09_019 తెలుగు మహిళాజాతి రత్నం

                              అణగదొక్కబడిన వర్గాలు, లింగ వివక్షతతో వెనుకబడ్డ స్త్రీలు, ఆర్ధిక పరిస్థితుల కారణంగా అలక్ష్యం చెయ్యబడ్డ పిల్లలు ఒకప్పుడు మన సమాజంలో చాలా ఎక్కువగా ఉండేవారు. తమ జీవితాలను త్యాగం చేసి, వారిని ఆ పరిస్థితులనుంచి బయిటకు తీసుకొచ్చి,  వారి అభ్యున్నతే లక్ష్యంగా అంకితమైన మహానీయులేందరో చరిత్రలో మనకు కనిపిస్తారు. అలాంటి వారిలో చెప్పుకోదగ్గ వారు శ్రీమతి దుర్గాబాయి దేశ్ ముఖ్.

1909 వ సంవత్సరంలో కాకినాడకు చెందిన మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన దుర్గాబాయి 12 వ ఏటనే సంఘ సేవాకార్యక్రమాలలో పాల్గొన్నారు.  అప్పట్లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో నిర్వహించిన ఖాదీ ప్రదర్శనలో స్వచ్చంద సేవకురాలుగా పాల్గొని ప్రవేశానికి టికెట్ లేదనే కారణంతో జవహర్లాల్ నెహ్రుని కూడా లోనికి అనుమతించకుండా నిలిపివేసి సంచలనం సృష్టించారు. అంత పిన్న వయసులోనే గాంధీ సిద్ధాంతాలను వంటబట్టించుకుని ఖద్దరు ధారణతో బాటు ఆంగ్ల విద్యను బహిష్కరించారు.

ఎనిమిదేళ్ళ పసివయసులోనే దుర్గాబాయికి ఒక జమిందారీ కుటుంబంలోని యువకునితో వివాహం జరిగిపోయింది. యవ్వనంలోకి ప్రవేశించాక గానీ ఆమెకు వివాహమంటే ఏమిటో పూర్తిగా అవగాహన కాలేదు. తెలిసాక తన ప్రస్తానం కుటుంబ వ్యవస్థ వైపు కాదనీ, ప్రజాసేవ వైపనీ నిర్ణయించుకున్నారు. తాను అసలైన భార్య పాత్ర నిర్వహించలేనని భర్తకు నచ్చజెప్పి విడాకులు పొందారు. అప్పటినుంచి పూర్తిగా తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసారు.

గాంధీజీ బోధనల ప్రభావంతో 1930 లలో ముమ్మరంగా జరిగిన సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్నారు.  ఆ ఉద్యమానికి దక్షిణభారత దేశంలో పథ నిర్దేశకుడైన టంగుటూరి ప్రకాశం పంతులుగారి వారసురాలిగా పేరు తెచ్చుకున్నారు. సత్యాగ్రహ కార్యక్రమాలు నిర్వహించి లాఠీ దెబ్బలు తిని మూడుసార్లు జైలుకెళ్లారు. మొదటిసారి వెల్లూరు జైలులో కలిసిన స్త్రీల పరిస్థితి ఆమెను కలచివేసింది. ఖైదు చెయ్యడానికి కనీసం తమ మీద మోపిన అభియోగాలేమిటో కూడా తెలియని అజ్ఞానంలో వున్నారు వారు. వారిని ఆ అజ్ఞానం నుంచి బయిట పడెయ్యడమే తన కర్తవ్యమని దుర్గాబాయి నిర్ణయించుకున్నారు. 1933 లో విడుదలయ్యాక మధ్యలో వదిలివేసిన చదువును కొనసాగించడానికి నిర్ణయించుకున్నారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్ పాసై మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి బి. ఏ. ( ఆనర్స్ ) పట్టా పుచ్చుకుని అక్కడే క్రిమినల్ లా లో న్యాయ పట్టా కూడా పొందారు. స్త్రీలకు అసాధ్యమనిపించే ఆ వృత్తిలో అప్పటిరోజుల్లో ఆమె క్రిమినల్ లాయర్ గా ప్రఖ్యాతి గాంచారు. న్యాయసహాయం కోసం తనదగ్గరకి వచ్చిన ఏ స్త్రీ కూడా ఉత్తి చేతులతో వెళ్ళకూడదనేది ఆవిడ సిద్ధాంతం.

రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యురాలిగా పనిచేసారు. భారత బృంద సభ్యురాలిగా దుర్గాబాయి చైనా దేశం సందర్శించారు. అక్కడ కుటుంబ న్యాయస్థానాల పనితీరును పరిశీలించిన ఆమె తిరిగివచ్చాక వాటిపై ప్రథాని నెహ్రూకు సమగ్ర నివేదిక ఇస్తూ మనదేశంలో వాటి ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఆ రకంగా మనదేశంలో ఫ్యామిలీ కోర్ట్ వ్యవస్థ ప్రారంభానికి కారణమయ్యారు. దుర్గాబాయి గారు ప్రణాళికా సంఘ సభ్యురాలిగా, సాంఘిక సంక్షేమ శాఖ అధిపతిగా విధులు నిర్వర్తించారు.

దేశ సమగ్రాభివృద్ధికి జనాభా నియంత్రణే సరైన పరిష్కారమని నమ్మిన దుర్గాబాయి గారు ఆ విషయం మీద అనేక ప్రాంతీయ సదస్సులు నిర్వహించి సమగ్ర నివేదికలను తయారుచేసి ప్రభుత్వానికి అందజేశారు. అంధత్వ నివారణా సంస్థను ఏర్పాటు చేసారు.

1953 లో అప్పటి కేంద్ర ఆర్ధిక మంత్రి, రిజర్వు బ్యాంకు మొదటి గవర్నర్ అయిన సి. డి. దేశ్ ముఖ్ గారిని వివాహం చేసుకున్నారు.

జ్ఞాన సముపార్జనలో మహిళలు వెనుకబడకూడదని ఆంధ్ర మహిళా సభను స్థాపించి ఆసుపత్రి, నర్సుల శిక్షణాలయం, అనేక విద్యాసంస్థలు, వృత్తి విద్యా సంస్థల్లాంటివెన్నో ప్రారంభించారు. అవి ఇప్పటికీ విజయవంతంగా నడుస్తున్నాయి. కేంద్ర సాంఘిక సంక్షేమ సంస్థను నెలకొల్పి, దానిద్వారా దేశంలో అనేక స్వచ్చంద సేవా సంస్థలు, స్వచ్చంద సేవకులు పెరగడానికి కారణమయ్యారు.

శాంతి, సాంఘిక సంక్షేమం, విద్య మొదలైన రంగాలలో దుర్గాబాయి చేసిన సేవలకు మెచ్చి అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు పలు అవార్డులతో సత్కరించాయి. వాటిలో నెహ్రు లిటరసీ పురస్కారం, విద్యారంగంలో విశిష్ట సేవలందించిన వారికిచ్చే యునెస్కో పురస్కారం, భారత ప్రభుత్వ అత్యున్నత పద్మవిభూషణ్ పురస్కారాలు వున్నాయి.

ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన దుర్గాబాయి గారు స్వాతంత్ర్య సమరయోదురాలిగా, ప్రణాళికా రచయితగా, నిర్వాహకురాలిగా, విద్యావేత్తగా, సంఘ సంస్కర్తగా, పార్లమెంట్ సభ్యురాలిగా  జాతీయ స్థాయిలో  కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నారు. తెలుగు మహిళకు కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు.

************************* *************************