెఱుగుదేని ” –
తన ప్రశ్నకు సమాధానాన్ని అడిగి తెలిసికొని రమ్మంది. ఆమెనే సభలోకి వచ్చి తెలిసికొమ్మని దుర్యోధనుడు వెటకారం చేశాడు. పరిస్థితుల వైపరీత్యాన్ని గుర్తించిన ద్రౌపది ఏకవస్త్ర అయినప్పటికీ కన్నీటి ధారలతో ప్రాతిగామి వెంట సభకు వచ్చింది. భీతయై ధృతరాష్ట్రుని చెంత నిలిచింది. దుర్యోధనుడు ఆమెను సభా మధ్య ప్రాంతానికి తీసికొని రమ్మని దుశ్శాసనుని పంపించాడు. ద్రౌపది భయంతో కంపిస్తూ గాంధారి వద్దకు పరుగెత్తింది.
పాండవులు ద్రౌపదితో కలసి హస్తినకు వచ్చినపుడు గాంధారి ద్రౌపదిని ఆలింగనం చేసికొంది. “ మమ పుత్రాణాం పాంచాలీ మృత్యు రేవత్య మన్యథా ” – తన పుత్రులకు ద్రౌపది వల్ల మరణం తప్పదని తెలిసినా ఆ ఇంటి కోడల్ని కాపాడలేక పోయిన గాంధారి వ్యక్తిత్వం ఈ ఘట్టంలో చిన్నబోయిందని చెప్పాలి.
ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంలో ధర్మ స్వరూపులు, పెద్దలు మాట్లాడలేదా ? అడ్డుకోలేదా ? అన్న ప్రశ్నలుదయిస్తాయి.
తొలుత విదురుడు ద్రౌపది ప్రశ్నకు సమాధానం చెప్పండని, సత్యాన్ని చెప్పకపోతే, అసత్యమాడిన పూర్ణఫలితాన్ని అనుభవించవలసి వస్తుందని అంటాడు. విదురుని మాటలు అందరూ పెడచెవిన పెట్టారు.
కర్ణుడు దుశ్శాసనునితో ఈమె మన దాసి. ఇంటికి నడిపించు అన్నాడు. దుశ్శాసునుడు ఆమెను లాగాడు. ద్రౌపది క్రింద పడిపోయింది.
మహాతపస్విని యైన ద్రౌపది ఇంతవరకు స్వయంవర సభలో తప్ప ఏ రాజు కంటాపడలేదని, రాజభవనంలో తనను గాలి కూడా సోకలేదని, ఇప్పుడు ఈ దుశ్శాసునుడు నన్ను సభలో అవమానిస్తుంటే పాండవులు నిశ్చేష్టులై చూస్తూ ఊరుకొంటున్నారని, కురువంశ కోడలు ఇలా అవమానించబడడం కాల వైపరీత్యమని బాధపడింది.
ధర్మపరాయణురాలగు స్త్రీని ఎవరూ సభలోకి తీసికొని వచ్చినట్లు తాను వినలేదని, కౌరవులు ధర్మాన్ని తప్పారని, ధర్మవిరుద్ధమైన చేష్టలకు ఫలితాన్ని అనుభవించవలసినదేనని చెప్పింది.
భీష్ముడు కులస్త్రీని అవమానించడం దోషమని, ఇది కురు వంశ వినాశనానికి దారి తీస్తుందని వారించడానికి ప్రయత్నించాడు.
ధర్మరాజు వ్యసనపరునిగా ద్యూతంలో కూర్చోలేదు. సుహృద్యూతం మాయాజూదమయ్యింది. పాచికలు శకునే వేశాడు. శకుని వంచన ధర్మరాజును ఓడించింది.
ధర్మాన్ని ఎఱిగిన విజ్ఞులు కూడా నీ ప్రశ్నకు సమాధానం చెప్పలేరని, పాండవులు ఉత్తమ వంశ సంజాతులు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మం తప్పరని, ఇంతటి క్లిష్ట సమయంలో కూడ నీవు ధర్మాన్నే వివరించమని అడుగుతూ, “ ధర్మాన్ని ఆశ్రయించావని, ఆ ధర్మం మిమ్మల్ని తప్పక రక్షిస్తుందని ” భీష్ముడు చెబుతూ, “ నీ ప్రశ్నలకు ధర్మరాజు మాత్రమే సమాధానం చెప్పగల ” డన్నాడు.
వెంటనే దుర్యోధనుడు నవ్వి, నిన్ను పణంగా పెట్టే అధికారం ధర్మరాజుకు లేదని తక్కిన పాండవులు నలుగురిలో ఎవ్వరు చెప్పినా దాస్యం నుండి అందరినీ విముక్తుల్ని చేస్తానంటాడు.
