10_001 ఆనందవిహారి

 

                               

‘నెల నెలా వెన్నెల’ కార్యక్రమంలో’ బాలాంత్రపు లావణ్యా శ్రీనివాస్

సమాజ అభివృద్ధికి అవసరమైన చైతన్యాన్ని కలిగించడానికి, పరోపకారం కోసమే జీవితాంతం విశేషమైన సాహితీసేవ చేసిన మాలతీ చెందూర్ నిజంగా ‘హృదయనేత్రి’ అని బాలాంత్రపు లావణ్యా శ్రీనివాస్ కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి సాంకేతిక మాధ్యమాల ద్వారా నిర్వహించిన మూడవ ‘నెల నెలా వెన్నెల’ ‘నెట్ ఇంటి’ కార్యక్రమంలో భాగంగా అశేష తెలుగు పాఠకుల అభిమానాన్ని చూరగొన్న వెనకటి తరం ప్రముఖ రచయిత్రి మాలతీ చెందూర్ ఏడవ వర్ధంతి సందర్భంగా ఆమె ‘హృదయనేత్రి – సాహితీమైత్రి’ అంశంపై ప్రసంగించారు.

1988లో మాలతి రాసిన ‘హృదయనేత్రి’ నవల ఆంధ్రప్రదేశ్ సాహిత్య పురస్కారాన్ని, 1992లో కేంద్ర సాహిత్య పురస్కారాన్ని అందుకుందని చెప్తూ… 1921లో జరిగిన చారిత్మాత్మక ‘చీరాల పేరాల’ స్వాతంత్ర్యోద్యమ ఇతివృత్తం నేపథ్యంగా మూడు తరాల కథను ఆమె అందులో అత్యద్భుతంగా చెప్పారని పేర్కొన్నారు. కథతో పాటు శైలి, కథనం, పాత్ర చిత్రణ, సంభాషణలు ఈ నవల జాతీయ పురస్కారానికి ఎంపిక కావడానికి కారణాలని వ్యాఖ్యానించారు. అంతకు ముందుమే మట్లాడుతూ..  మాలతి బాల్యంలో సరోజినీ టీచర్ నుంచి స్ఫూర్తి పొందడంతో మొదలుపెట్టి ఆమె సాహిత్య ప్రస్థానంలోని అన్ని కోణాలనూ ప్రస్తావించారు. జీవితం పట్ల, అభ్యున్నతి పట్ల తెలుగు పాఠకులకు సుదీర్ఘకాలం పాటు స్ఫూర్తి కలిగించిన మాలతి సామాన్యులకి, ముఖ్యంగా స్త్రీలకి నిత్య జీవితంలో పనికొచ్చే విషయాలను చెప్పారని లావణ్య పేర్కొన్నారు. అయితే, వివిధ పత్రికలలో ప్రచురితమైన ఆమె రచనలను పురుషులే ఎక్కువగా చదివారని కొందరు ప్రముఖుల ప్రసంగాల వల్ల తనకు అర్థమైందని ఆమె అభిప్రాయపడ్డారు. మాలతి అరవయ్యేళ్ళ పాటు నిర్వహించిన ‘ప్రమదావనం’, ‘అడగండి చెబుతా’ తదితర శీర్షికల్లో తమ కుటుంబ సమస్యలకు పరిష్కారాన్ని కోరిన మహిళా పాఠకులకోసం ఆమె రచనలు చేశారని, వాటి ద్వారా మహిళలే కాక పురుషులు కూడా తమ కుటుంబాలను దిద్దుకున్నట్టు, అనేక విషయాల పట్ల అవగాహన పెంచుకొన్నట్టు లావణ్య చెప్పారు. అనేక జాగ్రత్తలు, పోషక విలువల వివరాలతో మాలతి రాసిన ‘వంటలు – పిండివంటలు’ అప్పట్లో 30 సార్లు పునర్ముద్రించబడిందని గుర్తు చేశారు. సామాన్య స్త్రీలకు నిత్య జీవితంలో పనికొచ్చే విషయాలను చెప్పాలన్న ఉద్దేశంతోనే ఆమె రచనలు చేశారని, అందుకే హస్తకళల మీద, ఇంకా అనేక అంశాల మీదా ఆమె రాసిన