10_006 తో. లే. పి. – మస్తాన్ రావు

___________________________________________________________

50 సంవత్సరాల నాటి ముచ్చట. 

నాకు పెళ్ళైన కొత్తలో అంటే 1969 ప్రాంతాలలో శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి మకాం ని హైదరాబాద్ కి ఉద్యోగ రీత్యా మార్చడం జరిగింది. నాది ఛీఫ్ ఇంజినీర్ ఆఫీస్ లో జూనియర్ ఇంజినీర్ గా ఉద్యోగం. జీతం నెలకి 450 రూపాయలు మాత్రమే. చార్మినార్ చౌరాస్తా సమీపం లో ఆఫీస్ కి దగ్గరగా మూడు పోర్షన్ల ఇంట్లో మధ్య  పోర్షన్ అద్దెకి తీసుకున్నాను. జీతం లో నాల్గవవంతు అంటే దాదాపు నూట పది రూపాయలు ఇంటి అద్దె కి పోయేది. ఇక మిగిలిన ఆదాయం  కొద్దిపాటిదే అయినా జీవితం — అదే కొత్త సంసారం – హాయిగా, సరదాగా గడిచేది. దగ్గరలోనే సంగం ఎయిర్ కూల్డ్  థియేటర్ ఉండేది. అందులో సినిమా టిక్కెట్టు కేవలం మనిషి కి రెండు రూపాయలు మాత్రమే. అందువల్ల, నేనూ – మా కొత్త పెళ్లి కూతురు ( మా ఆవిడ ) కలిసి హాయిగా సినిమాలకు వెళ్లి పోతూ ఉండేవాళ్ళం తరచుగా. ఆ లిస్ట్ లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడం సినిమాలు ఉండేవి – సినిమా చూసిన ఆ ఆనందం అంతా ఇంతా అని చెప్పలేము. 

పోతే ఆఫీసు లో పని ఎక్కువా కాదు.. అలా అని తక్కువా కాదు. మధ్యస్తం గా ఉండేది. మాకు డెప్యూటీ చీఫ్ ఇంజినీర్ గా మస్తాన్ రావు గారు అని ఉండేవారు. BE ( Hons ) ఆయన క్వాలిఫికేషన్. చాలా మంచి వ్యక్తి. ఎప్పుడూ వైట్  డ్రెస్ లో నీట్ గా ఉండేవారు. మంచి పెర్సనాలిటీ, చిరునవ్వు చిందించే ఆ ముఖం చూస్తే మాకు పరమానందం అనిపించేది. తెలివితేటలు అయన సొత్తు. కేవలం విషయం పరిజ్ఞానం మాత్రమే కాదు – మాట లో ఆదరణ, ఆప్యాయత, పని  నేర్పే విధానం, ఆదర్శవంతమయిన నడవడిక ను మాకు ఆయనే నేర్పారు. ఆయన అక్షరాలు అందమైన ఆడపిల్లల్లా ఉండేవి. ఆఫీసు కి రావడం లోనూ, పని చేయడం లోనూ పంక్యుయాలిటీ ని నిర్దేశించి, దానిని ముందు ఆయన ఆచరించి చూపి మాకు ఆదర్శవంతం గా నిలిచేవారు. కష్టం లో ఉన్న వ్యక్తి కి అతని నుండి దేనినీ ఆశించక సహాయం చేయడం ఆయనలోని విశిష్టత. నా మటుకు నాకు అనేక సందర్భాల్లో — ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు తదితర విషయాలలో ఎంతో సహాయాన్ని అందచేసారు. అందుకు ప్రధాన కారణం నాపైన, నా పని తీరు పైన ఆయనకు ఏర్పడిన దృఢమైన, అపారమైన నమ్మకము, నిజానికి సహాయాన్ని అందజేసిన చేసిన వ్యక్తి కంటే ఆ సహాయాన్ని అందుకున్న వ్యక్తి కి ఆ ఉపకారం జీవితాంతం జ్ఞాపకం ఉండి తీరుతుంది. అటు తరువాత ఆయనకు మా ఆఫీస్ నుండి ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ గా సోమాజిగూడ లో ఉన్న సెంట్రల్ మెకానికల్ యూనిట్ కి ట్రాన్స్ఫర్ అయింది. ఆయన స్థానం లో కొంతకాలానికి మాకు వేరే ఆఫీసరు వచ్చారు. అటు తరువాత మస్తాన్ రావు గారు ఒకటి, రెండు సందర్భాలలో మా ఆఫీసుకి కారును పంపి అందులో వెళ్లి నేను ఆయనను కలవగా అక్కడ పని ని కొంత చేసిపెట్టవలసినది గా నన్ను కోరడం జరిగింది. ఆయన అప్పజెప్పిన పని పూర్తి చేసుకుని ఆయనను కలవగా కేవలం థాంక్స్ చెప్పి ఊరుకోకుండా నన్ను, తిరిగి మా ఆఫీస్ దగ్గర దింపి రమ్మని కారు డ్రైవర్ కి పురమాయించేవారు. ఇక నేనూ ట్రాన్ఫర్ అయి వేరే చోటికి వెళ్లినా మా మధ్యన ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉండేవి. ఏ పండుగ కు ఆయనకు గ్రీటింగ్స్ కార్డు పంపినా తిరిగి తప్పనిసరిగా వారి నుండి మళ్ళీ  గ్రీటింగ్ కార్డు వచ్చేది. అలాగా అయన చీఫ్ ఇంజినీర్ గా ప్రమోషన్ మీద పని చేసినా ఆయనలో ఏవిధమయిన భేషజం గానీ, ఇగోయిజం కానీ చోటు చేసుకోలేదు అంటే అది ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి అది ఒక నిదర్శనం. 