భీముడు “ ధర్మరాజు మా ప్రాణాలకు, తపస్సులకు ప్రభువు. ఆ మహానుభావుడే మా సర్వస్వంగా భావిస్తాం. ఆయన మమ్మల్ని ఓడిపోయాడు కాబట్టి ఇలా కట్టుబడి ఉన్నాం ” అని అన్నగారిపై తన గౌరవాన్ని బయిట పెట్టాడు. భీమునికి తన అన్నపై గల గౌరవం అప్పటికి కౌరవుల ప్రాణాల్ని కాపాడింది.
కర్ణుడు “ దాసుని భార్యపై, సంపదలపై యజమానికే అధికారం ఉంటుందని, ఎలాగూ ఐదుగురు భర్తలు కావున జూదంలో ఓడిపోని వానిని భర్తగా ఎంచుకొమ్మ ” న్నాడు.
దుర్యోధనుడు తన తొడపై వస్త్రాన్ని తొలగించి ద్రౌపదికి సైగ చేశాడు. భీముడు క్రోధంతో “ దుర్యోధనుని తొడలు విరుగగొడతా ” నని రాబోయే యుద్ధంలోని తన ఉగ్ర రూపాన్ని సభ్యుల కళ్ళకు కట్టించాడు.
వికర్ణుడు “ ద్రౌపది అధర్మవిజిత ” అని స్పష్టం చేసినా, “ ఇంతమంది ధర్మజ్ఞులు, పెద్దలున్న ఈ సభలో అధిక ప్రసంగం చెయ్యద్దని ” కర్ణుడు వికర్ణుని మందలించాడు.
ద్రౌపది పెక్కుమంది భర్తలు కలది కావున బంధకి. ఆమెను వివస్త్రను చేసినా దోషం లేదని దుర్యోధనాదుల్ని ప్రేరేపించిన కర్ణుడు రాబోయే యుద్ధంలో హీనమైన మరణాన్ని పొందాడు.
కురుసభలో పెద్దల బుద్ధుల్ని అసురాంశలు ఆశ్రయించాయి. దుర్యోధనాదుల్ని అసురాంశలు ఆవేశించాయి. భూభారం తగ్గాలంటే ద్రౌపదీ పరాభవం జరగాలి. పాండవుల నుండి ప్రతిజ్ఞలు రావాలి.
కృష్ణ సహోదరి శరీరం నుండి అనంతమైన వస్త్రాలు పుడుతూనే ఉన్నాయి. యజ్ఞ శాలలో నక్కలు అరిచాయి. రథాలపై ధ్వజాలు తగలబడ్డాయి. భయపడిన గాంధారి కీడును శంకించి ధృతరాష్ట్రునితో వెంటనే దీనిని వారించమని చెప్పింది.
భయపడిన ధృతరాష్ట్రుడు “ నీవు నా కోడ ళ్లందరిలో ధర్మపరురాలి ” వని ద్రౌపదిని ప్రశంసించి, వరాలు కోరుకొ మ్మన్నాడు.
ధర్మాత్ముడైన యుధిష్ఠరుని దాస్యం నుండి విముక్తుని చేయమని, ఆయుధాలు, రథాలతో సహా తక్కిన నలుగురు భర్తల్ని దాస్యం నుండి విడిపించమని కోరింది.
ధృతరాష్ట్రుడు మరొక వరం ఇస్తానన్నాడు.
క్షత్రియ కాంత రెండు వరాలు మాత్రమే కోరాలని ధర్మ సూక్ష్మాన్ని చెబుతుంది.
“ లోకంలో కార్యసాధన స్త్రీ వల్ల జరుగడం ఇప్పుడే చూస్తున్నా ” నని కర్ణుడు ఎగతాళి చేస్తాడు. ఆ మాటలకు భీముని చెవులనుండి, నాసికా రంధ్రాల నుండి అగ్నిజ్వాలలు రేగాయి.
పాండవుల ప్రతిజ్ఞలకు భయపడిన ధృతరాష్ట్రుడు నీవు అజాత శత్రుడవని ధర్మరాజును ప్రశంసించి ఇంద్రప్రస్థానానికి పాండవులను పంపించి రాజ్యాన్ని ఏలుకొమ్మన్నాడు.
మరల పునర్ద్యూతం, పాండవుల అరణ్య, అజ్ఞాత వాసాలు ద్రౌపది సహనానికి పరీక్షలనే చెప్పాలి.
అజ్ఞాతవాస సమయంలో విరాటరాజు కొలువులో సైరంధ్రిగా కీచకుని వల్ల ఇబ్బందులను ఎదుర్కొంది. తన భర్తలు గంధర్వులని, దుర్వార పరాక్రమశీలురని చెప్పింది. తన తమ్మునికి ఎదురు చెప్పలేని విరాటరాజు భార్య సుధేష్ణ తప్పనిసరియై ద్రౌపదిని కీచకుని మందిరానికి పంపింది. సూర్యభగవానుని దయతో వేయి ఏనుగుల బలం గల కీచకుని త్రోసివేసి బయిటపడింది.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. సూర్యచంద్రుల్ని సాక్షులుగా ఆ కాలంలో భావించేవారు. తండ్రి సూర్యుడు మహోన్నత వ్యక్తిగా భావించి, ద్రౌపదిని కాపాడడానికి రాక్షసుని పంపితే ఆయన కుమారుడు కర్ణుడు ‘ బంధకి ’ అని అవమానించడం ఆలోచించదగిన అంశం. ఇది బహుశా దుష్టుల స్నేహప్రభావమని చెప్పాలి. ద్రౌపది శపిస్తే తన తపశ్శక్తి పోతుంది కాబట్టి కీచకుని శపించకుండా విడిచిపెట్టింది. కీచక సంహారం కోసం పుట్టిన భీముడే సోదరులతో సహా వానిని సంహరించాడు.