వ్యాసాలు, నిర్వహించిన శీర్షికలు పొందిన ప్రజాదరణ ఇంతా అంతా కాదని అన్నారు. శారీరక ఆరోగ్యం ముఖ్యమని, మానసిక ఆరోగ్యం అంతకన్నా ముఖ్యమన్న సందేశాన్ని మాలతి తన రచనల్లో ఇచ్చారని చెప్పారు. ‘రవ్వల దుద్దులు’ అన్న కథతో మొదలుపెట్టి కథ, నవల, వ్యాసం, జాబులు జవాబులు, సాహిత్య పరిచయం (ఆంగ్లం, కొన్ని తెలుగేతర భారతీయ భాషల పుస్తకాల పరిచయం) తదితర అన్ని సాహితీ ప్రక్రియలతో పాటుగా ఆకాశవాణి కోసం ఎన్నో నాటికలను కూడా రచించిన సమగ్ర సాహితీవేత్త మాలతీ చెందూర్ అని లావణ్య ప్రశంసించారు. పోలీసుల సతీమణులకు స్ఫూర్తి కలిగించడం కోసం ఆమె రాసిన 160 వ్యాసాలను యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, కొన్ని రచనలను పద్మావతీ విశ్వవిద్యాలయం యాజమాన్యం ప్రచురిస్తామని పేర్కొన్నాయని వెల్లడించారు. స్థానిక ‘పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటి’, ‘ఆంధ్ర మహిళా సభ’ ఛైర్ పర్సన్ గా ఆ సంస్థల బాగోగులు చూశారని గుర్తు చేశారు. ఆంధ్ర మహిళా సభ పత్రికను అత్యంత సమర్థవంతంగా నిర్వహించగా సభ వ్యవస్థాపకురాలు దుర్గాబాయి దేశముఖ్ మాలతిని హైదరారాబాదు వచ్చి స్థిరపడమన్నా కూడా చెన్నైలోని తెలుగువారి అదృష్టం కొద్దీ చెందూర్ దంపతులు ఇక్కడే స్థిరపడ్డారని అన్నారు. ఎప్పుడూ పరోపకారానికే జీవితాన్ని అంకితం చేసిన మాలతి తన మరణానంతరం తన భౌతిక కాయాన్ని రామచంద్ర ఆసుపత్రికి ఇవ్వాల్సిందిగా వీలునామా రాశారని, ఇది ఆమె వ్యక్తిత్వాన్ని వెల్లడి చేస్తుందని చెప్పారు. అందరితో స్నేహపూరితంగా వ్యవహరించడం వల్లే చెందూర్ దంపతులు ప్రజల మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని అంటూ లావణ్య తన ప్రసంగాన్ని ముగించారు. వృత్తిరీత్యా స్టోరీ టెల్లర్, మేనేజ్మెంట్ నిపుణురాలైన లావణ్య ఎంతో స్పష్టంగా, సులభంగా అర్థమయ్యే మాటల్లో ఆద్యంతం ప్రసంగించి ఆకట్టుకున్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాలాంత్రపు సోదరీమణులు శ్రేయ, మానసలు చక్కగా ఆలపించిన ‘జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి’ (దేవులపల్లి రచన, వింజమూరి అనసూయ సంగీతం) గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమానికి స్వాగతం పలికిన ‘నిర్వాహక సంస్థ సంయుక్త కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య వక్తను పరిచయం చేశారు. చెన్నైకి చెందిన ముళ్ళపూడి ప్రసాద్, విజయవాడ వాస్తవ్యులు శిష్ట్లా రామచంద్రరావు, ఆయన కుమారుడు ఉదయ్ సాంకేతిక సహకారాన్ని అందజేశారు.