13_008 మందాకిని – సంసారంలో సరిగమలు

 

మనము ప్రతిరోజు చేసే పనులలో పిల్లలను కూడా భాగస్వాములను చేస్తే వాళ్ళకి పనులు ఎలా చేయాలో అవగాహన కలుగుతుంది. వాళ్ళ పెద్దయినాక అమ్మ, నాన్న ఇట్లా చేసేవారు అని గుర్తుపెట్టుకొని వాళ్ళు కూడా తలితండ్రులని అనుకరిస్తారు. పిల్లలు పెరిగి ఉద్యోగస్థులయిన తరువాత ముందుగా తలితండ్రులు అన్ని జాగ్రత్తలు చెప్పి, వారి సంపాదన ఎలా ఖర్చుపెట్టాలో వివరించాలి. సంపాదించినదంతా ఖర్చుపెట్టుకోకుండా నెలకి ఇంత అని కొంత డబ్బు ముందుముందు రాబోయే అవసరాలకు బ్యాంక్ లో దాచి ఉంచుకొంటే – గడ్డుపరిస్థితులలో “ఎలా ? డబ్బు ఎలా ? అని ఖంగారు పడే అవసరం ఉండదు.

పిల్లలు బయటకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎక్కడికి వెడుతున్నారో, ఎప్పుడు వస్తారో ఇంట్లోవున్న పెద్దవాళ్ళకి చెప్పివెళ్ళమని వారికి బోధించాలి. అలా చేస్తే పెద్దవాళ్ళు సంతోషిస్తారని అంటే పిల్లలు విని ఆచరించాలి. ఆ! ఈ ముసలివాళ్ళకి చెప్పేదేమిటి? అనే ఆలోచన, నిర్లక్ష్య౦ మీ మనసులోకి రాకూడదని చెప్పాలి.

పిల్లలు ఇంట్లో వున్నపుడు భార్యాభర్తలు పొట్లాడుకోవడం, ఒకరినొకరు విసుక్కోవడం చేస్తే అదే అలవాటు వారికి వచ్చేస్తుంది. పెద్దయాక అలానే ప్రవర్తిస్తారు. ఈ రోజులలో చాలామంది పిల్లలు వివాహం కాగానే విడిగా కాపురం పెట్టుకోడానికి ఇష్టపడుతున్నారు. ” మన ఇష్టం ప్రకారం మనం వుండవచ్చని – మన సంపాదన మనకుందని గర్వపడుతున్నారు. “ కలసివుంటే కలదు సుఖం” అని మనం చెప్పినా వాళ్ళకు బోధపడదు.

” మా అమ్మాయి, అల్లుడు ఇద్దరు ఉద్యోగస్థులే, అనుకోకుండా ఇద్దరి వెహికల్స్ కి ఒక్కసారే రిపేరు వచ్చింది. బ్యాంకులో బాలెన్సు లేదు. రిపేరు చేయించడానికి చాలదు ” అని తనతో చెపితే ఆవిడ “ మేమే చాలా ఇబ్బందులలో ఉన్నామే తల్లీ! లేకపోతే ఇద్దును ” అని “మీ అత్త గారు వాళ్లు ఆస్థిపరులే కదా ! అడిగి చూడు ” ఆన్నదిట. కూతురితో. అల్లుడు వాళ్ళ నాన్నని అడిగితే “ముందుగా బడ్జెట్ వేసుకొని కాస్త వేనుకోమని చెప్పానా ? ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెడితే ఇంతే ” అని ఆయన లేచి బయటకి వెళ్ళిపోవడట. ఎవరు ఎవర్నీ ఆదుకొంటారనే ఆశలు ఇప్పుడు లేవు. ఇక పిల్లలు పుట్టాక వాళ్ళ పరిస్థితి కత్తిమీద సాము. ఉద్యోగం వదులుకోలేరు, పిల్లల్ని చూసుకోలేరు. అంతా కలిసి వుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావు, పెళ్ళితో మొదలయిన ప్రేమ వార్థక్యం వచ్చేకొద్దీ అందులోని సారం అనుభవమై ఆనందాన్నిస్తుంది. సంసారం సాగరం, సంసారం ఒక పరీక్ష, సంసారం ఒక అనుభవం. సంసారంలో సరిగమలు పలికించడం తెలుసుకొన్న రోజున అదొక దివ్యస్వప్నం అవుతుంది.

************

 

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page