ఒక సందర్భం లో ఆయనను మర్యాదపూర్వకం గా కలవాలని ముందుగా ఫోన్ చేసి సోమాజీగూడా లోని ఆయన ఆఫీస్ కి వెళ్లాను. ఆయన రూమ్ లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారని తెలుసుకుని బయట కుర్చీ లో కూర్చుని అటెండర్ కి నా వివరాలు వ్రాసిన  చీటీ ని ఇచ్చి లోపలకు పంపాను. ఆ చీటీని చూసిన ఆయన నన్ను లోపలకి రమ్మనమని అటెండర్ ద్వారా కబురు పంపారు. లోపలకి వెళ్లగా ఆయన కు ఎదురుగా ఎవరో అమ్మాయి కూర్చుని ఆయనతో మాట్లాడుతోంది. నేను మౌనం గా వింటున్నాను. ” “…… సార్ — రైల్వేస్ లో పని చేస్తూ మా నాన్నగారు చనిపోయారు. ఆయన పెన్షన్ శాంక్షన్ అయి ఇన్నాళ్ళకి మాకు సమస్య పరిష్కారం అయింది సార్. మీరు చేసిన సహాయానికి మిమ్మల్ని కలిసి కృతజ్ఞతలను చెప్పమని అమ్మ నన్ను పంపించిందండీ ! అసలు తానే వద్దామనుకుంది కానీ ఆరోగ్యం బాగులేక నన్ను పంపింది సార్.. వస్తానండీ ! థాంక్యూ వెరీ మచ్ సార్ ” అంటూ ఆ అమ్మాయి చెప్పడం నేను ప్రత్యక్షం గా వినడం జరిగింది. ” ఫరవాలేదమ్మా– అయినా నేను ఇందులో చేసినది పెద్ద పనేమీ కాదు.. జాగ్రత్తగా వెళ్ళమ్మా ! ” అన్నారు మస్తాన్ రావు గారు ఆ అమ్మాయికి వీడ్కోలు చెబుతూ. మస్తాన్ రావు గారు పని చేసేది రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ లో. మరి ఈ కేసు రైల్వేస్ కి చెందింది. అయినా ఆ పని విజయవంతం అయిందంటే, అందుకు కారణం ఆయనకున్న అపారమైన పరపతి. మానవత్వపు విలువలను, ప్రమాణాలను పాటించిన మహనీయ వ్యక్తి మస్తాన్ రావు గారు. మస్తాన్ రావు గారి సౌజన్యం గురించి చెప్పాలంటే ఇలాంటి దృష్టాంతాలు మరెన్నో ఉన్నాయి. అయన కీర్తిశేషులయినా, కీర్తి ఆయనను మకుటం లేని మహారాజు గా నిలిపింది ఆయన యావజ్జీవిత కాలపర్యంతం ! అది ఏ కొందరికో లభించే అపూర్వమైన భగవద్దత్త వరం !

ఆయన వివిధ సందర్భాలలో నాకు  అభిమానంతో పంపిన అమూల్య రత్నాలలో కొన్నిటిని ఈనాడు మీ అందరితోనూ ఆనందం గా పంచుకుంటున్నాను ఈనాటి తోక లేని పిట్ట రూపం లో…

 

                                   <><><>*** ధన్యవాదాలు ~  నమస్కారములు*** <><><>