పలు సందర్భాలలో ద్రౌపది తన గురించి తాను విశ్లేషించుకొన్న మాటలు ఆమె వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. అరణ్యవాస సమయంలో సత్యభామ ద్రౌపది వినయవిధేయతలకు, పాండవులపై ఆమెకు, ఆమెపై పాండవులకు గల అనురాగానికి ఆశ్చర్యపోయి భర్తలను ఎలా వశం చేసికోవాలని అడుగుతుంది.
గృహనిర్వహణను స్వయంగా తానే చూసుకోవడం, అత్తగారిని మాతృమూర్తిగా సేవించడం, అతిథి సత్కారాలు చేయడం, భర్తలను అనురాగమూర్తులుగా ఎలా మలచుకోవాలో ద్రౌపది చెప్పిన మాటలు కుటుంబ వ్యవస్థకు మూల స్థంభాలుగా నిలుస్తాయి.
కురుసభకు రాయబారిగా వెడుతున్న కృష్ణునితో ఐదుగురికీ ఐదూళ్ళిచ్చినా చాలని ధర్మరాజు చెప్పినప్పుడు ద్రౌపది బాధతో, ఆవేశంతో తన బాధను కృష్ణునితో పంచుకొంది.
ద్రౌపది తన సుదీర్ఘమైన నల్లని త్రాచు వంటి శిరోజాలను కృష్ణునికి చూపి దుశ్శాసనుని వేళ్ళలో చిక్కుకొని సగము తెగిపోగా మిగిలినవి. కౌరవులతో సంధి మాటలాడునపుడు వీటిని గుర్తుంచుకొమ్మని చెప్పింది. ఆడత్రాచుకు పగ ఎక్కువ. ఇన్ని కష్టాలు పడ్డ ధర్మనందనుడు, తాను రాజరాజు పీనుగును కళ్ళారా చూడాలంది. లేకపోతే భీమార్జునుల పరాక్రమం దేనికని ప్రశ్నించి, వారిని యుద్ధోన్ముఖులను చేసింది.
యుద్ధంలో పాండవులు విజృంభించి కృష్ణుని ఆదేశంతో దుష్ట సంహారం చేశారు.
చివరకు తన ఐదుగురు పుత్రుల్నీ సంహరించిన అశ్వత్థామను కూడా క్షమించింది. తనలా కృపి బాధపడకూడదని ద్రోణుని ఇల్లాలి దుఃఖాన్ని అర్థం చేసికొని పుత్రశోకాన్ని దిగమింగింది.
ధర్మరాజు 40 సంవత్సరాలు ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించాడు. ద్రౌపది శరీరంగా ( మానవ దేహాలతో ) భర్తలతో కలసి మహాప్రస్థానానికి అడుగులు వేసింది.
‘ త్రేతాయాం సీతా శక్తిః
ద్రౌపదీ ద్వాపరేయుగే ’ – దుష్టశిక్షణ కోసం అవతరించిన స్వర్గలక్ష్మి ద్రౌపది. ఆమె స్మరణ మాత్రం చేతనే మనం ముక్తు లవుతాం.
*******************************************
జానపద ‘ జాలాది ‘
” ఎక్కువ పాటలు రాయాలనే కోరిక నాకెప్పుడూ లేదు. రాసిన నాలుగూ మంచివి రాయాలనే తపన తప్ప “
అనేవారు అచ్చమైన తెలుగు సినీ గేయ రచయిత జాలాది.
జానపదాలను సినీపదాలుగా మార్చిన అక్షర బ్రహ్మ జాలాది. ఈయన సినిమా రచయితగా మారక ముందు డ్రిల్ మాస్టర్ గా, డ్రాయింగ్ మాస్టర్ గా పని చేశారు.
” మేడ కట్టలేకపోవచ్చు గానీ, మేడలో గూడు కట్టుకోగలను. అలాగే నేను మనుష్యుల గుండెల్లో గూడు కట్టుకోవాలని ప్రయత్నిస్తానే తప్ప స్వార్థంతో గుడి కట్టుకోవాలని తాపత్రయపడను ” అనే సంస్కారం ఆయనది.
ఏతమేసి తోడినా ఏరు ఎండదు…
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు ………… .
ఆగష్టు 09 వ తేదీ జాలాది జయంతి సందర్భంగా……..
****************************************